సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)

8. ఇల్ హెల్తు – ఇన్సూరెన్సు

 
అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ-
పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- 
సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… 

-డా||కె.గీత

ఇంతకీ మనకు ఏ ఇన్సూరెన్సు ప్లాను సెలెక్టు చేసావ్? అడిగాడు సూర్య.

“అయ్యో! ఆ విషయమే మర్చిపోయాను.” అని చప్పున నాలిక్కరుచుకుని “ఇప్పుడే చూస్తాను, అయినా ఇద్దరం కూర్చుని ఆలోచించుకుంటే బావుంటుంది అన్నాను.”

రెండు నిమిషాలు చూసి నాకస్సలు ఏవీ అర్థం కావడం లేదు. ఈ H.M.O లు ఏవిటో, P.P.O లు ఏవిటో అన్నాను.

“ఇలా చూడు ప్రియా! ఈ దేశంలో మన దగ్గరలా ఏ డాక్టరు దగ్గిరికీ, ఏ హాస్పిటల్ కీ మనంతట మనం వెళ్లడానికి కుదరదు. (వెళ్తే ఏమవుతుందో అప్పటికి సూర్యకీ తెలీదు.)

ఏదో ఒక ఇన్సూరెన్సు పాలసీ తీసుకోవలసిందే. మనలాంటి వాళ్లకు మనం పనిచేసే కంపెనీని బట్టి పాలసీలలో తేడాలుంటాయి. ఇందులో పీ.పీ.ఓ ప్లానులో ఇన్సూరెన్సు కంపెనీలు హాస్పిటల్ కు కట్టే సొమ్ములో దాదాపుగా 80% కడతాయి. మిగతా 20% మనం కట్టాల్సి ఉంటుంది. ఇందులో స్పెషలిస్టుల దగ్గరికి కూడా నీ అంతట నువ్వు వెళ్లొచ్చు. ఇక H.M.O లో పీ.పీ.వో కంటే తక్కువ కడతాం. ఇందులో హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ గా కొంత కోపే కడతాం. ఏయే సెక్షన్లలో ఎంత కట్టాలో ముందే వాళ్లొక లిస్టు ఇస్తారు. ఇక కేవలం ఫిజీషియన్ల దగ్గరికి తప్ప స్పెషలిస్టుల దగ్గరికి మనంతట మనం వెళ్లడానికి వీలవ్వదు. ముందు ఫిజీషియన్ చూసి అవసరమనుకుంటేనే పంపుతాడన్నమాట” అన్నాడు.

“మన దేశంలోనైనా అంతేగా, స్పెషలిస్టుల దగ్గరికి సాధారణంగా మనంతట మనం వెళ్లంగా” అన్నాను.

“ఊ…కాకపోతే అవసరం ఉన్నా లేకపోయినా ఇక్కడ నెలకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ప్రీమియం కట్టాలి. అదీ ఇన్సూరెన్సు వాడికి లాభం అన్నాడు.”

“ఇలా రెండు ప్రధానమైన ఇన్సూరెన్సు పద్ధతులకు ఇక్కడ కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లిస్టులు ఉంటాయి. అందులో నుంచి మనం ఎన్నిక చేసుకోవచ్చు. ఇదంతా పేద్ద యంత్రాంగంలే.

ఇంతకీ మనకేది కావాలంటావ్” అన్నాడు.

ఓ గంట సేపు కాలిక్యులేటర్ ముందేసుకుని “నెలకు కట్టే ప్రీమియంలు ఎంతెంత? డాక్టర్ల విజిట్లకి వెళ్లే ప్రాబొబిలిటీ ఎంత? స్పెషలిస్టుల దగ్గరికి ఎన్ని సార్లు వెళ్లాల్సి రావొచ్చు? వెళితే 20% అంటే ఎంత కట్టాలి?” అని లెక్కేసినా కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు నాకు.

“నీతో లాభం లేదు గానీ నేను H.M.O ప్లానుకి ఫిక్సయ్యానోయ్, ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో నెలకు ఏది తక్కువ ప్రీమియం ఉంటే అది మంచిదన్న మాట, తర్వాతి సంగతి దేవుడెరుగు అన్నాడు.” సూర్య.

“ఆ మాత్రం దానికి ఇన్ని లెక్కలు నాతో వేయించడం ఎందుకో” అని లోపల తిట్టుకున్నాను.

***

డిసెంబరు నుంచి డిసెంబరుకి ఇన్సూరెన్సు ప్లానులో సంవత్సరం పూర్తవుతుంది. కొత్త సం.రానికి ఇన్సూరెన్సు ప్లాను కాగితాలు మరలా పట్టుకుని వచ్చాడు సూర్య.

“ఇక మనం మనకు నచ్చిన స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి మనంతట మనమే వెళ్లొచ్చు, ఎందుకో చెప్పుకో!” సంతోషంగా అన్నాడు సూర్య.

పరధ్యానంగా ఉండి “ఎందుకూ” అన్నాను.

“ఎందుకంటే జీతం పెరిగింది కనుక. ఇవాళే శాలరీ రివిజన్ మీటింగ్ జరిగింది. ఇక హెల్త్ ఇన్సూరెన్సుకి కాస్త డబ్బు ఎక్కువైనా అందరిలా మనమూ P.P.O ప్లాను తీసుకుని నచ్చిన స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి మనంతట మనమే వెళ్లొచ్చు.”

నేను సరిగా వినలేదనుకున్నట్లున్నాడు గట్టిగా గొంతు పెంచి అదే మరలా చెప్పాడు.

“అబ్బబ్బ ఎన్ని సార్లు చెపుతావ్, అయినా అదెందుకలా అరుస్తున్నావ్” అన్నాను.

“ఇప్పటికి వచ్చావీలోకంలోకి. అసలు నేను చెప్పింది విన్నావా!” అన్నాడు.

“ఆ…” అన్నాను ముక్త సరిగా.

ఏదో బాధ పడ్తున్నానని గమనించినట్లున్నాడు, “ఏమైందిరా..!” దగ్గరకు వచ్చి అన్నాడు .

ఇక ఏడుపు ఆపుకోవడం నా వల్ల కాలేదు.

“మరి.. జార్జి…జార్జి ..” అన్నాను వెక్కుతూ.

జార్జి మా కింద అంతస్థులో సరిగ్గా మెట్లనానుకుని ఉన్న సింగిల్ బెడ్రూం అపార్ట్ మెంటులో ఉంటాడు. 55-60 మధ్య ఉంటుంది వయస్సు.

ఎప్పుడూ కుర్చీలో కూర్చుని నీరెండ కాగుతూ పేపరు తిరగేస్తూ కనిపిస్తాడు.

ఒక కాలుకి ఏమైందో తెలీదు. కర్ర చంకలో పెట్టుకుని నడుస్తాడు.

ఆ రోజు చేతిలో కర్రతోనూ, ఏదో ఫుడ్డు సంచీతోనూ కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఆగుతూ వస్తున్న అతన్ని నేనే పలకరించేను.”లెట్ మీ హెల్ప్ యూ” అని.

అతను చాలా కృతజ్ఞతా పూర్వకంగా “థాంక్స్ యంగ్ లేడీ” అన్నాడు.

పై నించి చూస్తున్న అలీసియా నన్ను చూసి ప్రశంసాపూర్వకంగా నవ్వింది.

“అతని పేరి జార్జి. తెల్ల వాడినని గర్వం. ఎవరితోనూ మాట్లాడడు తెలుసా?! నీతో బానే మాట్లాడేడు నయమే.” అంది.

“అయినా అందరికీ సాయం చెయ్యాలనుకునేదానివి కాబట్టి నీతో ఎవరూ మాట్లాడకుండా ఉండరులే.” అంది మళ్లీ.

అది మొదలు మేం మెట్లు దిగుతున్నపుడో, ఎక్కుతున్నపుడో నిధిని పలకరించడం ఒక చాక్లెట్టో, బిస్కెట్టో చేతిలో పెట్టడం చేస్తుండే వాడు జార్జి.

ఈ అపార్ట్ మెంటులో గత 15 ఏళ్లుగా ఉంటున్నాడట. అప్పడప్పుడూ నాలుగు మాటలు కదిపేదాన్ని.

“జీవితమంతా సెక్యూరిటీ గార్డుగా రకరకాల కంపెనీలలో పనిచేసాను. వయసులో ఉండగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనిపించలేదు. ఏ బంధమూ నిలవక ఇలా ఒంటరిగా మిగిలిపోయేను…” అని నిట్టూర్చి “అయినా ఇక్కడున్న సగం జనాభాలాగే నేనూ. మీ దేశంలో పెళ్లి త్వరగా చేసుకుంటారనుకుంటా.”

అని ఓ సారీ “ఈ కాలుకి నాలుగేళ్ల కిందట మొదటగా మెట్ల మీంచి పడి బాగా దెబ్బ తగిలింది. మళ్లా అక్కడే ఏడాదిన్నర కిందట. ఇక బాగవలేదు” అని మరోసారీ తన కష్టం నష్టం చెప్పేడు.

నేను అతనితో మాట్లాడడం అతనికి ఉపశమనం కలిగిస్తుందని అతని ముఖంలోని సంతోషం చూసి అనిపించేది నాకు. ఆ రోజు నేను నిధిని స్కూలు నించి ఇంటికి తీసుకుని వచ్చే సరికి సందు మొదలే మా అపార్టుమెంటు బయట పోలీసు కారు, ఫైర్ ఇంజన్, పారామెడిక్ వాను ఆగి కనిపించాయి.

ఎవరో ఎమర్జన్సీ ఫోన్ చేసి ఉంటారు. కంగారుగా గబ గబా అడుగులేస్తూ వచ్చాను. పోలీసులు జార్జి ఇంటి బయట కనిపించారు. నాకు ఇంకా కంగారు పుట్టింది.”పరుగులాంటి నడకతో మెట్లన్నీ ఒక్క ఉదుటున ఎక్కి వాళ్లింటి తలుపు వరకూ వెళ్లి, బయటే ఉన్న ఒక పోలీసుని అడిగాను” ఏమైంది?” ఆతృతగా.

అతను తాపీగా “మీకతను ఏమవుతాడు?” అన్నాడు.

“ఏ..మీ అంటే ఏమీ కాడు. మేమా ఇంటిలో ఉంటాం” పైకి చూపించి అన్నాను.

“సోరీ మేడం, ఇలా బయటి వాళ్లకి అతని వివరాలు చెప్పడం కుదరదు” అన్నాడు.

“ఓరీ, ఇంతకే ఇలా మాట్లాడుతున్నాడే” అనుకుని చుట్టూ చూసాను. ఎవరూ వాళ్లిళ్లలో నుంచి బయటకు చూసిన పాపాన పోవడం లేదు.

ఈ దేశంలో ప్రైవసీలు, పకడ్బంది సెక్యూరిటీలు, నిబంధనలు మనుషులకు భద్రతని కల్పిస్తున్నాయా, దూరం చేస్తున్నాయా?! అయినా మనసాగక బయటికొచ్చిన మరో పోలీసుని అదే ప్రశ్న అడిగాను. నా ముఖంలో ఆతృత చూసో ఏమో గానీ “కళ్లు తిరిగి పడిపోతూ లక్కీగా ఫోను చేసాడు.” అన్నాడు.

ఎందుకైనా మంచిది, అలీసియాని పిల్చుకొద్దామని పైకి వెళ్లేను.

అలీసియా “నీకింకా ఈ దేశం సంగతి తెలీదు, మనకు సంబంధం లేని వాళ్ల విషయాల్లో మనం తలదూర్చకూడదు” అంది. అయినా మరో గంట తర్వాత పోలీసులు వెళ్లిపోవడం గమనించి జార్జిని చూసొద్దామనిపించి మరలా అలీసియా మాటలు గుర్తొచ్చి ఆగిపోయేను.

మర్నాడు జార్జి బయట కనిపించలేదు. ఆ మర్నాడూ పత్తాలేడు. వారం తర్వాత కనిపించాడు. చేతికి కట్టువేసుకుని ఉన్నాడు.

“అయ్యో ఏమైంది?” అన్నాను చేతి వైపు చూస్తూ.

“ఏం లేదు చిన్న ఆపరేషను” అన్నాడు.

నేనింకా ప్రశ్నార్థకంగా చూస్తుండగా “ఆ రోజు స్నానం చేసి టబ్బులోంచి లేస్తూండగా పడ్డాను. బరువు కాచుకోవడంలో పక్క నున్న షేవింగు కత్తెరని చూసుకోలేదు. చేతి చర్మం ఈ పొడవునా చీరుకుపోయింది. నేనే స్వయంగా కుట్లేసుకోవడానికి ప్రయత్నించాను…..” అతను చెబ్తూండగా నాకు కడుపులో దేవడం మొదలెట్టింది.

ఖిణ్ణురాలినై “అదేమిటీ హాస్పిటల్ కి…” అంటూండగానే అడ్డు తగిలి “నాకు ఇన్సూరెన్సు లేదు” అన్నాడు. మళ్లీ “ఫర్వాలేదు బానే కుట్టుకోగలిగాను. కానీ సరిగ్గా పదినిషాల తర్వాత కళ్లు తిరిగినట్లయ్యి పడిపోబోతూ ఎమర్జెన్సీకి ఫోను చేసాను. హఠాత్తుగా గుండె వెనక నించి ఎవరో తడుతున్నట్లు భయంకరమైన నొప్పి కూడా వచ్చింది. భలే భయం వేసిందిలే” అన్నాడు తల విదిలిస్తూ.

అప్పటికొద్దీ అనునయంగా రెండు మాటలు మాట్లాడి ఇంటికొచ్చేసేను. కానీ తీవ్రమైన బాధ నన్ను వదలడం లేదు సాయంత్రం నించీ.

కళ్లు తుడుచుకుంటూ సూర్యకి చెప్పేను. “ఈ దేశంలో ఇన్సూరెన్సు లేకపోతే వైద్యం లేనట్లే తెలుసా?! ఇన్సూరెన్సు లేకపోతే హాస్పిటల్ వాళ్ళిచ్చే వేలకొద్దీ డాలర్ల బిల్లు ఇక్కడి సామాన్యులెవరూ కట్టలేరు. ప్రభుత్వం ఇచ్చే అరకొర వైద్య సదుపాయానికి అర్హులు కాని జార్జిలాంటి వాళ్లెందరో. ఇందాకే ఆన్ లైనులో చూసాను, ఇలాంటి వాళ్లు యాభై మిలియన్ల వరకూ ఉన్నారట ఇక్కడ. మెరుగైన వైద్య సదుపాయాలు కావాలనుకున్నా, ఇన్సూరెన్సు ప్రీమియంలు కట్టలేక, కట్టినా హాస్పిటల్ వాళ్లు ఇచ్చే హఠాత్తు బిల్లు షాకులు తట్టుకోలేక చాలా మంది ఇన్సూరెన్సు తీసుకోరని, ఇలా స్వంత వైద్యాలు చేసుకుంటారని అలీసియా చెప్పింది.” అన్నాను.

“అందరి సమస్యలూ పట్టించుకుని వర్రీ కాకు. మన దేశంలో మాత్రం కనీస వైద్య సదుపాయం అందక ఎందరు బాధలు పడడం లేదు?!” అన్నాడు.

“మన దగ్గర ఎంత కాదన్నా ఎవరి శరీరాన్ని వాళ్లు కుట్టుకునే దౌర్భాగ్య స్థితి ఉంటుందంటావా?!…ఏమో ఎంతో ఉన్నతంగా ఉంటుందనుకున్న ఈ దేశపు సమాజంలో ఇలాంటివి చాలా బాధని కలిగిస్తున్నాయి.” అన్నాను.

కాస్త ఉపశమనం కావాలనిపించి తలుపు తెరుచుకుని బాల్కనీలోకి వచ్చాను.

బైట ఆకాశంలో చలికాలపు చిక్కని చీకటి. పైకి కనిపించని ఇక్కడి సమాజపు అసలు స్వరూపంలా మంచు చలి చర్మాన్నించి ఎముకల్ని తాకింది.

*****

( వచ్చే నెల మరో కథతో కలుద్దాం-)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.