రాగసౌరభాలు-22

(వసంత రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

ప్రియ మిత్రులందరికీ ఆంగ్ల నూతన వత్సర శుభాకాంక్షలు. అందరు నూతన ప్రణాళికలతో క్రొంగొత్త ఆశల తోరణాలు అల్లే ఉంటారుగా! వసంత ఋతువు కన్నా ముందే వసంత శోభలను మీ ముంగిళ్లకు తెచ్చే ఉంటారు. అందుకే ఈ మాసం ఆశావహ దృక్పధాన్ని పెంచి, ఉత్సాహాన్ని నింపే వసంత రాగం గురించి తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం?

ఇది పురాతన రాగమే. సుమారు 1000 సంవత్సరాల ముందుదే. సంగీత రత్నాకరం, సంగీత సమయసారం వంటి గ్రంధాలలో పేర్కొనబడింది. ఈ రాగం కనిపెట్టి పాడుకున్న సమయంలో వసంత శోభ కనపడిఉండవచ్చు. అందుకే వసంత అని పేరు పెట్టి ఉండవచ్చు.

ఇక రాగ వివరాలకు వస్తే ఇది 17వ మేళకర్త సూర్యకాంతం రాగ జన్యము. కొందరు శాస్త్రవేత్తలు ఇది 15వ మేళకర్త మాయమాళవ గౌళ రాగ జన్యంగా భావిస్తారు. కాని శుద్ధ దైవత ప్రయోగం కనిపించదు. అందుకే సూర్యకాంతం జన్యంగానే భావిస్తారు.

ఈ రాగం ఆరోహణ అవరోహణలు క్రింది విధంగా ఉన్నాయి.

స గ మ ద ని స

స ని ద మ గ రి స

“స మ గ మ ద ని స ” అనే ఆరోహణ ప్రయోగం కూడా వినిపిస్తుంది. ” స మ గ మ ” చక్కని రంజక ప్రయోగము.  500 సంవత్సరాల ముందు “సరిగమ”

ప్రయోగంతో పంచమంతో కూడి ఉండవచ్చును. అందుకే రామరాజ భూషణుడు తన వసు చరిత్రలో  “సరిగానయ్యెను వసంత రాగము సంపూర్ణ భావోన్నతిన్” అని పలికాడు. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పులతో నేటి వసంత రిషభ, పంచమ వర్జమ ఆరోహణతో పంచమ వర్జ అవరోహణతో ఔడవ షాడవ రాగంగా నిలిచింది. జన్య రాగము కనుక ఉపాంగ రాగము.

ఈ రాగములోని స్వర స్థానములు షడ్జమ్, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి దైవతం, కాకలి నిషాదములు. గమక వరీక రక్తి రాగము. మంద్ర దైవతం క్రింద సంచారము లేదు. మనోధర్మ సంగీతానికి అనువైన చక్కని రాగము.

ఈ రాగము శృంగార భక్తి రసాలను అద్భుతంగా పోషించగలదు. ఎల్లవేళలా పాడదగినదే కానీ సాయంత్రము మరింత శోభనిస్తుంది. ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి, భయాదులను పోగొట్టగలదు. వసంత ఋతు శోభను కూర్చగలదు కనుక ఆశలను చిగురింపజేస్తుంది.

ఈ రాగానికి దగ్గర రాగం లలిత రాగం. శుద్ధ దైవతము మినహా అన్ని స్వర స్థానములు ఒకటే. హిందూస్తాని సంగీతములో మిక్కిలి సమీప రాగం గిరిజ.

ఇంత చక్కని రాగం లలిత సంగీతములో కానీ సినిమా సంగీతములో కానీ విస్తృతంగా వాడబడలేదు. ఇది కొంత ఆశ్చర్యకరమే.

ఇప్పుడు కొన్ని ప్రసిద్ధ రచనలు పరికిద్దాము.

 

శాస్త్రీయ సంగీతం
1 వర్ణం నిన్ను కోరి అదితాళము త్రిచూర్ సింగరాచార్
2 కీర్తన సీతమ్మ మాయమ్మ రూపకతాళము త్యాగయ్య
3 కీర్తన ఎట్లా దొరికితివో అదితాళము త్యాగయ్య
4 కీర్తన రామచంద్రం భావయామి రూపకతాళము దీక్షితులు
5 కీర్తన మరకత లింగం అదితాళము దీక్షితులు
6 కీర్తన పరమ పురుష అదితాళము స్వాతితిరునాల్
7 కీర్తన నటనం ఆడినార్ అట తాళము గోపాల కృష్ణ భారతి
8 తిల్లనా ధీమ్ ధీమ్ అదితాళము పల్లవి శేషయ్య
9 అష్టపది లలిత లవంగ అదితాళము జయదేవ

 

అన్నమాచార్య కీర్తనలు
1 కలశాపురము అదితాళము బాలకృష ప్రసాద్
2 వాడే వెంకటాద్రి అదితాళము పినాకపాణి
3 యే తపములు అదితాళము మూర్తి నల్లాన్ చక్రవర్తి

 

లలిత సంగీతం
1 వసంత లక్ష్మీ విలాసము c నారాయణ రెడ్డి

 

సినిమా సంగీతం
1 మెరిసేటి పువ్వా  (చిత్రం: నరసింహ) నిత్యశ్రీ, బాలు

ఇవండీ  వసంత శోభను కూర్చే వసంత రాగ విశేషాలు. వచ్చే నెల మరొక అందమైన రాగంతో మీ ముందుంటాను. అంత వరకు సెలవా మరి?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.