కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-1

 -డా. సిహెచ్. సుశీల

           20 వ శతాబ్దపు మొదటి దశకం లోనే తమ తోటి స్త్రీలను చైతన్య పరచడానికి కవయిత్రులు, రచయిత్రులు సాహిత్య సృజన చేసారు. ఐదారు తరగతుల వరకు చదివి, వివాహం చేసుకొని, కుటుంబ బాధ్యతలలో తలమునకలైన ఇల్లాళ్ళుకూడ కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుష వివక్షతను గుర్తించారు –  ఆలోచించారు – రచనలు చేసారు. 
   
           స్త్రీ విద్య ఆవశ్యకత, స్త్రీ స్వేచ్చా స్వాతంత్య్రం ప్రాధాన్యత గురించి వ్యాసాలు, కవితలు, కథలు రాశారు. దేశమంతా స్వాతంత్రోద్యమం ఊపందుకొంటున్న సమయంలో తమ భర్తలతో పాటు తామూ కార్యరంగంలోకి ప్రవేశించారు. కొందరు స్వాతంత్య్ర సమరంలో జైలు పాలైన తమ భర్తలకు ధైర్యాన్నందిస్తూ, కుటుంబాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు.
   
           ఈ క్రమంలో స్త్రీలు దేశానికి స్వాతంత్య్రం సాధించే కంటే ముందు తమ వ్యక్తిగత స్వాతంత్య్రం ముఖ్యమని భావించారు. కుటుంబం, సమాజం, దేశం, పరపాలన నుండి  విముక్తి వంటి విషయాల పై విస్తృతంగా రచనలు చేశారు. కానీ వందలకొద్దీ కవయిత్రులు, రచయిత్రులు చరిత్ర మరుగున పడిపోయారు. వేళ్ళ మీద లెక్కించే సంఖ్యలో మాత్రమే ఈనాడు మనకు తెలుసు.
 
           ముఖ్యంగా కథా రచయిత్రుల గురించి అన్వేషిస్తున్నప్పుడు అనేక మంది ‘పేర్లు’ కనిపించాయి. పేర్లు కనిపించాయి కానీ, చాలా వరకు వారి రచనలు లభ్యం కాలేదు. లభ్యమైనంత వరకూ – ఆనాటి వారి ఆలోచనా పటిమ, వ్యక్తిగత స్వాతంత్య్రం కొరకు వారి ఆరాటం, మూఢవిశ్వాసాల ఊబిలో కూరుకుపోతున్న సమాజం పట్ల ఆవేదన చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగింది.
   
           భారత స్వాతంత్రయానంతరం స్త్రీలు చదువుకోవడం, వారి కొరకు మరిన్ని పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో వారి విద్యా , వికాసం విస్తృతమైనాయి. రచనలు విరివిగా చేయసాగారు.   
     
           తమ తోటి స్త్రీలకు విషయాన్ని ఆకర్షణీయంగా చెప్పాలంటే అన్ని ప్రక్రియల కంటే “కథా రచన” మేలైనదని భావించారు. పత్రికల్లో రాయడమే కాక కొందరు రచయిత్రులు కలిసి కథా సంకలనాలు వెలువరించారు.
     
           భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా “అమృతో త్సవాలు” జరుపుకొంటున్న సమయంలో తెలుగు భాషలో స్త్రీల సృజనాత్మకతను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొందరు నాటి స్త్రీల వ్యాసాలను, కవితలను సేకరించి ప్రచురించారు. 
     
           కథల విషయానికొస్తే, నిజానికి  ప్రతి కుటుంబంలో ‘అమ్మే’ మొదటి కథకురాలు. చదువుకోని తల్లి కూడా మారాం చేస్తున్న తన బిడ్డను ఊరడించడానికి తనకు తెలిసిన  కథలను చెప్తుంది. కొంత కల్పించి కొనసాగిస్తుంది. ( ఈ దృష్ట్యా కథలు స్త్రీల “స్వంతం” అని అంటే పురుషులు కోపగించుకోరనే భావిస్తాను. )
     
           స్త్రీవాదం ఉధృతంగా సాగుతున్న ఈ రోజుల్లో కవయిత్రులు, రచయితలు అన్ని ప్రక్రియల్లో తమ ఆలోచనల్ని, భవిష్యత్ ఆకాంక్షల్ని నిస్సంకోచంగా, నిర్భయంగా వెల్లడిస్తున్నారు.
     
           అయితే 75 ఏళ్ళ క్రితం రచయిత్రులు ఆలోచనలు, ఆకాంక్షలు ఎలా సాగాయి? కథల్లో ఎంత వరకు తమ అభ్యుదయ భావాలను వెలిబుచ్చారు? అన్న ఆశక్తి తో ఆనాటి కథా సంపుటాలను, సంకలనాలను అన్వేషించడం జరిగింది. ఏ కారణంచేతనో ద్వితీయ ముద్రణకు రాని పాత పుస్తకాలు జీర్ణావస్థలో ఉన్నాయి. రచయిత్రులు ఇబ్బడిముబ్బడిగా కథలు రాసినా, చాలా వరకు ( శరత్ ప్రభావమేమో) “పాద ధూళి” “కార్యేషు దాసి” వంటి కథలే ఎక్కువగా ఉన్నాయి. 
   
           *కొన్ని కథలు “స్త్రీ వ్యక్తిత్వం” ఉట్టిపడేలా వెలుగులు చిమ్ముతూ ఆశను, ఆనందాన్ని* *కలిగించాయి* 
     
           “ఫెమినిజం” అన్న పదానికి “స్త్రీవాదం” అనే పేరుతో తెలుగు సాహిత్యంలో ఎనభయ్యో దశకంలో కవితలు, కథలు, నవలలు పెను సంచలనాత్మకంగా వెలువడ్డాయి. ఈ పేరుతో లేకపోయినా తత్పూర్వమే రచయిత్రులు కొందరు స్త్రీల ఆత్మగౌరవానికి భంగం కలిగించే సమస్యలను, స్త్రీలు తమ వ్యక్తిత్వంతో సమస్యలను ఎలా  పరిష్కరించుకున్నారో తెలియజేసే రచనలు చేశారు. 
       
           ముఖ్యంగా భారత స్వాతంత్య్రాయానికి పూర్వమే కథయిత్రులు అద్భుతమైన స్త్రీ పాత్రలను సృష్టించి, స్త్రీల ఆత్మగౌరవాన్ని వెలువరించే విధంగా కథలు రచించడం ఒకింత ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. పైగా నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితుల పట్ల వారికున్న అవగాహన కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. 
     
           అటువంటి ఆణిముత్యాలు వంటి కథలను సమీక్షించుకొందాం.

***

కుటీరలక్ష్మి

-కనుపర్తి వరలక్ష్మమ్మ

           ” నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యం సతీ శ్రేయము – ఈమూడింటిని సమర్ధించుటకే నేను చేత కలము బూనితిని” అని కనుపర్తి వరలక్ష్మమ్మ గారు తన ధ్యేయాలను ప్రకటించారు, ఆచరించారు.
   
           1931 లో స్త్రీల కోసం ” స్త్రీ హితైషిణీ మండలి” ని స్థాపించారు. గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని స్వీకరించిన ( 1934) తొలి మహిళ ఆమె. 1942 ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించారు. శారద లేఖలు (రెండు సంపుటాలు), వసుమతి, అపరాధిని, వరద రాజేశ్వరి (నవలలు), కన్యాశ్రమము, నవకథా విపంచి (కథా సంపుటాలు), బాల నీతి కథావళి, ఓటు పురాణం, మహిళా ప్రబోధం గ్రంథాలను వెలువరించారు. అనేక సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు పొందారు. 1978 ఆగస్టు 13 న కన్నుమూసారు వరలక్ష్మమ్మ గారు.
 
           ప్రథమ తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ గారి కథ ” ధన త్రయోదశి”(1902) వలెనే ఈ కథ కూడా గ్రాంథిక భాష లో ఉంది.          
       
           రామలక్ష్మి వస్త్ర వ్యాపారి యైన వెంకట స్వామి భార్య. వస్త్రాల పై రంగుల నద్ది విక్రయించే చిన్నపాటి వ్యాపారం చేసేవాడు వెంకటస్వామి తండ్రి వీరాస్వామి. తండ్రి మరణానంతరం వెంకటస్వామి వ్యాపారాన్ని వ్యాప్తి చేయదలచి, బొంబాయి నుండి తానే స్వయంగా రంగులను, బట్టలను తెప్పించి చుక్కలతో, తీగలతో డిజైన్లు వేయించి, తెలుగు ప్రాంతాలదే కాక హైదరాబాదు, బొంబాయి, రంగూన్, సింహళంలకు కూడా ఎగుమతి చేయసాగాడు. బంధుమిత్రులు మొదట నిరుత్సాహపరిచినా అతడు తన గ్రామం వెలుపల పెద్ద పెద్ద పాకలు వేయించాడు. బందరు, కాకినాడ, నెల్లూరు, మధుర నుండి రంగులు వేసి అద్దగల నిపుణులను రప్పించి, బొంబాయి నుండి వచ్చిన రంగులతో వస్త్రాల పై అద్దకం చేయించి, విక్రయించి వ్యాపారం వృద్ధిపరిచాడు. పేరు, సిరి, సంపదలు పెరిగాయి. 
     
           పది సంవత్సరాలు గడిచేసరికి వ్యాపారం బాగా అభివృద్ధి చెంది, భార్య రామలక్ష్మి, ఇద్దరు మగ పిల్లలతో సుఖ సంతోషాలతో వర్థిల్లసాగాడు. రామలక్ష్మి కూడా తనకు చేతనైనంతగా దానధర్మాలు చేస్తూ, అవసరం ఉన్న స్త్రీలకు సహాయం చేస్తూ “ధార్మికురాలు” అని పేరు తెచ్చుకుంది.
     
           అంతలో ఐరోపాలో ఆర్ధిక సంక్షోభం నెలకొని, ఆ ప్రభావంతో భారతదేశంలో కూడా ప్రతి వస్తువుకు ధర పెరిగిపోయింది. జర్మనీలో తయారయ్యే రంగులు, వస్త్రాల ధరలు ఆకాశాన్నంటాయి. లాభాలు లేకపోయినా నష్టం రాకుంటే చాలని, వ్యాపారాన్ని ఆపకూడ దని కష్టం మీద లాక్కొస్తున్నాడు వేంకటస్వామి.
 
           పులి మీద పుట్రలాగా, దురదృష్టవశాత్తు అదే సమయంలో హఠాత్తుగా అతని అద్దకపు పాకలకు నిప్పు అంటుకొని, మొత్తం కాలి బూడిద అయ్యాయి. అది విన్నంతనే కుప్పకూలిపోయి కన్నుమూశాడతను.
     
           అప్పులు, చేబదుళ్ళలకు తోడు తమ దగ్గర పనిచేసే గుమస్తాలు ఇతర వ్యాపారస్తులతో కుమ్మక్కవటంతో ఆస్తి అంతా కోల్పోయి ఇద్దరు బిడ్డలతో నిరాశ్రయురాలయింది రామలక్ష్మి.
       
           ఇక్కడ వరలక్ష్మమ్మ గారి అభ్యుదయ భావాలతో రచన సాగటం వల్ల రామలక్ష్మి జీవితమే కాక కథ కూడా ఆణిముత్యంలా నిలబడింది. రామలక్ష్మి విద్యావంతురాలు అని చెప్పటం, చిన్న పూరి గుడిసె వేసుకొని, ఇద్దరు బిడ్డల్ని పోషించుకోవడం కోసం ఇరుగు పొరుగు ఇళ్లల్లో పిండి రుబ్బటం వంటి తన చేతనైన పనులు చేస్తోందని చెప్పటం స్త్రీ తన కాళ్ళ పై తాను నిలబడే  వ్యక్తిత్వానికి నిదర్శనంగా చూపారు రచయిత్రి. 
     
           అదే సమయంలో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరం, సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకున్నది. ఖద్దరు సంఘాలు, నేత పరిశ్రమలు, మద్యపాన నిషేధ ప్రయత్నాలు, జాతీయ పాఠశాలలు, స్వదేశీ సంతలు, సభలు ఏర్పడసాగాయి. ఏ ఇంట్లో చూసినా రాట్నం, కదుళ్ళు, ఏకులు, ప్రత్తి. గ్రామాల్లో జాతీయ ఉద్యమ సంఘాలుస్థాపించబడ్డాయి.
 
           వరలక్ష్మమ్మ గారు కేవలం రచయిత్రి మాత్రమే కాక గాంధీ ప్రబోధించిన ఖద్దరు ప్రాముఖ్యత, స్వాతంత్రోద్యమ పోరాటాలు, వాటిని స్త్రీలు కూడా అనుసరించవలసిన ఆవశ్యకతలను గురించి స్పష్టమైన అవగాహన ఉన్న దేశభక్తి గల మహిళ. 
     
           ఖద్దరు పరిశ్రమల వారు రాట్నం, ప్రత్తి ఇంటికే తెచ్చి ఇచ్చి, వడికిన నూలుకు ‘వీసెకు రూపాయి పావలా’ కూలి ఇస్తామంటున్నారు. ఆసు కూడా పోసి ఇస్తే మరొక పావలా ఇస్తున్నారని తెలిసి, అది గౌరవ ప్రదమైన పని అని ఆలోచించిన రామలక్ష్మి, తను కూడా చేస్తానని చెప్పింది.
 
           ఆ పనిలోనే నిమగ్నమై అతి త్వరలోనే సన్నటి నూలు తీయటంలో నైపుణ్యం సంపాదించుకొంది. “అహ్మదాబాద్ లో దేశీయ మహాసభ సందర్భంగా జరగబోతున్న ఖద్దరు ప్రదర్శనమున మీ నూలు ప్రదర్శించెదము’ అన్నారు వారు. ఆమె ఉత్సాహం, ఆమె నిపుణత చూసి వారు ఎక్కువ డబ్బు ఇవ్వసాగారు కూడా. 
 
           భర్తను, ఆస్తినంతటిని కోల్పోయిన స్త్రీ ఎలాంటి అఘాయిత్యం చేసుకోక, తన ఇద్దరు బిడ్డల జీవిక కోసం ఆత్మాభిమానానికి భంగం కలుగకుండా గౌరవంగా బతకటమే కాక, భారత స్వాతంత్రసమర యజ్ఞంలో తనకు చేతనైన పనిచేసి, ఎంతో కొంత భాగస్వామి కాగలిగింది. స్త్రీ వ్యక్తిత్వానికి ఎక్కడా భంగం కలగదు ఈ కథలో. జీవితంలో అన్నీ కోల్పోయినా తన కాళ్ళ పై తాను నిలబడి, తనని తాను నిరూపించుకున్న స్త్రీ మూర్తి కథ 1924 లోనే రాసిన వరలక్ష్మమ్మ గారు అభినందనీయురాలు.
       
           ప్రధాన సంపాదకులు వల్లూరి శివప్రసాద్, సంపాదకులు పెనుగొండ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో అరసం గుంటూరు జిల్లా శాఖ ప్రచురిస్తున్న “కథా స్రవంతి” పరంపరలో “కనుపర్తి వరలక్ష్మమ్మ కథలు” లో మొత్తం 12 కథలున్నాయి. ఎక్కువ కథల్లో రాఘవరావు, రాజేశ్వరి దంపతులు పాత్రలు. వారి సంభాషణల్లో మహిళా సభలు, స్త్రీ స్వేచ్ఛ, స్త్రీపురుష సమానత్వం, పురుషుడు భార్యను ‘బానిస’గా కాక, ‘మిత్రురాలు’గా చూడాలని ఆకాంక్ష ఎక్కువగా కనిపిస్తుంది.
     
           ” ఒక స్త్రీ ప్రాణము తీసిన నేరము కంటే ఒక స్త్రీ సుఖమును, సంతోషమును, ఉత్సాహ ఉల్లాసములను నాశనం చేసి జీవన్మృతులుగా చేసిన నేరము బలవత్తర మైనది” అని శక్తివంతంగా చెప్పిన రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ తెలుగు నాట మహిళాభ్యుదయానికి కృషి చేసిన తొలి స్త్రీ చైతన్యవాది. ఉదాత్త భావాలు కలిగిన ఉత్తమ రచయిత్రి.
 
(5, ఏప్రిల్ 1924 ఆంధ్రపత్రిక ( సంవత్సరాది సంచిక) లో ప్రచురించబడింది)

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

One thought on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-1 కనుపర్తి వరలక్ష్మమ్మ కథ “కుటీరలక్ష్మి””

  1. ఆధునిక తెలుగు సాహిత్యంలో కథలేకాక శాదలేఖలు అనే కాలమ్ రాయటంలో కూడ ప్రధమంగా చెప్పాల్సిన రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు.ఆమెకథతో కథామృతాలు మొదలుపెట్టాం చాలాబాగుంది.ఈ తరం వారికి తెలియని రచయిత్రులను వెలికి తీస్తున్నందుకు ధన్యవాదాలు& అభినందనలు సుశీల గారూ

Leave a Reply

Your email address will not be published.