
యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-10
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) థేమ్స్ నదీ విహారం
థేమ్స్ నదీవిహారం:
థేమ్స్ నది దక్షిణ ఇంగ్లాండ్ దేశం గుండా ప్రవహిస్తూ లండన్ దాటేక “టిల్ బరీ” దగ్గర ఉత్తర సముద్రంలో కలుస్తుంది. లాటిన్ లో “ముదురు వర్ణం కలిగిన” అనే అర్థం వచ్చే “తమేసిస్”(Tamesis) అనే పదం నించి పుట్టినదే ఈ థేమ్స్. “తమేసిస్” పరిశుభ్ర జలాలనందించే దేవతామూర్తి కూడా. ఈయన ముఖాకృతి థేమ్స్ నది మీద ఆక్స్ ఫర్డ్ దగ్గర్లో నిర్మించిన హెన్లీ బ్రిడ్జి మీద చెక్కబడి ఉంటుంది.
క్రీ. శ పన్నెండో శతాబ్దంలో నిర్మించబడిన “లండన్ బ్రిడ్జి” థేమ్స్ నది మీద నిర్మించబడిన 223 బ్రిడ్జిల్లోకెల్లా పురాతనమైంది. థేమ్స్ నది మీద ఒక్క లండన్ లోనే 33 బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ “లండన్ బ్రిడ్జి” మొదట రాళ్లతో నిర్మించబడినా శతాబ్దాల తరబడి ఎన్నో సార్లు మరమ్మత్తులు చేయబడుతూ పునర్నిర్మించబడుతూ వస్తూ ఉంది. అందుకే కాబోలు “లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్” అనే గీతం పుట్టినట్టుంది. ఛార్లెస్ డికెన్స్ వంటి మహా రచయితలతో బాటూ ఎందరో రచయితల రచనల్లో థేమ్స్ నది ప్రస్తావన అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది. వర్డ్స్ వర్త్, ఇలియట్ వంటి కవులెందరో కవితలు అల్లారు. ఎన్నో సినిమాలు తీశారు. ఈ నది మీద ఏటా రోయింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి.
థేమ్స్ నది బురద వర్ణంలో ఉంటుంది. వేగవంతమైన గుండ్రటి ప్రవాహాల వల్ల ఎప్పటికప్పుడు అడుగున ఉన్న బురద పైకి తేరి ఎప్పటికప్పుడు కొత్తనీరు ప్రవహిస్తున్నట్టే ఉంటుందట.
ఇంగ్లాండ్ దేశం మొత్తమ్మీద నీటి సరఫరాకు ఈ నదీ జలాలే ప్రధాన వనరు. మొత్తం దాదాపు 350 కి.మీ మేర ప్రవహిస్తున్న థేమ్స్ నది ఇంగ్లాండ్ సంస్కృతిలో ప్రధాన భాగం.
నిజానికి మన దేశంలో ఉన్న నదుల వెడల్పుతో పోలిస్తే లండన్ లో కనిపిస్తున్న థేమ్స్ నదిని కాలువ అనొచ్చు.
ఇక వెస్ట్ మినిస్టర్ లో థేమ్స్ నది ఒడ్డున మా “లండన్ ఐ” రైడ్ పూరయ్యేసరికి దాదాపు మధ్యాహ్నం ఒకటిన్నర కావొచ్చింది. మూడు గంటలకి మేం అక్కణ్ణించి మరో రెండు మైళ్ళకవతల ఉన్న టవర్ బ్రిడ్జి తీరం నించి “ఆఫ్టర్ నూన్ హై టీ క్రూజ్” ఎక్కాల్సి ఉంది. నిజానికి అదే తీరం నించి బయలుదేరే బోటు, లండన్ ఐ కలిపిన కాంబో టిక్కెట్లు గానీ, విడిగా ఆ తీరం నించి వెళ్లే బోటు టూరు గానీ ముందే తీసుకోవడం మంచిది. మేం చివరి నిమిషంలో క్రూజ్ టికెట్లు కొన్నందువల్ల టవర్ బ్రిడ్జి తీరం నించి వెళ్లే ఎక్కాల్సి వచ్చిందన్నమాట.
అయితే ఈ తీరం నించి ఆ తీరానికి తక్కువ సమయంలో, సులభంగా వెళ్లాలంటే “ఊబర్ బోట్” ఎక్కడమే మంచి మార్గం అని గూగులమ్మ చెప్పింది. ఇంకేం? “లండన్ ఐ” ని ఆనుకుని ఉన్న ఫెర్రీ నించి మరో అయిదు నిమిషాల్లో పడవ అందుకున్నాం.
ఈ ఊబర్ బోట్లు నీళ్ల మీద నడిచే టాక్సీలన్నమాట. రోడ్డు మీద వెళ్లినట్టు ట్రాఫిక్ గోల ఉండదు కాబట్టి వేగంగా వెళ్లగలుగుతాం. లండన్ లో థేమ్స్ నదీ తీరాల్లో ఇది ప్రధానమైన, చాలా చక్కని రవాణా సౌకర్యం. ఈ ఊబర్ బోట్లకి కూడా ఎవరి క్రెడిట్ కార్డు వాళ్ళు స్కాన్ చేసి ఎక్కెయ్యొచ్చు. అక్కణ్ణించి ఒకొక్కళ్ళకి దాదాపు ఏడు డాలర్ల టిక్కెట్టు.
అలా మేం సరిగ్గా ఇరవై నిమిషాల్లో టవర్ బ్రిడ్జి తీరానికి చేరుకున్నాం.
దిగంగానే “ఆఫ్టర్ నూన్ హై టీ క్రూజ్” అన్న బోర్డు ఉన్నచోట అడిగితే, తాపీగా “మూడు గంటలకి పదినిమిషాల ముందు రమ్మని” జవాబిచ్చాడు అక్కడ లైన్లో పంపించే కుర్రాడు. అప్పటికి రెండే అయ్యింది. ఇంకా గంట అక్కడక్కడే గడపాలి. బయట ఏ మాత్రం కాస్త నునువెచ్చగా ఉన్నా ఎక్కడో ఓ చోట కూర్చోవచ్చు. కానీ చలిగాలి వల్ల అయిదునిమిషాలు కూడా బయట గడిపేటట్లు లేదు. సిరి అప్పటికే బాగా అలిసిపోయింది. ఇక ఎదురుగా కనిపిస్తున్న స్టార్ బక్స్ కాఫీ షాపులోకి దారి తీసాం.
లండన్ లో అమెరికన్ బ్రాండ్ అయిన స్టార్ బక్స్ కాఫీ షాపులు ఎక్కడికక్కడ బాగా ఉన్నాయి. మేం ఎక్కడికెళ్లినా ఆ నగరపు పేరు చెక్కిన స్టార్ బక్స్ కాఫీ కప్పు ఒకటి ఆనవాయితీగా కొంటాం. అలా “లండన్” అని రాసున్న కప్పు, మా ఇద్దరికీ కాఫీలు, సిరికి కేకు లాంటివేవో కొనుక్కుని అక్కడే మరో గంట కాలక్షేపం చేసేం.
పదినిమిషాల తరువాత సత్య అలా బయటికెళ్లి టవర్ బ్రిడ్జి చూసొద్దామని అన్నాడు. బయట చలి మాట అలా ఉంచితే, ఆ తీరాన గచ్చు సాఫీగా లేకుండా రాళ్లు పరిచినట్టు ఉంది. అందులో సిరి వీల్ ఛైర్ ని దొర్లించడం దుర్లభం. అలాగని నడిపిద్దామంటే తను అడుగు తీసి అడుగు వెయ్యనని మొండికేసింది. ఇక చేసేదేం లేక నేను సిరిని కనిపెట్టుకుని కాఫీ షాపులో ఉండిపోయాను. సత్య ఒక్కడూ వెళ్లి టవర్ బ్రిడ్జి పై వరకు నడిచి చూసొచ్చాడు.
ఈ లోగా సిరి నా ఒళ్ళో నిద్రపోయింది. మేం చక్కటి సోఫాలో కూర్చున్నామేమో, నా కాఫీ పూర్తిచేసి నేను కూడా అలా వెనక్కి అలవోకగా జేరబడ్డానో లేదో నాకు తెలియకుండానే గాఢంగా నిద్ర పట్టేసింది. ఇద్దరం జెట్ లాగ్ వల్ల నిద్ర ఆపుకోలేకపోయామన్నమాట. అలా కూర్చుని కునుకు అన్న పేరుతో గాఢ నిద్ర తీస్తుంటే షాపు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు గానీ, సత్య వచ్చి ఒక్కటే నవ్వడం ప్రారంభించాడు.
మొత్తానికి సరిగ్గా మూడుగంటలకి క్యూలోకి వెళ్లి మొత్తానికి “ఆఫ్టర్ నూన్ హై టీ క్రూజ్” ఎక్కాం.
ఈ “ఆఫ్టర్ నూన్ హై టీ” అనేది లండన్ లో చాలా ప్రత్యేకమైన, సాంప్రదాయకమైన మధ్యాహ్నపు తేనీటి విందు. ఇందులో కేవలం ఏదో టీ తాగడం మాత్రమే కాకుండా, ఫార్మల్ డిన్నర్ క్రూజ్ తరహాలో దర్జాగా టేబుల్ అలాట్ మెంటు ఉంటుంది. కెటిళ్లతో టీతో బాటూ, కేకులు వంటివి కూడా ఇస్తారు.
ఈ క్రూజ్ కి టిక్కెట్లు మా ప్రయాణానికి ముందురోజు లాస్ట్ మినిట్ టిక్కెట్లుగా చాలా లక్కీగా దొరికాయి మాకు. సాధారణంగా అడ్వాన్సుగా బుక్ చేసుకోకపోతే దొరకవు. ఇందులో కూడా ఒక కిటుకు ఉంది. మామూలుగా ఇటువంటి వాటికి టిక్కెట్లు “వయేటర్” వంటి సైట్లలో అమ్ముతారు. అక్కడెక్కడా దొరకని పక్షంలో ఇటువంటి విహార యాత్రలకు ప్రత్యేకించిన “సిటీ ఎక్స్పీరియెన్సెస్” అనే సైటులో టిక్కెట్లు దొరుకుతాయని ఎక్కడో చదివాం. ఈ సైటులో యూరపులోనే కాకుండా అమెరికా వంటి దేశాల్లో కూడా విహారయాత్రలకు టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ క్రూజ్‌లో నదీ విహారం చేస్తూ ఫలహారాలు స్వీకరించడానికి మనిషికి దాదాపు యాభై యారు యూరోలు చెల్లించాం. అంటే దాదాపు అరవై డాలర్లు. అద్దాల తలుపు పక్కనే కూర్చోవాలంటే తొంభై డాలర్లు. ఈ తతంగమంతా చాలా ఖరీదు అయినప్పటికీ ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా జనాలు నిండిపోయి ఉన్నారు.
“కేవలం టీ తాగడానికి అంత ఖరీదా?” అని అనిపించినా లోపలికి వెళ్ళేక విశాలమైన గదిలాంటి అద్దాల డెక్ లో, అందమైన పువ్వులతో చూడచక్కని ఏర్పాట్లు, టేబుళ్ల మీద ఉన్న కేకు స్టాండ్ల నిండా పెట్టిన తిండి సామగ్రి చూస్తే ఫర్వాలేదనిపించింది.
టీ అంటే పాలు కలిపిన టీ కాకుండా ఎవరికి వారికి కెటిల్ తో అచ్చపు డికాషన్ టీ ఇస్తారు. మూణ్ణాలుగు వెరైటీ టీల్లో మనకు కావాల్సిన టీ ఆర్డరు చేసుకోవచ్చు, అది తేనీరులా తాగే చైనీస్ టీ వంటిది. మనిషికి ఒక్కొక్క కెటిల్ లో వేన్నీళ్ళలో టీ బ్యాగ్ వేసి తెచ్చి ఇచ్చారు. పాలు, పంచదార కావాలంటే అడిగితే ఇస్తారు. నాకు సువాసన ఏమీ లేని బ్లాక్ టీ, సత్యకి సువాసన భరితమైన లైట్ టీ ఆర్డరు చేశాం.
టీ కెటిళ్ళు, ప్లేట్లు అన్నీ పింగాణీ వైనా పాతకాలపు సీనా రేకు పాత్రల్ని పోలిన డిజైనులో వైవిధ్యంగా ఉన్నాయి. లండనులో అన్ని హోటళ్లలో సామగ్రి దాదాపుగా ఇలాగే ఉన్నాయి.
ఇక మా టేబులుకి రెండు స్టాండ్ల మీద మూడు వరుసల్లో పేస్ట్రీలు, శాండ్విచ్ లు ఇచ్చారు. పై వరుసలో స్కోన్లు, మధ్యలో కేకులు, మూడో వరుసలో శాండ్విచ్ లు ఉన్నాయి. అన్నీ చిన్న సైజులో ఉన్నా నిజానికి మధ్యాహ్న భోజనం లాగా హెవీ ఫుడ్ అది. శాండ్విచ్ లలో బ్రెడ్ మధ్య పన్నీర్ బటర్ మసాలా పెట్టినట్లున్న కర్రీ శాండ్విచ్ బావుంది. ఇక బుజ్జి బుజ్జి క్రీమ్ కేకులు అన్నీ మొదటగా “హాం ఫట్” అనిపించాం. రుచీ పచీ లేని స్కోన్ల మీద వేసుకోవడానికి ఇచ్చిన చిన్న చిన్న జామ్ సీసాలు, వెన్న డబ్బాలు భలే ఉన్నాయి. గంటన్నర నదీ విహారంలో స్థిమితంగా తినొచ్చు. అయితే మేం అంతకుముందే కడుపు నిండా తినడం వల్ల పూర్తిగా తినలేక పోయాం. పైగా ఎటూ కాని వేళ అది.
మా టేబుల్ పడవకి ముందు భాగంలో ఉండడం వల్ల ఆ విహారం ఎంతో బావుంది. పడవ ఎక్కుతూనే ఈ టీ, స్నాక్ కార్యక్రమం మొదలయ్యింది. ఓ గంట పాటు నిశ్శబ్దంగా ఈ క్రూజ్ నది మీద ప్రయాణించేక, వెనక్కి తిరిగి వచ్చేటపుడు మైకులో దార్లో కనిపించే బ్రిడ్జిలు, భవంతులు, నిర్మాణాల వివరాలు వివరించసాగేరు.
ఇలా లండన్ లో చాలా చోట్ల మధ్యాహ్నం పూట “ఆఫ్టర్ నూన్ టీ”ఉన్నా, ప్రసిద్ధి చెందిన స్థానిక లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ “సావోయ్” లో అయితే మనిషికి నూట యాభై డాలర్ల పై చిలుకు చెల్లించవలసిందే. పైగా అక్కడ సీట్లు ఎంతో ముందు బుక్ చేసుకుంటే గానీ దొరకవు కూడా. దాంతో పోలిస్తే ఈ నదీ విహారపు ఆఫ్టర్ నూన్ టీ కారుచౌకనే మరి!
అప్పటిదాకా కాస్త ఎండ కాస్తున్నట్లు వెల్తురున్నా పడవ బయలుదేరిన అయిదునిమిషాల్లో మబ్బు ముసిరి, హోరున వాన కురవడం మొదలు పెట్టింది. సమయానికి పడవలో ఉన్నాం కాబట్టి సరిపోయింది. అంతలోనే కాస్సేపు ఎండ, విచిత్రంగా మళ్ళీ వాన. ఎండా వానా దోబూచులాడుతున్న ఆ మధ్యాహ్నపు వేళ లండన్ నగరాన్ని థేమ్స్ నది మీంచి తిలకించడం గొప్ప మరపురాని అనుభూతి.
బురద తేరిన థేమ్స్ నదీ ప్రవాహం, నాచు పట్టిన తీరాలు, పాతకాలపు వారధులు ఏవేవో చారిత్రక జ్ఞాపకాల్ని తవ్వితీస్తూ ఉంటే అలా థేమ్స్ నదిలో అలల మీద తేలియాడుతూ పడవ విహారం చెయ్యడం, ఈ మధ్యాహ్నపు తేనీటి సాంప్రదాయాన్ని రుచి చూడడం కోసమైనా ఈ టూరుకి వెళ్లొచ్చు.
సాయంత్రం అయిదుగంటలకి తిరిగి టవర్ బ్రిడ్జి తీరాన్ని చేరుకున్నాం. ఆ సాయంత్రమే మేం లండను సాహితీమిత్రుల్ని కలవాల్సి ఉంది.
https://www.facebook.com/geetamadhavikala/posts/
(సశేషం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
