అనగనగా అమెరికా

( డాక్టర్ కె.గీత కాలమ్స్ పుస్తక పరిచయం)

-వసీరా

అనగనగా అమెరికా….ఇది గీతా కాలమ్ ….కాలమ్ కథల పుస్తకం. ఇది కాలమ్ అయినప్పటికీ దీన్ని కథల పుస్తకంగానే  పరిగణిస్తాను నేను.

ఇందులో అమెరికాలోని తెలుగోళ్ల గోడు చెప్పారు, గొప్పలూ చెప్పారు. వాళ్ల కష్టసుఖాలను సానుభూతితో చెప్తూనే సున్నితమైన వ్యంగ్యం , హాస్యంతో చమత్కార బాణాలు వేశారు. కొన్ని చోట్ల తన అభిప్రాయాలేమీ చెప్పకుండానే, ఎలాంటి వాఖ్యానాలూ చెయ్యకుండానే మనుషుల్నీ పరిస్థితుల్నీ ఉన్నదున్నట్టు చూపించారు. కొండని అద్దంలో చూపించినట్లు చిన్ని కథల్లోనే సాంస్కృతిక పరంగా మనవాళ్ల భ్రమలూ భయాలూ అవలక్షణాలు మంచిలక్షణాలూ అన్నీ చూపించారు. అక్కడి సమాజాన్ని మనలోకి రానియ్యరు, మన పిల్లలు రానిస్తారు. అక్కడే వీళ్లకీ పిల్లకీ పేచీ. పిల్లల వీకెండ్ కథ చూడండి.

1 అమెరికాలో మన పిల్లల పరిస్థితికి అద్దం పడుతోంది. పిల్లల మనోభావాలను చక్కగా చెప్పారు. ఒక చిన్నిపాప మనసులోంచి కథ చెప్పారు. మన సంస్కృతి పరి రక్షణ పేరుతో తల్లి తండ్రులు తమ కలల్ని ఆశల్ని అభిప్రాయాలను పిల్లల మీద ఎలా రుద్దుతారో చూపించారు. వీకెండ్లో సైతం పిల్లలకి ఊపిరాడకుండా చేస్తున్న వైనాన్ని చూపించారు. ఈ కథలో పిల్లల తరపున వకాల్తా పుచ్చుకున్నారు గీతగారు. వ్యక్తి స్వేచ్ఛ కేంద్రంగా నడిచే అమెరికా సమాజంతో సర్దుబాటు అసలు సమస్య. అమెరికా జీవితం కావాలి. డాలర్లు కావాలి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి నెత్తిన మోస్తున్న ఫ్యూడల్ విలువల్ని దించుకోలేరు. తాము వదిలించుకోలేక పోగా అవన్నీ పిల్లల మీద రుద్దుతారు. పాపం పసివాళ్లు నోరువిప్పి చెప్పుకోలేని హింసని భరించాల్సి ఉంటుంది. అటువంటి హింసనే పిల్లల మనోభావాల్లోంచి ఎంతో సున్నితంగా చెప్పారు డాక్టర్ కె.గీత.

ప్లే డేటు…దీనికి పూర్తిగా భిన్నమైంది. భారత దేశంలో బాల్యంలో సహజంగా లభించే స్నేహాలూ ఆటలూ అమెరికాలో అంత తేలిగ్గా దొరకవు. ఇక్కడ చాలా ఫ్రీగా సహజంగా పిల్లలు వీధుల్లోనూ, కమ్యూనిటీ ల్లోనూ ఆడుకుంటారు. అమెరికాలో ఉంటే పిల్లల్ని కలిపి, ఆడుకోవడానికి పెద్దలే ఏర్పాటు చెయ్యాలి. అటువంటి ఏర్పాటే ప్లేడేటు. స్థల కాలాలు మారినప్పుడు ఇటువంటి ఏర్పాట్లు తప్పవేమో. అయినా దీనిలోని ఐరనీని చాలా సున్నితంగా చూపించారు.. అమ్మలూ అమ్మమ్మలూ చేసే వ్యాఖ్యలు హాస్యంగానే కాకుండా కామన్సెన్స్ తో ఉంటాయి. అమెరికా పెంపకం అక్కడి భారతీయుల భయాందోళనలు రిఫ్లెక్టు చేస్తోంది. ఇద్దరు కౌమార ప్రాయంలోని స్కూలు పిల్లలు. వాళ్ల తల్లుల సంభాషణ. ఒక పిల్ల పెళ్లిచేసుకోననీ జీవితాంతం లివ్ ఇన్ రిలేషన్ షిప్లో ఉంటానంటుంది. ఇంకోక పిల్ల  అసలు ఈ ఇండియన్ తల్లి తండ్రులకు పుట్టే కంటే అమెరికన్ తల్లితండ్రులకు పుడితే బాగుంటుంది అనుకుంటుంది. ఇందులో వాళ్లతప్పేం లేదు. వాళ్లున్న సమాజం అలాంటిది. దాన్నుంచి ఇన్సులేట్ చెయ్యలేరు. ఈ ఇద్దరు పిల్లలూ వాళ్ల తల్లి తండ్రులకు ఆందోళన కలిగిస్తారు. వారి ఆందోళన వాస్తవం. మనం సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే. మరి పిల్లల తప్పేంటి? అమెరికా బడిలో చదువిస్తూ అక్కడి సంస్కృతితో సంపర్కం లేకుండా ఎలా ఉండగలరు. మరి పేరెంట్స్  ఆందోళనకి కారణం వారి వెనుకబాటు తనమా? ముఖ్యంగా మన ఇంట్లో మన సంస్కృతిని కాపాడు కోవాలనే తాపత్రయంలో పిల్లల సఫొకేషన్ గురించి ఆలోచించడం లేదా? ఈ లాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తుంది అమెరికా పెంపకం కథ. ఏది ఏమైనా కౌమార ప్రాయంలో పిల్లల పెంపకం,  ముఖ్యంగా భారతీయ సంతతికి చెందిన వారికి  కత్తి మీద సాము లాంటిదే. గీతగారు ఈ విషయమే తన కథలో చెప్పారు.

ఇండియాఅమ్మా అమెరికా అమ్మా

ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రేమలో అమ్మ అమ్మే. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అమ్మచాకిరి కూడా అమ్మదే. చంద్రమండలంలోనైనా అమ్మ చాకిరి మాత్రం మారదు. ఒక గ్రహాంతర వాసి కుతూహలం కొద్దీ ఇండియా అమ్మనీ అమెరికాలో అమ్మనీ ప్లేసులు తారుమారు చేస్తుంది. అమ్మలు అటూ ఇటూ మారిపోతారు. వాళ్ల చాకిరీ ఏమైనా మారిందా ? అనేదే పాయంటు. గ్రహాంతర వాసి కనుగొన్న సత్యం ఏమిటి ? అది మాత్రం మీరు చదవాల్సిందే. చాలా సీరియస్ ఇష్యూని ఫన్నీగా, ఫాంటసీ జోడించి మరీ చెప్పారు డాక్టర్ కె.గీత.

హ్యాపీ హోలోవెన్ అమెరికా వాళ్ల దెయ్యాల పండగ. ఇండియా  నుంచి కొత్తగా వచ్చిన ఇల్లాలికి దెయ్యాల పండగ విచిత్రంగా తోచింది. పండగ వాతావరణాన్ని గృహిణి దృష్టిలోంచి కొద్దిపాటి సెటైనరికల్ టోన్లో కథ చెప్పారు డాక్టర్ గీత. కానీ దెయ్యాల పండక్కీ దసరా పండగ పప్పుబెల్లాలకీ పోలిక కనిపిట్టిందా గృహిణి. హాలోవిన్ పండగ గురించి గప్పాలు పోయిన భర్త , చివర్లో భార్య ఇచ్చిన షాక్ కి కెవ్వుమని అరిచి పడిపోయాడు. ఏమిటా షాక్. తెలుసుకోడానికి మీరీ పుస్తకం చదవాల్సిందే.

అమెరికా పోలీసుల క్రమశిక్షణ, తక్షణ స్పందన మనల్ని అబ్బుర పరుస్తాయి. టిక్కెట్లు రాయడంలో వాళ్ల తెలివి చురుకుదనం అంతా ఇంతా కాదు. మరి మన పోలీసుకీ వాళ్ల పోలీసులకీ పోలికల్లేవా? అదేంటో రీసెర్చి చేయించి మరీ చెప్పించారు డాక్టర్ కె.గీత గారు. ఆ రీసెర్చి తెలియాలంటే మీరు చదవాల్సిందే అనగనగా అమెరికా…గీతాకాలంలో పోలీసు కోటా

అమెరికాలోని  తెలుగు కుటుంబంలో దీపావళి ఎలా ఉంటుంది. అక్కడి ఇబ్బందులు, పరిమితుల్లోనే మన వాళ్లు దీపావళి పండగ ఎలా జరుపుకుంటారు. ముఖ్యంగా అక్కడి మనవాళ్ల పిల్లలకి తల్లితండ్రులకీ దీపావళి సరదాలు , పండగరోజు కూడా ఉద్యోగ విధులూ, బాణాసంచా ఖర్చులూ ఇలా పండగ పరిస్థితుల్ని ఒక చిన్ని కథలోనే చక్కగా వివరించారు. ఈ కథలో అసలైన దీపావళి గురించి భర్తగారు చేసిన హిత బోధకి భార్య ఇచ్చిన కౌంటర్ మామూలుగా ఉండదు. చుక్కలు కన్పించాల్సిందే. అదేంటో అనగనగా అమెరికా చదివి తెలుసుకోండి. ముఖ్యంగా కొసమెరుపు మిస్ కాకండి.

కిం కం పిన్ని: ఈ పుస్తకంలో ఒక తెలుగు మహిళ తీయని విజయ గాధ కం కిం పిన్ని కథ. ఆమె పక్కా పదహారణాల తెలుగు ఆడబడుచు.  అమెరికా వేషభాషలతో అమెరికా సమాజంలో చక్కగా కలిసిపోయింది. ఆమె కథ రాయాలంటే ఒక నవల అవుతుందేమో కూడా. అమెరికాలో నిలదొక్కుకోడానికి ఆమె పట్టుదలా చేసిన కృషీ నిజంగా అబ్బురపర్చేవే. అమెరికన్ యాక్సెంటు ఇంగ్లీషు మాట్లాడ్డంలో గానీ ప్రవర్తనలో గానీ ఆమె పర్ఫెట్. తెలుగోళ్లు అమెరికన్ ఇంగ్లీషుతో ఆడంబరాలు పోయేచోట కమ్ కిమ్ కామేశ్వరి అబ్బుర పరిచే ట్విస్ట్ ఇచ్చింది. అదేంటో నేను చెప్పడం లేదు మీరు చదవాల్సిందే అనగనగా అమెరికాలో కం కిం!

శివరాత్రి ‌క్షీరాభిషేకం: రామేశ్వరం పోయినా శనీశ్వరం వదల్లేదనేది సామెత. శనీశ్వరం ఎక్కడో ఉండదు. మన సంకుచితమైన మనస్తత్వంలోనే ఉంటుంది. వైరాగ్యం ఇచ్చే దేవుడు శివుడు . అటుంటి శివుడికి శివరాత్రి రోజున క్షీరాభిషేకానికి వెళ్లినా కూడా,  మనోళ్ల కక్కుర్తి ఎంత దారుణంగా ఉంటుందనేది ఈ కథలో చెప్పారు డాక్టర్ కె.గీత గారు. ఆ కక్కుర్తిని చూస్తే శివుడు సైతం శివశివా అంటూ కళ్లు మూసుకోవాల్సిందే. ఎందుకో మీరే తెలుసుకోండి.

సెల్ఫ్ సర్వీస్ వ్యూహంతో  మనుషుల్ని ఊడ్చేస్తాయి యంత్రాలు. మనుషులకి ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త వాళ్లకి ఉద్యోగాలు దొరకవు. అది అమెరికన్ల కయినా సరే అక్కడి మనోళ్లకయినా సరే. సెల్ఫ్ సర్వీస్ వ్యాపార మర్మాన్నీ , దాని వెనుక నిరుద్యోగాన్నీ వివరించారు కె.గీత తమ కథలో

మామూలు మనుషులు తమ కష్టసుఖాలు చెప్పుకున్నప్పుడు వాళ్ల వ్యక్తిగతమైన స్వభావాలూ , సమాజంతో పడే ఘర్షణలూ ప్రతిఫలిస్తాయి. ఇద్దరు తల్లుల సంభాషణే పెళ్లీ- పేరంటం కథ. అమెరికాలో ఎన్నేళ్లుగా  స్థిరపడినా మనోళ్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లే భూస్వామ్య సాంస్కృతిక భావజాలాన్ని వదులుకోలేరు. తమ పిల్లల్ని అక్కడి ప్రజాస్వామిక భావజాలానికీ సంస్కృతికీ దూరంగా ద్వీపాల్లాగా పెంచాలనుకుంటారు. అది సాధ్యమా? ఈ ఘర్షణనుంచి బయట పడటానికి వాళ్లు ఎంచుకునే మార్గం ఏమిటీ? వాళ్లు మారడమా? లేక దేశం మారడమా? ఇలాంటి సీరియస్ ప్రశ్నల్ని లేవనెత్తే కథ పెళ్లీ పేరంటం.

అమెరికన్ ఇంగ్లీషు చాలా తమాషా కథ. అమెరికా వాడి ఇంగ్లీషు వేరు మన ఇంగ్లీషు వేరు.  ఉచ్చారణ మాత్రమే కాదు. మనం వాడే కొన్ని పదాలు వాళ్ల కసలు వాడుకలోనే ఉండవు. బాగా ఇంగీలీషు వచ్చనుకున్న వ్యక్తి విమానం దిగుతూనే ఏ ‘క్యూ’లో  నిలబడాలో తెలుసుకోవడం దగ్గర్నించి మన ఇంగ్లీషు పండితుడి పాట్లు మొదలవుతావు. చివరికి అతడికో గురువు దొరుకుతుంది. ఆ కంపల్సరీ గురువు ఎవరో కాదు తన చిన్నారి కూతురే. ఈ కూతురు నేర్పిన ఇంగ్లీషేంటో తెలిస్తే మీరూ అబ్బుర పడతారు.  సరదాగా చెప్పినా సీరియస్ స్టోరీ- మన వాళ్లకి ఎదురయ్యే సమస్యలే ఇవన్నీ…ఇలా మన ఇంగ్లీషుకి అమెరికన్ ఇంగ్లీషు పదాలతో పదకోశం రాస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని డిజిటల్ లింగ్విస్టు డాక్టరు గీతగారికి నా మనవి.

అక్కడ మన సంస్కృతిని కాపాడ్డానికి వ్యక్తులూ సంస్థలూ పడే తాపత్రయాలూ , చేసే ట్రిక్కులను కూడా ఎక్కడా  వదిలి పెట్టలేదు,ఎడా పెడా వాయించారు గీతగారు. కాకపోతే సుతిమెత్తని హాస్యంతో. జావా రావులాంటి యంత్రభాషకి అంకితమైన తమాషా మనుషుల్ని చూపించారు గీతగారు. అంతేకాకుండా  మనుషులు పార్కులో పలకరించుకుని మాట్లాడ్డాన్ని కూడా డాలర్ల ఆదాలోకి మార్చేకుని మురిసిపోయే అతి తెలివిమంతుల్ని కూడా నిర్మొహమాటంగా చూపించారు గీతగారు. చిన్ని కాలమ్ లో  లోతైన కథలు చెప్పడం చాలా కష్టం. ఆ లోతైన కథలు తేలిగ్గా చెప్పడం ఇంకా కష్టం . అటువంటి కష్టసాధ్యమైన రచనలు అలవోకగా చేశారు డాక్టర్ కె.గీత. వారికి హృదయపూర్వక అభినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.