
దేవి చౌధురాణి
(రెండవ భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
ప్రఫుల్లని బంజారాది, దాన్ని ఇంట్లోనుంచి తరిమెయ్యండి అని హరివల్లభ బాబు ఆజ్ఞాపించి పది సంవత్సరాలు గడిచింది. ఈ కాలమేమీ హరివల్లభ బాబుకి కలసి రాలేదు.
బ్రిటిష్ గవర్నర్ Warren Hastings దేవీ సింగ్ అనేవాడిని ఇజారిదారుగా నియ మించి వాడికి జమీందారుల దగ్గర పన్నులు వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ దేవీ సింగ్ క్రూరాతి క్రూరుడు. దేవీ సింగ్ తన ఇష్టం వచ్చినట్లు పన్నులు పెంచి, బ్రిటిష్ సైనికులని వెంట తెచ్చుకుని పన్నులు పిండి వసూలు చేసుకుని తన బొక్కసం నింపు కున్నాడు. కానీ బ్రిటిష్ వాళ్లకిచ్చింది తక్కువే. దేవీ సింగ్ హరివల్లభ బాబుకి ఏభై వేల రూపాయల పన్ను విధించాడు. అప్పటికే హరివల్లభ బాబు అధీనంలో వున్న గ్రామాలు బందిపోటుల దాడులూ, దోపిడిలతో మునిగాయి. దానితో ఆదాయం బాగా తగ్గింది. అలా అని హరివల్లభ బాబు ఖర్చులేమీ తగ్గించుకోలేదు. జమిందారీ ఘరానాలు కొనసాగిస్తూనే వున్నాడు. జాతరలకి, ఉత్సవాలకి, గానాభజానాలకి, మల్ల యుద్ధం పోటీలకీ ఎప్పటిలా గానే ఖర్చు పెడుతున్నాడు. సాక్షాత్తు, లక్ష్మీ దేవి దిగి వచ్చి నన్ను వుండమంటావా లేక పోతే నీ ఘరానాలు వుంచుకుంటావా అంటే, ఘరానాలే కావాలనేవాడేమో!
మొత్తానికి ఈ పది సంవత్సరాలలో హరివల్లభ బాబు అప్పుల పాలయ్యాడు. పైగా దేవీ సింగ్‌కు కట్టవలసిన పన్ను బాకీ ఏభై వేల రూపాయలూ అలాగే మిగిలిపోయింది.
***
ఆ పెద్ద భవంతిలో అల్లుడు వస్తున్నాడనే సందడీ హడావిడీ మొదలయ్యింది. వ్రజేశ్వర్ అత్తగారింటికి వస్తున్నాడు. ఏ అత్తగారింటికని వేరే చెప్పనవసరం లేదు, సాగర్ వాళ్ల కన్నారింటికి. వాళ్లు చాలా ధనవంతులు కాబట్టి. ఆ రోజులలో అల్లుడు వస్తున్నాడం టేనే మర్యాదలు వేరేగా వుండేవిలెండి!
చుట్టుపక్కలున్న చెరువులు అన్నిటి నుండి చేపల పట్టేసారు. గొల్లలు పాలూ పెరుగూ వెన్న మీగడలు ఎంత తెచ్చినా చాల్లేదన్నారు. చాకలి వాళ్లకి చాకిరీ ఎక్కువ య్యింది, అన్నీ ఉతికి ఆరేసి ఇస్త్రీ తోమి పెట్టారు. ఇంట్లోని ఆడవాళ్ల హడావిడి అంతా ఇంత కాదు, పెట్టెలలో దాచుకున్న నగలు తీసి మెరుగులు పెట్టించుకున్నారు. కొందరేమో కొత్త నగలు చేయించుకున్నారు. వయసు పైబడిన ఆడవాళ్లు తమ రోజుల్లో అల్లుడు వచ్చిన ఘనతలు అంతలింతలుగా చెప్పుకుంటున్నారు. మేమేం తక్కువ అంటూ మిగిలిన ఆడవాళ్లు పోటీలుగా అంతకు ముందు ఎవరి దగ్గరో విన్న గొప్పలు తమ గొప్పలుగా చెప్పుకుంటున్నారు.
అన్ని రకాల వంటకాలూ, పిండివంటలూ, మిఠాయీలూ, పానీయాలు సిద్దం చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికోసం చేస్తున్నారో అతను మాత్రం ఇబ్బందిగా వున్నాడు. వ్రజేశ్వర్ వచ్చింది వాళ్ల మావగారిని డబ్బు అడగడానికి, మర్యాదలు, భోజనవిలాసాలకు కాదు. మావగారి దగ్గర డబ్బు తీసుకుని బాకీదారులకి చెల్లించటానికి. దేవీ సింగ్ శిస్తు బాకీ చెల్లించకపోతే తండ్రి హరివల్లభ బాబుని పట్టుకుపోయి ఖైదులో వేస్తానంటున్నాడు. ఆ ఆపత్తు నుండి తండ్రిని కాపాడుకోవటానికి మావగారి దగ్గర అప్పు అడగటానికి వచ్చాడు.
మావగారు “చూడు బాబూ, ఈ డబ్బు ఎప్పటికయినా నీదేనని నీకు తెలుసు కదా? నేను జాగ్రత్తపరుస్తున్నాననే విషయం కూడా నీకు తెలుసు కదా? ఇప్పుడు నీ తండ్రి కిచ్చాననుకో, అప్పులవాళ్లు పట్టుకుపోతారు. మొత్తానికి మొత్తం హుళక్కి అవుతుంది” అన్నారు.
“నాకేమీ డబ్బు మిగలకపోయినా ఫర్వాలేదు, మా నాన్నగారిని ఖైదుకు పోకుండా చేసి, ఆయన గౌరవం నిలబట్టాలి” అన్నాడు వ్రజేశ్వర్.
ఈ జవాబుతో మావగారు విసురుగా, “ఆ డబ్బు అప్పుల వాళ్లు పట్టుకుపోతే మరి మా అమ్మాయికేం మిగులుతుంది? డబ్బుంటే మా అమ్మాయి సుఖంగా వుంటుంది. మీ బాబుకి ఉన్న అప్పులు తీరుస్తా కూర్చుంటే మా అమ్మాయికి మిగిలేది ఏమీ వుండదు” అన్నారు.
వ్రజేశ్వర్ ఉద్రేకంగా “అట్లయితే మీకు అల్లుడు అవసరంలేదనమాట, మీ అమ్మాయిని మీరే వుంచుకోండి. మళ్లీ ఈ గడప తొక్కను” అన్నాడు.
మామా అల్లుళ్లకి మాటా మాటా పెరిగింది. గట్టిగానే అరుచుకున్నారు.
సాగరేమో తల్లి దగ్గర తనకు పెనిమిటి అంటే ఎంత ప్రియమో, గొడవపడి వెళ్లి పోతున్నాడు అంటూ బాధపడింది. అత్తగారు వ్రజేశ్వర్ని తన మందిరానికి పిలిచి సర్ది చెప్పబోయింది. వ్రజేశ్వరుడికి కోపమేమీ తగ్గలేదు.
చివరికి సాగర్ వంతు. వచ్చి మోకాళ్ల మీద పడి వ్రజేశ్వర్ కాళ్లు కావలించుకుని, ఇందులో నా తప్పేముంది? కనీసం ఇంకొక రోజన్నా వుండమని ప్రార్ధించింది.
వ్రజేశ్వర్ అంతే కోపంతో సాగర్‌ని గట్టిగా వెనక్కితోసాడు. అతని కాళ్లు కావలించు కుని వుందేమో, ఆ తోపులాటలో వ్రజేశ్వర్ కాలు వెళ్లి సాగర్‌కి తగిలింది. సాగర్‌కి వ్రజేశ్వర్ తనను కాలితో తన్నాడనిపించింది.
నాగినిలాగా ఒక్క వుదుటున లేచి, ఆవేశంతో బుసకొడుతూ, “నన్ను కాలితో తంతావా? నీకెంత ధైర్యం?” అన్నది.
ఆ సమయంలో వ్రజేశ్వరుడు పొరపాటున తగిలింది అని వుండవచ్చు. కానీ సాగర్ ఆవేశం చూసి మూర్ఖంగా, “ఏం, తంతే మాత్రం? మీ బాబు దగ్గర డబ్బుందేమో, ఈ కాళ్లు మాత్రం నావే. మీ నాన్న ఇవే కాళ్లని పట్టుకుని, కడిగి నిన్ను కన్యాదానం చేసాడు. గుర్తుందో లేదో?” అన్నాడు.
సాగర్‌కు తిక్క రేగి, “పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, దీనికి సరిపడా ప్రతీకారం తీర్చుకుం టాను జాగ్రత్త” అని హెచ్చరించింది.
వ్రజేశ్వర్ వెటకారంగా నవ్వి, “ఏం చేస్తావేంటి? నన్ను తంతావా?” అన్నాడు.
సాగర్ కోపం పరాకాష్ఠకి చేరింది.”నేను బ్రాహ్మల అమ్మాయిని. నువ్వే నా కాళ్లు పట్టుకుని …” అని ఆ తరువాత ఏమి అనాలో తెలియక ఆగిపోయింది. కాళ్లు పట్టుకున్న తరువాత ఏం చెయ్యించాలో తెలీదు, నోటి మాట అంతటితో ఆగిపోయేదే.
ఇంతలో గదికి వెలుపలగా, కిటికీ ప్రక్కనుండి లోగొంతులో “మర్ధన చేయ్యాలి” అనే మాట నెమ్మదిగా వినబడింది.
సాగర్ వెనక ఎవరు ఆ మాట అందించారో గమనించుకోలేదు. అదే మాటతో సాగర్ తన వాక్యాన్ని పూరించింది. “నువ్వే నా కాళ్లు పట్టుకుని మర్ధన చెయ్యాలి” అన్నది.
“అలాగా, అయితే అలానే ఎదురుచూస్తూ వుండు. నేను నీ కాళ్లు మర్ధన చేస్తానో లేదో. అదే జరిగితే నేను బ్రాహ్మణుడినే కాదు” అంటూ అత్తారింటినుండి కోపంగా వెళ్లిపోయాడు.
సాగర్ క్రింద పడి భోరున ఏడవటం మొదలుపెట్టింది. ఇంతలో తనకు కాళ్లు “మర్ధన చెయ్యాలి” అనే మాటను అందించింది ఎవరా అని వెనక్కు తిరిగి చూస్తే, ఒక దాసీది వున్నది. నువ్వేనా మాట అందించింది అని అడిగితే ఆ దాసి భయంగా నేను కాదు అన్నది. మరెవరు? ఆ కిటికీ వెనక ఎవరున్నారో చూడమంది.
అప్పుడు ఒక లలిత సుందర రూపవతి, సాక్షాత్తు భగవతీ దేవిని తలపించే తేజస్సు తో ఆ గదిలోకి ప్రవేశించి “ఆ కిటికీ వెనుక వున్నది నేనే” అన్నది.
“ఎవరు నువ్వు?” ఆశ్చర్యంగా అడిగింది సాగర్.
“నన్ను గుర్తు పట్టలేదా?”
“లేదు, ఎవరు నువ్వు?”
“దేవి చౌధురాణి” అన్నది ఆ రూపవతి.
ఆ పేరు వింటునే దాసి చేతిలో వున్న కంచు తాంబూలపు పాత్ర జారి క్రింద పడి ఖంగు ఖంగు మంటూ గిర్రున తిరిగింది. దాసీది భయంతో వణికిపోతూ, గట్టిగా కేక పెట్టబోయి, ఆ కేక నోటి బయటకు రాక, సన్నగా కీచు పెట్టి, క్రింద పడి ఏడవ సాగింది.
“ముండా, నోర్ముయ్యి. ఏడుపు వినపడిందంటే నాలుక కోస్తాను, జాగ్రత్త” అన్నదా స్త్రీ.
దాసీదాని ఏడుపులు గొంతులో నుండి బయటకు రాకుండానే, ఎక్కుతూ, కిస్‌కిస్ మంటూ ఎగశ్వాసలు తీస్తోంది. సాగర్‌కు కూడా చెమటలు పట్టాయి. భయంతో ఆ స్త్రీ వంక చూస్తూ నిలబడింది. ఏ పేరైతే విన్నదో, ఆ పేరు ఆ పరగణాలో పసిపిల్లలకి, వృద్ధులకి కూడా తెలుసు. ఆ పరగణాలో దేవీ చౌధురాణి పేరు ఎవరికి తెలీదూ? ఆ పేరు ఒక భయం కర శబ్దం. కానీ ఉన్నట్టుండి సాగర్‌కి పెద్ద నవ్వు వచ్చింది. దేవీ చౌధురాణి ముఖము కూడా చిరు నవ్వుతో నిండింది. వాళ్లిద్దరూ ఒక ఆత్మీయతతో ఒకరినొకరిని చూసుకుంటూ పలకరించుకున్నారు.
*****
(సశేషం)

విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.