పచ్చని కుటుంబం

-అనసూయ కన్నెగంటి

అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో నీరు చాల తక్కువ. దాంతో ఆ ఊరి ప్రజలు అక్కడికి దూరంగా ఉన్న నది వరకూ వెళ్ళి నీళ్లను కడవలతో పట్టి తెచ్చుకుంటూ ఉంటారు. కష్టపడి అంత దూరం నుంచి తెచ్చుకోవటం వల్ల ఆ ఊరి ప్రజలు నీటిని చాల పొదుపుగా వాడుకుంటూ ఉంటారు.

కిట్టూ ఆ ఊరి బడిలో చదువుకుంటున్నాడు. రోజూ బడికి భోజనంతో పాటు సీసాతో నీళ్ళు పట్టుకుని వెళుతూ ఉంటాడు. ఒకరోజు దారిలో ఎండిపోతున్న మామిడిచెట్టు అతనికి కనిపించింది. కాసేపు అక్కడే నిలబడి దానివైపు చూశాడు. కిట్టూకి అయ్యో అనిపించింది.

మర్నాడు బడికి వెళుతూ “ అమ్మా..! ఇక నుండీ నాకు రెండు సీసాలతో నీళ్ళు ఇవ్వు” అని వాళ్లమ్మకి చెప్పాడు.

“ ఎందుకు?” అని అడిగింది వాళ్లమ్మ.

“చెట్టు కోసం” అన్నాడు కిట్టూ. “ ఏం చెట్టు?” అని అడిగింది వాళ్లమ్మ.

“ మామిడి చెట్టు. బడికి వెళ్లే దారిలో కనపడింది.అది ఎండిపోతుంది.కొన్ని ఆకులు మాత్రమే పచ్చగా ఉన్నాయి. నీళ్ళు పొయ్యకపోతే అది చనిపోతుంది” అన్నాడు.

“ భలే వాడివిరా. మనకు తాగటానికే నీళ్ళు లేవు. ఎక్కడి నుండో కష్టపడి తెచ్చుకుంటున్నాం. చెట్లకి, చేలకి పోయటానికి మన దగ్గర ఎక్కడ ఉన్నాయి. అవి లేకపోతే మనకి కష్టం కదా. నీ కోసం తీసుకెళ్ళు” అంటూ ఒక్క సీసాతో మాత్రమే నీళ్లు ఇచ్చింది.

ఏమీ మాట్లాడకుండా ఆ సీసా తీసుకుని బడికి వెళ్ళిపోయాడు కిట్టూ. సాయంత్రం బడి నుండి తిరిగి వస్తూ చెట్టు దగ్గరకు వెళ్ళి తన సీసాలో మిగిలిన రెండు గుక్కల నీటిని మొక్క మొదట్లో పోసాడు. ఆ రోజు మొదలుకొని బడి ఉన్నన్ని రోజులూ రోజూ రెండు గుక్కల నీరు చెట్టు మొదట్లో పోస్తూనే ఉన్నాడు. కొన్నాళ్లకు చెట్టు కొమ్మలు చిగిర్చి పచ్చగా కళకళలాడ సాగింది. అంతే కాదు కొంత కాలానికి పూత పూసి కాయలు కూడా కాసేసింది. నిండా కాయలతో ఉన్న పచ్చని చెట్టుని చూసి ఎంతో సంతోషించాడు కిట్టూ.

కిట్టూ సంతోషాన్ని చెట్టు గమనించి..

“ నీ ఈ ఆనందానికి, నా ఈ కళకళలకు కారణం నువ్వే” అంది చెట్టు కిట్టూతో.

“నేనేం చేసాను?” అన్నాడు మాట్లాడుతున్న చెట్టునే ఆశ్చర్యంగా చూస్తూ.

“రోజూ నువ్వు తాగటం మానేసి నాకు నీళ్ళు పోసావుగా. అందుకని” అంది నవ్వుతూ చెట్టు.

“నేనూ తాగాను. మానలేదు” అన్నాడు కిట్టూ .

“ఎన్ని తాగినా నా కోసం రెండు గుక్కల నీటిని సీసాలో మిగిల్చి నా కోసం తెచ్చే వాడివి. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు అలా నాకు నీళ్లు ఇచ్చి నా ప్రాణం నిలబెట్టావు.నీకేం కావాలో కోరుకో ఇస్తాను.” అంది చెట్టు.

“ఇవ్వాలి.ఇవ్వాలి “ అని అరిచాయి ఆకులు, కొమ్మలు, కాయలు గట్టిగా అటూ ఇటూ ఊగుతూ.

“ ఏది అడిగినా ఇస్తావా?” అని అడిగాడు కిట్టూ.

“ ఏదైనా ఇస్తాను కోరుకో..” అంది చెట్టు.

“ అయితే మా అందరికీ కావాల్సినన్ని నీళ్ళు కావాలి “ అని అడిగాడు కిట్టూ.

కిట్టూ కోరికకి చెట్టు ఆశ్చర్యపోయింది. బొమ్మలు, బట్టలు,బిళ్లలు ఇలాంటివి ఏవైనా కోరుకుంటాడు అనుకుంది. కానీ నీళ్ళు అడిగాడు కిట్టూ. చెట్టు ఆనందపడింది. ఆ తర్వాత కిట్టుతో ..

“ అలాగే.తప్పకుండా ఇస్తాను. అయితే నువ్వొక పని చెయ్యాలి” అంది చెట్టు “ ఏమిటో చెప్పు. చేస్తాను”

“ ఒక మూడు రోజుల తర్వాత మీ స్నేహితుల్ని అందర్నీ ఇక్కడకు తీసుకురా” అంది చెట్టు.

“ సరే “ అని వెళ్ళిపోయిన కిట్టూ చెట్టు చెప్పినట్టే మూడు రోజుల తర్వాత తన స్నేహితుల్ని అందర్నీ తీసుకుని చెట్టు దగ్గరకు వచ్చాడు. వాళ్లందర్నీ చూసి చెట్టు ఎంతో ఆనందపడింది. పిల్లలు కూడా చెట్టుని ముగ్గిన మామిడి పళ్లను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.

“ మీ అందరికీ మామిడి పళ్ళు కావాలా ? తినాలని ఉందా?” అని అడిగింది.

“ అవును . తినాలని ఉంది “ అని అరిచారంతా తలలు ఊపుతూ.

“ అయితే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి.ఇస్తానంటే చెప్తాను”

“ అలాగే చెప్పు చెప్పు” అన్నారు ఆనందంగా గంతులేస్తూ.

“మీకే కాదు మీ ఇంట్లో వాళ్లకి కూడా పండ్లు ఇస్తాను. అందరూ మామిడి పళ్ళు తినేసి టెంకను ఎవరి ఇంటి ముందు వాళ్లు నాటండి. అలా నాటిన టెంకకు రోజూ రెండు గుటకల నీరు పొయ్యండి. అది పెరిగి పెద్దదై నాలా కాయలు కాస్తుంది. మీ అందరూ టెంకల్ని నాటి రోజూ నీళ్ళు పోస్తే మొక్కలు పెద్దవై కాయలు కాస్తాయి. మళ్ళీ ఆ కాయలు తిని టెంకల్ని నాటితే మళ్ళీ చెట్లు మొలుస్తాయి. నీళ్ళు లేకపోవటానికి చెట్లు లేకపోవటమే కారణం. చెట్లు ఉంటే వర్షాలు కురుస్తాయి. కొన్ని రోజులు కష్టపడి నీళ్ళు పొదుపు చేసి మొక్కలకు పోస్తే అవి పెద్దవై మీకు పళ్ళు నీళ్ళూ రెండూ ఇస్తాయి. అర్ధమైందా?

“ అర్ధమైంది. అర్ధమైంది” అంటూ గంతులేసారు పిల్లలు.

“ అయితే పళ్ళు ఇవ్వనా?”

“ఇవ్వు ఇవ్వు”

“టెంకలు నాటుతారా?”

“నాటుతాం.. నాటుతాం”

“నీళ్లు పోస్తారా?”

“ పోస్తాం పోస్తాం”

“ అయితే తీసుకోండి” అంటూ చెట్టు అటూ ఇటూ ఊగింది. పళ్లన్నీ రాలి పిల్లల ముందు పడ్డాయి. పిల్లలంతా గబగబా వాటిని ఏరుకుని చొక్కాల నిందా నింపుకుని “ ఆహా..ఓహో” అంటా ఇంటిదారి పట్టారు. కొంతకాలానికి ఊరంతా పచ్చని మామిడి చెట్లతో నిండిపోయేసరికి వర్షాలు విపరీతంగా కురవటంతో ఊరి వాళ్లకు నీటి సమస్య తీరిపోయింది.

అందరూ కిట్టూని మెచ్చుకున్నారు.

ఎన్ని చెట్లు కాయలు కాస్తున్నా గానీ పిల్లలంతా మొదటి మామిడి చెట్టు టెంకల్నే నాటటానికి ఆ చెట్టు చుట్టూ తిరిగే వారు కాయల కోసం. ఒకరోజు పిల్లలు అందర్నీ దగ్గరకు పిలిచి “పిల్లలూ.. నేను పెద్దదాన్ని అయిపోయానర్రా. ఇక మీకు కాయలు ఇవ్వలేను. మీ ఊర్లో ఉన్న చెట్లన్నీ నా పిల్లలే. మీకు నీటి సమస్య తీరిపోయిందని టెంకల్ని నాటటం మానకండి. నాటండి. నీళ్ళు పొదుపు చేసి చెట్లకి పోయండి. అప్పుడు అన్ని ఊళ్ళూ వనాలే.

అవునా కాదా?”

“ అవును అవును” అన్నారంతా చెట్టు చుట్టూ తిరిగి దండాలు పెడుతూ. అలా వాళ్లు నాటుతూనే ఉన్నారు మామిడి చెట్టు కుటుంబం పెరుగుతూనే ఉంది

           *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.