
ఈ తరం నడక – 16
సింగిల్ ఉమెన్
-రూపరుక్మిణి
కవిత్వం రెప్పపాటు కాలాన్ని కూడా బంధించగల గుండె ధైర్యం కలది.
ఎన్ని వసంతాలు..,
ఎన్ని పౌర్ణములు..,
ఎన్ని సంధ్య వేళలు..,
ఎన్ని ఉషోదయాలు..,
వీటన్నింటి మధ్య నిట్టాడిగా నిలబడి నడివయసు నీరెండగాయం ఒకటి సలపరిస్తూనే ఉంటుంది.
అదిగో అటువంటి ఓ గాయాన్ని జీవితకాలగమనంలో అరమరికలలోని.., ఓ పార్శ్వపు గుండె చప్పుడు.., అక్షరాల్లోకి ఒంపుకొని నా చేతుల్లో వాలింది.
“రవిక” కవిత్వ సంపుటి. బోధి ఫౌండేషన్ వారి ప్రచారణలో అచ్చయిన రేణుక అయోల గారి కవిత్వం.
“నీలి రంగు హ్యాండ్ బ్యాగ్” కవితతో నాకు ఎప్పుడో పరిచయం ఉన్న ఈ కవిత్వం. కాస్తంత ఎడంగానైనా పారదర్శిక దారిలో నడిచే కవిత్వం. ఆత్మ చలనాన్ని పట్టుకో వాలని ప్రయత్నించే అక్షరం. స్త్రీత్వాన్ని మూటగట్టుకున్న నేటి చలనం. కాలంతో పోటీ పడుతూ ఆ తరం నుండి నేటి తరం వరకు జరిగిన ప్రయాణంలోని మలుపుల అంతరాలను, తన చుట్టూ ఉన్న సమాజంలో చూసిన గమనింపులని, కవిత్వంలోకి మలచిన నేర్పుల అక్షరతోరణాలన్నీ కలిసినవే ఈ “రవిక”.
ఈ పుస్తకంలోని మొదటి కవిత కూడా రవిక గురించే. మరి ఆ రవిక గురించి మాట్లాడాలి అంటే., మనం కొంచెం కాలాన్ని వెనక్కి తిప్పి, మొదలుపెట్టాలి. ఓ బ్రాహ్మణ స్త్రీ రవిక లేని స్థితి నుండి ఆధునిక స్త్రీగా రవికను అందుకున్న క్షణం వరకు.., ఆమె మేనిపై కరాల నృత్యం చేసిన చూపుల ఒత్తిడినే కాదు, కుటుంబ పునాదుల కింద కూరుకుపోయిన గొంతులో అందుకున్న స్వేచ్ఛా ఊపిరిదాకా ప్రయాణిస్తుంది. ఈ కవిత్వం.
అందుకు రేణుకగారు తన కవిత్వంలో
// పరువు, ప్రతిష్ట కుటుంబం మనుషులని
దాటుకొని కొత్త పోరాటపు గొంతుక
అందరికీ వినిపిస్తుందా// అన్న ప్రశ్న నుండి మొదలై
// రవిక ఎదని హత్తుకున్నాక తెల్ల గన్నేరు రెక్కలా ఉంది,
పాల చుక్కల గుండెలకి కట్టుకున్న వంతెనలా ఉంది,
ఊరికే చేతులు తగిలించడానికి అడ్డుపడే కత్తిపీటలా ఉంది // అంటూ
రవిక ఎలా ఒక స్త్రీకి తొడుగుగా మారిందో వివరించిన ఈ కవిత్వ ముగింపులో… “ఆమెలు తెచ్చుకున్న విజయం వెలుతురు అంటారు”. రవిక ఒంటికి వేసుకున్న మహిళను చూపిస్తూ.
మరి ఆనాటి నుండి నేటి తరం అనుభవిస్తున్న ఈ సౌకర్యం ఒకనాటి మగువల పోరాట ఫలితమే అని గుర్తు చేస్తారు.
స్త్రీల కోసమే పుట్టిన ఆచారాలు ప్రత్యేకించి స్త్రీలను వేధించే మనుధర్మ సూత్రాలను వ్యతిరేకిస్తూనే…
వైధవ్యంలో స్త్రీ పడే వేదనను,
ఆమెకు ఈ సమాజం చేసే గాయాన్ని కవిత్వీకరించడంలో… సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.
ఒక స్త్రీ జీవితాన్ని //వైధవ్యం పేరుతో బందిలదొడ్లో వేయడానికి వీళ్లంతా ఎవరు// అని ప్రశ్నిస్తారు.
ఆడపిల్లలకు వారి వంటి రంగు జత చేసి చూసే కాలం ఇంకా పోలేదు.., పోదు అందుచేత నువ్వే వీళ్ళలోని // తెల్లటి సమాజానికి చీకటి విలువ నేర్పు// అంటూ నల్లటి నగశీలు చెక్కిన నాలుకల గాజు మేడల్ని కూల్చివేయమంటారు.
మరి ఈ కవిత్వంలో వస్తువు పాతదే కదా..! అంటే పాత వస్తువులు అయినా.. కొత్త దారిని వెతుకుతూ నడిచే కవిత్వంగా ఈ పుస్తకంలోని కవితలని చూడవచ్చు.
“ఒప్పందాలు” ఈ కవితలో పెళ్లిని కాదనుకుంటున్న నేటి తరంలోని ధైర్యాన్ని, పెళ్లి పట్ల ఉన్న ఇన్ సెక్యూరిటీస్ కి కారణమైన ఈ పురుషస్వామ్యాన్ని గురించి చెప్తూనే…, నేటి స్త్రీకి సగం బలం, ఈ సాంప్రదాయ గోడల్ని బద్దలు కొట్టడమేఅంటారు.
నాటి తరం స్త్రీ అనుభవించిన మరో దుర్భర స్థితిని వివరించే ప్రయత్నంలో…
స్త్రీ మానానికి కచ్చడాలు కట్టి పురుషస్వామ్యం అధికారాన్ని ఎలా చాటిందో చెప్తూనే… వాటిని ఆ తరం స్త్రీలు ఎలా దాటుకొని తమని తాము గెలుచుకున్నారో గుర్తుచేస్తూ… నేటితరం ఆడపిల్లలకు ఈ కచ్చడాల తొడుగులే అవసరమేమో అంటూ… సాంఘిక భద్రత కరువైన రోజుల్లోని భయాన్ని తెలియజేస్తారు.
ఇందులో నాకు బాగా నచ్చిన కవిత “ఇన్లాండ్ హృదయం”
మనసు దూలనికి వెళ్ళాడే జ్ఞాపకాల చిట్టా, మనసు అద్దంలో వీడని వయసు సంకెళ్ల చిక్కుముడులు ఇవి విడిపోయి దూరంగా జరగవు, అలా అని ప్రవహించే జీవన సాగరంలో అడ్డుగాను నిలవని వొ శరదృతువులో అందుకునే చల్లని గాలి.
ఇలా… స్త్రీల వెంట వచ్చే కెమెరా కన్నుని, సమూహంలోని ఒంటరితనాన్ని, 60లో 20 గా మనసు చేసే రోదని, భార్యాభర్తల బంధంలో 60 ఏళ్ల వయసులో వచ్చే నిశ్శబ్దాన్ని, ఒంటరి మజిలీలో కోల్పోయిన భాగస్వామిని, గర్భ శోకాన్ని, గొడ్రాలి తనంలోని నిందల్ని, ఇలా తన ప్రతి కవిత్వంలో… స్త్రీలలో అంతర్వాణిగా ప్రవహిస్తున్న నిశ్శబ్ద యుద్ధాన్ని ప్రకటిస్తాయి ఈ పుస్తకంలోని ఎక్కువ భాగం కవితలు.
ఇందులో ఇంతటి కవిత్వం ఉన్నా..
కొన్ని అనవసరమైన విభేదాల గూటి అల్లికల వల్ల కొంత తేలిపోయేలా చేశాయి. కొన్ని సందర్భాల్లో తన కవిత్వము ఓ సాధారణ ఇల్లాలు చెప్తున్నట్టుగా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ సీనియర్ కవయిత్రి అయివుండి ఇలా ఇల్లాలి అభిప్రాయంగా చెపుతున్నా అని చెప్పడం నాకైతే నచ్చలే. వొ రచయితగా తన అభిప్రాయం చెప్పడంలో స్పష్టత మిస్ అయ్యారేమో. అనిపించింది. ఈ రవిక అన్న పేరు కూడా ఈ కవిత్వం అంతటికి అప్లికబుల్ కాదనిపించింది.
ఈ పుస్తకం మొత్తం 20 కవితలే కానీ ఇవి అన్ని దీర్ఘ కవితల్లా అనేక పార్శ్వలని చూపించే విభాగాలుగా ఒక్కో కవిత 5 లేదా 6 భాగాలతో రెండు లేదా మూడు పేజీలకి వొద్దికగా ఒదిగిపోయి ఉంటాయి.
తేలికగా అందే భావం, సరళతతో కూడిన వాక్యం , ఎక్కడా తొణకని గొంతు… మనల్ని వేగంగా చదివిస్తుంది. కాల ప్రయాణంలో నాటి నుండి నేటి స్త్రీత్వపు మార్పు వైపు ఆలోచించేలా నడిపిస్తుంది ఈ రవిక కవిత్వ సంపుటి.
ఈ తరం నడకలో భాగమైనందుకు అభినందనలు రేణుకా అయోలాగారు.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.