ఎక్కడ వెతికేది?

-శీలా పల్లవి

అన్ని చోట్లా ఆశగా వెతికాను
దొరక లేదు
పోనీ ఎక్కడా దొరకక పోయినా
కొద్దిగా కొనుక్కుందాం అని అనుకుంటే
కనీసం అమెజాన్ లోనో , ఫ్లిప్ కార్ట్ లోనో
దొరుకుతుందని అనుకోడానికి
అదేమైనా వస్తువా?
తప్పకుండా దొరుకుతుందనే
విపరీతమైన నా నమ్మకాన్ని
జాలిగా చూస్తూ
ఎక్కడా నీకు నేను దొరకను అంటూ వెక్కిరించింది

అంతటా ఎండిపోయింది అని అనుకుంటే
బీటలు పడిన అంతరాంతరాలలో
ఏ మూల నుంచో
కొద్ది కొద్దిగా ఉబికి వస్తున్న అలికిడి వినిపిస్తుంది
కానీ జాడ మాత్రం కనిపించలేదు
నాకు ఎదురుపడిన ప్రతీ పలకరింపులో
వెతికాను కానీ దొరకలేదు
అడుగడుగునా తన ఉనికిని చాటి చెప్పేది
ఇప్పుడు ఆనవాలు లేకుండా మాయమైపోయింది
ఎక్కడికి పోయిందో అని ఆలోచిస్తూనే ఉన్నాను
ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను

నీ దేశం ఇక పై నాదే
అనే రాజ్యాధినేతలే కానక్కర లేదు
నే వేసిన ముగ్గు నువ్వు చేరిపేసావనో,
నాకు నచ్చిన నువ్వు ఇంకెవరికీ వద్దనో,
గత జీవితపు ఆనవాళ్ళు వర్తమానానికి అడ్డు అనో,
ఇంకా ఇంకా ఏదో ఏదో కావాలనో
మృగాలుగా మారిపోయి
పచ్చటి జీవితాలను చిదిమేస్తుంటే
భయంతో కనిపించకుండా పారిపోయిందేమో
మీకు ఎక్కడైనా మానవత్వం దాక్కొని కనిపిస్తే
బుజ్జగించి, నచ్చచెప్పి,

నా దగ్గరకి పంపిస్తారా…

*****

Please follow and like us:

4 thoughts on “ఎక్కడ వెతికేది? (కవిత)”

  1. ఆశతో మానవత్వం కోసం ఎదురు చూద్దాం పద్మావతి గారు. మీ స్పందనకు ధన్యవాదాలు.

  2. మానవత్వం అనేది ఒక వస్తువుగా అయిపోయిందేమొ . అందుకే అది ఎక్కడ తయారు చేయబడటంలేదు. ఎవరి దగ్గర పేటెంట్ రైట్ కూడా లేదు. ఎందుకంటే మానవత్వం మనిషినుంచే కదా పుట్టాలి. మనుషులు మృగాలుగా మారిపోయి ఒక శతాబ్దమే గడిచిపోయింది మరి.
    మంచి మనుషుల లతో వచ్చే మానవత్వ పుట్టుక కోసం ఎదురు చూద్దాం. ధన్యవాదములు శీలా పల్లవి గారు !

  3. చాలా గొప్పగా రాశారు – దొరకని మానవత్వం గురించి.. మనం ఆశా జీవులము …. వెదుకుతూనే వుందాము. ఎప్పుడో, ఎక్కడో దాగి వున్న మానవత్వమా మా ఆహ్వానం గైకొనుమా!
    శీలా పల్లవి గారికి అభివందనాలు.

    1. ఆశతో మానవత్వానికి ఆహ్వానం పలుకుదాం సురేఖ గారు. మీ స్పందనకి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.