
వాత్సల్యం
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-సీతాసుస్మిత
’సీతాపురం కాలనీ’ అని అందంగా చెక్కి ఉన్న ఆర్చి చూస్తూ కారు దిగింది వాత్సల్య. ఎదురుగా వాచ్మెన్ రూముకి వెళ్లి, తను ఫలానా ఇల్లు కొనుకున్న సంగతి చెప్పింది.
“నమస్తే మేడం! ఇక్కడ మీరు పేరు, ఫోన్ నంబర్ రాసి సంతకం చేయండి. ఎవరైనా కొత్తవారు వస్తే మీకు ఫోన్ చేసి చెప్తాను.” అన్నాడు వాచ్మెన్ రిజిస్టర్ ఆమె ముందుకు నెడుతూ.
వాచ్మెన్ చెప్పింది చేసి, కారెక్కి తన ఇంటి ముందు ఆగింది.
ఒక్కత్తే కావడంలో తనకి ఉపయోగపడే సామాన్లు తప్ప పెద్దగా అనవసరమైన చెత్త పోగేసే అలవాటు లేదు వాత్సల్యకి. వాటికి బదులుగా మొక్కల్ని పెంచుకుంటుంది. అవే తన తోబుట్టువులు, నేస్తాలు, శ్రేయోభిలాషులు మరి!
మెల్లగా అన్నీ సర్దుకుని సాయంత్రానికి కాలనీలో వాకింగ్ చేస్తూ అన్నీ పరిశీలించసాగింది.
తన ఇంటికి కొద్దీ దూరంలోనే విశాలమైన పార్కు ఉంది. అందులో ఎక్సర్సైజ్ చేయడానికి వీలుగా పరికరాలు కూడా ఉండడం తనకి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్నీ ఇచ్చింది…
రెండోరోజు సాయంత్రం వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళబోతున్న వాత్సల్యని పలకరిస్తూ వచ్చింది తన ఇరుగుంటావిడ.
“మీరొక్కరే వచ్చినట్టున్నారు, ట్రాన్స్ఫరా? ప్రభుత్వోద్యోగమా?” అడిగింది.
“లేదండీ. ప్రైవేటుగానే క్లాసులు తీసుకుంటాను.” చెప్పింది వాత్సల్య.
“ఓహ్! మరి మీ భర్తా, పిల్లలూ?” ఈసారి పొరుగింటావిడ ఆరా!
“ఎవరూ లేరు, నేనొక్కదాన్నే ఉంటాను.” నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది వాత్సల్య.
ఇహ విషయాన్ని పీకి పాకం పెట్టడానికి పోగయ్యారు అందరూ కలిసి.
“అదేంటి ఒక్కత్తినే అంటుంది, భర్త పోయాడా? మరి తల్లితండ్రి? పిల్లలు కూడా లేరా, ఏ వయసులో పెళ్లైందో?” ఇలా సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు పాపం.
***
ఉదయాన్నే ఇంటి ముందు చెట్లకు నీళ్లు పోస్తున్న తనకు ఒక చక్కటి పాట వినిపించింది.
“సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా!” పాడుతూ తనింటి ముందు ఊడుస్తోంది పనమ్మాయి గంగ.
“ఏమే గంగా! ఆ పాట కన్నెపిల్ల పాడుకుంటుంది సినిమాలో. నువ్వు నీ పారిపోయిన మొగుడి కోసం పాడుతున్నావా?” ఎగతాళిగా నవ్వాయి పక్కింటి మరో నలుగురి పనిపిల్లల గొంతులు.
ఆ నవ్వులు, వెక్కిరింతలు అలవాటైన గంగ కూడా పైకి నవ్వుకుంటూ లోపలికి వచ్చింది. ఇంట్లోకి వచ్చిన గంగ ముఖంలోకి చూసింది వాత్సల్య. ఆమె కళ్ళు నొచ్చుకుని, బాధ పడుతున్నాయి.
“వాళ్ళు అన్నది నిజమేనా గంగా?” అడిగింది వాత్సల్య.
ప్రతిగా సమాధానం రాకపోయేసరికి మళ్ళీ తనే తేరుకుని, “సరే ఇంకెప్పుడైన చెప్పుకుందాంలే, దా కాఫీ తాగుదాం!” అని మాట మార్చేసింది.
“అవును గంగా, కాలనీకి వచ్చిన దగ్గరనుంచి గమనిస్తున్నాను, చుట్టుపక్కల ఆడవాళ్లందరూ పనులు చేసుకుంటూనో, ఇంట్లో టీవీ చూసుకుంటూనో ఉంటున్నారు తప్ప బయటకి వచ్చి నలుగురూ నాలుగు మంచి మాటలు మాట్లాడుకోవాలి, లోకజ్ఞానం తెలుసుకోవాలి అని అనుకోవటంలేదు. ఆ పార్కులో వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఆ వైపుకే వెళ్ళరెవరూ ఏంటో!
“ప్చ్! బావిలో కప్పల్లా ఉండిపోతున్నారు!” అని బాధపడింది.
“ఎక్కడ కుదురుద్దమ్మా? ఇంట్లో పనులు, వంటలు ఇవే సరిపోతాయి. అయినా అంత అవసరం అంటారా, బయటకొచ్చి చల్లగాలి పీల్చుకోవడం?” గంగ ప్రశ్నలో అమాయకత్వం తొంగిచూసింది.
“అందరూ చెప్పుకుంటున్న ఆరోగ్య సమస్యలకి సగం కారణం ఇంట్లోనే ఉంటూ వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోవడం. రోజు ఒక అరగంట అలా బయట చల్ల గాలికి గడిపితే ఎంత ఉత్సాహంగా ఉంటుందో తెలుసా?
ఈ వయసులో తరచూ వచ్చే మెనోపాజ్ సమస్యలు తగ్గుతాయి!” అని చెప్పింది వాత్సల్య.
తన ఆశయం కూడా అదే కదా. తనకు చేతనైనంతమంది ఆడవారిలో చైతన్యం కల్పించాలి. వారు వంటింటికే పరిమితం కాదని వారికి తెలియాలి.
గంగ కూడా వాత్సల్య మాటలకు ఆలోచనలో పడింది.
***
నాలుగురోజుల తర్వాత,
అదే వీధిలో ఆ చివరన ఇంట్లో అబ్బాయి తాగి బండి నడుపుతూ ఆక్సిడెంట్ పాలయ్యాడని తెలిసి, అతని తల్లిని పలకరించడానికి వెళ్ళింది వాత్సల్య. అప్పటికే అమ్మలక్కలందరూ అక్కడ చేరుండడంతో పలకరింపుగా నవ్వి, ఓ పక్కగా కూర్చుంది. ఒక్కక్కరూ ఒక్కో పనికిమాలిన సలహా ఇస్తున్నారు ఆ తల్లికి.
“ఊరిలో శివార్లలో ఒక నాటువైద్యుడున్నాడు. పసరు మందు ఇస్తున్నాడట, తప్పకుండా నయమవుతుంది, అబ్బాయిని తీసుకెళ్ళు.” అన్నది ఒకావిడ పాపం.
“అసలు ఈసారి మందుసీసా ముట్టుకుంటే, చస్తామని ఏడవండి. వాడి ముందు ఒకసారి విషం డబ్బా పట్టుకుని బెదిరించండి, దెబ్బకి మాని కూర్చుంటాడు.” ఒకావిడకి ఆవేశం తన్నుకొచ్చింది.
’బ్రతిమాలినా, బామాలినా, బెదిరించినా, భయపెట్టినా లొంగే వయసు కాదు, జీవితం పట్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అతని తీరులో.’ వాత్సల్య ఇలా అనుకుంటూ ఉండగా, వినపడ్డాయి ఆ మాటలు.
“అసలివన్నీ కాదు వదినా, మంచిపిల్లని చూసి పెళ్లి చేసేయండి. నేను చెప్తున్నా కదా ఆ అమ్మాయే మొగుడ్ని దారిలోకి తెచ్చుకుంటుంది, మార్చుకుంటుంది.” అని చెప్తూ ఏ అమ్మాయిలు ఖాళీగా ఉన్నారో, ఎవరి గొంతు కోసేద్దామో అన్నీ చెప్పుకుంటూపోతుంది.
ఇహ సహనం నశించింది వాత్సల్యకి.
“ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెళ్లి చేస్తే బుద్ధి మారుతుంది, మంచివాడు అయిపోతాడని ఎలా అనుకుంటారు. ఒకవేళ మారకపోతే ఒక ఆడబిడ్డ జీవితం నాశనం కాదా? అసలు పుట్టి, బుద్దేరిగినప్పటి నుంచి చూస్తున్న అమ్మానాన్నల మాటే విననివాడు, ఎవరో పరాయి పిల్ల మాటలు వింటాడు అనుకోవడం మీ అమాయకత్వం. దీని కోసం ఆ పిల్ల తన కుటుంబాన్ని వదులుకునిరావాలా? చాలా తప్పుడు సలహా ఇస్తున్నారు మీరు.” అని ఒక క్షణం ఆగింది.
ఇన్నిరోజులుగా వాత్సల్య ఇంత మాట్లాడ్డం ఎరుగని వారు తను ఒక్కసారిగా ఇలా ప్రశ్నించేసరికి సహించలేకపోయారు.
“ఇదిగోమ్మా ఒక్కదానివే ఉంటున్నావన్నా కూడా నీ గురించి, జీవనం గురించి మేమే ప్రశ్నలూ వేయలేదు నిన్ను. ఏదో నీ దారిన నువ్వుంటున్నావు అనుకున్నాం కాబట్టి. అయినా నీకేం తెలుసు, కుటుంబం ఉండి, అందులో ఒకరి వల్ల ఇంట్లో ప్రశాంతత కరువవుతుంటే ఎంత బాధగా ఉంటుందో?” ఆమె అలా అడుగుతూనే ఉన్నది కానీ వాత్సల్య మాత్రం ఆ ప్రశ్న గురించి ఆలోచిస్తూ అక్కడినుంచి వెళ్ళి పోయింది.
ఇంట్లోకి వెళ్లగానే అలమరలో ఉన్న బట్టలను చెల్లాచెదురుగా పడేసి, ఏడుస్తూ మళ్ళీ అవి మడతేస్తూ సర్దుకుంటుంది. మనసు బాధపడ్డప్పుడు తనను తాను సమాధానపరుచుకునే తీరు అది.
“ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు నా కుటుంబాన్ని చూసుకోడానికి ఒక్క ఫోటో కూడా లేదు నా దగ్గర.”అని మొహాన్ని దోసిళ్ళల్లో పెట్టుకుని ఏడుస్తుంది.
***
ముప్పై ఏళ్ళ క్రితం… ఇలానే ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది పదిహేనేళ్ల వాత్సల్య.
ఊపిరి ఆడట్లేదు, మాట రావట్లేదు, కాళ్ళు చేతులు కదపడానికి ప్రయత్నిస్తున్నా కదలట్లేదు. బలవంతాన తల పైకెత్తింది. ’తను ఇప్పటిదాకా పడిన ఘర్షణే ఇంత భయంకరంగా ఉంటే మరి రేపు నలబై ఏళ్ళ వాడు తన మీద చేయి వేస్తేనో?’ చమటలు పట్టేశాయి ఒళ్ళంతా.
చుట్టూ చూసింది, అత్తామావయ్య, పిల్లలు, అమ్మమ్మ అందరూ కమ్మని కలలు కంటూ పడుకున్నారు.
” హ్మ్మ్!” అని ఒక నిట్టూర్పు విడిచింది.
ఈ పెళ్లి చేసుకుంటే తామందరి జీవితాలు గాడిన పడడమే కాకుండా, సుఖంగా గడిచిపోతాయి అని అమ్మమ్మ బ్రతిమలాడడం తర్వాత పట్టుపట్టడం గుర్తొచ్చాయి.
’తామందరూ అంటే అందులో నువ్వున్నావా? నీకు సుఖం కావాలా, సంతోషం కావాలా ? “అని మనసు ప్రశ్నించింది.
“నువ్వూరుకో ! అన్నిటిలో దూరిపోకు. కన్నవాళ్ళు పోయాక, ఇన్నాళ్లు తనని చూసుకున్నారు, ఇంతదాకా చదువు చెప్పించి, ఇంతదాన్ని చేశారు.” అని బుద్ది మూతితిప్పింది.
“అవును చిన్నపిల్లగా చూసుకున్నారు, కానీ ఇప్పుడు వయసుకొచ్చాక కాపాడాల్సిన సమయంలో ఇలా వదిలించుకుందామని చూస్తుంటే…?” మనసు మౌనంగా రోదించింది.
“ఇప్పుడు ఇతడిని చేసుకుని నేను వీళ్ళని ఉద్దరించాలా? నా గురించి పేపర్ లో రాస్తారా? టీవీలో వేస్తారా?? లేక నాకు స్వర్గ ప్రాప్తి కలుగుతుందా? ఇవన్నీ అవుతాయో లేదో కానీ నన్ను నేను కచ్చితంగా కోల్పోతాను. నా కుటుంబంలో నావల్లే ఇబ్బంది కాబట్టి నేనే తప్పుకుంటే?” అని ఎంతో మధనపడుతూ, తన కోసం తెగించి ఇంట్లోనుంచి బయటకొచ్చేసింది వాత్సల్య.
’ఆసరా ’ అనే ఆశ్రమంలో చేరి అక్కడివారిని చూసుకుంటూ, మెల్లగా ప్రైవేట్ డిగ్రీ వరకు చదువుకుని, కంప్యూటర్ శిక్షణ తీసుకుని, చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థికంగా అంచలంచెలుగా ఎదిగింది. కానీ ఎక్కడకెళ్లినా తనకి మహిళా బాధితులు కనిపిస్తూనే ఉన్నారు. వారికి తనవంతుగా సాయం చేయాలనుకుని కౌన్సెలింగ్ వైపు మొగ్గు చూపించింది.
ఇందాకావిడ ఏమన్నదీ?
“ఒకరివల్ల కుటుంబంలో కష్టం వస్తే దాని పర్యావసానాల అనుభవం నీకు తెలీదు.” అని.
“నా అనుకున్న వాళ్ళు నాకు ద్రోహం చేద్దామనుకున్నారు ముసలాడితో పెళ్లి చేసి. కానీ నా అంతట నేనేగా తప్పుకున్నాను. విలువ తెలియనిది వారికా? నాకా? పర్యవసానాలు అనుభవించింది నేనే కదా. మరి నన్ను అపరాధిని చేస్తుందేంటి ఈ సమాజం?” ఇలా సమాధానాలు, మళ్లీ వాటికి ప్రశ్నలు వేసుకుంటూ ఆ రోజంతా గడిపేసింది వాత్సల్య.
***
కాలనీ వారు తనపట్ల అయిష్టత ప్రదర్శించినా తను మాత్రం నిబ్బరంగా వారిలో మార్పు కోసం ఎదురుచూస్తూనే ఉంది. తనే వచ్చి పార్కులో నేర్పిస్తానంటే వారు కచ్చితంగా రారంటారని ముందే ఊహించి గంగతో కలిసి ఒక పథకం వేసింది.
’అనారోగ్యానికి వయసుతో సంబంధం లేదు, మీ జీవితాల్ని ఎప్పుడైనా కుదిపేస్తుంది. ఆలోచించండి! ముందడుగు వేయండి!
వేదిక: కాలనీ పార్క్!’అని రాసి ఉన్న పాంప్లేట్లను తన పేరు లేకుండా ప్రతీ ఇంట్లోకి పంపించింది వాత్సల్య. ప్రతిరోజూ వచ్చి పార్కులో ఎదురుచూసేది, కానీ తన ఎదురుచూపులకి చీకటి పడింది కానీ చుట్టుపక్కల ఏ ఒక్కరూ కూడా ఆ దరికి రాలేదు.
ఇలా నాలుగురోజులు గడిచాక,
ఆ రోజు ఉదయం యధావిధిగా వాకింగ్ పూర్తిచేసుకుని, పార్కుకి వెళ్లేసరికి, తనకంటే ముందే అయిదారుగురు వచ్చి పార్కులో ఉన్నారు. ప్రయత్నం ఫలించినందుకు ఎంతో సంతోషించింది తను. కానీ అక్కడ వాత్సల్యను చూసేసరికి కొందరు వెనుతిరగబోతుంటే, వారిని ఆపుతూ,
“పిన్నిగారు! మొన్నటి నా మాటలను మనసుకు తీసుకోకండి. అందరికీ గతం ఉంటుంది, కానీ నేను దాన్ని తవ్వాలనుకోవట్లేదు. మనం ఇప్పుడు మన ఆరోగ్య భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. చక్కని చిక్కటి కబుర్లు చెప్పుకుందాం!” అన్నది నవ్వుతూ.
అందరూ సరేననుకున్నారు.
ఇప్పటిదాకా ఎవరూ చొరవ తీసుకుని అవి వాడడం మొదలుపెట్టలేదు, కానీ వాత్సల్య చీరలో అవి అలవోకగా ఆ వ్యాయామాలు చేస్తుంటే అందరికీ ఉత్సాహం కలిగింది.
ఇలా ఆరోగ్యకరమైన కబుర్లు చెప్పుకుంటూ, సలహాలు ఇచ్చుకుంటూ చాలా ఆహ్లాదంగా గడుస్తుంది సమయం వారికి పార్కులో.
మంచి పుస్తకాలు, తిండి అలవాట్లు అన్నీ వివరంగా చెప్తూ వారిలో అవగాహన కల్పిస్తూ వస్తుంది వాత్సల్య.
ఒకరోజు యధావిధిగా పార్కులో మాట్లాడుతున్న వాత్సల్యకి,
“గంగా!!” అని పిలుస్తూ ఎవరో ఆమె వద్దకు పరుగెత్తుకు వెళ్ళడం కనిపించి, అటువైపు వెళ్ళింది.
అందరూ గంగ ఉన్నవైపుకు వెళ్ళారు ఏమైందా అని.
“గంగా! నీ మొగుడు వచ్చాడంటే, నీకోసం బస్తీలో అడుగుతున్నాడు. మీ పిన్నాం నిన్ను వెంటబెట్టుకు రమ్మంది. దా!” అని చేయి పట్టుకు లాగింది ఆ అమ్మాయి.
గుమిగూడి చూస్తున్న ఆడవారి ముఖాల్లో, “ హమ్మయ్య, అదృష్టవంతురాలివే నువ్వు.” అని ఒకరి సంతోషం.
ఒకరేమో,
“పాపం ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తుంది, ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు.” అని దండం పెట్టింది.
“ఇక మంచిరోజులు వచ్చాయే గంగా నీకు.” ఒకావిడ సంబరపడింది.
ఈమధ్యే గంగ గురించి తెలుసుకున్న వాత్సల్య మాత్రం కలవరపడింది.
వీరందరి కన్నా ముఖ్యంగా గంగలో మాత్రం ఏ చలనం లేదు. అసలు ఎటువంటి ప్రతిస్పందనా కనిపించట్లేదు ఆమె ముఖంలో. ఎటో శూన్యంలోకి చూస్తూ అంతే నిలబడిపోయింది.
“ ఏంటే కదలవు, పదా!!” అంటూ కుదిపింది ఆ అమ్మాయి.
గంగ చేయి విదిలించుకుని, మళ్ళీ చీపురు పుచ్చుకుని శుభ్రం చేయడం కొనసాగించింది. అందరూ బుగ్గలు నొక్కుకుంటూ చూస్తూ ఉండిపోయారు. ఆమె స్థితిని అర్థం చేసుకున్న వాత్సల్య వెంటనే వెళ్ళి గంగను హత్తుకుంది. అంతే అప్పటిదాక బిగపట్టిన దుఃఖమంతా కన్నీళ్లతో బయటకు వచ్చిన గంగ, వాత్సల్యను గట్టిగా పట్టుకుని వెక్కివెక్కి ఏడవసాగింది. ఊహించని ఈ పరిణామానికి అందరూ అలా నిలబడిపోయారు.
“ఇన్నాళ్లు నన్ను మొగుడు వదిలేశాడని జాలి చూపించారు, చిన్నచూపు చూసారు, ఎగతాళి చేశారు. ఎప్పుడూ బాధ అనిపించలేదమ్మా నాకు. అలాంటిది ఇవాళ వాడు మళ్ళీ వచ్చాడని విని, అందరూ వెళ్ళు వెళ్లు అంటున్నారు కానీ ఒక్కరు కూడా, ’వెళ్ళవే గంగా, వెళ్ళి ఆడి దవడ పగలకొట్టి తిరిగి ఎందుకొచ్చావు అని అడుగు ’ అని ఒక్కరు కూడా అనట్లేదమ్మా.” అంటూ అందరివైపు చూసింది.
అందరూ బుగ్గలు నొక్కుకుంటూ, “ ఇదేం చోద్యమే గంగా. మొగుడు నీకోసం తిరిగొస్తే, ఇలా మాట్లాడుతున్నావు?”
“ఆమెను వద్దనుకుని, ఇంకో ఆడదాని కోసం వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లు గంగ గురించి ఒక్కసారి కూడా ఆలోచించనివాడు ఇప్పుడు వచ్చాడంటే ఏమనుకోవాలి ఆంటీ.” అడిగింది వాత్సల్య.
“అదేంటమ్మాయి నువ్వు కూడా వత్తాసు పలికితే ఎలా? పిల్ల జీవితం మోడుబారిపోతుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ వచ్చాడు. వాడితో వెళ్తే ఏమవుతుంది?” అన్నది ఇంకో ఆవిడ.
“ఉహూ! నేనసలు అతగాడు మొహం చూడను. వెళ్ళి నిలదీయడమంటే అతన్ని మళ్లీ నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు! నేను ఆ పని చేయదలుచుకోలేదు , నేను వద్దని వెళ్లిపోయిన వాడిని మళ్లీ ఎందుకు బామాలాలి? ఈ రెండేళ్లు నేను పడ్డ అవమానాలు చాలు.” అన్నది గంగ.
ధైర్యం చెప్తున్నట్టుగా తన భుజం తట్టింది వాత్సల్య.
“ఆడదానికి ఆడదే శతృవు అంటారు. అది నీ విషయంలో ఈ మహాతల్లి నిజం చేస్తుంది.” అని వాత్సల్యని ఆడిపోసుకున్నారు అందరూ.
ఇవన్నీ షరా మామూలే అని కొట్టిపారేసింది వాత్సల్య.
***
పార్కులో వాతావరణం మునుపటిలా లేదిప్పుడు. ఆ ప్రశాంతతకు అలవాటుపడిన కొందరు మాత్రం క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నారు.
అలా ఇంకోరోజు, మాధవికి ఫోన్లో స్నేహితురాలు హితబోధ చేసుకుంటుపోతుంది.
“నువ్వసలు తగ్గకు మాధవి. ఎన్ని మాటలంటుందే మీ అత్త.
’వెన్న, నెయ్యి వాడకు, లావైపోతున్నావు’ అన్నదా.
అసలు మీ మావగారికి వంటింట్లో ఏం పనే? మూతలు పెట్టావా? అంట్లు సరిగా తోమావా? ఇవన్నీ ఆయనకెందుకే?
ఇక మీ ఆయన సంగతి చెప్పక్కర్లేదు. పిల్లల్ని నీ మీద వదిలేసి ఉద్యోగం ఉద్యోగం అంటూ. ఉఫ్ఫ్ కష్టాలన్నీ పడుతున్నావే మాధవి. ఏమాత్రం ఆలోచించకు, విడాకులకు అప్లై చేయి.”
అన్నిటికి మాధవి ’ఊ, ఊ ’ కొడుతూనే ఉంది కాని మనసులో వేరే ఆలోచనలు. ఆమె మొహంలో కలవరం గమనించిన వాత్సల్య,
“నీ స్నేహితురాలు చెప్పినట్టు చేస్తే సరిదిద్దుకోలేనీ తప్పు చేసినట్టే మాధవి.” అంటూ వెనకనుంచి వచ్చి ఆమె భుజం మీద చేసి వేసింది. జరిగిందేంటి అని తెలుసుకుని, నవ్వుతూ,
“ఇంత చిన్న చిన్న విషయాలకు విడాకుల దాకా ఆలోచిస్తే, మొదటిరోజే కాపురాలు కూలిపోవు?
నీ విషయంలో జరుగుతున్నవి అపార్థాలు అంతే!
మీ అత్తగారీతో,
’ అత్తయ్యా! నెయ్యి వల్ల గుడ్ ఫ్యాట్ మాత్రమే వస్తుంది, ఇబ్బంది లేదు. అయినా ఇకనుంచి తిన్న వెంటనే వాకింగ్ చేద్దాం. మనకీ హాయిగా ఉంటుంది!’ అని చెప్పి చూడు” అని చెప్తుండగానే పక్కనుంచి ఇంకో బామ్మగారు,
“ఆవిడ మాటా విన్నట్టుంటుంది, నువ్వు నీ మాట నెగ్గించుకున్నట్టుంది.” అన్నది వాత్సల్య వైపు చూస్తూ.
వాత్సల్య మళ్ళీ అందుకుని
“మీ మావగారితో,
’థాంక్యూ మావయ్యా. నేను పనిలో పడి ఒక్కోసారి మూతలు సరిగా పెట్టకపోయినా మీరు సరిచేస్తున్నారు. ఇకనుంచి జాగ్రత్త పడతాను.’ అని చెప్పు.
ఏముంది, హమ్మయ్య కోడలు నా మాట విన్నదన్న సంతోషంలో కొన్నిరోజులు నీ వంటింటి వైపు రారు. కానీ అమ్మాయి నువ్వు కూడా జాగ్రత్తగా అన్ని గుర్తుపెట్టుకో శుభ్రత, పరిశుభ్రత!” అన్నది ఇంకో పిన్నిగారు.
“కరెక్టుగా చెప్పారు పిన్నీగారు!” అన్నది వాత్సల్య చప్పట్లు కొడుతూ.
“ఇక మీ శ్రీవారు! మిమ్మల్నందరిని బాగా చూసుకోడానికి ప్రమోషన్ కోసం కష్టపడుతున్నారు. మరి నీకు తాత్కాలిక సుఖం కావాలంటే ఇప్పుడు మీ ఆయనతో గొడవపడు. ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే కొన్నిరోజులు అతని ఎదుగుదలలో నీ భర్తకు సహకరించు.” అని చెప్పింది.
“చాలా థాంక్స్ అక్కా, నా కళ్ళు తెరిపించారు.” అన్నది మాధవి కళ్ళు తుడుచుకుంటూ.
“ఇలా పక్కింటి పంకజాలు, ఎదురింటి మందరలు వీళ్ళ మాటలకి నీ కుటుంబంలో స్థానం కల్పించకూడదు మాధవి. గుర్తుపెట్టుకో.” అని హితవు చెప్పింది వాత్సల్య.
***
బామ్మగారు, పిన్నిగారు, ఇంకొంతమంది ఆంటీలు అందరూ కలిసి వాత్సల్య చుట్టూ గుమిగూడారు.
“మొన్న గంగా విషయంలో అలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా! ఎలా? ఎందుకు?” అడిగారు.
“గంగ విషయంలో తన భర్త తెలిసి చేసిన తప్పు. అది క్షమించరానిది. మాధవి తెలియక చేసుకున్న అపార్ధాలను పెద్దవి చేసుకుంటుంది. అందుకే వారించాను.
మన జీవితం ఒక పువ్వైతే, దాన్నుంచి వచ్చే సౌరభమే సంతోషం. ఆ సౌరభాన్ని మనం ఎంతగా పంచిపెడితే ఈ ప్రపంచం అంత అందంగా ఉంటుంది. అదే మన ’జీవన సౌరభం!’” అని ముగించింది.
అందరి కరతాళ ధ్వనుల మధ్య తన నవ్వు ఇంకా సుందరంగా తోచింది.
***
’ సీతాపురం కాలనీ’ ఆడవారి ఆలోచనా దృక్పథాన్ని ఎంతో ప్రభావితం చేసింది వాత్సల్య.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు నిలబడుతున్నారు. వారిచేత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టించి, “ఫుడ్ బిజినెస్”, “రెసెల్లింగ్”, “ ఇంటి నుంచి సంపాదించే విధంగా వారికి శిక్షణ ఇచ్చి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ, ఎంతోఎంతో ముందుకు వెళ్లిపోతుంది వాత్సల్య.
*****

సీతాసుస్మిత రచయిత్రి …
