
పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్మృతిలో
-అత్తలూరి విజయలక్ష్మి

పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరులో జన్మించారు. ఆలమూరు గరల్స్ హై స్కూల్ లో విద్యనభ్యసించారు. వివాహానంతరం పోలాప్రగడ సత్యనారాయణగారు బాపట్లలో ఇంగ్లీష్ లెక్చరర్ గా నియమింపబడడంతో వీరు దాదాపు 30 సంవత్సరాలు బాపట్లలోనే నివసించారు. ఆ రోజుల్లోనే వీరికి కనుపర్తి వరలక్షమ్మ గారితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సాన్నిహిత్యం పెరిగింది. భర్త పోలాప్రగడ సత్యనారాయణగారు అప్పటికే సుప్రసిద్ధ రచయితగా పేరుపొందారు. వారు రాసిన కౌసల్య నవల, వారి సాంగత్యంలో, వరలక్షమ్మ గారి స్నేహంతో పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారికి సాహిత్యం పట్ల మక్కువ కలిగింది. సత్యనారాయణ గారితో సాహిత్య చర్చల కోసం వచ్చే అనేక మంది ప్రముఖ రచయితలూ, రచయిత్రులు, వారి చర్చలు రాజ్యలక్ష్మిగారిని కూడా రచయిత్రిని చేసాయి.
ఏ రంగం అయినా సరే, ఆసక్తి, అభిలాష ఉంటె రాణించడం కష్టం కాదు. వారి చదువు 5 వ తరగతే అయినా, అంతులేని విజ్ఞానం భర్త సాంగత్యంలో ఆమె పొందారు. కనిపించిన ప్రతి పుస్తకం చదువుతూ తానూ రాయడం ప్రారంభించారు. భర్త ప్రోత్సాహం, ఆమెలోని జిజ్ఞాస త్వరలోనే ఆమెని ప్రముఖ రచయిత్రుల స్థానంలో కూర్చోబెట్టాయి. వారు రాసిన రెల్లుపొదలు నవల హిందీలో అనువదించబడి, ఆ ఒక్క నవల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏం ఫిల్ స్థాయిలో అనేక పరిశోధనలు జరిగాయి. ఈమె కథా రచనలపై నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏం ఫిల్, వీరి సాహిత్యం, వ్యక్తిత్వం పైన ఆంద్ర విశ్వ విద్యాలయం నుంచి పి. హెచ్.డి చేసారు. వీరి కథలు, నవలలు, కవితలు కొన్ని ఇంగ్లీష్, హిందీ భాషలలో అనువదించబడ్డాయి.
‘దేవుడు నవ్వుతూనే ఉన్నాడు’, ‘ముసురు’, ‘మక్కువకే రెక్కలుంటే’, ‘నిజానిజాలు’ ‘కోరుకోని కోవెల’ , ‘కొత్త వెలుగు’, ‘రహదారి బంగళా’ ‘ఇల్లు మరవద్దు’, ‘ఈరోజు పనిమనిషి రాలేదు’, ‘ఏర మింగని చేప’ ‘ తెలియని నిజాలు’, ‘ఏం చేస్తాం ఆల్లు మనోళ్ళు’, పిలుపే బంగార మాయేరా, ‘పాపం సుబ్బారావు’ ‘గోవు మహాలక్ష్మి’ ‘వంటింటి రాజకీయం’ శరన్మేఘం , శృతి తప్పిన వీణ, గాజు మేడ, దరిచేరిన కెరటం శిలలూ-సెలయేళ్ళు వంటి అనేక కథలు, నవలలు వీరి కలం నుంచి జాలు వారాయి. సుమారు 14 నవలలు, 100 పైగా కథలు, 100 కవితలు వ్రాసారు. పక్షులకు మనసుంటుంది అనే సున్నితమైన అంశంతో వీరు రాసిన ‘ఓ చిలక కథ’ లేఖిని కథాసంకలనంలో చోటుచేసుకుంది.
వీరి సాహితీసేవకు మెచ్చిన వివిధ సంస్థలు ఈమెను సత్కరించాయి. “సఖ్య సాహితి” రచయిత్రుల సంస్థకు వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. ఆ తరవాత “లేఖిని “ సంస్థకు కూడా వీరు ఉపాధ్యక్షులుగా సేవలందించారు. ఆంద్ర మహిళా సభ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలిగా కూడా వీరు కొనసాగారు.
వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భారత పెట్రోలియంలో, రెండో కుమారుడు బెహ్రాన్ లో ఉన్నత పదవులు నిర్వహించి పదవీ విరమణ చేసారు. సుప్రసిద్ధ రచయిత, నటుడు పోలాప్రగడ జగన్నాధశర్మ (జెన్నీ) వీరి అక్క కుమారుడు, వీరి కుటుంబం చాలా పెద్దది. అందరూ ఉన్నత పదవుల్లోనే ఉన్నారని చెప్పేవారు. వారి అక్కగారిని ఆమె అమ్మక్క అని పిలిచేవారు. వారి పేరున లేఖిని మాతృదేవోభవ పురస్కారం అందించారు. మరో రచయిత్రి పద్మావతి వీరి సోదరి. వీరి ఇరువురు మనవళ్ళు, ఒక మనవరాలు. అందరూ ఉన్నత పదవుల్లో విదేశాల్లో స్థిరపడ్డారు.
నాగార్జున విశ్వ విద్యాలయం వారు ఉత్తమ నవలలకు ప్రతి ఏటా ఇచ్చే ఉన్నవ లక్ష్మీనారాయణ అవార్డును పొందడమే గాక, ఇతర రచయిత్రులు ఎవరూ దృష్టి సారించని జాతీయ, రాజకీయ సమస్య అయిన అస్సాం ఉద్యమాన్ని “రేల్లుపోదలు” నవలలో పొదిగి విశిష్టతను ఆపాదించుకున్నారు. వీరి నవలల పరిశీలనమే డాక్టర్ ఏమినేని బాలకృష్ణగారి సిద్ధాంత గ్రంధంలోని ప్రధానాంశం. రాజ్యలక్ష్మి గారి నవలలో కుటుంబ సమస్యలే కాదు, రాజకీయ, సాంఘిక, మానసిక సమస్యలు కూడా చర్చించారు. రావి శాస్త్రి జీవితం రచనలు. కనుపర్తి వరలక్ష్మమ్మ జీవిత చరిత్ర రాసారు.
సత్యనారాయణగారితో పాటుగా అన్ని సాహితీ చర్చల్లో వీరు పాల్గొని తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడం విశేషం. ఫెమినిస్ట్ అనే ముద్ర లేకున్నా స్త్రీ అభ్యుదయం కాంక్షిస్తూ రచనలు చేయడమే కాక, స్త్రీ విద్యపట్ల అనేక ప్రసంగాలు చేసారు. “నీ కొత్తపుస్తకం వచ్చినపుడు నాకు ఇస్తే, చదువుతాను. అంతే కాదు, అనేక సాహితీ పురస్కారాల కమిటిలో నేనున్నాను. నీ పుస్తకాలు బాగుంటే సిఫారసు చేస్తాను” అనేవారు.
అతిధులను ఆదరించడంలో సాక్షాత్తూ అన్నపూర్ణ. గుమ్మంలో అడుగుపెట్టిన వారికి భోజనం పెట్టకుండా గడప దాటనిచ్చేవారు కాదు. ఆత్మీయత పంచడంలో అందరికీ అమ్మే. మంచి మనసు, విశాలమైన భావాలు ఆమె వ్యక్తిత్వాన్ని రాణింప చేస్తాయి. భర్త పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ లోని మలక్ పేటకు వచ్చి, అక్కడ ఒక ఫ్లాట్ లో చివరివరకు ఉన్నారు. వయసు మీద పడినా, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆమె ఒక్కరే ఒక పనిమనిషి, వంటమనిషిని పెట్టుకుని ఉండేవారు. “నా ఇంట్లో నా మిత్రులతో సాహితీ చర్చలతో గడపడం నాకిష్టం” అనేవారు. సహధర్మచారిణి అనే మాటకి నిలువెత్తు నిదర్శనం పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు.
వారి కుటుంబ సభ్యులకు ఆ దైవం ఈ విషాదం తట్టుకునే శక్తి ప్రసాదించాలని కోరుకుంటూ, ఆ మాతృమూర్తికి అశ్రుతర్పణాలు.
*****

1974 లో చిన్న చిన్న స్కెచెస్ ద్వారా ప్రారంభించిన నా రచనా వ్యాసంగం మధ్య, మధ్య అనేక కారణాలతో ఆగిపోతూ ఈ రోజు వరకు సాగుతున్నది. చందమామ అనే స్కెచ్ ద్వారా మొలకెత్తిన నా సాహిత్య వృక్షం కధలు, రేడియో నాటకాలు, రంగస్థల నాటకాలు టివి సీరియల్స్, టెలి ఫిలిమ్స్ నవలలు, కాలమ్స్ , కవితలు అనే వివిధ ప్రక్రియలు తో విస్తరించి అనేక బహుమతులు, పురస్కారాలతో ఫలమంతమైంది. సుమారు మూడు వందల కధలు, వంద పైగా నాటకాలు, 23 నవలలు, అనేక కాలమ్స్, నాలుగు టివి సీరియల్స్, ఐదు టెలి ఫిలిమ్స్ నా ఖాతాలో చేరాయి. అనేక కధలు, నవలలు కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించబడ్డాయి. జీవితాన్ని పరిశీలించి అనుభవించి రాయాలన్నది నా ఆశయం.. ఊహలకు దూరం ….
