
ఆ కలం ఆగితే?
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-అనసూయ ఉయ్యూరు
అచ్యుత టేబుల్ పై వున్న తన సెల్ ఫోన్ లో నోటిఫికేషన్ సౌండ్ రావటంతో దాన్ని చేతుల్లోకి తీసుకుని మెసేజ్ చదివాడు. తన అకౌంట్లోకి పదివేలు జమ అయినట్లు వచ్చిన మెసేజ్ అది. నా ఎకౌంట్ కి 10000 వేలు వేసింది ఎవరబ్బా? అని ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా ఎవరు వేసారో అర్థం కాలేదు. ఈలోపు వాట్సాప్ లో అకౌంట్ లో పదివేలు వేసిన రశీదుతో పాటు దసరా కథల పోటీలో నెగ్గిన మీ కథకు ప్రయిజ్ మనీ గూగుల్ పే ద్వారా మీ ఎకౌంటుకు వేసామని మెసేజ్ వచ్చింది.
అప్పుడు గుర్తొచ్చింది ఈమధ్య తన భార్య సురేఖ కథలు రాస్తుంది. అడపాదడపా వారిచ్చే కొద్దిపాటి రెమ్యునరేషన్ కి తనకి గూగుల్ ఎకౌంట్ లేకపోవటం వల్ల తన నెంబరు ఇచ్చింది. అప్పుడో రెండొందలు, మూడొందలు ఓ నాలుగుగైదు సార్లు వచ్చినయ్ కూడా.
మొదటిసారి కథ సెలక్టయినప్పుడు సురేఖ ఆనందంగా అచ్యుత్ కి చెప్పినప్పుడు “నీలో ఈ టాలెంట్ ఎప్పటి నుండి?” అంటూ బొల్డంత ఆశ్చర్య పోయాడు.
“ఎందుకంత ఆశ్చర్యం నేను పెళ్ళికి ముందు కూడా రాసానని చెప్పాను కదా! ఇంటి పని వత్తిడిలో సరైన సమయం దొరక్క రాయలేదు. ఆ గ్యాప్ నేను మరింత అప్డేడ్ అవ్వటానికి సహాయపడినట్లు నాకే అనిపిస్తుంది. అందుకే అన్నీ సెలక్టవుతున్నాయి” అంది.
అతనికి గుర్తొచ్చింది ఆమెకి కథలు రాయటం ఇష్టమని ఎప్పుడో ఒకసారి చెప్తే, గొప్పలు పోతుందని నమ్మలేదు అప్పుడు. “నిజమేనా?” అని అనుమానంగా చూసి అభినందనలు చెప్పాడు. అంతే అప్పటి నుంచి ఏదోకటి రాసే పనిమీదే వుంది. ఇది ఎంతలా మారిందంటే ఒక్కోసారి వంట చేయటం కూడా మర్చిపోతుంది. అదేమన్నా అంటే అబ్బా! పోదురూ ఎక్కడంటే అక్కడ కర్రీపాయింట్లు వచ్చాయి. వంట చేసి నేను రెండు గంటలు టైం వేస్ట్ చేసుకునే కన్నా ఓ కథ రాసుకోవటం ముఖ్యమనిపిస్తుంది ఎలాగోలా సర్దుకుపోండి అంటుంది.
నిజానికి ఆమె అలా కథల్లో మునిగి పోవటం ఇష్టమే అతనికి. ఏ ముహూర్తాన కథ సెలక్టయి మరిన్ని కథలు రాయడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి తనకి బాగా రిలీఫ్ వచ్చింది. ఇది వరకులా ఎక్కడి కెళ్ళారు? ఇంతాలస్యం అయిందేం? ఈరోజు త్వరగా వచ్చేయండి… సినిమాకు వెళదాం లాంటి మాటలు అస్సలు ఆమె నోటి నుండి రాలేదు. తనే ఎప్పుడన్నా బోర్ అనిపించి ఈరోజు బైటకెళ్ళి సినిమా చూద్దాం అంటే నేను రాలేనండీ కథల పోటీకి కథ పంపాలి టైం లేదు అనేది. ఇదే అదననుకుని మిత్రులతో చతుర్ముఖ పారాయణం సాగించి ఏ అర్థరాత్రికో మెల్లగా వచ్చేవాడు. అప్పుడు కూడా “అబ్బా వచ్చారా రండి భలే మంచి కథ రాసా చదివి చెప్పండి ఎలావుందో” అనేది.
“ఇప్పుడు కాదులే రేపు ఉదయం తప్పకుండా చదువుతా” అని తప్పించుకునే వాడు.
చదవకూడదని ఏం కాదు కానీ మొదటినుంచి ఇంగ్లీష్ మీడియం కావటంతో తెలుగు చదవటం కొంచెం కష్టం. కూడబలుక్కుని కూడబలుక్కుని చదువుతాడు. ఆ విషయం ఆమెకి తెలుసు అందుకే అప్పటికి ఊరుకుంటుంది. తీరా ఉదయం అయ్యేసరికి ఇద్దరూ ఆ విషయం మర్చిపోతారు. అందువల్ల భార్య కధలేవీ అతను ముందుగా చదవలేదు. పత్రికలో వచ్చినవి మాత్రం కొన్ని తీరిక చేసుకుని చదివాడు. అవి చదివినప్పుడు అతనికి అనిపించింది తెలుగు రాసేవాళ్ళు సంఖ్య తగ్గిపోవటం వల్ల ఎవరు ఏం రాసినా తీసుకుంటున్నారల్లే వుంది అని. తన భార్య నిజంగా అంత గొప్ప కథకురాలు కాదని అతని ఉద్దేశ్యం.
ఇప్పుడు ఏకంగా పదివేల రూపాయల బహుమతి వచ్చింది అంటే అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ విషయం చెప్పటానికి తాను ఇంట్లో లేదు. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. మరి కాసేపట్లో వచ్చేస్తుంది.
తన భార్య గురించి అనవసరంగా తక్కువ అంచనా వేసానా? అని కొంచెం ఫీల్ అయ్యి ఆమె రాసిన కథేంటో చూద్దాం అని టేబుల్ పై రఫ్ గా రాసి పెట్టుకునే బుక్ తీసాడు. తనకి బహుమతి వచ్చిన కథ కాపీ వుంది అక్కడ. మెల్లగా తీసి చదవటం మొదలు పెట్టాడు. అతి కష్టంగా అక్షరాలు చదవటం ప్రారంభించిన కాసేపటికి చకచకా చదవటం పూర్తి చేసాడు. అన్నీ విన్న సంభాషణలు, విన్న మాటలు. అర్థం అయింది. తన గురించి తాను రాసుకున్న అంతర్మధన కథ. ముగింపు చదివాక ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. కథలో కథానాయిక ఓ రచయిత్రి. యనభైశాతం సగటు స్త్రీ లాగే భర్తే దైవంగా భావించి తన అభిరుచులు, అభిప్రాయాలు కుటుంబ నిర్వహణలో పక్కన పెట్టిన మహిళ. కొంత కాలానికి ఇది కరెక్టేనా ఎంతకాలం ఇలా? అని తనని తాను ప్రశ్నించుకుంటుంది. తన అభిరుచిని బైట పెట్టు కోవటానికి కథలు రాస్తూంటది. ఇంట్లో వంట వండితే ఆహా! చాలా బావుంది అనో, ఉప్పు తక్కువైదనో చెప్పేవారుంటారు కానీ తన కథలు ఎలా వున్నాయో చెప్పేవారుండరు. నాలుక అందరికీ వుంటుంది కనుక రుచులు అందరూ తెలుసుకోటంలో ఆశ్చర్యం లేదు. కానీ అభిరుచి ఎవరికుంటే వారే కదా ఇలాంటివి చెప్పాలి అని సరిపెట్టుకుంటుంది. నిజానికి వంట చేసేప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో కథ రాసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది. కొన్ని కథలు పత్రికల్లో వచ్చాక ఎక్కడెక్కడివారో పలకరిస్తుంటారు. కానీ ఇంట్లో భర్త నుండి స్పందన రాకపోగా తన కథలు ఎలా వున్నాయో అని అడుగుతున్నందుకు తప్పించుకోడానికి కాలక్షేపం పేరుతో స్నేహితుల ఇళ్ళకెళ్ళి పేకాట దానితో కాస్త మందు, ఆ మత్తులోపడి ఆలస్యంగా ఇంటికొస్తుంటాడు. తన భర్త నిదానంగా వ్యసనపరుడౌతున్నాడని గ్రహిస్తుంది. తన ఇంటిని చక్కదిద్దుకోలేనప్పుడు తన కథలలో ఈ సమాజానికి ఇచ్చే సందేశాలు, నీతులు రాయటంలో అర్థం లేదనిపించింది. తను ఒకరికి ఇచ్చే స్పూర్తి కన్నా తమ ఇద్దరి మధ్యా వచ్చిన గ్యాప్ తగ్గించుకోవటం ముఖ్యమనిపించింది. అందుకని ఇక నుండి కథలు రాయకూడదని నిర్ణయించుకుంటుంది. ఇది ఆ కథలోని సారాంశం.
అది చదివాక ఆ కథ తనకి ఎక్కడో తాకింది. ఆ రచనా శైలి, ఎక్కడా ఆగ కుండా చివరి వరకూ ఉత్కంఠగా చదివిస్తూ పాఠకుల్ని ఆలోచనల్లోకి నెడుతూ కథ బాగా రాసింది అనుకోకుండా వుండలేక పోయాడు. అంటే తను పేకాటకి వెళుతున్నానని తెలిసిందన్నమాట. అందులో కథానాయిక నిర్ణయం తన భార్య నిర్ణయమేనా అనే సందేహం వచ్చింది. లేకుంటే ఎప్పుడూ లేంది తన తోడు లేకుండా స్నేహితురా లిని చూసేందుకు ఇంత తీరికగా వెళ్ళింది అనుకున్నాడు. ఏమీ ఎరగనట్లు ఎక్కడి పేపర్లు అక్కడ సర్దేసాడు. కొద్ది సేపటికి ఆమె వచ్చింది. ఆమె వస్తూనే ఇంట్లో ఏదో మార్పు వున్నట్లు గమనించింది. వంట పూర్తి చేసి అన్ని సిద్దంగా వున్న టేబుల్ ని చూస్తూ “ఏంటి ఈరోజు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటం లేదా?” అడిగింది.
“లేదు వెళ్ళాలని అనిపించటం లేదు. నీకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళను. ఏదీ నీవు రాసిన కథ ఏదైనా వుంటే ఇవ్వు చదివి పెడతా” అన్నాడు హుషారుగా ఎక్కడ అనుమానం వస్తుందో అని జాగ్రత్త పడుతూ.
ఇప్పుడిప్పుడే వర్దమాన రచయిత్రిగా పేరు తెచ్చుకుంటున్న ఆ కలం ఆగిపోవటం మంచిదికాదని అతనికి అనిపించింది మరి.
*****

