
‘నిర్జన వారధి’ . కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఉద్యమ అనుభవాలు
(8 మార్చి ,2022 మహిళా దినోత్సవం సందర్భంగా)
-పి. యస్. ప్రకాశరావు
“రహస్యస్థావరాలలో పనిచేయడానికి స్త్రీ ఉద్యమకారులతో బాటు నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఏలూరులో ఒక డెన్ లో తలదాచుకున్నాం. అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చలసాని జగన్నాధరావుగారు “తప్పించుకునే పరిస్థితి వస్తే నేను యాచించే బ్రాహ్మణుడిలాగా, నువ్వు భర్త నుంచి వేరైన నా కుమార్తెగా చెప్పుకుని భిక్షాటన చేస్తున్నట్టుగా తప్పుకుందాం. పొట్లాలకు కట్టిన దారాలు పారెయ్యకు. నాకు జంధ్యానికి పనికొస్తాయి” అన్నారు.
“ఒక డెన్ లో తలదాచుకున్నాం. సి.ఐ.డి లు పసిగట్టారని చెప్పి కొరియర్లు కొన్ని కాగితాలనూ, సీతారామయ్యనూ తీసుకెళుతూ, ఇంట్లో ఎవరూ లేనట్టు ఉండాలని, నన్నొక్కదాన్నే లోపల ఉంచి బయట తాళం వేసి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో స్టవ్ లు లేవు. కట్టెలతో వంట చేసుకుంటే పొగ బయటికొచ్చి పోలీసులకు తెలిసిపోతుందని రెండురోజులపాటు తిండి లేకుండా గడపాల్సొచ్చింది.”
మూడు ఉద్యమాల ( సంస్కరణ, జాతీయ. విప్లవోద్యమాలు ) లో క్రియాశీలంగా పనిచేసిన కోటేశ్వరమ్మ గారి అనుభవాల సమాహారం, “నిర్జనవారధి” పుస్తకంలోవి ఈ విషయాలు. నాలుగైదేళ్ళ వయసులోనే బాల వితంతువుగా మారి, ప్రముఖ విప్లవోద్యమ నాయకుడు సీతారామయ్యగారిని సంస్కరణ వివాహం చేసుకున్నారు. నగలు ఇవ్వడం, జాతీయ గీతాలను పాడటం ద్వారా జాతీయోద్యమానికి దగ్గరయ్యారు. ఆ తరువాత కమ్యూనిస్టు అయ్యారు. తల్లిదండ్రులకు , భర్తకూ , పిల్లలకూ దూరమై దేశమంతా తిరుగుతూ అజ్ఞాతవాసంలో బతికారు. ప్రజానాట్యమండలిలో క్రిమియాశీల కార్యకర్తగా పనిచేసారు. రెండు కథా సంపుటాలు , ఒక కవితా సంపుటి ప్రచురించారు. విప్లవ నాయకుడిగా కీర్తిపొందిన భర్త ( సీతారామయ్య ) కారణం చెప్పకుండా వెళ్ళిపోయి 36 ఏళ్ళ తరువాత తనదగ్గరకొస్తే ‘నాకు చూడాలని లేదు’ అంటూ తిరస్కరించిన గొప్ప ఆత్మగౌరవం ఉన్న మేటి మహిళ కొండపల్లి కోటేశ్వరమ్మ. ఎన్నో ఒడి దుడుకులు, అనేక మలుపులతో కూడిన ఆమె జీవితం పాఠకులకు ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది.
చండ్ర రాజేశ్వరరావుగారు, సుందరయ్యగారు, మద్దుకూరి చంద్రంగారు, సుంకర సత్యం గారు వంటి నాయకులు ఈ పుస్తకంలో మనకెదురవుతారు…ఉద్యమాలూ పార్టీలూ వ్యక్తులూ నేర్చుకోవలసిన విషయాలెన్నో ఇందులో మనం చూడవచ్చు.
‘నిర్జనవారధి’ అనే పేరు ఎందుకంటే : అటు తల్లితరానికీ, ఇటు బిడ్డల తరానికీ బ్రతుకును వారధిగా చేసి దానిపై నుండి అటు ఒకరు, ఇటు ఒకరు వెళ్ళిపోతే .. కోటేశ్వరమ్మ నిర్జనవారధిగా మిగిలిపోయింది” అని కవి మిత్రుడు సోమసుందర్అన్నారు. ఆ మాటనే నా ఆత్మకథకు శీర్షికగా ఎంచుకున్నాను” అన్నారు కోటేశ్వరమ్మగారు.
“నిర్జనవారధి” ప్రచురణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ( 2012)
*****

పి యస్ ప్రకాశరావు రిటైర్డ్ టీచర్, కాకినాడ.
M. phil : దాశరధి రంగాచారయ నవల ‘ మోదుగు పూలు – ఒక పరిశీలన ’.
P.hd : ‘నూరేళ్ళ పంట’ (వందమంది రచయిత్రుల కథా సంకలనం)
రచనలు :
1. లేడీ డాక్టర్ (కవితారావు గారి ఇంగ్లీష్ పుస్తకానికి పరిచయం) డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం ప్రచురణ
2. గురజాడమాట – ప్రగతికి బాట JVV కాకినాడ ప్రచురణ
3. తొలి పార్లమెంట్ లో డా. చెలికాని రామారావు ( వేరొకరితో కలిసి ఇంగ్లిష్ నుంచి అనువాదం)
4. డా. చెలికాని రామరావు జీవన రేఖలు ( వేరొకరితో కలిసి రచన )
ప్రజాసాహితి, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి, తెలుగు వెలుగు (మాసపత్రిక), దారిదీపం పత్రికలలో వ్యాసాలు,
సోషల్ మీడియాలో :
మక్సిం గోర్కీ, ఎంగెల్స్, ఆర్వీయార్, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, వీరేశ లింగం ఆరుద్ర, రాంభట్ల, శ్రీ శ్రీ రావు కృష్ణారావు, రారా, తిరుమల రామచంద్ర, మహీధర నళినీ మోహన్, కొ. కు, గిడుగు, శ్రీపాద, దర్శి చెంచయ్య అబ్రహం కోవూర్, తాపీ ధర్మారావు, సుందరయ్య, ఆలూరి భుజంగరావు, జవహర్లాల్
నెహ్రూ, పెరుమాళ్ మురుగన్, గాంధీ, అప్పలనాయుడు , డి. ఆర్ ఇంద్ర, అబే దుబాయ్ ‘ హిందూ మేనర్స్ అండ్ కస్టమ్స్’ (పుస్తకం నుండి కొన్ని వ్యాసాల అనువాదం) టాల్ స్టాయ్ మొదలైన రచయిత్ల పుస్తకాల పై సమీక్షలు.
