
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)
7. హోం లెస్
అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ…
-డా||కె.గీత
“అయాం సారీ, ఆలస్యమైందా” గబగబా నడిచి రావడం వల్ల ఒగురుస్తూ అన్నాను.
“ఫర్వాలేదు, నాకివ్వాళ ఎలాగూ కాలేజీ లేదు.” అంది కరుణ.
“ఇక్కడి లైబ్రరీలు ఎంత బావుంటాయో కదా! ఎక్కడా దుమ్మూ, ధూళీ లేని పుస్తకాల అరలు, విశాలమైన రీడింగ్ రూంస్, నాకెందుకో మా ఇంటి కంటే ఇక్కడి లైబ్రరీ చాలా ఇష్టం” అన్నాను.
ఏదో ఆలోచిస్తున్నట్లున్న కరుణ నిశ్శబ్దంగా తలూపి నవ్వింది.
అలా వెళ్లి ఆ కార్నర్ లో కూచుందాం అన్నాను.
రెండంతస్థుల పెద్ద సిటీ పబ్లిక్ లైబ్రరీ అది. ఇక్కడ పక్కపక్క “పేట” లను కూడా సిటీలుగా పిలుస్తారు. పిలవడమే కాదు. ఆ స్థాయిలో లైబ్రరీల వంటి ప్రజోపయోగకరమైన స్థలాల్ని అభివృద్ధి చేస్తారు కూడా.
“బయట బాగా చల్లగా ఉంది. హమ్మయ్య లైబ్రరీలో వెచ్చగా, హాయిగా ఉంది” అన్నాను.
ఇక్కడి ప్రత్యేకతల్లో ఇదొకటి బయటి వాతావరణానికి అనువుగా లైబ్రరీల్లో ఏసీలు పనిచేస్తాయి.
మాకిద్దరికీ ఇష్టమైన నాన్ ఫిక్షన్ సెక్షన్ లో కార్నర్ లోని చక్కని వాలు కుర్చీల్లో చేరబడ్డాం. అక్కడి నుంచి హాలులో మిగతా అందరూ కనిపిస్తూ ఉన్నా ఈ రెండు కుర్చీలు ప్రత్యేక విభాగంలో ఉన్నట్లు ఉంటాయి.
నిశ్సబ్దంగా లాప్ టాప్ లతో పని చేసుకుంటున్నవాళ్లు కొందరు, పుస్తకాల్ని తిరగేస్తున్నవారు కొందరు, లైబ్రరీ ఇచ్చే ఫ్రీ కంప్యూటర్స్ ముందు కూచుని బ్రౌజ్ చేస్తున్నవారు కొందరు.
“ఊ చెప్పు కరుణా” అన్నాను.
“అతనికి ఏమని సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.”
అని, కరుణ ఆలోచనలో పడింది.
గంట నించీ కథంతా విన్న నాకూ ఏం చెప్పాలో పాలుపోవడం లేదు.
“అడుగో, అతనే …” దూరంగా చూపిస్తూ గబుక్కున లేచి పుస్తకాల అరల మధ్యకు తప్పుకుంది కరుణ. నన్ను దాటుకుని వెళ్తూ అమెరికాలో అందరికీ అలవాటైన లాంటి పరిచయ హాసమొకటి చేసాడు. ఆరడుగుల స్ఫురద్రూపి. చక్కని వ్యాయామ శరీరం, చురుకైన కళ్లు, చెదరని చిరునవ్వు.
***
ఇంటికొచ్చిన తరువాత కూడా అతని ముఖమే గుర్తుకు వస్తూంది. ఒక్కసారి చూసిన నాకే ఇలా అనిపిస్తే ఇక కరుణ సంగతి చెప్పాలా?
అంతలా గుర్తుండిపోయే మనిషిని నేను ఈ మధ్య కాలంలో చూసినట్లు జ్ఞాపకం లేదు. బయట బాగా మబ్బు పట్టి ఉంది. ఆకాశం ఎప్పుడు చినుకులు రాలుస్తుందో తెలీదన్నట్లు గొప్ప గుంభనంగా ఉంది. శీతాకాలపు సాయంత్రం. గుబులు గుబులుగా సాయంత్రం అయిదింటికే చుట్టూ అలుముకున్న చీకటి. భోజనాల వేళకి దబదబా వాన కురవడం మొదలెట్టింది. ఇక్కడ తమాషాగా శీతాకాలంలో వానలు పడతాయి. అసలే చలికాలం, ఆ పైన మరింత చల్లని వాన.
బయట తడిస్తే భయంకరమైన వణుకు పట్టుకుంటుంది.
“పాపం, అతనెలా ఉన్నాడో!” ఒక్క క్షణం తల విదిలించాను. కరుణ మాటలు నన్ను వదిలిపెట్టడం లేదు. అతని గురించిన ఆలోచనలు నన్ను వదలడం లేదు. ఇలా లాభం లేదు, ఇదంతా సూర్యకి చెపితే, తనే ఒక పరిష్కారం చెప్తాడు. నన్నానుకుని నిద్ర పోతున్న నిధిని పక్కకు జరిపి, “సూర్యా!” అని రెండు సార్లు పిలిచాను.
ముందు గదిలో కంప్యూటర్ ముందు కూచున్న మనిషి నించి ఉలుకూ పలుకూ లేదు. లేచెళ్లి చూసాను. చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో సీరియస్ మీటింగ్ లో ఉన్నట్లున్నాడు. నా వైపు కనీసం చూడ లేదు. తిరొగొచ్చి సూర్యకి ఈ-మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాను.
మరలా ఉదయపు కథ-
కరుణ చెప్పిన కథ-
ఈ సారి స్వేచ్ఛగా ఆలోచనల్ని రానిచ్చాను. తన మాటలు మొదట్నించీ గుర్తుకు వచ్చాయి….
“అతని పేరు బెనర్జీ. సర్వ దమన్ బెనర్జీ.”
ఆశ్చర్యంగా చూస్తున్న నా వైపు నవ్వుతూ చూసి, “కాదులే, ఊరికే అన్నాను. అలా ఉన్నాడని నేనా పేరు పెట్టాను. అంతే” అంది కరుణ.
కరుణ ఇక్కడికి ఎమ్మెస్ చెయ్యడానికి వచ్చింది. లైబ్రరీలో పరిచయమైంది నాకు. తనకూ సాహిత్యం పట్ల ఇంట్రెస్టు ఉంది. టాల్స్ టాయ్ పేరు వెతుక్కుంటూ పుస్తకాల అరల దగ్గర తిరుగుతున్న నాకు తన చేతులోని టాల్స్ టాయ్ దారి చూపించాడు.
“బెనర్జీ అసలు పేరు సంగతలా ఉంచితే, అతనితో పరిచయం నీకు చెప్పాలి” అంది కరుణ.
కుతూహలంగా ముందుకు వంగాను.
“అతన్ని నీలాగే ఇక్కడే లైబ్రరీలో కలిసాను. ఆ రోజు యోగా గురించిన ప్రత్యేకమైన లెక్చర్ అవుతూంది. వచ్చిన వాళ్లకి అమెరికను ఒకావిడ ప్రధానమైన చిన్న చిన్న ఆసనాలేవో ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో చెప్తూంది. నాలా ఊరికే చూడడానికి వచ్చిన వాళ్లు వెనక వరుసలో నిల్చుని ఇదంతా చూడొచ్చు. నిలబడ్డ వాళ్లలో అతనూ, నేను మాత్రమే ఇండియన్సుమి ఉన్నాం.
అప్పటికే ఆ చిన్న హాలు నిండా జనం. ఇంతలో మరో ఇద్దరు వచ్చారు లోనికి. వాళ్లకి చోటు ఇవ్వడం కోసమన్నట్లు నేను బయటికి వచ్చేసాను. నా వెనకే అతనూ వచ్చేడు.
నేనే పలకరించేను. “ఎక్కడ నించి మీరు?” అని.
అతను తత్తరపడ్డట్లు నా వైపు చూసి అంతలోనే ప్రశాంతంగా నవ్వి, “ఇక్కడా, భూమికవతలా ?” అన్నాడు.
“ఇక్కడా, అక్కడానూ-” అన్నాను.
“ఇక్కడైతే లాస్ ఆల్టోస్, అక్కడ నేపాల్” అన్నాడు మరలా చిర్నవ్వుతో.
“నన్ను చూడగానే ఇండియన్ అని పొరబడడం మామూలే, నేపాల్ లో స్థిరపడ్డ బెంగాలీయులం.” అన్నాడు మళ్లీ.
“నేను ఇక్కడ ఈ ఊర్లో, అక్కడ హైదరాబాద్” అంటూండగానే “నాకు తెలుసు” అన్నాడు.
“ఎలా?!” విస్మయంగా చూస్తున్న నా వైపు చూసి
“నాకు హైదరాబాదు తెలుసు, చదువుకునే కాలంలో మిత్రులు ఉండే వారు” అన్నాడు.
“ఇక్కడ ..”
అన్న నా ప్రశ్నకి “ఎకనామిక్స్ చదివాను, ప్రతీ వారం మూడు రోజులు తప్పకుండా వస్తాను ఈ లైబ్రరీకి ” అన్నాడు.
…..అలా మా పరిచయం వారంలో మూడు రోజులుగా మొదలై, నాలుగు నెలలుగా కొనసాగింది, కాదు కాదు అక్కడే గుండ్రంగా తిరుగుతూంది” అని నిట్టూర్చింది కరుణ.
“అతని దగ్గర నేనొకటి గమనించాను. అవసరం లేకుండా ఊరికే మాట్లాడడు. చనువు అస్సలు తీసుకోడు. లైబ్రరీలో నాకు క్రమం తప్పకుండా కనిపిస్తాడు. కానీ చిరునవ్వు, లేదా పరిమితమైన సంభాషణ కంటే ముందుకెళ్లదు.
నేను ఈ మధ్యనే ఈ-మెయిల్ ఇచ్చాను అతనికి.
ప్రతిగా ముక్తసరి జవాబు.
కిందటి వారంలో అతను రాలేదు. అతను వారంలో మరో మూడు రోజులు లాస్ ఆల్టోస్ లైబ్రరీలో ఉంటాడని చెప్పినట్లు గుర్తు. అక్కడకు వెళ్లాను.”
నేను మరింత కుతూహలంగా వినడం మొదలు పెట్టాను.
“లైబ్రరీ అంతా తిరిగాను. అతను కనబడ లేదు. అనవసరంగా వచ్చానని నన్ను నేను తిట్టుకుంటూ కారు దగ్గరికి వచ్చాను.”
అని ఊపిరి తీసుకుంది.
“ఆ తర్వాత… ” అన్నాను కుతూహలం పట్టలేక.
“ఉండు ప్రియా, ఈ కథలో నువ్వనుకున్నంత సస్పెన్సు ఏమీ లేదు” అని ఎటో చూస్తూ,
“అతను సరిగ్గా నా పక్క కార్లో సీటు వెనక్కి వాల్చుకుని నిద్రపోతున్నాడు” అంది.
“అయితే” అన్నాను కరుణ వైపు మామూలుగా చూస్తూ.
“నేను లైబ్రరీ లోపలికి వెళ్లేటప్పుడు హడావిడిలో గమనించలేదు, అసలతని కారు ఎలా ఉందో తెలుసా! ప్రతీ చక్రమూ ఒక్కో పాత స్టెఫ్నీ అతికించినట్లు, ఎప్పటిదో పాత మోడల్ కారు అది.
వెనక సీట్లో మొత్తం అంతా సర్ది పెట్టి ఉన్న అట్ట పెట్టెలు. నాకేదో కన్ ఫ్యూజన్, వెంటనే అక్కడి నుంచి వచ్చేసాను.” అంది.
నాకింకా అర్థం కాలేదు తనేం చెప్తూందో.
“ఆ రాత్రి ఈ-మెయిల్ ఇచ్చాను. అతన్ని నేను తన కారులో చూసానని.
వెంటనే రిప్లై వచ్చింది. ఆశ్చర్యంగా చేంతాడంత.
ఏమనుకున్నాడో, ఏమో అని భయంగా చదివాను.
విషయమేమిటో, తెలుసా ప్రియా!
అయిదేళ్ల కిందట యాక్సిడెంట్ లో వెన్నుకి బాగా దెబ్బ తగిలిందట. ఎక్కువ సేపు ఎక్కడా ఏ పని చెయ్యలేడట. ఇక్కడేదో ఉద్యోగం చేసి డబ్బు పంపిస్తాడనుకున్న కొడుక్కి ఇలా అయ్యిందని, తన మీద ఆశ లు పెట్టుకున్న వాళ్ల కుటుంబానికి చెప్పడం ఇష్టం లేక తిరిగి ఇండియాకి వెళ్లలేదట. అలాగని ఇక్కడేమీ ఉద్యోగమూ లేదు. కాస్త కోలుకుని గత రెండేళ్లుగా పార్ట్ టైం ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. రిసెషన్ వల్ల చిన్నా చితకా ఉద్యోగం కూడా దొరకలేదట. అలా అతను హోం లెస్ గా మారాడట. తన కారులోనే ఉంటూ పగలంతా లైబ్రరీలలో గడుపుతూ పొద్దు పుచ్చుతూంటాడట. బాగా చలి కాలం కదా ఇప్పుడు, చాలా కష్టంగా ఉంది కారులో గడ్డ కట్టుకుపోతూంది, తెలిసిన చోటెక్కడైనా కాస్త పడుకుందుకు చోటు ఇప్పించమని రిప్లై ఇచ్చాడు.”
“నాకు తల తిరిగి పోయింది. ఇలా ఎంత మందిని అడిగాడో ఏమో” అంది మళ్లీ.
“మరి వీసా..” అన్నాను.
“వాళ్లు, నేపాలీయులు కదా, వాళ్లిక్కడికి రావడమే గ్రీన్ కార్డుతో వస్తారు” అంది.
“భోజనం వగైరా.. బహుశా: గవర్న్ మెంట్ నిరుద్యోగ భత్యం ఇస్తుందేమో, పైగా కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయిగా, ఉండడానికి ఇల్లు కొరత గానీ, తినడానికి కొరత ఏముంది ఈ దేశంలో” అంది మళ్లీ.
“మరి హోం లెస్ షెల్టర్లు ఉంటాయేమో కదా..” అన్నాను.
“అతని అప్లికేషను ఇప్పటికీ లైనులో ఉందట.”
రిసెషన్ సమయంలో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డ వార్తలు విన్నాం.అలాగని అవన్నీ రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు కూడా కాదు.బ్యాంకు లోన్లతో ఇళ్లు కొనుక్కుని, ఉద్యోగాలు పోవడంతో మార్టిగేజీ కట్టలేక, అలాగని ఇళ్ల అద్దెలూ భరించలేక కుటుంబాలు కారుల్లోకి మకాం మార్చుకున్న దుర్భర పరిస్థితి అమెరికా అంతా ఎలా వ్యాపించిందో కళ్లారా చూసాం.
ఒక కుటుంబంలో ముగ్గురు పెద్ద పిల్లలతో తల్లిదండ్రులు ఆరు నెలలు ఎలా ఇబ్బందులు పడ్డారో ఇంటర్నెట్లో చూసి భయం వేసింది కూడా.
“అమెరికా అనే మొదటి ప్రపంచంలోనే వీళ్లు కనీసం మనిషికి తలదాచుకుందుకు చోటివ్వలేక పోతే ఎలా?” అంది కరుణ.
“నేనే నాకు తెల్సిన వాళ్ల ఇంట్లో పేయింగ్ గెస్టుగా ఉన్నాను, ఇక అతనికేమి దారి చూపించగలను!” అంది మళ్లీ.
నిజమే, సూర్య అన్నట్లు మాలా బొటాబొటిగా బతికే వాళ్లు ఈ దేశంలో ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు చూపించలేరు.
అదే అన్నాను కరుణతో ఆ సాయంత్రం లైబ్రరీలో.
“అదే చెప్పేసెయ్యి. సాటి మనిషికి సహాయం చేసే ప్రయత్నంలో ఇబ్బందుల్లో పడడానికి ఈ దేశానికి మనలా వచ్చిన వారెవ్వరూ సాహసించరు కరుణా! అది అతనికీ తెలుసు. ఏమీ అనుకోడులే, ఈ- మెయిల్ పెట్టేసి, ఇక నీ వరకు నువ్వు బుద్ధిగా చదువుకో” అన్నాను.
“ఏమో, ప్రియా! రాత్రుళ్లు పడుకుంటే అతను చలిలో వణుకుతున్నట్లు కలలు వస్తున్నాయి, అలాగని ఏమీ సాయం చెయ్యలేని నిస్సహాయత. చాలా బాధగా ఉంది తెలుసా! ”
కరుణ కళ్లల్లో నీటి పొరలు చూసి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు.
రాత్రంతా అతని ముఖమే నాకూ గుర్తుకు వచ్చిందని కరుణకు ఎలా చెప్పను?!
*****
( వచ్చే నెల మరో కథతో కలుద్దాం-)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
