
కేన్సర్
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-నీరజ వింజామరం
కుముదకు కేన్సర్!!
ఆ వార్త తెలియగానే నోట మాట రాలేదు . అలాగే మంచం మీద ఒరిగి పోయాను. మూసిన కనురెప్పల నుండి కన్నీరు వెచ్చగా జారిపోతోంది . కుముదను తొలిసారి కలిసిన నాటి నుండి జరిగినవి కళ్ళ ముందు కదలాడాయి.
కుముద మా ఆయన చెల్లెలు. నాకు ఆడపడుచు.
పెళ్లి చూపులకు తనను తీసుకెళ్ళ లేదని, నేనంటే ఇష్టం లేక కుముద అలిగిందని చెప్పారు. ఆమ్మో!ఇలా అలిగే ఆడపడుచుంటే కష్టమే అని అందరూ అనుకుంటుంటే విని కొద్దిగా గాభరా పడ్డాను. గౌరి పూజలో ఉన్నా నా మనసంతా కుముద చుట్టే తిరుగుతోంది. కొంచం సేపయ్యాక కుముద నన్ను చూడడానికి వచ్చింది. దాదాపు నా వయసే ఉంటుంది. అందరూ అన్నట్టు తనలో అలక కనబడలేదు నాకు. మామూలుగానే మాట్లాడింది. ఎక్కువ సరదాగా కూడా ఏం లేదు. ఆమె చూపుల్లో నా మీద అయిష్టత కన్నా జాలే ఎక్కువ కనిపించింది ఎదిగిన చెల్లెలు ఇంట్లో ఉండగా అన్నకు పెళ్లి ఏమిటని కొందరు గుసగుస లాడారు. తన చదువు పూర్తయ్యి తన కాళ్ళ మీద తాను నిలబడేదాకా పెళ్లి చేసుకోనని మొండికేసిందట కుముద.
మొత్తానికి వదిన స్థానంలోకి నేను వెళ్ళాను. పెళ్లి అయిన రెండో రోజు టీ పెట్టాను. అత్త గారికి డయాబెటిస్ అన్న సంగతి గుర్తే లేదు. మొదటి సారి టీ పెడుతున్నానన్న టెన్షన్ లో టీ లో షుగర్ వేశాను.
“ఏమ్మా అప్పుడే చంపేస్తావా ఏంటి ?”అన్నారు మామగారు. బెదిరిపోయాను. నా భర్త రాగానే నేను చేసిన పనిని భూతద్దంలో చూపెట్టారు. వినడానికి సరదా గానే చెబుతున్నట్లు అనిపించినా దాని వెనక ఏదో కుట్ర వుందా అనిపించింది. ఈయన “ఇంత చదువు చదువుకున్నావు .ఎందుకు? వేస్ట్.” అని కసురుకున్నారు.ఈ మాత్రం బుద్ధి లేదా అని ఈసడిస్తుంటే , అత్త మామలు అతి కష్టం మీద నవ్వాపుకున్నారు. కళ్ళలో తిరిగిన నీటిని కిందికి జారకుండా ఆపలేక పోయాను. “ఇప్పుడెందుకు ఏడుపు? ఎవరేమన్నారని?
ఇంకో సారి ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను అంటే అయిపోయే మాట. దానికి నట్టింట్లో ఏడుస్తావా?
ఏడిస్తే అన్ని ఏడ్చినట్లే అవుతాయి. నీ సంసారమే మట్టిలో కలుస్తుంది” నా భర్త అక్క మాటలు సముదాయింపా, శాపనార్థమా అర్థం కాలేదు.
ఒక టీ స్పూన్ చక్కెర వేసి టీని తీయగా చేసినందుకు ఫలితం నామనసు చేదెక్కడం . ఈ గోల కి కుముద బయటికి వచ్చింది. కనుబొమ్మలు ముడి వేస్తూ నా కోసం చూసింది. ఇక
తనేమంటుందో అని బిక్కు బిక్కున నిలబడ్డాను . ఆమె చూపులనుండి తప్పించుకుని వంటింట్లోకి వెళ్ళాను. నా వెనకే వచ్చింది. వదినా అని ప్రేమగా పిలిచింది.
“ఇవన్నీ పట్టించుకోకు. లైట్ తీస్కో” అంది. ఎంతో ఓదార్పుగా అనిపించింది.
ఆ తరువాత ప్రతీ రోజు నాకు తోడుగా ఉంది . ఇంట్లో వాళ్ళను, వారి మాటలను అనుకరించి నన్ను నవ్వించేది . నా బాధను తగ్గించడానికి తపన పడుతుండేది. ఒక రోజు నేను కుముదను “ఇంత ప్రేమగా ఉంటున్నావు కదా? మరి ఎందుకు నా పై అలిగావు? అని అడిగాను.
కుముద ఆ మాటలు వినగానే మెల్లిగా నవ్వుతూ, దుఃఖంతో కలిసిన గొంతు తో చెప్పింది,
“వదినా, అది అలక కాదు… జాలి.ఈ ఇంట్లో వారిని చూసావు కదా? మూర్ఖులు! స్వార్థ పరులు! మా అన్నకు స్త్రీలంటే గౌరవం లేదు. బాధ్యత లేదు. మర్యాద అనే మాటే లేదు.
అతడిని పెళ్లి చేసుకునే అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో అనే భయం తప్ప, నీ మీద నాకు ఏ అలక లేదు.”
కుముద చదువు పూర్తి కాగానే ఉద్యోగం సంపాదించుకుంది .కుముద తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానన్నప్పుడు ఇంట్లో ప్రళయమే వచ్చింది.మామగారు పరువే ముఖ్యమన్నారు .అత్తగారు చచ్చిపోతానని బెదిరించింది.మా పెద్ద ఆడపడుచు ఏడ్చి నానా తిట్లు తిట్టింది; మా ఆయన కుముదను కొట్టి గదిలో పెట్టి తాళం వేశాడు. నాకు తనంటే ఏర్పడిన అభిమానం తో కాస్త ఆకలి తీర్చే ప్రయత్నం చేశాను. అది నా ఆయన చెవిన పడటమే ఆలస్యం –చెవులు తూట్లు పడేలా బూతుల వర్షం కురిసింది. నా వేదన చెప్పకుం డానే అర్థం చేసుకుని నన్ను ఓదార్చిన నా నెచ్చెలి, ఆకలితో, దాహంతో అలమటిస్తుంటే ఏమి చేయలేని నా నిస్సహాయతను తలచుకుని కుమిలి పోయాను.
ఎలా ఈ నరకం నుంచి తప్పించుకుందో ఎవరికీ తెలియదు కానీ, కుముద వెళ్ళిపోయింది – తన మనసు కోరినవాడి దగ్గరకు.
కుముద వెళ్ళిపోయిందన్న మాట మామూలు తుపాను కాదు ఒక లోతైన భూకంపాన్ని సృష్టించింది..
అవమానం… కోపం… కలవరం … కానీ ఎవరి నోటా ఒక్క మాట కూడా రాలేదు. అలాంటి సమయం లో సునాయాసంగా దొరికాను నేను. ఆ కోపమంతా నా మీదకి మళ్లించారు.
ఒక ముద్ద తిండి పెట్టిన పాపానికి, కుముద ను నేనే పంపించేశానని నాపై నింద మోపారు . నా పుట్టింటిని వినరాని తిట్లు తిట్టారు. అవకాశం దొరికితే నేనూ లేచిపోయే రకమేనని , నేను పెరిగిన పెంపకం అలాంటిదని కారుకూతలు కూశారు. ఒళ్ళంతా వాతలు తేలేలా కొట్టాడు నా భర్త. జ్వరంతో లేవలేని స్తితి లోఉన్న నన్ను నా తమ్ముడు కొన్ని రోజులు తీసుకెళ్ళాడు. నన్ను చూసి వాడి బాధ వర్ణించలేను. వదిలేసి వచ్చేయమన్నాడు. అప్పుడు వాళ్ళన్నదే నిజం చేసినదాన్నవుతానని భయపడ్డాను.
కుముద కి విషయం తెలిసి పరుగెత్తుకు వచ్చింది . “ఎందుకు వదిన ఇంకా ఆ నరకం లో పడి ఉంటావు? మా అన్న రాక్షసుడు. నీ జీవితం నాశనమవుతుంది.” అని కన్నీళ్ళు పెట్టుకుంది. ఎలాగు వచ్చావు.మీ తమ్ముడు ఉన్నాడు,నేనున్నాను ,తిరిగి వెళ్లకు అని ఎన్నో విధాలుగా చెప్పింది.
ఎందుకో తెలియదు ధైర్యం కూడగట్టు కోలేక పోయాను. పిల్లలను కుటుంబానికి దూరం చేయొద్దన్న తలంపా? ; నా వల్ల ఇంకొకరు బాధ పడొద్దు అన్న ఆలోచనా? నా పిరికితనమా? మూర్ఖత్వమా? తెలీదు. శరీరం కాస్త కోలుకున్న వెంటనే… మళ్ళీ ఆ రొంపిలోకి వెళ్ళి పోయాను.
ఆ ఇల్లు , ఆ గోడలు, ఆ రాక్షసత్వంతో నిండిన నరకం లోకి …మళ్ళీ నాకై నేనే నడుస్తూ వెళ్ళి పోయాను. ఎవరూ బలవంత పెట్టలేదు – కానీ నా లోపలినుండే ఎవరో నన్ను తోసినట్టుగా వెళ్ళాను. కుముద చెప్పిన “వెనక్కి వెళ్లకు వదిన” అన్న మాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ ఇంట్లో ఆ రోజు నుండి, నేను ప్రతి రోజూ అగ్గిలోనే బతికాను.
అది శరీరాన్ని కాల్చే అగ్ని మాత్రమే కాదు, మనసును కూడా ఆవిరి చేసింది. కుముద పేరు ఇంట్లో వినబడడానికే వీలు లేదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండకూడదని
శాపనార్థాలు . కుముద వల్లే తన అత్తగారింట్లో తనకు గౌరవం తగ్గి పోయిందని వారానికి మూడుసార్లు పుట్టింటికొస్తుంది మా పెద్ద ఆడపడుచు. వచ్చిన ప్రతిసారి అందరినీ ఆడిపోసుకోవడం. నన్ను పరోక్షంగా తిట్టడం. ఆమె వెనకాలే వస్తాడు వాళ్ళాయన. ఆయనకు మర్యాదలు సరిగ్గా జరగలేదని అలిగి వెళ్ళిపోవడం.మళ్ళీ రెండో రోజే రావడం. ఇదే తంతు.
తమ చెల్లెలికి చెడు జరగాలని కోరుకుంటారా ఎవరైనా ? నిజంగా ఇంత మూర్ఖత్వం ఉంటుందా? ఒక్క ఇంట్లో పుట్టిన మనుషుల మధ్య ఇంత ద్వేషం ఉంటుందా?
“కూతురు నాశనం కావాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటారా?”
నిజంగా ఉంటారా అలాంటి వారు? లేక అహంకారం వాళ్ళ కళ్ళనును మూసేసిందా?
కూతురి పై అభిమానం లేదు. కోడలికి అవమానం తప్ప మరింకేం లేదు . అవమానించడానికి తోడు అనుమానించడం మొదలైంది. ఆఫీసు కి వెళ్ళేది ఉద్యోగం చేయడానికి కాదు,
వ్యభిచరించడానికే అన్న చందాన తయారయింది పరిస్థితి. ప్రతీ రోజు,ప్రతీ క్షణం సూటిపోటి మాటలే. ఎందుకివన్నీ సహిస్తున్నానో, ప్రతీ రోజు ఎందుకు చస్తూ బతుకుతున్నానో తెలియడం లేదు. ప్రతీ రోజు గౌరవాన్ని తుడిచిపెట్టేస్తున్న మాటలు, తిట్లు, అనుమానాలు…
ఆ మాటల్లో నా మనసు చిన్న చిన్న ముక్కలుగా బద్దలవుతోంది. కానీ నేను మాత్రం — చెల్లాచెదురైన ఆ ముక్కల్ని మళ్లీ జాగ్రత్తగా ఏరుకుంటున్నాను. ఎందుకీ పిరికితనం, చేతకానితనం?
కొన్ని సార్లు అద్దం ముందు నిలబడి చూస్తాను.
ఆ ముసుగులో నేను ఉన్నానా? లేక ఎప్పుడో మిగిలిపోయిన నీడ మాత్రమేనా?
ఏమిటో ఈ ప్రయాణం… దానికి దిశా లేదు, ఉద్దేశమూ లేదు. కాని నేను మాత్రం నడుస్తూనే ఉన్నాను. ఎందుకు? తెలీదు.
కాలం గడిచే కొద్దీ మనసు మొండి బారి పోయింది. ఒక రోజు బాలు దగ్గర నుండి ఫోన్ కాల్.బాలు కుముద భర్త. ఫోన్ తీసేలోపే గుండె అర్థం చేసుకుంది – ఇది ఏదో పెద్ద దెబ్బ.
“అక్కా … కుముదకి కేన్సర్ డయాగ్నసయ్యింది…” బాలు గళంలో బిగిసిన బాధ.
అతనికీ మాటలు రాలేదు… నాకూ శ్వాస ఆగిపోయినట్టైంది.
కేన్సర్!!
ఆ పదం ఒక్కటే నా మెదడులో పదేపదే మోగింది… బండ రాళ్ల కుప్ప నా పై పడినట్లుంది.
ఏం చేయాలో తెలియలేదు. నిశ్శబ్దం నన్ను చుట్టేసింది. కన్నీరు రావడం లేదు… ఎందుకంటే ఆ వార్త నిజమని నేను ఇంకా ఒప్పుకోలేదు. ఆమె చిరునవ్వు గుర్తొచ్చింది.
“వదినా, చాలు… ఇక వెనక్కి వెళ్లకు!” అని వేదనతో చెప్పిన ఆమె స్వరం… ఆ గోరింటాకు వేళ్లు… ఆ చల్లని చూపు…ఇవన్నీ ఒక్కసారిగా నా ఎదురుగా నిలబడ్డాయి. ఆమె వైపు పరుగెత్తాలనిపించింది.
“కుముదా!” అని గట్టిగా అరవాలనిపించింది.
నా కాళ్లు నేల మీద ఉండలేక… చేతులు ఖాళీగా ఉండలేక… గుండె దడదడలాడింది.
“ఎప్పుడెప్పుడు కుముదను చూద్దామా?”
“ఆమెను కౌగిలించుకుని, నీకేం కాదు కుముదా… నీతో నేను ఉన్నాను అని చెబుదామా?” అన్న తపనతో నేను నాలా ఉండలేకపోయాను.
చాలా కాలంగా రాయి లా మారిపోయిన నా మనసు…ఈ ఒక్క వార్తతో తిరిగి కదిలింది. ఆమె బాధను ఊహించుకోగానే…నా లోపల ఎక్కడో ఓ తల్లి రోదించింది, ఓ అక్క విలపించింది, ఓ వదిన తల్లడిల్లింది. “కుముదా…” అనుకున్నపుడు కంటిపాప కదిలింది. ఇంట్లో వాళ్ళకు చెప్పాను.
“కుముదకు క్యాన్సర్… బాలు ఫోన్ చేశాడు…” అని చెప్పినప్పుడు, నాకు ఓ చిన్న ఆశ.
“ఇప్పటికైనా వీళ్ల హృదయాల్లో కదలిక వస్తుందేమో… “అని.కానీ…వారివి మనసులు కావు — బండలు.
“ఆమె చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తోందంతే.”
“అయినా వాడు నీకెందుకు ఫోన్ చేశాడు?” మాటలు కావు – మంటలు .
ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నారు. టిఫిన్లు, కాఫీలు లాంటి రోజు వారీ మాటలను అతి మామూలుగా మాట్లాడుతున్నారు. ఎవరికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తున్నారు.
ఇక్కడ ఏ ఉద్వేగానికీ చోటు లేదు…
ఛీ… వీళ్లసలు మనుషులేనా?
మనుషులైతే… ఎవరైనా ఆ మాట వినగానే ఒక్క క్షణం శ్వాస ఆగిపోవాలి కదా?
“కుముదకు క్యాన్సర్” అన్నా కూడా … వారి మనసులో ఒక్క చిల్లు పడలేదంటే…
వాళ్ల హృదయాలకు బదులు బండలు ఉన్నట్టు అనిపించింది. కాస్త అనురాగం, కాస్త కనికరం, కాస్త కరుగుదల? ఏమాత్రం లేదు. వీరి మీద ఉన్న అసహ్యం పదింతలయింది.
మొదటిసారి…ఇంట్లో చెప్పకుండా, కనీసం “వెళ్తున్నాను” అన్న మాట కూడా లేకుండా, ఆఫీసుకి లీవ్ పెట్టి హాస్పిటల్ కి బయలుదేరాను. హాస్పిటల్ గేటు దగ్గర నిల్చున్నప్పుడు చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి…
కుముదను చూసిన క్షణం… కన్నీళ్లు ఆగలేకపోయాయి.
“ఎలా ఉన్నావు వదిన?” — కుముద తన చేతిని నా చేతిపై పెట్టి బలహీనంగా అడిగింది.
నిజానికి అది నేనడగాల్సిన ప్రశ్న.
అబద్ధం ఆడలేక ,నిజం చెప్పలేక తల దించుకున్నాను.
“నా వల్లేగా నీకు ఈ నరకం” అని కుముద అంటుంటే నా చేత్తో తన నోరు మూసేశాను. .
ఆ మౌనంలో ఎలాంటి మాటలు అవసరం లేదు, నా చేతి బలాన్ని ఆమె గుండె లోతుల్లో వదిలిపెట్టాలని అనిపించింది. అంతలోకి బాలు వచ్చేసరికి కుముదకి నేనేమీ చెప్పలేక పోయాను. డాక్టర్ ఏమన్నారో తెలుసుకోవాలనే ఆత్రం పెరిగి పోయింది.
“డాక్టర్ ఏమన్నాడు బాలు?”నా గుండె ఒత్తిడిని పక్కన పెట్టి ప్రశ్నించాను.
“ఇంకా కొన్ని పరీక్షలు చేయాలి అంటున్నారు అక్కా…” బాలు జీవం లేని గొంతుతో చెప్పిన మాటల్లో భయముంది.
“అదేం పెద్ద విషయం కాదులే బాలు!” అని లేచే శక్తి లేకపోయినా, కూర్చోవడానికి ప్రయత్నించింది కుముద.
ఆమె చిరునవ్వు, నీరసమైన ముఖంలో మెరిసిన కాంతి… ఆమె నిజంగా బాధలో ఉన్నా, బాలు కోసం ధైర్యం నటిస్తోందని చెప్పకనే చెబుతున్నాయి.
బాలు నవ్వే ప్రయత్నం చేశాడు. ఆ నవ్వు మొదట అబద్ధంగా అనిపించింది…కానీ కుముద చూపులో ఆ నిజమైన ప్రేమను చూసిన వెంటనే ఆ నవ్వు నిజమైంది.
“ఏం కాదు… ఇది చిన్నదే…” అనే నమ్మకం వాళ్ల చూపుల్లో కనిపించింది —ఒకే సూత్రం కట్టినట్టు, ఒకే మనసులో పుట్టినట్టు. ఎంత అరుదుగా ఉంటాయి ఇలాంటి జంటలు. కుముదకు ఏమి కాకూడదు దేవుడా! వారి ప్రేమను బతకనివ్వు ప్లీజ్! నాకు తెలియకుండానే నేను మర్చిపోయిన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
ఆఫీసు టైమ్ అయిపోగానే ఇంటికి బయలుదేరి పోయాను. ఇంటికి వెళ్ళగానే వెటకారాలు వ్యంగ్యాలు అసందర్భ బూతు పురాణం షరా మామూలే. ఇంట్లో ఎవ్వరిలోనూ అనుమానం లేదు.ఎవరూ అడగలేదు, “ఎక్కడికి వెళ్ళావ్?” అని. పెద్ద ఆడపడుచు అప్పటికే భోజనానికి వచ్చింది.
కుముద గురించి మనసు బరువుగా ఉంది…
రోజువారీ విమర్శలు, తిట్లు, వెటకారపు మాటలు —నన్ను ప్రతి రోజూ కొద్దిగా కొద్దిగా కరుస్తూనే ఉంటాయి. కాని ఈరోజు మాత్రం, అవి అంతగా బాధించలేదు. ఆ రోజు తరువాత నేను తరచుగా ఇంట్లో చెప్పకుండా లీవ్ పెట్టి కుముదను కలిసే దాన్ని. తొలుత హాస్పిటల్ లో. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళ ఇంట్లో. పరీక్షలు జరిగాయి. కొన్ని రోజులు ఊపిరాడనంత ఉత్కంఠ. అది నేను బయటకు చూపలేక, కుముద ముందూ, బాలు ముందూ ధైర్యం నటించాల్సి వచ్చేది.
కానీ… మనసు లోపల, గుండెల్లో వణుకు మాత్రం ఆగేది కాదు. ఫలితాలు వచ్చాయి. డాక్టర్ మాటల్లో ఆశాభావం తొలిసారిగా కనిపించింది: “సర్జరీ చేస్తే… బయట పడవచ్చు. పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది.” బాలు , కుముద కళ్లలో మెరుపు — నిశ్చింత ,ధైర్యం. నా ఆనందానికి అవధి లేదు . మరికొన్ని రోజుల్లో ఆమెకు సర్జరీ.ఆమెకన్నా ఎక్కువగా బాలు ఆతృతగా, ధైర్యంగా, ప్రేమగా ఉన్నాడు.
ఆఫీసు కి లాంగ్ లీవ్ పెట్టాను. ప్రతీ రోజు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీసు కి బయలుదేరినట్టే వచ్చేదాన్ని.రోజంతా కుముద తో గడిపి తిరిగి సాయంత్రం 6కు ముందే ఇంటికి చేరిపోతున్నా.ఇంట్లో వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకుండా.
“సర్జరీ విజయవంతంగా జరిగింది.”డాక్టర్ మాట విన్న క్షణం…నా గుండెల్లో ఏదో హాయి అనిపించింది. కుముద కోలుకుంటోంది.. నేను మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్లడం మొదలుపెట్టాను. కుముద సర్దుకున్నప్పటికీ, నా జీవితంలో పెద్ద తుఫాను నా భర్త రూపంలో వచ్చి నన్ను బలంగా తాకింది.
నా లాంగ్ లీవ్ కారణంగా ఆ నెల జీతం తక్కువగా వచ్చింది. ఎందుకని అడిగితే నేను ఏవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. కానీ అతను నమ్మలేదు. ఆగకుండా నా ఆఫీసుకి వచ్చాడు.ఎంక్వయిరీ చేశాడు. లాంగ్ లీవ్ సంగతి తెలిసింది.అగ్గిమీద గుగ్గిలం లా “ఇంటికి రా ! నీ సంగతి తేలుస్తా” అంటూ కోపంగా వెళ్ళిపోయాడు.
ఇంట్లో అడుగు పెట్టగానే ప్రశ్నల వర్షం కురిసింది.అందరూ ప్రశ్నించేవారే. కానీ ఆ ప్రశ్నల వెనుక, నిజమైన జవాబులు కావాలని ఎవరికీ ఆసక్తి లేదు.వాళ్లు నా తప్పుల్ని వెతకేందుకు మాత్రమే అడుగుతున్నారు.
“కుముదను చూడడానికి వెళ్ళాను .”
ఈ ఒక్క మాట తో ఒక్క క్షణం సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది .పిడుగు పడ్డట్లే అయింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు . వారి ముఖాల్లో ఏ భావం కనిపించలేదు. హమ్మయ్య చెప్పేసాను అని ఊపిరి పీల్చే లోపే నా వీపు పై పిడిగుద్దు పడింది. అమ్మా అని నోట్లోంచి కేక రాకముందే బుగ్గ పై వాతలు తేలాయి.
“దానికి కేన్సర్ వచ్చిందని నువ్వు పడుకుంటున్నావా వాడి పక్కలో” నా భర్త నోరు పెంటకుప్ప కంటే హీనమని మరోసారి ఋజువయ్యింది. మర్నాటి ఉదయం ఒళ్ళు నొప్పులతో అతి కష్టంగా లేచాను . కుముదను చూడాలని ఆశగా ఉంది .ఒకే ఒక్క సారి తనను చూసి వీడ్కోలు చెప్పి రావాలని ఉంది .
కుముద కు మొహం పై వాతలు కనబడకుండా స్కార్ఫ్ చుట్టాను . “కొంచం జలుబుగా ఉంది,” అన్న మాట నోటిలోంచి సునాయాసంగా జారిపోయింది. ఇన్నేళ్ళు నిజం మాత్రమే చెప్పిన నేను ఎంత అవలీలగా అబద్ధం అడుతున్నాను !
ఏవో చిన్నచిన్న కబుర్లు…
ఆమె నవ్వింది… నేను నవ్వినట్టు నటించాను.
ఇంతలో నా చెవి లోపలే గంట మోగినట్టైంది — వెళ్ళాలి… అని గుర్తొచ్చింది. నాకు వెళ్లాలని లేదు. రాగానే అడగాల్సిన ప్రశ్న “డాక్టర్ ఏమన్నారు ?” అని .కానీ వెళ్ళేముందు అడుగుతున్నాను .
కుముద నెమ్మదిగా మంచం మీద లేచి కూర్చుంది.
“నార్మల్ అవడానికి కొంచం టైమ్ పడుతుందంట…” ఆమె గొంతులో సందిగ్ధం .
“వదినా…” — ఒక్క క్షణం ఆగింది. “నేను సరైన పనే చేశానా?”
ఆమె చెయ్యి పట్టుకుని నిశ్శబ్దంగా తల ఊపాను. తన చేతి వేళ్లతో నా చేతి వేళ్ళను పెనవేసింది.
“కదా వదినా…” అని నన్నే చూస్తూ నెమ్మదిగా నవ్వింది కుముద.
“జీవితం కూడా శరీరం లాంటిదే వదినా,” బలంగా ఊపిరి తీసుకుంటూ మళ్ళీ నన్ను చూసింది.
“కేన్సర్ వచ్చిన భాగాన్ని తొలగించాలి. లేకపోతే అది మన అస్తిత్వాన్నే తినేస్తుంది.”
“సర్జరీ చేసుకుని జీవితాన్ని కాపాడుకోవాలా… లేక జీవితాన్ని బలి పెట్టాలా అనేది మనం తీసుకునే నిర్ణయం వదినా.” ఆమె చూపు లోనూ, గొంతులోనూ ప్రశాంతత .
“మరి నీ నిర్ణయమేంటి వదినా ?ఆ కేన్సర్ తాలూకు మచ్చలను ఇంకెంతకాలం దాచిపెడతావు? నీ జీవితం లోని కేన్సర్ కు చికిత్స చేయవా?” అని సూటిగా అడిగింది కుముద.
ఆ ప్రశ్నలో ఒత్తిడి లేదు, అర్జీ లేదు… కానీ అది నా హృదయాన్ని బలంగా తాకింది. నన్ను ప్రశ్నించిందే కానీ సమాధానం కోసం చూడలేదు.
ఆమెకి తెలుసు — సమాధానం బయట కాదు, నా లోపలే ఉంది.
ఆమె నన్ను ప్రశ్నించింది —నా జవాబు వినడానికి కాదు నన్ను నేను ఎదుర్కొనడానికి. నాతో యుద్ధానికి నన్నే సిద్ధం చేయడానికి .
“వదినా… నువ్వు ప్రతి క్షణం కేన్సర్ తో చస్తున్నావు. ఒక్కసారి బ్రతికే ప్రయత్నం చెయ్యవా ? నిజంగా బ్రతికే…” మాట పూర్తి కాలేదు.
ఆమెలో బాధ ఉంది — ప్రేమతో కూడిన బాధ.
నాలో బాధ ఉంది — తప్పిపోయిన జీవితం మీద దిగులుతో కూడిన బాధ.
చాలాసేపు మౌనం రాజ్యమేలింది ఆ గదిలో . కుముద కళ్ళు మూసుకుంది. నాకు ఆలోచించుకునే అవకాశం ఇచ్చింది . జీవితమంతా కళ్ళ ముందు కదలాడింది . ఏముందక్కడ?
“కుముదా…” అన్న నా పిలుపుకి ఆమె కళ్ళు నెమ్మదిగా తెరిచింది. ఆ కళ్ళలో నిద్ర లేదు… నీరసం లేదు… ఉన్నది కేవలం అపారమైన ప్రేమ, అపారమైన ఆశ.
నేను మరో మాట లేకుండా నా మొహాన్ని ముందుకు వంచాను. ఇక దాచుకోవడం లేదు..నా మొహం మీద చుట్టుకున్న స్కార్ఫ్ ని తొలగించాను. ఆమె కన్నా ముందు, నా ముఖం నాకే కొత్తగా అనిపించింది. నిజంగా తొలిసారి నాకు నేను అద్దంలో కనిపించినట్లుంది.
“ఇక పై నేనేమీ దాచను…” అంటూ కమిలిపోయిన వాతలను నిమురుతూ , నాలో మిగిలిన చిట్టచివరి భయాన్ని కూడా తుడిచేసాను. ఆమె చేతిని నా చేతిలో గట్టిగా పట్టుకొని చెప్పాను.
“ఈ రోజే…నా జీవితానికి సర్జరీ.”
ఆ మాటలతోనే, నేను ఏ బంధాలను , ఏ బాధలను తెంపుకోవాలో నిర్ణయం తీసుకున్నాను. ఆ గదిలో ఉన్న వెలుగు కొంచం పెరిగినట్టు అనిపించింది. నిశ్శబ్దం తొలగింది. ఓ శ్వాస, ఓ సాహసం జన్మించింది.
ఇది ముగింపు కాదు.
ఇది మొదలు.
*****

నీరజ వింజామరం సెయింట్ పీటర్స్ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. పాటలు వినడం పుస్తకాలు చదవడం నా హాబీలు . పిల్లలంటే చాలా ఇష్టం . వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటాను .
