దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          ఇంతకు క్రితం చెప్పినట్లుగా నావకు ప్రక్కగా నున్న తీరం మీద ఒక పెద్ద చింత చెట్టు వున్నది. ఆ పెద్ద చింత చెట్టు చాటులో వున్న చిమ్మ చీకటి నీడలో ఒక పడవ వుంది. సన్నని పడవ, మూడడుగులు వెడల్పు, అరవై అడుగుల పొడవు వుంటుంది. ఆ నాగతరి పై చాలా మంది యోధులు నిద్ర పోతున్నారు. రంగరాజు పడవ వదలమని ఆదేశించగానే ఒక్క ఉదుటన మేల్కొన్నారు. నాగతరి అడుగు భాగాన ఉన్న అరలలో పేర్చి వున్న బల్లాలను, ఢాలులను, ఇతర ఆయుధాలను తీసుకుని ప్రక్కన పెట్టుకుని, ఒక తెడ్డుని పట్టుకుని దాడికి సిద్దమయ్యారు. ఇదంతా  నిశబ్దంగా సాఫీగా జరిగిపోయింది. ఇంతకు క్రితం ఈ కవాతు పలు సార్లు జరిగిందని వేరే చెప్పనవసరం లేదు.

          పడవని వదలిపెట్టారు. రంగరాజు కూడా పడవ ఎక్కి తన స్థానాంలో కూర్చున్నాడు.

          “నేను చెప్పినది గుర్తు వున్నదా?” నావ పై నుండి అడిగింది ఆ స్త్రీ.

          “గుర్తు వున్నది” అన్నాడు రంగరాజు.

          వరద ప్రవాహంలో దిగువకు ఆ అపరిచిత నావ వేగంగానే వస్తున్నది. ఎదుటి ప్రవాహంలో పడవ ఎక్కువ దూరం వెళ్లకుండానే ఆ నావ దాపులకు చేరుకున్నారు. నాగతరిపై యోధులు వేగంగా తెడ్డు వేయసాగారు, కానీ ఆ అరవై తెడ్డులు నీళ్లలో పడినప్పుడు ఎక్కడా చప్పుడు చెయ్యటం లేదు.

          ఆ నావ పైకప్పు మీద ఎనిమిది మంది కాపాలాదరులు వున్నారు. వారిలో ఇద్దరు ఎర్ర తలపాగాలని చుట్టుకుని, ఆయుధాలు పట్టుకుని నావకు ఎదుటి భాగం మీద  ఎత్తుపీటల పై కూర్చుని నదిని పరిశీలిస్తున్నారు. మిగిలిన ఆరుగురు కప్పుపైన చల్లని గాలికి, వెన్నెలలో నిద్రపోతున్నారు. ఈ కాలంలో అర్థరాత్రి ఆ నదిపై ప్రయాణానికి సిద్ధమవ్వటం సాహసమే.

          రంగరాజు పడవ అకస్మాత్తుగా, ప్రక్కనుండి ఆ నావకు అడ్డుగా రాబోయింది. నావ పైని కాపలాదారులు ఒకడు పడవ నావను ఢీ కొట్టటానికి వస్తుందని గమనించి, లేచి నిలబడి “ఎవరు మీరు? పడవను తప్పించండి” అని అరిచాడు.

          రంగరాజు గట్టిగా, “మీరే తప్పుకోండి” అని అరిచాడు.

          కాపలాదారుడికి కోపం వచ్చి చేతిలో వున్న తుపాకీని తీసుకుని హెచ్చరికగా గాలిలోకి కాల్చాడు. అది అసలు గుళ్ళు లేని ఠాప్ ఠాప్ అని మోత మాత్రమే చేసే తుపాకి మోత అని రంగరాజు వెంటనే పసిగట్టి, గట్టిగా నవ్వాడు.

          “ఓ పాండే జీ, ఒక తుపాకి గుండు కూడా లేదా? నన్నివమంటారా?” అని రంగరాజు తన తుపాకీని గురిపెట్టాడు. ఇంతలోనే దాన్ని దించి, “లేదు నిన్ను చంపను, నీ తలపాగాను కొడతాను” అని విల్లు తీసుకుని, గురిపెట్టి బాణంతో ఆ కాపలాదారుడి ఎర్ర తలపాగాని ఎగరకొట్టాడు. 

          పడవ నావను తాకగానే ఒక పది పన్నెండు మంది యోధులు నావ ఎక్కారు. పైకప్పు మీద నిద్ర పోతున్న కాపలాదారులు తుపాకి మోతకి లేచి తమ తమ ఆయుధా లను అందుకునే లోపునే వారిని ఈ యోధులు లోబర్చుకుని కట్టివేశారు. మేల్కొని వున్న ఇద్దరు కాపలాదారులు కొంత ప్రతిఘటించారు కానీ వారిని కూడా బంధించ టానికి ఎక్కువ సమయం పట్టలేదు.

          ఆ యోధులు నావపై వున్న గూటిగదిలోకి ప్రవేశించబోయారు. గదికి లోపల నుండి గడియ పెట్టి వున్నది.

          రంగరాజు ఆ తలుపును కొడుతూ “తలుపు తియ్యండి మహాశయా” అన్నాడు.

          ఆ తలుపుకు అవతల వ్రజేశ్వర్ వున్నాడు. గాఢనిద్ర నుంచి అప్పుడే మేల్కొన్నాడు. ఈ అవాంతరానికి పూర్తి బాధ్యుడు వ్రజేశ్వరుడే. లేకపోతే, అర్థరాత్రి సమయంలో ఎవరూ ఈ నదిపై నావను తీసుకురారు. అత్తారింట్లో అలిగి చేసిన తొందరపాటు పని ఇది.

          తలుపుకి ఆవలి వైపు నుండి “ఎవరు నువ్వు, ఈ గోల ఏమిటి”  నిద్రమత్తు గొంతుతో అరిచాడు వ్రజేశ్వర్.

          “ఏమీ భయపడనవసరం లేదు. ఈ నావ మీద డాకూలు దోపిడీ చెయ్యటానికి వచ్చారు” అన్నాడు రంగరాజు.

          వ్రజేశ్వర్ ఒక క్షణ కాలం నిర్ఘాంతపోయాడు. తేరుకుని “ప్యారే, తీరే, రాంసింగ్” అంటూ గట్టిగా పిలిచాడు.

          కప్పు పైనుండి రాంసింగ్ “దొరా, ఈ ముండాకొడుకులు మమ్మల్ని ఇక్కడ కట్టి పడేసారు” అని అరిచాడు.

          వ్రజేశ్వర్ “అవునా, మీలాంటి ధైర్యవంతులని కట్టిపడేసారా? డాకూలు ఎంతపని చేసారు? మీ వీరత్వానికి రేపు బహుమతి ఇస్తానులే” అన్నాడు వ్యంగ్యంగా.

          తలుపు అవతల నుండి రంగరాజు కూడా నవ్వాడు. “కాపలా వాళ్లకు బహుమతి ఇవ్వాల్సిందే. కానీ, ఇప్పుడు తలుపు తియ్యండి” అన్నాడు.

          “నువ్వు ఎవరవు?”

          “నేను డాకూను. తలుపు తియ్యండి.”

          “తలుపు ఎందుకు తియ్యాలి?”

          “లూటీ చెయ్యటానికి.”

          “నన్ను కూడా కాపలావాళ్ల లాగా చేతకాని వాడిని అనుకుంటున్నారా? నా చేతిలో పిస్తోల్ వుంది. కాల్చి పారేస్తాను.”

          “ఆ తుపాకీతో ఎంత మందిని చంపగలరు? ఒకళ్లు కాదు ఎంతమంది వున్నామో తెలుసా? అయినా మీరు ఒక బ్రాహ్మణుడు. నేను కూడా బ్రాహ్మణుడినే. నన్ను చంపితే మీకే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అదంతా ఎందుకు? తలుపు తియ్యండి” అన్నాడు రంగరాజు.

          “అయితే, అదే పాపం చేస్తా” అన్నాడు వ్రజేశ్వర్.

          ఇంతలో ఆ గదికి వున్న కిటికీని విరగకొట్టి అందులో నుండి ఇద్దరు యోధులు ప్రవేశించారు. వ్రజేశ్వర్ తన తుపాకీని అటువైపు గురిపెట్టి పేలిస్తే, ఒకడు గురి తప్పించుకుని క్రిందకి జారి పడ్డాడు. ఇంతలో రంగరాజు తలుపులను రెండు తన్నులు గట్టిగా తంతే అవి వూడిపోయాయి. వ్రజేశ్వర్ మళ్లీ తుపాకీని రంగరాజు వైపు తిప్పబోతే, రంగరాజు అతని మీద పడి తుపాకీనీ లాక్కున్నాడు. ఇద్దరూ తలబడ్డారు. ఇద్దరూ బలవంతులే, కానీ రంగరాజు మల్లయుద్ధం మెళుకువలు గట్టిగా సాధన చేసిన వాడు. వ్రజుడు గభాలున గోడపైన వేలాడుతున్న కత్తిని అందుకుని పొడవబోయాడు. ఈ లోపల ఆ గదిలోకి చేరుకున్న నలుగురు యోధులు వ్రజేశ్వర్ని వెనక నుండి పట్టుకున్నారు. ఆ నలుగురిలో ఒకడ వ్రజేశ్వర్ చేతిలోని కత్తిని లాక్కున్నాడు.

          “కట్టి పడెయ్యమంటారా?” అని అడిగాడు ఒకడు.

          “అవసరం లేదు. నేను ఓడిపోయాను, మీకు కావల్సింది పట్టుకుపోండి” అన్నాడు వ్రజుడు.

          ఆ డాకూలు అప్పటికే అందిన వస్తువులను నావ నుండి దించి పడవలోకి ఎక్కిస్తున్నారు. నిమిషాలలో ఆ పని పూర్తి అయ్యింది.

          “ఒక్క పైసా కూడా నీకు వదిలిపెట్టేది లేదు. ఒదిలిపెట్టేవాడినే, అది నువ్వు నా మీద దెబ్బ వెయ్యకముందు. అందుకే, నీకు ఇప్పుడు ఒక్క పైసా కూడా లేదు” అన్నాడు రంగరాజు.

          “అన్నీ పట్టుకుపోండి” అన్నాడు వ్రజేశ్వర్.

          “పట్టుకుపోతాం. నువ్వు కూడా ఇప్పుడు మాతో వస్తావు.”

          “ఎక్కడికి?”

          “మా రాణి దగ్గరకు.”

          “రాణీ? దొంగలకు కూడా రాణీలు వుంటారా? నేనెప్పుడూ వినలేదు.”

          “దేవి చౌధురాణి పేరు వినలేదా?”

          “ఓ, మీరు దేవి చౌధురాణి దొంగల ముఠాలోని వాళ్లా?”

          “దొంగల ముఠా కాదు, ఆ రాణి సైన్యం.”

          “సర్లే, ఈ రకం సైన్యానికి సరిపోయే రాణీనే. నేనెందుకు అక్కడికి?”

          “మాకు ఈ నావలో విలువైనవి ఏమీ దొరకలేదు. నిన్ను బందీగా పట్టుకు పోతున్నాము. ఆవిడ ముందు నువ్వు ఏం పాట పాడతావో, ఇంకేమి విలువైన వస్తువులు బయటకు తీస్తావోనని” అన్నాడు రంగరాజు.

          “మీ రాణి గురుంచి చాలా విన్నాను. మీ రాణి పడుచుపిల్లా?”

          “ఆవిడ మాకు తల్లి లాంటింది.”

          “మంచి రూపవతి అని విన్నాను” అన్నాడు వ్రజుడు.

          “ఆవిడ మాకు అమ్మవారు.”

          “సరే, పద” అంటూ బయలుదేరాడు వ్రజేశ్వర్. వెళ్లుతూ, తన నావ నడిపేవాళ్లు, ఇతర పరిచారకులూ నావకి ప్రక్క కట్టిన త్రాళ్లు పట్టుకుని వేలాడుతూ, భయంతో నీళ్లల్లో దాక్కోవటం గమనించాడు. 

          “ఇంక నావ ఎక్కి కూర్చోండి. మీకిష్టమైన దేవుడిని తలుచుకోండి. అల్లా అంటారో, రాం రాం అంటారో, మీ ఇష్టం” ఆదేశించాడు రంగరాజు.

          “కట్టిపడేసిన కాపలాదారులను కూడా వదిలిపెడతావా?” రంగరాజుని అడిగాడు వ్రజేశ్వర్.

          “అలాగే, కానీ వాళ్లేమన్నా మళ్లీ పేచీ మొదలుపెడితే నీ తల వాళ్లకి బహుమతిగా ఇస్తా. అది సరిగ్గా వాళ్లకి చెప్పు” అన్నాడు రంగరాజు.

          వ్రజేశ్వర్ “నావను తీసుకుని ఇంటికి పోండి. ఇంకేమీ అల్లరి చెయ్యొద్దు. నేను వచ్చినప్పుడూ వస్తాను” అని తన వాళ్లకు హుకుం చేసి ఆ పడవ ఎక్కాడు.

          పడవ నీటి మీదనుండి రయ్యిమని పోయే వానకోయిల పక్షిలాగా వడిగా, వేగంగా పోయింది.

          “దేవి చౌధురాణీ కి జై” అంటూ జయ జయ ధ్వానాలతో సాగింది ఆ నాగతరి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.