
ప్రమద
పి. సుశీల
-నీరజ వింజామరం
వస్తాడు నా రాజు ఈ రోజు .. .. అని ఎదురుచూసినా
ఝుమ్మంది నాదం .. అని ఒక మూగ గొంతు పలికినా
శ్రీ రామ నామాలు శతకోటి .. అని భక్తి రసం లో ఓలలాడించినా
ఆకులో ఆకునై పూవులో పూవునై .. అని ప్రకృతితో పరవశించినా
అది పి. సుశీల గారికే చెల్లింది. తెలుగు లోగిళ్ళలో అనాదిగా ముగ్గులు వేసే ఆచార మున్నా , ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయా అని పాడుతూ ముగ్గులేయిం చడంలో సుశీల గారి గాత్రానికున్న పాత్ర ఎవరు మరువగలరు?
“గాన కోకిల”, “గాన సరస్వతి”, “మెలోడీ క్వీన్”;, “గంధర్వ గాయని”; అని పిలువబడే పి. సుశీల పూర్తి పేరు పులపాక సుశీల., .ఆమె, భారతదేశంలోని అత్యంత సుపరిచితమైన నేపథ్య గాయకులలో ఒకరు. పి. సుశీల గారు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక చిరస్మరణీయ అధ్యాయం. తెలుగు సినీ సంగీత రంగంలో మహిళా గాయకులు అనగానే జ్ఞాపకం వచ్చే తొలి పేరు — పి. సుశీల .
ఆమె గళం కేవలం సంగీతానికే కాదు, భావవ్యక్తీకరణకు, స్పష్టమైన ఉచ్ఛారణకు నిలువెత్తు నిదర్శనం. ఒకే పాటలో ఆనందం, బాధ, ఆశ, విరహం అన్నీ ఒకేసారి వినిపించేలా పాడగలగడం ఆమె ప్రత్యేకత. సంగీత దర్శకుల నుంచి గాయకుల వరకు ఆమె ప్రతిభను ప్రశంసించని వారే లేరు. అటువంటి గానదిగ్గజం పి. సుశీల గారిని గుర్తు చేసుకోకుండా తెలుగు సంగీత చరిత్రను రచించడం అసాధ్యం.
సుశీల 1935 ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించారు. ఆమె తండ్రి, పులపాక ముకుంద రావు, విజయనగరంలో ప్రముఖ న్యాయవాది. ఆమె తల్లి పేరు శేషావతారం. ఆమె సంగీతం పట్ల ఆసక్తి ఉన్న కుటుంబం నుండి వచ్చారు.
చిన్నతనం నుంచే సుశీల సంగీతంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు . ఆమె కుటుంబ పెద్దలు ఆమెకు కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆమె తన పాఠశాల లో, విజయనగరం పట్టణంలో జరిగిన వివిధ సంగీత పోటీలలో పాల్గొని , పాల్గొన్న ప్రతిసారీ మొదటి బహుమతినే గెలుచుకున్నారు.
పాఠశాల విద్య తర్వాత, సుశీల విజయనగరంలోని మహారాజా సంగీత కళాశా లలో చేరారు. అప్పుడు , అక్కడ ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆమె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో డిప్లొమాలో ప్రథమ శ్రేణి సాధించారు . ఆమె ద్వారం వెంకటస్వామి నాయుడు నుండి శాస్త్రీయ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. ఆ శిక్షణ ఆమె సహజమైన సంగీత అభిరుచిని మెరుగు పరిచింది .
పద్యాలు పాడినప్పుడు సరైన భావ వ్యక్తీకరణకు కావలసిన సూక్ష్మ నైపుణ్యాలను సమకూర్చింది . ఆమె ఆల్ ఇండియా రేడియో (AIR) వారి ప్రైవేట్ ప్రోగ్రామ్ టెలికాస్ట్‌ల కోసం కొన్ని పాటలు పాడారు . 1951లో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కొత్త గాయనీ గాయకుల కోసం అన్వేషిస్తూ ఆల్ ఇండియా రేడియో (AIR)ని సంప్రదించారు. AIR ఐదుగురి పేర్లను పంపింది. వారిలో సుశీల ఉన్నారు.
ఒక ఆడిషన్ తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు ఆమెను ఎంపిక చేశారు. ఆమె తొలి సినిమా పాట ,1953లో విడుదలైన తమిళ చిత్రం పెట్రా తాయ్ కోసం ఎ. ఎం. రాజాతో కలిసి పాడిన “ఎదుకు అళైత్తాయ్” అనే యుగళగీతం. ఈ చిత్రం తర్వాత తెలుగులో కన్నతల్లిగా రీమేక్ చేయబడింది, దీని కోసం ఆమె ఘంటసాలతో అదే యుగళగీతాన్ని తెలుగులో రికార్డ్ చేశారు.
ఆ తర్వాత, ఆమె AVM స్టూడియోస్‌లో ఒక స్టాఫ్ సింగర్‌గా ఉద్యోగం పొంది, అనేక సంవత్సరాలు నిర్ణీత నెలవారీ జీతం అందుకున్నారు. స్టూడియో యజమాని, A. V. మెయ్యప్పన్, ఆమె తమిళ ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి సుశీల కోసం ఒక తమిళ శిక్షకుడిని నియమించారు. తెలుగు మాతృభాష అయినప్పటికీ, పి. సుశీల తమిళంలో దోషరహిత ఉచ్చారణను సాధించి, తమిళ సినీగీతాలలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారు.
1954లో మాడిడున్నో మారయ చిత్రంతో ఆమె కన్నడ చిత్రసీమలోకి ప్రవేశిం చారు. నటి జయంతితో ఆమె కలయిక కర్ణాటకలో బాగా ప్రాచుర్యం పొందింది.
1950 లలో పి. లీల, ఎం.ఎల్. వసంతకుమారి, జిక్కి వంటి ప్రముఖ మహిళాగాయకు లు ప్లేబ్యాక్ పరిశ్రమను ఏలుతున్న సమయంలో, ఒక కొత్త వ్యక్తి సంగీత రంగంలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదు. అయినప్పటికీ, సుశీల తన విలక్షణమైన మరియు స్పష్టమైన గాత్రంతో తనదైన ముద్ర వేసుకున్నారు. 1955లో, మిస్సమ్మ మరియు కనవనే కన్ కండా దైవం చిత్రాల ద్వారా తమిళ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో ఆమె పాటలు ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రాలతో ఆమె పేరు ఇంటింటికీ చేరిపోయింది .
ఆమె 1955 నుండి 1985 వరకు అన్ని దక్షిణాది భాషా చిత్రాలలో తిరుగులేని ప్రధాన మహిళా గాయకురాలిగా మారారు. ఆమె 1960లో వి. దక్షిణా మూర్తి స్వరపరిచిన సీత చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుండి, ఆమె జి. దేవరాజన్, ఎం.కె. అర్జునన్ వంటి మలయాళ స్వరకర్తలందరితో అనేక హిట్ పాటలను రికార్డ్ చేశారు . ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాస్‌తో కలిసి ఆమె అనేక మలయాళ యుగళగీతాలను రికార్డ్ చేశారు. ప్రముఖ తమిళ సంగీత విద్వాంసులు విశ్వనాథన్ – రామమూర్తి జంట సుశీల స్వరంలో తమిళ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పాటలను స్వరపరిచారు. 1965లో ఎం . ఎస్ . విశ్వనాథన్ రామమూర్తితో
విడిపోయారు. ఆ తర్వాత కూడా ఎం . ఎస్ . విశ్వనాథన్‌తో ఆమె అనుబంధం కొనసాగింది. ఎం.ఎస్. విశ్వనాథన్ తో కలిసి ఆమె అనేక అజరామరమైన పాటలను సృష్టించారు. ఘంటసాల (తెలుగు), టి. ఎం. సౌందరరాజన్ (తమిళం), మరియు పి. బి. శ్రీనివాస్ (కన్నడ)తో ఆమె పాడిన యుగళగీతాలు దక్షిణాది సంగీత పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికాయి. ఆమె టి. ఎం. సౌందరరాజన్ మరియు విశ్వనాథన్-రామమూర్తితో వందలాది పాటలను రికార్డ్ చేశారు. ఎదకల్లు గుడ్దద మేలే చిత్రం కోసం ఆమె పాడిన “విరహ నూరు నూరు తరహా” పాట భారతీయ సినిమాలోని టాప్ 10 పాటలలో ఒకటిగా పరిగణించబడుతోంది.
ఆమె స్వరంలో తీయదనమే కాక, సంక్లిష్టమైన స్వరాలను సులభంగా పలికే నైపుణ్యం, పాటలలో భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా వ్యక్తీకరించగల సామర్థ్యం ఉంటుంది.
1970లలో సుశీల తన కెరీర్ పతాక స్థాయిలో కొనసాగారు. 1980లలో ఎస్. జానకి, వాణి జయరాం వంటి గాయనీ మణులు , వచ్చినప్పటికీ, సుశీల గారు 1985 వరకు అగ్ర గాయనిగా తమ ప్రస్థానం కొనసాగించారు.
1985 తర్వాత చలనచిత్ర గానం నుండి భక్తి మరియు తేలికపాటి సంగీతం వైపు దృష్టి మళ్లించినప్పటికీ, ఆమె అప్పుడప్పుడూ సినిమాపాటలు పాడుతూనే ఉన్నారు.
2018లో, LKG అనే తమిళ చిత్రానికి పాటను రికార్డ్ చేశారు.
2019లో, ఆడై చిత్రానికి “రక్ష రక్ష జగన్మాత” పాటను ఆమె స్వయంగా పాడి తన గాత్రాన్ని మళ్ళీ వినిపించారు; ఇప్పటికీ ప్రముఖ సంగీత కార్యక్రమాలలో పాల్గొంటూ, అభిమానుల అభ్యర్థన మేరకు పాటలు పాడుతున్నారు.
పరిచయం లేని భాషల పదాలను కూడా అక్షరాల సరైన ఉచ్చారణతో పలకడం కోసం శ్రద్ధ వహించేవారు. ఆమె ఆ భాషల్లో బాగా మాట్లాడకపోయినా, స్థానికులు ఆమెను తమ సొంతంగా భావించే స్థాయిలో పాడగలిగారు.
మైక్రోఫోన్ , సౌండ్ ఇంజనీరింగ్ విషయంలో, మంచి రికార్డింగ్‌కి అవసరమైన ప్రమాణాల పట్ల, ఆమెకు మంచి అవగాహన ఉంది. మైక్రోఫోన్ , సౌండ్ ఇంజనీర్లు ఇచ్చే సూచనలను పాటించి వారికి పూర్తిగా సహకరించే వారు.
1967 లో ఊటీ వరై ఉరవు చిత్రంలోని “తేడినేన్ వంతతు” పాటను రిహార్సల్ చేశారు . దర్శకుడు సి.వి. శ్రీధర్ కు ఆ పాట నచ్చలేదు. కానీ దానిని అత్యవసరంగా రికార్డు చేయాలి. ఎం.ఎస్. విశ్వనాథన్ దానికి కొత్త బాణీ కట్టారు . పి. సుశీల కేవలం అరగంటలో కొత్త ట్యూన్‌తో పాడి, ఆ పాటను అర్థరాత్రి రికార్డు చేశారు – ఈ సంఘటన ఆమె నిబద్ధతను , వృత్తి పట్ల ఆమెకు ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది.
ఎన్నో సందర్భాలలో ఆమెను చాలా సంయమనం ప్రదర్శించారు. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాతో ప్రారంభంలో అపార్థం ఉన్నా, సమయం గడిచే కొద్దీ వారితో సంబంధాన్ని మెరుగుపర్చుకున్నారు.
సుశీల గారు డా. మోహన్ రావును వివాహం చేసుకున్నారు. ఆయన 1990లో మరణించారు. వారికి జయకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ, ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్‌తో కలిసి గాయనిగా అరంగేట్రం చేశారు. ఆమె మనుమరాళ్ళలో ఒకరు – శుభ శ్రీ – సంగీత దర్శకుడు తమన్ ఎస్.తో కలిసి లీడ్ గిటారిస్ట్‌గా ఉన్నారు. ఆరు ప్రాథమిక భారతీయ భాషలతో పాటు, ఇతర భాషలలో కూడా (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ మరియు బెంగాలీ, ఒడియా, సంస్కృతం, తులు, బడాగ, మరియు సింహళీస్ వంటి ఇతర భాషలు ) 17,695 పాటలు పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు . ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన పి. సుశీల గారికి భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమయిన పద్మ భూషణ్ దక్కింది .
“నాలై ఇంత వేలై” (ఉయర్ంద మనితన్, 1969), సవాలె సమాలి (1971), సిరి సిరి మువ్వ (1978), మేఘ సందేశం (1982), ఎం.ఎల్.ఏ. ఏడు కొండలు (1983) చిత్రాలకు గాను ఐదు జాతీయ అవార్డులు పొందారు.
అన్ని దక్షిణాది రాష్ట్రాల, రాష్ట్ర స్థాయి అవార్డులను ఆమె ఎన్నో సార్లు సొంతం చేసుకున్నారు. ఇక ప్రత్యేక పురస్కారాలకు లెక్కే లేదు.
2008లో, ఆమె పి. సుశీల ట్రస్టును ప్రారంభించారు, ఇది అవసరమైన సంగీతకారులకు నెలవారీ పెన్షన్ చెల్లింపులు, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ట్రస్ట్ ఆమె పుట్టినరోజు (ఏప్రిల్ 13) నాడు నిర్వహించే సంగీత కచేరీల సమయంలో సీనియర్ కళాకారులకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. ఈ అవార్డు గ్రహీతలలో టి. ఎం. సౌందరరాజన్, పి. బి. శ్రీనివాస్, ఎస్. జానకి, వాణిజయరాం, ఎల్. ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, ఎస్. పి. బాలసుబ్రహ్మ ణ్యం, మరియు కె. జె. యేసుదాస్ ఉన్నారు.
పి. సుశీల గారి జీవితం ఒక సంగీత యాత్ర. ఆమె పాటలు లక్షలాది మందిని ప్రేమ, త్యాగం, భక్తి, దేశభక్తి వంటి భావాలతో ముంచెత్తాయి. ఆమె గాత్రమే కొన్ని తరాలకు ఓ చెరగని జ్ఞాపకం, ఎన్నో ప్రేమ కథల అనుభూతి, దేవాలయాలలో ప్రతిధ్వనించే మంగళధ్వని. పి. సుశీల గారు ఓ గాయకురాలు మాత్రమే కాదు — ఓ యుగం. ఆమె గానం ప్రతి తెలుగు మనసులోనూ ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. “గానం అంటే ఏమిటో” తెలుసుకోవాలంటే ఆమె పాటలు వినాలి . ఆమె పాటలే పాఠాలు .
తెలుగు సంగీత జగత్తులో ఆమె పేరు చిరకాలం, పదిలంగా నిలిచిపోతుంది. సంగీత లక్ష్మి ముద్దుల తనయ సుశీల తెలుగు బిడ్డవడం మనందరికీ గర్వకారణం.
*****

నీరజ వింజామరం సెయింట్ పీటర్స్ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. పాటలు వినడం పుస్తకాలు చదవడం నా హాబీలు . పిల్లలంటే చాలా ఇష్టం . వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటాను .