దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

సోమవారానికి వైకుంఠపురం అడవులలోని విశాలమైన వృక్షాల నీడల మధ్య వున్న ఒక తోపులో దర్బారు ఏర్పాటు చెయ్యబడింది. చిరుగడ్డి, ముళ్ల పొదలు తొలగించి నేల చదును చెయ్యబడి వుంది. ఒక ప్రక్కగా, ఒక విశాల వృక్షం క్రింద చెక్కతో కట్టబడిన వేదికకు పైకప్పుగా ఒక ఛత్రి, ఆ వేదికపైన ఒక రాజాసనము ఏర్పరిచి వున్నవి.

సూర్యోదయ కాంతిలో, దేవి రాణి ముత్యాలతో పూసకట్టు చేసిన జరీ చీరతో, నిండు ఆభరణాలతో, ఒక కిరీటంతో ఆ రాజాసనం మీద ఆసీనురాలు అయ్యింది. ఘనమైన ఆహార్యంతో ఒక శక్తిలాగా, రాణిగా వున్నది. ఆవిడ వెనుకగా నలుగురు యువతులు బంగారపు తాపడాలతో కూడిన చామరలతో విసురుతున్నారు. వేదికకు నాలుగు వైపులా నలుగురు బలశాలులు ఎర్ర తలపాగాలతో, ఎర్రటి చొక్కాలతో, మోకాళ్ల వరకు బిగుతుగా కట్టిన ధోవతీలతో తుపాకీలు పట్టుకుని వున్నారు. ఐదు వందల యోధులు ఆ వేదికకు ఎదురుగా రెండు ప్రక్కలా ఒక వరుసలో నిలబడి వున్నారు. వారి వెనుక చెట్లపై ఎర్రని జెండాలు ఎగరవేసి వున్నాయి. ఆ వేదికకు ఎదురుగా వేలమంది పీడిత ప్రజలు కూర్చునివున్నారు.

దర్బారు “దేవి రాణీ కి జై” అంటూ ప్రజలు చేస్తున్న జయ ధ్వనులతో మారుమ్రోగింది.  ఒక యువ బృందం చక్కని వేషకట్టుతో వేదిక వద్దకు వచ్చి దేవి రాణికి జయ గీతాలను పాడారు. దర్బారు ప్రారంభమయ్యింది.

ఈ దర్బారులో తగువులు తీర్చే కార్యక్రమేమీ లేదు. దీనజనోద్ధరణ మాత్రమే. రంగరాజు ప్రజలను ఒక క్రమ పద్ధతిలో దేవి వద్దకు తీసుకువస్తున్నాడు. కొందరు కలసి జట్టుగా వస్తున్నారు, కొందరు ఒకొక్కరే వస్తున్నారు. వచ్చిన వారందరూ దేవి ఆ భగవతీ దేవి అంశ అని తలుస్తూ సాష్టాంగ పడుతున్నారు. దేవి వారిని లేపి మృదు వచనాలతో అనునయిస్తూ తగిన ధన సహాయం చేస్తున్నది. సూర్యోదయానికి ప్రారంభమైన దర్బారు అర్థరాత్రి వరకు సాగింది. అప్పుడు మాత్రమే దేవి లేచి మంచి నీరు, ఫలాహారం సేవించింది. దేవి ఏ రకం డాకూనో ఇప్పుడు పాఠకుడే నిర్ణయించాలి.

దేవి చేసిన ధన సహాయం వలన ప్రజల పరిస్థితి కొంత మెరుగయ్యింది. వారు జీవనావసరాలకు డబ్బు ఖర్చుచేయటం రంగాపురంలోని ఇంగ్లీష్ దొర గుడ్‌లాడ్ గమనించాడు. ప్రజలు మాత్రం ఏ విషయం పొక్కనివ్వలేదు. పైగా విషయం తెలిస్తే పన్ను వసూలు అంటూ ఇంగ్లీషువాడు ఉన్నది కాజేస్తాడు. దేవి తమకు ఇచ్చిన దనాన్ని కూడా కాజేస్తాడు.  కానీ, వైకుంఠపురం అడవులలో అసంఖ్యాకంగా డాకూలు కూడి వున్నారని వార్త గుడ్‌లాడ్‌కు చారుల ద్వారా అందింది.

***

వ్రజేశ్వర్ అనుకున్న సమయానికే తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఆ విషయాలూ ఈ విషయాలూ వ్రజేశ్వర్ మాట్లాడుతుంటే అసలు విషయానికి రమ్మన్నాడు తండ్రి. “డబ్బు సంగతి ఏమయ్యింది?” అన్నాడు హరివల్లభ బాబు.

“మావగారు డబ్బు సర్దలేదు” అన్నాడు వ్రజేశ్వర్.

తండ్రి గాభరా పడుతూ “అయితే డబ్బు లేదా ఇప్పుడూ?”

“మావగారు ఇవ్వలేదు కానీ వేరే రకంగా కూడింది.”

“దొరికిందా!? మరి ఆ విషయం ముందు ఎందుకు చెప్పలేదు? దుర్గా మాతా, బ్రతికించావు” అంటూ దండాలు పెట్టసాగాడు తండ్రి.

“డబ్బైతే దొరికింది కానీ, అది తీసుకోవాలా వద్దా అనేది అర్థం కావటంలేదు” అన్నాడు వ్రజేశ్వర్.

“అదేమిటి? డబ్బు ఎవరిచ్చారు?”

“పేరు గుర్తుకు రావటంలేదు, ఆ బందిపోటు రాణి వుందే …”

“దేవి చౌధురాణి?”

“ఆ, అవును.”

“ఎందుకిచ్చిందీ?”

“ఏదో ఉపయోగం వుండి వుంటుందిలే” అంటూ మాటా దాట వెయ్యబోయాడు వ్రజేశ్వర్.

“డాకూల డబ్బు. సరే, రాతపోతలు ఏమైనా జరిగాయా?”

“రాతపోతలేమీ జరగలేదు. అయినా పాపపు ధనం కదా, అది తీసుకుంటే మనకి కూడా పాపం అంటుకుంటుందేమోనని. అందుకే ఆ డబ్బు మనం వాడుకోవటం మంచిది కాదని అనుకుంటున్నా.”

“ఈ డబ్బు తీసుకోకుండా నన్ను జైలుకి వెళ్లమంటావా? అప్పు తీసుకోవటంలో పాపపుణ్యాలు లెక్కపెట్టటం ఏవిటీ?  సాధువు దగ్గర అప్పు తీసుకున్నా, దోపిడీ దొంగల దగ్గర నుండి అప్పు తీసుకున్నా, అప్పు అప్పే. అయినా, అప్పు ఇచ్చే సాధువు ఎవడూ లేడు. అసలు ఆలోచించవల్సిందేవిటంటే అప్పు తీసుకుంది డాకూ వద్ద నుండి, చెల్లించటం ఆలస్యమైతే, అది సాకు పెట్టుకుని ఆ బందిపోటుది మన ఇంటి మీదకు వచ్చి దాడులు లూటీలు చేసి మన ఆస్తులని కాజేస్తుందా అని” విశ్లేషించాడు హరివల్లభ బాబు.

వ్రజేశ్వర్ ఏమీ మాట్లాడలేదు.

“డబ్బు ఎప్పటికి తిరిగి చెల్లించాలి?” మళ్లీ తనే అడిగాడు తండ్రి.

“వైశాఖ శుక్ల సప్తమి చంద్రాస్తమయానికి ముందు.”

“డబ్బు ఎక్కడ చెల్లించాలి?”

“అక్కడ సంధానపూర్ ఘాట్ దగ్గర వుంటుందట. అక్కడకే డబ్బు పంపించాలి.”

“సరే, అలాగే పంపించుదాము.”

వ్రజేశ్వర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హరివల్లభ బాబు ఆలోచనలో పడ్డాడు. ‘ఆ దొంగ ముండకు డబ్బు చెల్లించేదేమిటీ? ఇంగ్లీష్ వాళ్లకి చెప్పి సిపాయీ దళాన్ని పంపించమంటాను. అప్పు గొడవ వదిలిపోతుంది, దేవి చౌధురాణిని పట్టించినదుకు బహుమతి కూడా వస్తుంది. ఇంగ్లీషు సైన్యం కాప్టేను దొరకు చెప్పి ఆ బందిపోటుదాన్ని పట్టించకపోతే నా పేరు హరివల్లభ బాబు కాదు’ అంటూ తనలో తనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు తండ్రి.

ఈ ఆలోచన తనలోనే వుంచుకున్నాడు హరివల్లాభ బాబు. కొడుకు మీద ఈ విషయాలలో అంత నమ్మకం లేదు.

ఇంతలో సాగర్ ముసలావిడ ఠాకురాణి దగ్గరకు చేరి, “రాత్రి ఏం జరిగిందో తెలుసా?” అంటూ కథలు కథలుగా చెప్పటం మొదలుపెట్టింది. “వ్రజేశ్వర్ రాత్రి ఓ పెద్ద నావ పైకి వెళ్లి చేపలు పట్టే ముసలిదాన్ని ఒకత్తెను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే దానికి రెండు పెళ్లిళ్లు అయ్యాయంటా! నేను వద్దంటే వద్దని బ్రతిమలాడాను. అయినా వినలేదు. వ్రజేశ్వర్ ఇప్పుడు జాతి భ్రష్టుడయ్యాడు కదా, ఇక ఒక విస్తరలోనే ఏం తింటాం, నేను తినను, బాబోయ్” అన్నది.

ఠాకురాణి అయితే నమ్మలేదు. అప్పుడే తండ్రి దగ్గర నుండి అటుగా వస్తున్న వ్రజేశ్వర్‌ని చూసి “నిన్న రాత్రి ఇంకో పెళ్లి చేసుకున్నావట కదా? ఎవరో చేపలు పట్టేదాన్ని అంట కదా” అని అడిగింది. వ్రజేశ్వర్ విసుగ్గా, “ఏం, పెళ్లి చేసుకున్నా, తప్పేమిటి? చేపలు పట్టేది మాత్రం కాదు, నాకు మేనత్త అవుతుందిలే, గొప్ప రాణి, మంచి కులం వాళ్లది. పెళ్లంటావా, నాకు ముగ్గురు పెళ్లాలు, దానికి కూడా ముగ్గురు మొగుళ్లు. ఒకళ్లకొకళ్లం సరిపోతాములే” అంటూ విసురుగా వెళ్లిపోయాడు.

పెళ్లి సంగతి అబద్దమని ఠాకురాణి గ్రహించింది. అయినా, నోరు కట్టేకోలేక నయనతారకు వ్రజేశ్వర్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడని చెప్పింది, అది కూడా చేపలు పట్టే ముసలిదాన్ని చేసుకున్నాడని చెప్పింది. సాగర్‌కి కావల్సింది కూడా అదే. వినగానే నయనతారకు తిక్క రేగింది. అప్పటికే సాగర్‌ని వెంటపెట్టుకుని వచ్చాడని చిరచిరలాడుతూ వుంది. నయనతార కోపావేశాలు చూసి వ్రజేశ్వర్ నయనతార దరిదాపులకు కూడా వెళ్లటానికి భయపడ్డాడు. సాగర్ వుండే గదిలోకి చేరటం తప్పలేదు. సాగర్ పన్నాగం పూర్తి అయ్యింది.

ఒక రోజు నయనతార ఇంట్లో తుఫాను లేపింది. అత్తగారిని విషయం తేల్చమన్నది. అత్తగారు, “నీకు పిచ్చా వెర్రా?  బ్రాహ్మణులెవరూ శూద్ర కన్యలని వివాహం చేసుకోరు. నీకు అసలే తిక్క ఎక్కువ. నువ్వు కుళ్లుకుంటావని వాళ్లకు తెలుసు. అందుకే నిన్ను ఆటపట్టించి, ఇంకా తిక్క ఎక్కించటానికే ఈ కథ అల్లి అబద్దాలు చెప్పారు” అన్నది.

నయనతారకు ఇంకా నమ్మకం కుదరలేదు. “పెళ్లి గురించి ఎవరూ అబద్దాలు చెప్పరు. పెళ్లి మాట నిజం కాదనటం ఎలా? నిజంగానే అయ్యిందేమో, ఇంటికి ఇంకోదాన్ని తీసుకువస్తాడేమో” అంటూ సాగించింది.

“అదే నిజమైతే, సాదరంగా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకువెళ్తాను. ఒక కోడల్ని ఇంట్లో నుంచి పంపించి పొరబాటు చేసాను. ఇంకో కోడల్ని ఎవరినీ తరిమెయ్యను.”

అదే సమయంలో వ్రజేశ్వర్ అటువైపుకు వచ్చాడు. నయనతార రుసరుసలాడుతూ వెళ్లిపోయింది. “అమ్మా, ఏం జరుగుతోంది?” అన్నాడు వ్రజేశ్వర్.

“నిన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటున్నది” అన్నది ఇంటావిడ.

ఏమీ మాట్లాడుకుండా వెళ్లిపోయాడు వ్రజేశ్వర్.

రాత్రి హరివల్లభ బాబుకి భోజనం వడ్డిస్తూ ఇంటావిడా మాటలలో వ్రజేశ్వర్ మళ్లీ పెళ్లి చేసుకుంటే బాగుంటుదేమో అంటూ మొదలుపెట్టింది. “సాగరేమో ఇక్కడ ఎక్కువగా వుండదు, పైగా ఆకతాయి పిల్ల, ఇల్లు నడపాలనే ఆలోచన లేదు. నయనతారకు ఏదీ చేతకాదు. ఇల్లు నడపడానికి ఒక మంచి యోగ్యురాలిని చూసి వ్రజేశ్వర్‌కి మళ్లీ పెళ్లి చేసి ఇంటి బాధ్యత అప్పచెప్పితే, నేను కృష్ణారామా అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటా” అన్నది.

“కొడుకేమనుకుంటున్నాడో ఒకసారి కనుక్కో. వాడు చేసుకుంటానంటే పెళ్లిళ్ల పేరయ్యను పిలిచి ఒక మంచి సంబంధం చూడమంటాను” అన్నాడు హరివల్లభ బాబు.

“సరే వ్రజేశ్వర్ ఏమంటాడో కనుక్కుంటాను.””

వ్రజేశ్వర్ ఇంకో పెళ్లి చేసుకోవటం గురించి ఏమని అనుక్కుంటున్నాడో తెలుసుకునే పని ఠాకురాణి మీద పడింది. ఆవిడ అందమైన రాజకుమారి, విరహాలు గురించి వ్రజేశ్వర్‌కి కథలు చెప్పటం మొదలుపెట్టింది. వ్రజేశ్వర్ ఏ విషయమూ బయటకు చెప్పలేదు. చివరకు ఇంటావిడ వ్రజేశ్వర్‌ని సూటిగా ఇంకో పెళ్లి చేసుకుంటావా అని అడిగితే “తల్లిదండ్రులిద్దరూ ఏమి ఆజ్ఞాపిస్తే అదే చేస్తాను” అన్నాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.