ప్రమద

అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్

-నీరజ వింజామరం

          ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ ,
ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ
ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 న అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన వీరు అక్కడ 8 రోజులు గడిపి భూమి పైకి తిరిగి రావలసింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన దాదాపు 8 నెలల తరువాత క్షేమంగా వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రముఖ మహిళా వ్యోమగామి సునీత విలియమ్స్.

          సునీత లిన్ విలియమ్స్ భారత మూలాలున్న అమెరికా వ్యోమగామి. ఆమె తండ్రి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన దీపక్ పాండ్య. 1958లో వైద్య శాస్త్ర అధ్యయనం కోసం అమెరికాకు వలస వెళ్లారు. దీపక్ స్లోవేనీయన్ సంతతికి చెందిన ఉర్స్ లీన్ బోన్నీ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ జంటకు సునీత సెప్టెంబర్ 19, 1965 లో మూడవ సంతానంగా యూక్లిడ్ , ఓహాయోలో జన్మించారు .దీపక్ అమెరికాలో న్యూరో అనాటమిస్ట్ గా
పనిచేసే వారు. వారిది మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచారు.. అమ్మానాన్నలుగా ఎప్పుడూ వారికి మద్దతుగా ఉండేవారు. చదువు లో మంచి మార్కులు తెచ్చుకోవాలని, కష్టపడి చదువుకోవాలని ప్రోత్సహించేవారు. తండ్రి భారతీయ, సైనిక కుటుంబం నుండి వచ్చినవాడు, ఇది సునీతకు క్రమశిక్షణను మరియు ధైర్యాన్ని నేర్పించింది. తల్లి అమెరికన్ సంస్కృతిలో పెరిగినవారు, ఆమె సునీతకు సామాజిక నైపుణ్యాలు, మానవ సంబంధాలు నేర్పించారు.

          భిన్న దేశాల వారసత్వం, సునీతలో వికసిస్తున్న వివిధ ధోరణులను, దృక్పథాలను మిళితం చేసి , ఆమె ప్రపంచాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో వీక్షించేలా చేసి, సునీత యొక్క వృద్ధి, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది.

          చిన్ననాటి నుండే సునీత చదువులో చురుకుగా ఉండేది. అంతరిక్షం అంటే ఆమెకు చిన్నతనంలోనే ఒక అద్భుతమైన ఆసక్తి ఏర్పడింది. ఆమె తరచుగా తండ్రితో
టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించేది . చిన్నతనంలోనే సునీత ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుంది — ఆకాశానికి హద్దులుండవు అని. చిన్నతనంలో ఆమెకు ఒక కల ఉండేది — “నేను ఒక రోజు చందమామ పైకి వెళ్ళాలి! ఆకాశంలో తారల మధ్య తేలిపోవాలి!” అని . దాని కోసం భవిష్యత్తులో వ్యోమగామిగా మారాలనే ఆశ ఆమెలో తలెత్తింది.

          చిన్నారి సునీతకు నడక అంటే చాలా ఇష్టం. తీరప్రాంతాలలో నడుస్తున్నపుడు , సముద్రాన్ని చూస్తూ నేవీలో చేరాలని నిర్ణయించుకుంది. సునీత తన విద్యను అమెరికాలోనే అభ్యసించింది.. సునీతకు చిన్నప్పటి నుంచి విజ్ఞానంపై అభిరుచి ఉంది. ఆమె ప్రాథమిక విద్యను యూక్లిడ్ పబ్లిక్ స్కూల్ లో పూర్తిచేసింది. ఆమె చదువులో ఎప్పుడూ అగ్రగామిగా నిలిచింది. ఆమె వృత్తి పరంగా ముందుకు సాగడానికి తగిన మార్గం “యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ “ అనే ప్రఖ్యాత సైనిక విద్యాసంస్థలో చేరడం ద్వారా ఏర్పడింది.

          1983లో, సునీతా నేవల్ అకాడమీకి చేరి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చదువును మొదలు పెట్టింది. అప్పుడు, ఈ అకాడమీకి చేరుకోవడం అనేది ఒక సవాల్ గా
భావించేవారు. అయితే, సునీతా అన్ని అడ్డంకులను దాటుతూ, 1987లో Bachelor of
Science in Electronics (ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) డిగ్రీని పొందింది. నేవీ యొక్క అధికారిక సైనిక శిక్షణను పూర్తి చేసిన అనంతరం ఆమె యునైటెడ్ స్టేట్స్ నేవీలో ప్రవేశించి పైలట్‌గా శిక్షణ పొందింది . నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్ నుండి ప్రత్యేక శిక్షణ తీసుకుని, తరువాత హెలికాప్టర్ పైలట్‌గా అనేక మిషన్లలో పాల్గొన్నది . పెర్షియన్ గల్ఫ్
యుద్ధానికి సన్నాహాక కార్యక్రమాలలో, ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతాలపై నో ఫ్లై జోన్‌ల స్థాపనలో, అలాగే 1992లో మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నది.

          1993లో ఆమె నేవల్ టెస్ట్ పైలట్ అయ్యింది, తరువాత ఆమె టెస్ట్ పైలట్ ఇన్‌స్ట్రక్టర్‌గా మారింది, 30 కి పైగా విభిన్న విమానాలను నడిపింది , 2,770 కంటే ఎక్కువ గంటలను గాలిలోనే గడిపింది. ఆమె నౌకలో దూసుకుపోయేది, హెలికాప్టర్ నడిపేది. కొన్నిసార్లు ఆకాశాన్ని తాకే అలల మధ్య ప్రయాణిస్తూ, “ఒక రోజు నేను నిజంగా
ఆకాశానికే వెళ్లాలి” అని మనసులో అనుకునేది. ఆమె గుండె లోతుల్లో ఓ చిన్న మాట పదేపదే వినిపించసాగింది “తారల దాకా పయనించాలి .” ఆ మాట నిజమవ్వాలంటే వ్యోమగామిగా మారాల్సిందే అనుకున్న సునీత నాసాలో వ్యోమగామిగా దరఖాస్తు చేసింది. కానీ నాసా ఆ దరఖాస్తును తిరస్కరించింది. ఆమె మిషన్‌కు ఎంపిక కాలేదని తెలిసి కొంత నిరుత్సాహపడింది. కానీ ఆమె దానిని ఒక పాఠంగా తీసుకుని, ఇంకా కృషి చేసింది, తన సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చింది. అలా చేయడమే ఆమెను తరువాత అవకాశానికి సిద్ధం చేసింది. ఈ సంఘటన మనకు “ అపజయం మన గమ్యం కాదు — అది ఒక మెట్టు మాత్రమే” అని మరొక్క సారి నిరూపిస్తుంది.

          ఒక రోజు ఆమెకు అర్థరాత్రి సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది — ఆ ఫోన్
కాల్ NASA నుండి వచ్చింది. “మీరు స్పేస్ ట్రైనింగ్‌కు ఎంపికయ్యారు” అని!
అనుకోకుండా వచ్చిన ఫోన్ కాల్ ఆ క్షణం నుండి ఆమె జీవితాన్ని మార్చేసింది.

          ఆ రోజు నుండి, సునీతా నిశ్శబ్దంగా, నిబద్ధతతో తనను తాను తీర్చిదిద్దుకుంది. శరీరం, మనస్సు, ప్రాణం అన్నింటిని అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేసుకుంది.          1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది. కల్పన చావ్లా  తరువాత అంతరిక్షం లోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన రెండవ మహిళ ఈమె.

          సునీతా మొదటి స్పేస్‌వాక్ (అంతరిక్షంలో నడక) చేయాల్సి వచ్చినప్పుడు,
కొద్దిగా భయ పడింది. ఎందుకంటే అంతరిక్షంలో బయటకి వెళ్లడం అంటే అత్యంత ప్రమాదకరమైన పని. కానీ సునీతా తన శిక్షణను నమ్మి, ధైర్యంగా ముందుకు సాగారు. ఫలితంగా, ప్రపంచంలో అత్యధిక స్పేస్‌వాక్ చేసిన మహిళల్లో ఒకరిగా నిలిచారు.

          సునీతా విలియమ్స్ మొదటి అంతరిక్ష ప్రయాణం డిసెంబరు 2006 నుండి జూన్
2007 వరకు జరిగింది . 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీలో సునీత తొలిసారి అంతరిక్షంలోకి ప్రయాణించింది . ఈ ప్రయాణంలో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్ళి, ఎక్స్‌పెడిషన్స్ 14 మరియు 15లో చేరింది. 

          సునీతా విలియమ్స్ తన మొదటి అంతరిక్ష ప్రయాణంలో ఆరు నెలలు గడిపింది. ఈ ప్రయాణంలో, ఆమె సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మత్తులు చేయడం వంటివి చేసింది.  సునీతా విలియమ్స్ ఆ తర్వాత 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్ళింది మరియు నాలుగు నెలల పాటు  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. రెండవ సారి ఆర్బిటింగ్ ప్రయోగశాల పై పరిశోధనలు జరిపింది. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన మొత్తం సమయం 322 రోజులు. ఈ సమయంలో ఆమె ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదు.

          సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టింది. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్రగర్భంలో మానవ అవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే “నాసా ఎక్సట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్” బృందంతో కలిసి పని చేసింది.

          సునీత ఎన్నో ఘన విజయాలను సాధించింది. 2007 ఏప్రిల్ 16న, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో మారథాన్‌ను పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. నిబద్ధత కలిగిన అథ్లెట్ అయిన విలియమ్స్ మొదట 2007 బోస్టన్ మారథాన్‌కు సైన్ అప్ చేసుకుంది. చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా, ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు పూర్తి మారథాన్ దూరాన్ని పూర్తి చేసింది, నాలుగు గంటల 24 నిమిషాల అద్భుతమైన సమయంలో రేసును పూర్తి చేసింది. ఈ ఘనతతో చరిత్రలో ఆమె స్థానాన్ని పదిలం చేసుకుంది.

          తన మూడవ అంతరిక్ష నడక సమయంలో, విలియమ్స్ స్టేషన్ వెలుపల దాదాపు 6
గంటల 40 నిమిషాలు గడిపింది., కేవలం తొమ్మిది రోజుల్లో మూడు అంతరిక్ష నడకలను పూర్తి చేసింది. మళ్ళీ 17 సెప్టెంబర్ 2012న, ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ట్రయాథ్లాన్‌ను నడిపిన మొదటి వ్యక్తి అయ్యింది.

          సునీతా విలియమ్స్ తన భారతీయ మూలాలను ఎప్పుడూ గౌరవిస్తుంది. ఆమె తన
అంతరిక్ష ప్రయాణంలో భూమి మీద పవిత్రతను గుర్తుచేసుకునేందుకు గంగాజలాన్ని, అనిశ్చితమైన గమనంలో మార్గదర్శకంగా భగవద్గీతను, ధైర్యానికి, నమ్మకానికి చిహ్నంగా చిన్న హనుమాన్ విగ్రహాన్ని తీసుకెళ్ళడం ఇందుకు నిదర్శనం.

          అంతరిక్షంలో కూడా తన భూమిని, తన మూలాలను త్యజించలేదు. ఇది ఆమె
మనసులో ఉన్న భారతీయతను , ఆధ్యాత్మికతను చాటిచెబుతుంది. ఆమె సెప్టెంబర్ 2007లో గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం ,అలాగే ఆమె కుటుంబ స్వస్థలమైన ఝులసన్‌ ను పర్యటించింది. భారతీయ ఆహారమైన సమోసా తనకెంతో ఇష్టమని ఆమె పిల్లలకిచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.

          సునీత సాధించిన విజయాలను ప్రపంచం గుర్తించింది. ఎన్నో అవార్డులు
పురస్కారాలు ఆమెకు దక్కాయి. వాటిలో కొన్ని 1987 లో నేవీ కమెండేషన్ మెడల్ , 1998 లో NASA అంతరిక్ష విమాన పతకం , 2007 లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభా పురస్కారం , 2008 లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్, 2011 లో రష్యా ప్రభుత్వం ద్వారా అంతరిక్ష అన్వేషణలో ప్రతిభా పతకం , 2013 లో గుజరాత్ సాంకేతిక  విశ్వ విద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, 2013 లో స్లోవేనియా ప్రభుత్వంచే గోల్డెన్ ఆర్డర్ ఫర్
మెరిట్స్. జూన్ 5, 2024న, విలియమ్స్ నాయకత్వంలో స్టార్‌లైనర్‌ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టినప్పుడు, కక్ష్య మిషన్ కోసం విమాన పరీక్షలో అంతరిక్ష నౌకను పైలట్ చేసిన మొదటి మహిళగా సునీతా విలియమ్స్ చారిత్రాత్మక మైలురాయిని సాధించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎనిమిది రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో చేరుకున్నారు. దానిలో తలెత్తిన సమస్యల కారణంగా అది తొమ్మిది నెలల బసగా మారింది. ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి రావడానికి నాసా, స్పేస్‌ఎక్స్ సహకారంతో 2025 మార్చి 15న క్రూ-10 మిషన్‌ను ప్రారంభించింది. వారు 286 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత 2025 మార్చి 18న భూమికి క్షేమంగా తిరిగివచ్చారు.

          సునీతా విలియమ్స్ అనేకసార్లు స్పష్టంగా చెప్పారు — “స్త్రీలు ఏ రంగంలోనైనా అగ్రస్థానంలో నిలవగలరు.” అంతరిక్ష ప్రయాణాలలో, శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఆమె, మహిళలు కూడా ఎంత బలమైనవారో ప్రపంచానికి చూపించారు.
సునీతా విలియమ్స్ తన పట్టుదల, కృషి, ధైర్యంతో ఎన్నో అద్భుత విజయాలను సాధించారు. ఆమె యువతకి స్ఫూర్తిదాయక మూర్తి. సునీతా మనకందరికీ నేర్పించిన గొప్ప పాఠం ఏమిటంటే — కలలు కనాలి, వాటిని నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నిం చాలి. అంతరిక్షాన్ని తాకిన ఆమె అడుగులు భూమి మీద ఎందరికో స్ఫూర్తిగా మారాలి.
“అంతరిక్షం మనం ఎంత చిన్నవారమో గుర్తు చేస్తుంది, కానీ మన కలలు ఎంత
గొప్పవో కూడా గుర్తు చేస్తుంది.” అన్న సునీతా విలియమ్స్ మాటలు మనందరికీ చిరస్మరణీయం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.