
దేవుడమ్మ: మరో పది కథలు- ఝాన్సీ పాపుదేశి కథల పై సమీక్ష
-కె.వరలక్ష్మి
మిలీనియం ప్రారంభంలో కాకతీయ యూనివర్సిటీ సెమినార్ కి వెళ్ళినప్పుడు నేనూ, అబ్బూరి ఛాయాదేవిగారూ ఒకే రూమ్ లో ఉన్నాం. ఎన్నెన్నో కబుర్ల కలబోతల్లో ఆవిడ ఒక మాట అన్నారు ‘మనిషి ఒక్కసారే ప్రేమించాలి అంటారేమిటి? జీవితకాలంలో ప్రేమ ఒక్కసారే పుట్టి ఆగిపోతుందా ‘అని. ఆ మాట ఎంతగా మనసుకు పట్టినా ‘మూవ్ ఆన్ ‘లాంటి కథ రాసే ధైర్యం లేకపోయింది. ఝాన్సీ ఈ కథను ఎంత బాగా రాసిందంటే మన మందరం ఆ కథానాయికకు వెన్నుదన్ను గా నిలబడతాం.
సహజంగా నేను ఇష్టపడేవి పల్లెజీవితాల కథలు-
అందుకేనేమో దేవుడమ్మ, నీరుగట్టోడు, మాతమ్మప్రశ్న, అనుమానం, సావు, తోలు నాకెంతగానో నచ్చాయి. ఒక్కో కథా చదివిన తర్వాత మనసులోకెక్కిన దుఃఖాన్ని వదిలించుకోడానికి పుస్తకాన్ని మూసి మరో పనిలో నిమగ్నం కావాల్సిందే. అందునా తోలు కథ పైకి దళిత జీవితాల కథే కాని సరసను తల్చుకుని పరదేశి కన్నా ఎక్కువ దుఃఖ పడతాం.
ఏకపర్ణిక వెంట పంపాతీరంలోనూ, యాంగ్ వెంట భూటాన్ పర్వతాల్లోను, పేరడాక్స్ లో సముద్ర తీరాల్లోను తిరుగుతూ ఆ ప్రేమ ప్రవాహాల్లో కొట్టుకుపోతాం. ద్వైతంలో ట్రాన్స్ జెండర్ గురించి కావచ్చు -తీసుకున్న వస్తువు ఏదైనా కథ చెప్పే విధానంలో కొత్తదనం వల్ల ఈ కథలు ఆకట్టుకుంటాయి.
ఝాన్సీ ముందుమాటలో చెప్పినట్టు ‘ఎవరి జీవితాన్ని వారు స్వేచ్ఛగా జీవించాలన్న కోరిక ‘ఎంత మంచి కోరిక! ఎందరో స్త్రీల జీవితాలు అందుకు వ్యతిరేకం గానే సాగుతున్నాయి కదా!
ఇన్ని భిన్నమైన కథల్ని నింపుకొన్న ఈ పుస్తకాన్ని అందరూ చదివి తీరాలి.
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 200 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. అజో విభో విశిష్ట సాహితీ మూర్తి, ఆంధ్రప్రదేశ్ 2025 ఉగాది గౌరవ పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
