
ఈ తరం నడక – 22
డా||కె.గీత కాలమ్స్ “అనగనగా అమెరికా”
-రూపరుక్మిణి

అందరికీ రాబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
సప్త సముద్రాల ఆవలికి చేసే ప్రయాణంలో ఎన్నో ఆశలతో భవిష్యత్తుని అందంగా నిర్మించుకోవాలన్న సంకల్పంతో ప్రయాణించే వారే ఎక్కువ. అమెరికా జనాభాలో తెలుగువారి లోగిళ్ళు ఎక్కువే. తెలుగు ప్రాంతం నుంచి అమెరికా వలస వెళ్లిన అనేక కుటుంబాలు వున్నాయి. అర్థ శతాబ్దం నుండి ఈ ప్రయాణం, ఈ వలస ఎక్కువగానే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసే వారి జీవితాన్ని, వలస బతుకుల్లో వచ్చే మానసిక సంఘర్షణలని, స్త్రీల మనోభావాలను, అక్కడి భౌగోళిక పరిస్థితులని దశాబ్దం క్రితం.. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన ధారావాహికగా రాసిన డా||కె.గీత గారి కాలమ్ “అనగనగా అమెరికా” ఇప్పుడు పుస్తక రూపంలో మనకు అందుబాటులోకి వచ్చింది.
ఇందులో ప్రవాస భారతీయులు ఆయిన తెలుగువారు ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు? సాంఘిక, రాజకీయ, ప్రాంతీయ మార్పులు ప్రజల జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేసాయి? అంటూ డాక్టర్ గీత గారు ఎంతో సరళమైన పద్ధతిలో హాస్యాస్పదంగా, వినోదాత్మకమైన వాక్యనిర్మాణంతో ఈ కాలమ్ ని రచించారు. ముఖ్యంగా కాలమ్ ని చిన్నచిన్న కథలుగా అందించారు.
ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్లిన వారి మనసుల్లో ‘సంస్కృతి సంప్రదాయాలకు దూరమైపోతున్నాం’ అన్న బాధ. అదే అక్కడ ఏకంగా ఒక ‘మినీ తెలుగువాడ’నిర్మాణానికి పునాదిఅంటారు గీత. ఇక్కడ మనం పండగ రోజుల్లో ఏదైనా గుడికి వెళ్తే ఏదో ఒక దేవుడిదర్శనమవుతుంది. శివుడు, మహా విష్ణువు లేదా దుర్గమ్మ. కానీ అక్కడ షెడ్డు రూపంలో అందరి దేవుళ్ళని ఎకాఎకిన ఒకే దగ్గర నిలబెట్టి పూజించుకోవడం గురించి రాస్తూ “ఒక్కసారిగా సంప్రదాయాలన్నీ ఇక్కడికి వచ్చిన తెలుగు వారికి పండగ అనగానే గుర్తొస్తాయని, ఎంతో పద్ధతిగా పంచలు, పట్టు వస్త్రాలు ధరించి సాంప్రదాయమైన రీతుల్ని పాటిస్తూ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత పని ఒత్తిడి ఉన్నా… పండగ రోజు మాత్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి షెడ్డు లాంటి గుడికి వచ్చి పాలాభిషేకాలు, అర్చనలు అంటూ శ్రమకోర్చి అయినా సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడే మనసు ఆరాట పడతారని” వివరించి చెప్పారు. ఈ కాలమ్స్ చదువుతున్నంత సేపు హాస్యంగా అనిపించినా, ఎక్కడో మనసు లోతుల్లో బరువు మోస్తున్నట్టుగా ఉంటుంది. దేశం కాని దేశం వచ్చి సాంప్రదాయాలు, సంస్కృతికి దూరమవుతున్నామన్న బాధ వారిని ఎలా ఏకం చేసిందో ప్రతిభావంతంగా చెప్పారు గీతగారు.
ఇక్కడ నుండి విజిటింగ్ వీసా పై విదేశాలు వెళ్లిన వారి బంధువులు వచ్చినప్పుడు వారాంతాలు వారి కోసమే కేటాయించుకొని, తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు తీసుకొని వెళ్లి, తిప్పి ఫోటోలు తీపించి, ప్రాంతాన్ని చూపించి తీసుకురావడంలో వారు పడే ఆందోళనని ఇంటికి వచ్చిన అతిథుల్ని సంతృప్తి పరచాలన్న ఆరాటం, అక్కడి ప్రాంతీయ వాతావరణంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎవరు ఏ కుటుంబంతో ఆడుకోవాలి, ప్లే డేటు కథలో విశ్లేషిస్తూనే విమర్శనాత్మకంగా అక్కడి సామాజిక ఒత్తిడిని గురించి చర్చకు తీసుకొస్తారు.
ఇండియన్ అమ్మకి, అమెరికా అమ్మకి ఉండే వ్యత్యాసాన్ని గురించి చెబుతూ “పని మనుషులు లేక సొంతంగా ఎవరికి వారు పని చేసుకోవాల్సిన ఒత్తిడి. మహిళలపై ఉండే ఇంటి పని భారాన్ని, పక్కవారితో మాట్లాడడానికి కూడా కుదరని ఒంటరి జీవితాల్ని, చాలా తేలికైన పదాలతో మనకు అర్థమయ్యేలా ఓ పరామర్శలా భావోద్వేగాల మధ్య చిక్కుముడులను వివరిస్తారు”.
ఇక్కడ ఈ కథల్లో పేర్లు ప్రాధాన్యం సంతరించుకోకుండా… ఏ పరిస్థితులలో ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయో చెప్తూనే, పరిష్కారం దిశగా ఓ సులువైన మార్గాన్ని సూచిస్తూ “అమ్మో అమెరికా” అనకుండా అక్కడ భారతీయులు తీసుకునే జాగ్రత్తని కళ్ళకి కట్టినట్టు చూపించారు. చక్కని సందర్భోచిత కథలుగా మనం వీటిని చూడొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే… అమెరికా వాతావరణంలో బ్రతుకుతున్నా, ‘పుట్టి పెరిగిన ప్రాంతంలో ఎవరు గెలుస్తారు?’, ‘ఎవరి ప్రాబల్యం ఉంటుంది?’ వంటి అంశాలు అక్కడి వారి మానసిక జీవనంపై ఎంత ప్రభావితం చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాయి ఈ కథలు.
డెంటిస్ట్ కథలో ఇన్సూరెన్స్ ప్రాధాన్యతని వివరిస్తూ డాలర్లలో సంపాదించిన సంపాదనంతా ఎలా ఖర్చు పెట్టాల్సి వస్తుందో వివరిస్తూనే… మరో కథలో డాలర్ కి రూపాయి విలువ లెక్కగట్టి అక్కడ జీవనాన్ని అంచనావేసి “మీకేంటి అమెరికావాసులు” అని దెప్పి పొడిచే అనేక మందికి కళ్ళు తెరిపించేలా ఇందులోని ప్రతి కథ ఒక మలుపుని తిప్పుతున్నట్టుగా ఉంటాయి.
ఒక కథలో అక్కడ డ్రైవింగ్ స్పీడ్ లిమిట్ లో పడే ఫైన్ గురించి చర్చిస్తూనే… ఇండియాలో ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న వారైనా అక్కడికి వచ్చేసరికి రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచడంలోనూ, చెత్తను పారవేయవడంలోనూ, ఎంత సమయాన్ని ఓపికని ప్రదర్శిస్తున్నారు, మరి ఇండియాలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు, సామాజిక బాధ్యతను ఎందుకు మర్చిపోతున్నారు అనే విషయాల్ని సూటిగా ప్రశ్నిస్తున్నట్టే ఉంటుంది.
వీరి కథల్లోని వాక్య నిర్మాణంలో అనేకసార్లు మానవత్వాన్ని, హాస్యాస్పదాన్ని కలిపి ముడివేసిన పూలదారంలా భావాలన్నీ కలిపి మాలగట్టినట్టు ఎంతో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు.
ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పటివరకు కలిసి ఉన్న తెలుగు వారు ప్రాంతీయ విభేదాల పట్ల వారిలో వచ్చిన మార్పు, ఆ సందర్భంలో అమెరికా తెలుగు కవులు కవి మిత్రులను కలుద్దామంటే స్థానికత గుర్తింపు వారికి తెచ్చిపెట్టిన కష్టాలని చక్కగా విశ్లేషిస్తూ చెప్తారు. అంతేకాదు అప్పటివరకు ఎన్నారైలుగా ఉన్నవారు ప్రతేసీయాంధ్రులుగా మారిన విధానాన్ని బాగా విశ్లేషించి చెప్పారు.
ఒక వ్యక్తి బస్సులో పోగొట్టుకున్న పర్సు… లాస్ట్ అండ్ ఫౌండ్ ద్వారా ఎలా పొందింది చెప్పే క్రమంలో అక్కడ సమాజంలోని నిజాయితీని.. వివరించి చెప్పిన కథ ఆకట్టుకుంటుంది.
చదువు కోసం వచ్చిన విద్యార్థులు ఫీజులు కట్టడం కోసం అక్కడ పనుల్లో చేరి, దూరం భారమైన కెరియర్ కోసం వాళ్లు పడే ఆరాటాన్ని బాధని, డబ్బు కష్టాలని ముక్కు సూటిగా చెప్పారు.
వీరి కథల్లో రాజకీయ సామాజిక సంక్షోభాల గురించి చర్చిస్తూనే అక్కడ సామాజికంగా ఉన్న చైతన్య వ్యవస్థని, మనం కోల్పోతున్న స్వేచ్ఛని సమదృష్టితో స్వీకరించాల్సిన కోణాల్ని, పనిలో స్త్రీ శక్తిని, వర్క్ ఫ్రం హోం అంటూ వచ్చే పని ఒత్తిడితో పాటు అక్కడ ఇంజనీరింగ్లు పూర్తిచేసిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటూ ఎక్స్ట్రా లాంగ్వేజెస్ నేర్చుకోకపోతే పని దొరకని పరిస్థితులని, చదివిన చదువు కంటే అక్కడి పరిస్థితులకు సరిపోయే సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవడం ఎంత అవసరమో వివరించారు.
గ్రీన్ కార్డు కోసం, అక్కడే డెలివరీలు చేసుకునే భారతీయ సంతతికి సహాయం కోసం వస్తున్న అమ్మమ్మలు, నానమ్మల గురించి ఇందులో ప్రస్తావించకపోవడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా… స్త్రీల సాంఘిక మానసిక దృక్పథాలకి అక్షర రూపం ఇవ్వడంలో… చాలా ముందున్నారు.. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి వివాహ సంబంధాల విషయంలో ఎటువంటి సంఘర్షణలని ఎదుర్కోవాల్సి వస్తోంది, అక్కడ వాతావరణంలో పుట్టి పెరిగిన ఆడ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేయడానికి గల కారణాలని విశ్లేషించే ప్రయత్నం చేశారు.
ప్రతి చిన్న కదలికని వలస బతుకుల్లోని బాధలని స్వేచ్ఛని స్వతంత్రాన్ని గురించి చర్చిస్తూనే.. స్త్రీ కోణాన్ని వివరించడం ఈ కథల ప్రత్యేకత.
ఈ పుస్తకాన్ని చాలా తేలిగ్గా సరదాగా చదివేయవచ్చు తెలియని ఒక ఆనందాన్ని, తృప్తిని ఈ రచన మనకు అందిస్తుంది. బీట్రూట్ ప్రచురణల్లో ఈ పుస్తకం దొరుకుతుంది. పుస్తకం పేరు “అనగనగా అమెరికా”, రచయిత్రి నెచ్చెలి అధినేత్రి డాక్టర్ కె.గీత గారు.
ఈ పుస్తకం చదివాక నాకెందుకో గీత గారిని ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఓ ప్రవాస సుప్రసిద్ధ రచయిత్రిగా తన జీవిత ప్రయాణంలో దాదాపు రెండు దశాబ్దాల వలసజీవనంలో… రచనల్లో వచ్చిన మార్పుల్ని, సామాజిక పరమైన, రాజకీయ పరమైన మార్పులు రచనలపై పడే ప్రభావాన్ని చిన్న ఇంటర్వ్యూ రూపంలో ఇక్కడే ఇస్తున్నా. మహిళగా తన రచనా ప్రస్థానాన్ని చర్చిస్తూ, మహిళా సాధికారతకు గుర్తుగా రాబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ… ఈ ఇంటర్వ్యూ కొనసాగుతుంది. థాంక్యూ గీత గారు! రెండు సంవత్సరాలుగా నెచ్చెలి లో కాలమ్ రాస్తూ మీ గురించిన విషయాలు తెలుసుకోవాలి, మీ రచనా ప్రస్థానాన్ని అందరికీ తెలియ చేయాలన్న నా ఆలోచనకి సహకరించినందుకు ధన్యవాదాలు.
ముందుగా పది చేతులతో పది పనులు చేస్తూ కూడా నెచ్చెలి నిర్వహణ చేస్తూ, రచన ఓ సామాజిక బాధ్యతగా స్వీకరించిన గీతగారి గురించి వివరాలు క్లుప్తంగా ఇస్తున్నాను.
తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించిన డా.కె.గీత కవయిత్రి, రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. పూర్తి పేరు గీతామాధవి. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపకులు & సంపాదకులు. అమెరికాలో ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలో “కంప్యూటేషనల్ లింగ్విస్ట్” గా పనిచేస్తున్నారు.
ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి, శ్రీ కె.రామ్మోహనరావు గార్లు వీరి తల్లిదండ్రులు. భర్త శ్రీసత్యన్నారాయణ గారు, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు” పొందారు.
ద్రవ భాష(2001), శీత సుమాలు(2006), శతాబ్ది వెన్నెల (2013) , సెలయేటి దివిటీ (2017), అసింట (2022) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురింపబడ్డాయి. “అపరాజిత” (గతముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం 1993-2022) 2022 కు సంపాదకత్వం & ప్రచురణ వహించారు.
‘గీతా కాలం’, “అనగనగా అమెరికా” అనే కాలమ్స్, “నా కళ్లతో అమెరికా”, “యాత్రాగీతం” అనే ట్రావెలాగ్స్, “కంప్యూటర్ భాషగా తెలుగు” అనే తెలుగు, ఇంగ్లీషు భాషల్లో భాషా పరిశోధనా వ్యాసాలు, లలితగీతాలు వీరి ఇతర రచనలు.
కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాన్ని పొందారు.
రేడియో కార్యక్రమాలలో విరివిగా పాల్గొన్నారు. సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై భారతదేశం లోని ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, అస్సామ్ వంటి అనేక ప్రాంతాల్లో సభల్లో పాల్గొన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బెంగుళూరు విశ్వవిద్యాలయం, తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, నన్నయ్య విశ్వవిద్యాలయం, అనేక డిగ్రీ స్థాయి కళాశాలల్లో తెలుగు భాష, సాహిత్యాలపై ఉపన్యాసాలిచ్చారు.
అమెరికాలో తానా, ఆటా, టాటా, వంగూరి ఫౌండేషన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. 2017 లో హైదరాబాద్ లో జరిగిన తెలుగు మహాసభలకు అమెరికా నుండి ప్రత్యేక అతిథిగా ఆహ్వానం పొంది కవిత్వవేదికలో పాల్గొన్నారు. 2019 లో “తెలుగు టైమ్స్” వారిచే అమెరికాలోని 17 మంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిగా గుర్తించబడ్డారు.
అమెరికాలోని “తానా” తెలుగు బడి “పాఠశాల”కి గత దశాబ్దిగా కరికులం డైరక్టర్ గా సేవలందిస్తున్నారు.
లలిత సంగీత గాయనిగా అనేక బహుమతులు అందుకున్నారు. 2017 లో గీత రచయితగా, గాయనిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. “గీతామాధవి” షార్ట్ ఫిలిమ్స్ అధినేత.
టోరీ తెలుగు రేడియోలో “గీతామాధవీయం” పేరుతో సంగీత, సాహిత్య టాక్ షో ని నిర్వహిస్తున్నారు.
కాలిఫోర్నియాలో నెలనెలా సాహితీ సమావేశాలు జరుపుకునే “వీక్షణం” రచయితల సాహితీ వేదిక, తెలుగులో రచయితలందరి వివరాలు పొందుపరిచే “తెలుగు రచయిత” వెబ్సైటు వ్యవస్థాపక అధ్యక్షులు & నిర్వాహకులు.
2026 కి ఆహ్వానం పలుకుతూ ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గీత గారు! మీ సాహిత్య ప్రస్థానం, ఎప్పుడు మొదలైంది ఇప్పుడు మీరు రాస్తున్న కొత్త రచనలు ఏంటి?
ముందుగా మీకు కృతజ్ఞతలు రూప గారూ! నెచ్చెలికి నెలనెలా కొత్తగా విడుదలయిన పుస్తకాల్ని, ఆయా రచయిత్రుల్ని పరిచయం చేస్తూ ఈ కాలమ్ ని రాస్తున్నందుకు, అందులో భాగంగా ఈవేళ నా సరికొత్త పుస్తకం “అనగనగా అమెరికా” కాలమ్స్ ని పరిచయం చేస్తున్నందుకు.
నేను ప్రధానంగా కవయిత్రిని. చాలా చిన్న వయసులోనే కవిత్వం రాయడం ప్ర్రారంభించాను నేను. కవిత్వంతోనే నా సాహితీ ప్రయాణం ప్ర్రారంభమైంది. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నపుడు నా మొదటి కవిత “ఓ రోజంతా” ఆంధ్రజ్యోతి సాహితీవేదికలో అచ్చయింది. ఆ తరువాత దాదాపు రెండు మూడేళ్ళకి మొదటి కథ “అనంతం” ని రాసేను. అది కూడా సాహితీవేదికలోనే వచ్చింది.
కవిత్వానికి ప్రేరణ తెలియదు కానీ కథలు రాయడానికి మాత్రం స్ఫూర్తి మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి కథలు.
చిన్నతనం నించీ సాహిత్యాన్ని విస్తృతంగా చదివేను.
మా ఇంట్లోనే ఒక చిన్నసైజు లైబ్రరీ ఉండేది. ఇక మా ఇంటి గోడని ఆనుకుని మా ఊరి గ్రంథాలయం ఉండేది. చిన్నతనం నుంచీ పుస్తకాల్ని లైబ్రరీ నుంచి తెచ్చుకుని బాగా చదివే అలవాటు ఉండేది. పదోతరగతికి వచ్చేసరికే నేను శరత్ సాహిత్యం మొత్తం చదివేను. కొకు, రావిశాస్రి, కారా మాష్టారు … ఇలా దాదాపు పేరు ప్రఖ్యాతులున్న రచయితలందరి పుస్తకాలన్నీ చదివేను. ఇంగ్లీషు, రష్యన్ వంటి అనేక భాషల నుంచి అనువాదాలు చదివేను.
కవిత్వానికి సంబంధించి మొదటగా మా ఇంట్లో చదివినవి తిలక్ ‘అమృతంకురిసిన రాత్రి’, శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’, ఠాగూర్ ‘గీతాంజలి’, కృష్ణ శాస్త్రి గారి ‘కృష్ణపక్షం’. ఆతర్వాత లైబ్రరీ నుంచి చదివిన తొలికవిత్వం ఆలూరి బైరాగి కవితలు. అలా క్రమంగా కొన్నాళ్లకి కేవలం కవిత్వం మాత్రమే ఇష్టం కావడం మొదలైంది.
ఇక వరసగా గురజాడ ‘ముత్యాల సరాలు’, కాళోజీ ‘నా గొడవ’, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు గార్ల మొట్టమొదటి కవితా సంకలనం ‘నయగారా’, కుందుర్తి ‘నగరంలో వాన’, అజంతా ‘స్వప్నలిపి’, నగ్నముని ‘కొయ్యగుర్రం’, ఇస్మాయిల్ ‘చిలకలు వాలిన చెట్టు’, గుంటూరు శేషేంద్రశర్మ ‘శేషజ్యోత్స్న’, నందిని సిధారెడ్డి ‘భూమిస్వప్నం’, కె.శివారెడ్డి ‘మోహనా! ఓ మోహనా!’, రేవతీ దేవి ‘శిలాలోలిత’, శిఖామణి ‘మువ్వలచేతికర్ర’, త్రిపురనేని శ్రీనివాస్ ‘రహస్యోద్యమం’, అఫ్సర్, సీతారాం, ప్రసేన్ ల ‘రక్తస్పర్శ’….ఇలా చిన్నవయసులోనే ఎన్నో కవితా సంపుటాలు చదివేను.
నాకు కవిత్వపిచ్చి ఎంతగా ముదిరిందంటే మా ఇంటికి సాహిత్య పత్రికలన్నీ వస్తూ ఉండేవి. ఆంధ్ర జ్యోతి “సాహిత్య వేదిక” లో వచ్చే కవితల కోసం వారమంతా ఎదురు చూసి సోమవారం సాయంత్రం ఆ పేజీని కత్తిరించి ఇంట్లోని పాత బోటనీ రికార్డుపుస్తకంలో వరసగా అతికించేదాన్ని.
అప్పుడే సినారె, సావిత్రి, దేవిప్రియ, స్మైల్, నాళేశ్వరం శంకరం, చినవీరభద్రుడు, కొప్పర్తి, వసీరా, ఎండ్లూరి సుధాకర్, యాకూబ్, ఆశారాజు, నారాయణస్వామి, విమల, దర్భశయనం శ్రీనివాసాచార్య, కందుకూరి శ్రీరాములు.… ఇలా అందరి కవితలు, ఒకో కవిత పదేసి సార్లు గుర్తొచ్చినప్పుడల్లా మళ్లీ మళ్లీ కంఠతా పట్టినట్లు చదివేదాన్ని. కవుల గురించి చేరా,కోవెల మొదలైన వారు రాసే ప్రతి వ్యాసాన్నీ తప్పక చదివేదాన్ని.
ఇలా కవిత్వం చదువుతూ మైమరుస్తూ అనుకోకుండా ఒక రోజు రాసిన కవిత”ఓ రోజంతా!”. ఒక వర్షం వచ్చి వెలిసిన పొద్దుట పూట బురద సందుల్లోంచి నడుచుకుంటూ వెళ్లినపుడు దారిలో నాకు కనబడిన యదార్థసంఘటనల సమాహారం అది.
ఇంట్లో చెప్పకుండానే ‘ఆంధ్రజ్యోతి’కి పోస్టు చేసాను. ఆ పై సోమ వారమే అది ప్రచురితమైంది. నా మొదటి కవిత అచ్చేసిన అఫ్సర్ గారు నాకు ఆ వెంటనే ఆ కవిత ఎంత బాగా రాసేనో ఉత్తరం కూడా రాసేరు. అలాగే ప్రసేన్ గారు, స్మైల్ గార్లు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు.
ప్రపంచమంతా చాలా అందంగా కనిపించే ఆ వయసులోనే నాకు ఎవరి కష్టం చూసినా విపరీతంగా దుఃఖపడే సున్నితత్వమూ ఉండేది. అందుకే ఆ తర్వాతి కవితల్లో ఎక్కడో జరిగిన రైలు ప్రమాదం గురించి, మా వీథి లో ఉరేసుకుని మరణించిన అమ్మాయి గురించి రాయగలిగేను. ఆ తర్వాత ఆంధ్ర భూమిలో “అక్షరం”ప్రారంభమైంది అప్పట్లోనే. కంజిర, సంతకాలు బులెటిన్ లు వస్తూండేవి. నా కవితలు ప్రతీ వారం ఎక్కడో ఒక చోట ప్రచురితమవుతూ ఉండేవి.
తొంభై లో “నేను ఋతువునైన వేళ” కవిత రాసేను. ఆ కవిత నేను రాసిన సమయానికి స్త్రీ వాదం ప్రారంభమైంది. చాలా జోరుగా పత్రికల్లో స్త్రీల కవితలు వస్తూండేవి. నన్ను బాధించే ప్రతి సంఘటననీ కవిత్వీకరించే గుణం వల్ల ఆ కవితని రాయగలిగేను. ఆంధ్రజ్యోతి ఆదివారంలో ఆ కవిత నా ఫోటోతో బాటూ ప్రచురింపబడింది. ఆ కవిత ఒక టర్నింగ్ పాయింట్. ఆ కవితతో బాటూ నా అడ్రసు ప్రచురించడం వల్ల నాకు రోజూ కట్టలుగా ఉత్తరాలు వస్తుండేవి. దాదాపు 250 ఉత్తరాలు వచ్చాయని గుర్తు.
ఎప్పుడూ కొత్త వస్తువుతో కవిత్వం రాయడం మొదట్నించీ అలవాటు చేసుకున్నాను. ఇక భావ ప్రకటనలో ఎవర్నీ అనుసరించకుండా నాకెలా తోస్తే అలాగే రాసే దాన్ని. ఇక ఎంతో సాహిత్యం చదివి ఉన్నందు వల్ల భాష వెల్లువలా వచ్చేది. కావలిసిన పదం కోసం నేనెప్పుడూ తడుముకొనేదాన్ని కాదు.
కవిత్వానికి దాదాపు స్వర్ణ యుగంలో నేను కవిత్వం, ప్రారంభించడం ఒక గొప్ప స్ఫూర్తిగా ఉండేది. కవిత్వాన్ని ప్రారంభించడం ఎలా జరిగినా రాసే స్ఫూర్తిని సంవత్సరాల తరబడి నిలబెట్టుకోవడం చాలా కష్టం.
మొదట్లో కవిత్వం నాకు స్వీయ ఓదార్పు, బాసట, కంటి తుడుపు అయినా, క్రమంగా జీవితంగా మారింది. బాధల్ని కవిత్వంగా వ్యక్తం చేసే క్రమంలో స్త్రీ వాదం ఎంతో బలాన్నిచ్చింది. నేను ప్రధానంగా అనుభూతి ప్రధానమైన వస్తువులతో కవిత్వం రాయడం వల్ల నా కవిత్వం ఎక్కడా ఆగకుండా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.
2001 లో నా మొదటి కవితా సంపుటి”ద్రవభాష” ని ప్రచురించాను. 2006 లో “శీతసుమాలు”, 2013 లో “శతాబ్ది వెన్నెల” , తర్వాత 2017 లో సెలయేటి దివిటీ, 2023లో అసింట – ఇప్పటివరకు అయిదు కవిత్వం పుస్తకాలు ప్రచురించాను. మరో కవితా సంకలనం, కథలు, ట్రావెలాగ్స్, వ్యాసాలు పుస్తకాలుగా రావాల్సి ఉన్నాయి.
కథల విషయానికి వస్తే ఎన్నో కథలు రాసినా మొదటగా పుస్తకంగా 2018లో ప్రచురించబడినవి “సిలికాన్ లోయ సాక్షిగా” కథలు. వాకిలి అంతర్జాల పత్రికలో ధారావాహికగా ప్రచురితమై, అత్యంత ప్రాచుర్యాన్ని పొంది తమిళం, ఇంగ్లీషు భాషల్లో కూడా పుస్తకంగా వచ్చాయి. హిందీ, కన్నడ, మలయాళం, ఒరియా వంటి భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. తర్వాత At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురింపబడ్డాయి. 2022లో “అపరాజిత” (గతముప్పయ్యేళ్ల స్త్రీవాద కవితా సంకలనం 1993-2022) కు సంపాదకత్వం & ప్రచురణ వహించారు.
‘గీతా కాలం’, “అనగనగా అమెరికా” అనే కాలమ్స్, “నా కళ్లతో అమెరికా”, “యాత్రాగీతం” అనే ట్రావెలాగ్స్, “కంప్యూటర్ భాషగా తెలుగు” అనే తెలుగు, ఇంగ్లీషు భాషల్లో భాషా పరిశోధనా వ్యాసాలు, లలితగీతాలు నా ఇతర రచనలు.
విదేశాల్లో మీరు స్థిరపడ్డాక స్త్రీల గురించి మీరు గమనించిన విషయం? సాహిత్యం పరంగా మీ ఆలోచనల్లో వచ్చిన మార్పు?
విదేశాల్లో స్థిరపడ్డాక ప్రపంచవ్యాప్త స్త్రీల స్థితిగతులను గమనించగలిగాను. ఇతర భాషల్లోని సాహిత్యాన్ని విస్తృతంగా చదవడం వల్ల సాహిత్య పరంగా నా ఆలోచనా విస్తృతి పెరిగింది. అమెరికా వంటి అత్యాధునిక సౌకర్యాలున్న దేశంలోని స్త్రీల సమస్యల్ని రచనల్లో ప్రతిబింబించగలిగాను. ఇక్కడికి వచ్చాక రాసిన శతాబ్ది వెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితా సంపుటాల్లో ఎన్నో కవితలు విదేశాల్లో స్త్రీల సమస్యల గురించే ఉంటాయి.
ముఖ్యంగా డయాస్పోరా సమాజంలో సాహిత్యంలో ప్రతిబింబించాల్సిన అనేక సామాజిక అంశాలున్నాయి. వాటి గురించి రాసే వారు ఇక్కడ ఎంత తక్కువ మంది వున్నా, నా వరకు నేను బలమైన డయాస్పోరా కవిత్వాన్ని, కథల్ని రాస్తూ వస్తున్నాను.
స్త్రీల రచనల్ని ప్రోత్సహించడానికే 2019లో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రికని ప్రారంభించాను. నెచ్చెలి పత్రిక ద్వారా అనేకమంది స్త్రీల రచనలు ప్రచురణ చేస్తున్నాను. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వెలువడుతున్న తొలి తెలుగు అంతర్జాల వనితా మాసపత్రిక “నెచ్చెలి”. విదేశాల నించి వెలువడుతున్న మొట్టమొదటి తెలుగు అంతర్జాల స్త్రీవాద పత్రిక కూడా.
ఇక డయాస్పోరా తెలుగు సాహిత్యంలో విస్తృతంగా పరిశోధన చేసి గమనించిన ఎన్నో అంశాలను గురించి అనేక సెమినార్లలో ప్రసంగాలు చేసాను. డయాస్పోరా సాహిత్యంలో సీరియస్ గా రాసేవారి ప్రాతినిధ్యం చాలా తక్కువ. అందునా స్త్రీల ప్రాతినిధ్యం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు.
మనకు ఇంగ్లీషు నించి తెలుగు లోకి అనువాదాలు ఎక్కువ, కానీ తెలుగు నించి ఇంగ్లీషులోకి అనువాదాలు చాలా తక్కువ. తెలుగు సాహిత్యం ప్రపంచ వ్యాప్తం కావాలంటే ఇంగ్లీషులోకి అనువాదాలొక్కటే మార్గం. అందుకే నెచ్చెలిని తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ తీసుకు వస్తున్నాను.
మన ప్రాంతీయతలో మహిళల పట్ల సాహిత్యంలో రావలసిన మార్పుల గురించి మీ అభిప్రాయం.?
నిజానికి ఒకప్పటి కంటే ఇప్పటి మహిళా సాహితీవేత్తలు నిశితమైన చూపుతో, బాగా విస్తృతంగా రాస్తున్నారు. అయినప్పటికీ ఇంకా స్త్రీల రచనల పట్ల చిన్నచూపు ఉంది. స్త్రీల వేషధారణని కూడా ఎవరో శాసిస్తున్న అగత్యం ఉంది ఇప్పటికీ. అమెరికాలోనూ ఇటువంటివి లేకపోలేదు. అబార్షన్ హక్కు కోసం పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. అంతర్గతంగా స్త్రీల మీద దాడులు, హింసలు, అణచివేతలు ఇక్కడా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే మన దగ్గరతో పోలిస్తే తక్కువ.
మహిళలు ఇంకా రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆధునిక సమాజంలో ఆధునిక స్త్రీలు మాత్రమే అనుభవించే, గమనించే, ఆలోచించే అనేక అంశాల్ని స్పృశిస్తూ, సాహిత్య సృజన చెయ్యాల్సి ఉంది.
మీరు రచనలు మొదలుపెట్టిన కాలానికి, నేటికీ మహిళా రచయితల (రచన విధానంలో మీరు గమనించిన మార్పు ఏదైనా ఉందా?)(లేదా) రచన శైలిపై మీ అభిప్రాయం.
ఒకప్పుడు రచనల్లో ఎవరి శైలినైనా గుర్తు పెట్టగలిగే విధంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రత్యేకత లోపించిందని అనిపిస్తుంది. మహిళా రచయితలనే కాదు, యువ రచయితలు చాలా వరకు ఏమీ చదవకుండా రాసేవారి శాతం ఎక్కువ. సవాలక్ష తప్పులతో భాష, అర్థం పర్థం లేని వ్యక్తీకరణ, వస్తువు పట్ల అశ్రద్ధ ఇప్పుడు అత్యధికంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాల్లో స్వీయ ప్రచురణ వచ్చాక, పత్రికా ప్రచురణకు విలువ లోపించింది. ఎడిటింగ్ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాయడం వల్ల రచనలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తూ ఉన్నా, వాసి గలవి అతి తక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక ఇప్పటి కవిత్వానికి వస్తే, ఒక మార్గనిర్దేశకత్వం లేకుండా చెల్లాచెదరుగా కనిపిస్తుంది. అంటే వాదాలకో, సిద్దాంతాలకో కట్టుబడని కవిత్వం అన్నమాట. నిజానికి చాలా మంది అనుకుంటున్నట్లు కవిత్వం ఒకప్పటి కంటే పలచబడిపోలేదు. ఇప్పడు కూడా బలంగా, అద్భుతంగా కవిత్వం రాస్తున్న వారు ఉన్నారు. ఇప్పటి కవిత్వంలో ఫిర్యాదుల కంటే తమ జీవితంలోని అంతర్గత అనుభవాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆత్మాశ్రయ అనుభవవాదం అని అనొచ్చు. అయితే అతి తక్కువగా ఉన్నారు.
పైన చెప్పినట్లు సోషల్ మీడియా వల్ల, ఎవరికి వారు ప్రచురించుకునే అవకాశం రావడం వల్ల ఎక్కడా ఎడిటింగ్ లేకుండా విస్తృతంగా కవిత్వం రాసే వారి సంఖ్య పెరిగింది. కానీ రూపంలో, సారంలో కవిత్వం కాకపోయినా కవిత్వం అనుకోవడం, ఏదొకటి రాసెయ్యడం ప్రధానం అనుకునేవారి సంఖ్య పెరిగింది. బలమైన సాహిత్య సృజన చెయ్యాలంటే బాగా చదవాలి. తప్పుల్లేని భాషా జ్ఞానం అలవడాలి. సోషల్ మీడియా ఎంత హానికరంగా పరిణమించిందంటే ఎవరేం రాసినా, నాలుగు లైకులు రాగానే అదే గొప్ప అనుకొనేంత.
నా దృష్టిలో జీవితంలో ఖాళీల్ని పూరించడమే కవిత్వం. ఏ ఖాళీ అయితే కవిని ప్రేరేపిస్తుందో అదే ఆ కలం నించి బలమైన కవిత్వంగా మారుతుందని భావిస్తాను. నిజమైన కవిత్వం అంటే జీవితాన్ని సుసంపన్నం చెయ్యగల గొప్ప వాక్యం. సహజంగా పారే సెలయేరులా స్వచ్ఛంగా కవిత్వం రావాలి.
కవిత్వం కేవలం వైయక్తిక వేదనలకు, అనుభూతులకు మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సమస్యల్ని ప్రతిఫలించే బలమైన గొంతుకగా మారడం కూడా అవసరం. కవులు కవిత్వం ఒక సామాజిక బాధ్యత అని గుర్తించాలి.
అంతర్జాలంలో విరివిగా కవిత్వం రావడం ముదావహమైనా ఉన్నత ప్రమాణాలతో వస్తేనే హర్షణీయమవుతుంది.
సాహిత్యం ఎప్పుడూ కాలాన్ని బట్టి మార్చుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు యువకుల్లో సాహిత్యం పట్ల ఆసక్తి చూపిస్తున్న వారిలో చాలా వరకు సినిమా, వెబ్ రంగాల్లో రచయితలుగా స్థిరపడదామను కునేవారే. అయితే చాలా మంది కథలు రాయడం అంటే స్క్రీన్ ప్లే రాయడం అని అనుకుంటూ ఉంటారు. తమ ముందు తరం రచనలు చదవని అపరిణితి కనిపిస్తూ ఉంటుంది. ఇక భాషా జ్ఞానం దాదాపుగా శూన్యం. అందువల్లనే అక్షరదోషాలే కాకుండా వ్యాకరణ దోషాలు కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు లోపాల్ని సరిచేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మెరుగుపడాలంటే రచనలు చెయ్యాలనుకునేవాళ్ళు విధిగా, విస్తృతంగా చదవాలి.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
