పేషంట్ చెప్పే కథలు – 10

చిరుదీపం

-ఆలూరి విజయలక్ష్మి

వర్షపుధారల్లో చీకటి, కాటుకలా కరుగుతూంది. మేఘగర్జనలకు ప్రకృతి ఉలికులికి పడుతూంది. అప్పుడప్పుడు విద్యుల్లతలు తళుక్కుమంటున్నాయి.

గదిలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ బజర్ మోగింది. ఫోన్ తీసి నర్స్ చెప్పింది విని గబగబ కిందకి దిగింది శృతి. రిక్షాలోంచి ఒకామెని చేతులమీద మోసుకొస్తున్నారు. ఆమెతోపాటు వెల్లుల్లి, పసుపు కలగలిసిన వాసన గుప్పున వచ్చింది. దూరం నుంచి చూస్తే అసలు ప్రాణముందా అని అనుమానమొచ్చేలా వేలాడిపోతోంది. అరికాళ్ళు, చేతులనిండా పసుపు. ఆమె అత్తగారు గుండెలు బాదుకుంటూ శోకాలు పెడుతూంది.

శృతి పరీక్ష చేస్తుండగానే అకస్మాత్తుగా కనురెప్పల్ని అల్లల్లాడిస్తూ గుప్పెళ్ళు బిగించసాగింది ఆమె. ఉండుండి చిత్రమైన శబ్దాలు చేస్తూంది. పూర్తి పరీక్ష చేసాక ఆమె జబ్బేమిటో గుర్తించింది శృతి.

మరునాడంతా కూడా ఆమె గుప్పిళ్ళు బిగిస్తూ, కాళ్ళు చేతులూ కొట్టుకుంటూ, ఏడుస్తూ, కొంచెంసేపు ఏ అవయవాన్ని కదిలించకుండా నిశ్చలంగా పడుకుంటూ, చూసే వాళ్లకు మతిపోయేలా చేస్తూ ఉంది. మరీ ఎక్కువగా వున్నప్పుడు ఇంజక్షన్ చేస్తే కొంచెంసేపు నిద్రపోయి, మెలుకువ రాగానే మొదలు.

నాలుగు రోజులకుగానీ కొంచెం కుదుట పడలేదు అంజని. శృతి పని పూర్తి చేసుకుని ఆమె దగ్గరకు వచ్చింది. శృతిని చూసి సంకోచంతో తలదించుకుంది అంజని. కుశల ప్రశ్నలయ్యాక, ఎలా మొదలుపెడితే ఆమె నొచ్చుకోకుండా తన సమస్యని చెపుతుందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది శృతి.

“కొద్దిపాటి బలహీనత తప్ప శరీరంలో జబ్బేమీలేదు మీకు. కేవలం మానసికమైన ఒత్తిడులు, ఆందోళనవల్ల యిలా వచ్చింది” మౌనంగా వింటూంది అంజని.

“మొదట్లోనే మీరు కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నించకపొతే కష్టం. మించి పోయాక ఆ అస్తవ్యస్థ స్థితిలో హాస్పిటల్ చుట్టూ తిరగడం యెంత బాధ! మీరు బాగా లేకపోతే మీ భర్త, పిల్లలు ఎంత కృంగిపోతారు? అసలు మిమ్మల్ని ఇంతగా బాధిస్తున్న సమస్యేమిటి?” కళ్ళ మీద అరచేతిని ఆన్చుకుని ఆలోచిస్తూంది అంజని.

“సమస్య-అవును సమస్యే. తన బతుకే ఒక సమస్య అయిపోయింది. తాను బాగా  లేకపోతే తన భర్త కుంగిపోతాడా? తన ఆరోగ్యం చెడిపోతే అతను బాధపడతాడా?! లేదు లేదు. తాను బాగా లేకపోయినా, చివరకు చచ్చిపోయిన అతనికేం పట్టదు” దుఃఖం ముంచుకొస్తూంది అంజనికి.

నవ వధువుగా తాను అతని జీవితంలో అడుగుమోపిన క్షణం, తమ కాపురంలోని తొలి రోజుల పన్నీటిజల్లులు, మధుర మధురంగా గడిచిన తమ దాంపత్యపు స్మృతులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. ఆ కమ్మటి కాలం కలలా కరిగిపోయింది. అతను, పిల్లలు-ఇదే లోకంగా బతుకుతున్న తాను క్రమేపీ అతను తన నుంచి దూరంగా జరగడం గుర్తించలేదు. తాను గుర్తించే సమయానికి అతను తాను అందుకోలేనంత దూరానికి వెళ్ళి పోయాడు. “ఏమైంది? ఎందుకిలా అయింది? ఇందులో తనలోటెంత? ఎలా దీన్ని చక్కదిద్దుకోవడం?” అని తర్కించుకుని, శారీరకంగానూ, మానసికంగానూ తనలో పెద్ద మార్పేమీ కనబడక, తన పొరపాటేమిటో అర్థంకాక, ముసుగులో గుద్దులాటెందుకని అతన్నే ముఖాముఖీ అడిగింది.

“మిమ్మల్నిలా నిలదీయడానికి నాకు సిగ్గుగా వుంది, అసహ్యంగా వుంది. ఎందుకిలా చేస్తున్నారు మీరు? నేను మీకేం తక్కువ చేశానని మరో ఆడదానికి దగ్గరయ్యారు?”రోషంగా అడిగింది.

అతను చెప్పిన జవాబు విని తన గుండెల్లో జ్వాలలు ఉవ్వెత్హున లేచాయి. తన అందం, ఆకర్షణ, తన చదువు ఏపాటివో ఇప్పుడా అతను ఆలోచించేది? ముగ్గురు పిల్లల తండ్రి తన పిల్లల తల్లిలో చూడవలసినవి చదువు, అందం, ఆకర్షణానా? అవి తనలో లేవని వాటి కోసం బయటకు పరిగెత్తాలని యిప్పుడు జ్ఞానోదయమైందా అతనికి? తమ మధ్య మానసిక బంధం పూర్తిగా తెగిపోయింది అని గ్రహింపు కొచ్చేసరికి దుఃఖసముద్రం కట్టలు తెంచుకుంది. అతను చేసిన అవమానానికి ఆవేశం ఎగసి వచ్చింది. అతని మాటలకు ఉద్రేకం ముంచుకొచ్చింది. తన వొంట్లో నరాలన్నిటినీ ఎవరో బలవంతాన సాగదీస్తున్నారు. తన మెదడులోని కణాలన్నీ చిట్లిపోతున్నాయి. రక్త నాళాలన్నీ తెగి పడిపోతున్నాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. అంతా గుర్తుకొచ్చి అంజనీ ముఖం ఎర్రబడింది.

ఆలోచనలు, ఆలోచనలు. నిగ్రహించుకోలేని ఆలోచనల సమూహం తనకు ఊపిరాడనివ్వడంలేదు. కానీ, ఇందంతా డాక్టర్ గారికి తాను చెప్పలేదు. యింత అవమానకరమైన సమస్యను ఆవిడకు చెప్పాలంటే తనకు చిన్నతనంగా వుంది. “నా సమస్య ఎవరితోనూ చెప్పుకోలేనిది డాక్టర్ గారూ! కానీ, నేను ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాను” కళ్ళలోని తడి శృతి చూడకుండా జాగ్రత్త పడింది అంజనీ.

“దట్స్ గుడ్” సంతోషాన్ని వ్యక్తం చేసింది శృతి.

“నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఈ నాలుగు రోజులు మీకు చాలా శ్రమ కలిగింది. నేను పిచ్చిదాన్నవడం వల్ల నా సమస్య తీరదని నాకు తెలుసు. తెలిసి కూడా నిగ్రహించుకోలేక పోతున్నాను. కానీ… మన ఆడవాళ్ళ స్థితి ఎప్పటికీ యింత దరిద్రంగానే ఉండి పోతుందని నేననుకోవడం లేదు.” సమస్యల సుడిగుండంలో చిక్కు కుని నిస్సహాయంగా అట్టడుగుకు చేరిపోయేవారే కాని, తమంత తాము నిలద్రొక్కుకుని, నిలబడడానికి ప్రయత్నించే స్త్రీలను అరుదుగా చూడడం వల్ల అంజనీ మాటలు సంతోషాన్ని, ఆశనూ, గర్వాన్నీ కలిగించాయి శృతికి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.