గజల్ సౌందర్య – 2

-డా||పి.విజయలక్ష్మిపండిట్

          గజల్ సౌందర్యాన్ని ఇనుమడింప చేసేది హృదయ లోతుల్లో ఉండలేక పొంగి పొర్లి ఉప్పెనగా బయట పడే భావోద్వేగాల అక్షర స్వరూపం గజల్ . “గుండె గొంతుక తోన కొట్లాడుతాది కూర్చుండనీదురా కూసింతసేపు “.అని నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో అంటారు. అదేభావం Robert Frost poem నిర్వచనంలో వినిపిస్తుంది.Robert Frost famous American poet “ A poem is “never a put-up job. … It begins as a lump in the throat, a sense of wrong, a homesickness, a loneliness. It is never a thought to begin with.”
ఈ కవిత్వం నిర్వచనం గజల్ తత్వాన్ని తెలుపుతుంది .
 
          ఆ అనంత చైతన్య ప్రేరిత ఆనుభూతులు …, ప్రేమ, ఆనందం, విరహం , నిరీక్షణ సుందర అక్షరరూపం పొందే ఆ దివ్యానుభవ క్షణాలు మాట్లాడే “ఆత్మ భాష /హృదయ భాష గజల్” “అంటాను నేను.
 
          గజల్ ..,ఆ కవి హృదయానుభూతుల సమాహారం. గజల్ రాసినప్పుడు ,ఆ గజల్స్ ను పాడినపపడు ఆ అనుభూతిని అంత గాఢంగా అనుభవిస్తూ రాసినప్పుడే ,  పాడిన పుడే ఆ గజల్ సౌందర్యాన్ని పాఠకులు శ్రోతలు తాదాప్యాన్ని అనుభవాన్ని  అనుభ వించ గలుగుతారు. 
 
          అందుకే ఉర్దూ గజల్ కచేరీలలో శ్రోతలు గొప్ప గజల్ గాయకుల గానం వింటానే వహ్వ వహ్వా అంటూ మెచ్చుకోవడం చేస్తుంటారు.
 
          గజల్ సౌందర్యం..,ఆ గజల్ లో వస్తువును మనసును దోచే భావవ్యక్తీకరణతో అందమైన ప్రతీకలు ,చక్కని చమత్కార పదబంధాలతో అల్లిన గజలియత్ పై  ఆధారపడి ఉంటుంది. ఆ గజల్ గాయకులు సృతి లయలతో అంతే అనుభూతితో తాదాదాప్యంతో గానం చేసినపుడు శ్రోతలు ఆ గజల్ భావంలో లీనమై గజల్  సౌందర్యాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. ఉర్దూ హిందీ గజళ్ళు కచేరీలు  విభావ రీలు అంత పాపులర్ అవడానికి కారణం లోతైన భావోద్వేగంతో గానం చేస్తూ కచేరీలు జరపడం .
 
గజల్ లో వస్తువు:
 
గజల్ వస్తువును పరిశీలిస్తే..గజల్ పుట్టి దాదాపు వెయ్యి సంవత్సరాలైనా ఉర్దూ హింది తెలుగు భాషల్లో ఇప్పటికీ గజల్ వెలుగుతున్న కారణం..గజల్ ప్రాథమికంగా  విశ్వజనీ నమైన స్త్రీ పురుష ఆకర్షణ..ప్రేమ ప్రణయం శృంగార, వియోగ, నిరీక్షణ భావోద్వేగాల వ్యక్తీకరణ వారధి. మధుర రసాత్మక పదబంధాలతో చమత్కారాలతో ప్రేమ భావ సంభాషణ యోగ్యమై శృంగార రసమే ప్రాథమిక వస్తువుగా గల గజల్ పుట్టి దాదాపు వెయ్యి సంవత్సరాలయినా గజల్ కు చావెక్కడ?
 
          గజల్ లో ప్రేమ శృంగార ప్రాధాన్యతను గ్రహిస్తే ప్రేమ మయమైన ఈ జగత్తులో ప్రేయసితో ప్రియునితో , మధుశాలలో సాఖీతో ,సూఫీ తత్వంలో దేవునిపై మధుర భక్తి భావనతో దేవునితో.., ప్రకృతితో కవి స్వతహాగా తన అంతరంగంతోనూ.. సంభాషించు కోవచ్చు.
 
          ప్రేయసి అందచందాలు, ప్రేమానురాగలు , విరహం, నిరీక్షణతో హృదయంలో పెల్లుబికినకే భావోద్వేగాల నివేదనకు అధ్భుత అక్షర రూప మయిన గజల్ ను తెలుగు కవులు రాయడానికి కొందరి విమర్శలకు భయపడుతూ గజళ్ళను తెలుగులో రాయక పోవడాన్ని ప్రచురించుకోక పోవడాన్ని గమనించిన నేను, ప్రముఖ కవి కళారత్న బిక్కి కృష్ణ తెలుగు గజళ్ళను తెలుగు కవులు కుల మత ప్రాంత భేదం లేకుండా నిర్భయం గా నిర్భీతితో రాసి ప్రచురించు కోవాలని, తెలుగు గజళ్ళు విశ్వవ్యాప్తం కావాలన్న లక్ష్యంతో 2021 Feb. లో “ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ “(VGF)ను స్థాపించాము. గజల్స్ పై work shops పెట్టి , గజల్ కవులు రాసిన రెండు సంపుటాలను VGF Publications పబ్లిష్ చేసి ,పురస్కాలతో కవులను ప్రోత్సహిస్తూ రావడంతో వందల మంది కవులు గజళ్ళను రాసి ప్రచురించు కుంటున్నారు.
 
          గజల్ కు ఒక మహత్తర ఆకర్షణ శక్తి ఉంది. గజల్ కౌగిలికి చిక్కిన రసహృదయులు ఆ మధుర అక్షర గజలియత్ ల పరిష్వంగం నుండి బయట పడడం కష్టం. గజల్ కవి అధ్భుత అసమాన సృజనాత్మకత శక్తితో తన భావోద్వేగాల ,అనుభవాల అనుభూతుల తో గజల్ కు ప్రాణం పోయడం ఒక అధ్భుత కళ.
 
          గజల్ తన ప్రాథమిక వస్తువు ..;ప్రేమ ప్రణయం, విరహం వేదనలనే కాకుండా కాలక్రమేణ గజల్ వైవిద్యమైన సామాజిక , సాంస్కృతిక అంశాలను కూడా తనలో ఇముడ్చుకొనే నిర్మాణ శైలి సత్తాను ప్రదర్శిస్తూంది.
 
తెలుగు గజల్ కవులు-గజళ్ళు:
 
దాశరధి కృష్ణమా చార్య గారిని తొలి తెలుగు గజల్ కవిగా గుర్తిస్తారు. ఉర్దూ భాషా పాండిత్యంతో రసహృదయులు కావడంతో వారు మొహమ్మద్ అసదుల్లా గాలిబ్ గజళ్ళకు ఆకర్షితులై గాలిబ్ షేర్లను ద్విపదలను తెలుగు లోకి అనువదించి”గాలిబ్ గీతాలు “అన్న శీర్షికతో 1963లో ప్రచురించారు. బాపు గారి గీతల అందమైన చిత్రాలు ఆ గాలిబ్ గీతాలకు వన్నె నిచ్చాయి.
 
          దాశరథి అనువదించిన మనసును దోచుకొనే కొన్న గాలిబ్ గీతాలు …,
ఉదాహరణకు గాలిబ్ గజల్స్ ను దాశరధి గారు తన శైలిలో ఇలా తర్జుమా చేశారు..,
 
“ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరము లెమ్ము”
 
“ప్రేయసి గృహవీధి స్పృహతప్పి పడిపోయి
ముదిత కాలిగురుతు ముద్దు గొంటి”
 
“గుండె దొంగిలించుకొని పోయె జంకక,
ముద్దొసంగ వెనక ముందు లాడు”.
 
“ కత్తి చేతలేక కదనమ్ము జరిపెడు
ఇంతి కెవ్వ డసువులీయకుండు?
 
“ఎంతకని వ్రాతు నా గుండెవంత ? నింక
ఆమెకున్ జూపెదను రక్తిలాంగుళులను.”
 
          నా యవ్వన దశ 1960s లో ప్రచురించిన దాశరథి గారి’గాలిబ్ గీతాలు ‘నా మనసును దోచుకున్నాయి. గజల్ పై నిద్రావస్తలో ఉన్న ఆ ప్రేమ నాలో మరలా మొలకెత్తి చిగురించింది.
 
          దాశరథి రంగాచార్యులు గాలిబ్ గీతాల ద్వారా తెలుగులో గజళ్ళకు బాటలేశారు.
వారి తొలి తెలుగు గజల్‌ ..;
“వలపునై నీ హృదయసీమల నిలువవలెనని ఉన్నది
పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది’’..
 
          1965లో వచ్చిన దాశరథి గారి తొలి తెలుగు గజల్‌లోని మత్లా ఇది. ఇది 14 ఏప్రల్ 1965 ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో “ఉగాది గజల్” అన్న శీర్షికతో అచ్చయింది. దాశరథి వెలువరించిన ‘ కవితా పుష్పం ‘ అన్న సంకలనంలో ‘ కామన’ అన్న శీర్షికతో అచ్చయిన తొలి గజల్ ఇది. తొమ్మిది షేర్లు ఉన్న దాశరధి గారి ఈ తొలి గజల్ ను కేసిరాజు కృష్ణ పాడిన గానం వినండి.
 
          దాశరధి గారి గజళ్ళలో వస్తువు ప్రేమ ప్రణయం విరహం నిరీక్షణ. ఇది ప్రాథమికంగా గజల్ యొక్క వస్తు తత్వం . రాను రాను కాలగమనంలో గజల్ వస్తువు విస్తృతమై వైవిద్యమైన గజళ్ల సృష్టిని గమనిస్తాము.
 
          తరువాత తెలుగులో ప్రేమ ప్రణయ సంభాషణ అంశమే కాకుండా సామాజిక అంశాలతో వైవిధ్యమైన గజళ్ళ ను ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు డా. సి. నారాయణ రెడ్డి గారు. ( సి. నా. రె.)
 
          సి.నా. రె. తన గజళ్ళ లోని అంశాలేవో తన”తెలుగు గజళ్ళు “ సంపుటిలో వారు
రాసుకున్న గజళ్ళ గురించి ఇలా అన్నారు; “ గజల్ అంటే అనేక అర్థాలున్నా స్థూలంగా ‘ప్రియురాలితో సల్లాపం’ప్రాయంగా ఇది శృంగారపరం. కొన్నింటిలో తాత్విక స్పర్శలూ ఉంటాయి. కానీ నా గజళ్ళలో ప్రణయానికి బదులుగా మానవీయ దృక్పథాన్ని, ప్రగతి శీలాన్ని, మెత్తని అధిక్షేపాన్ని ప్రవేశ పెట్టానని “ సి. నా. రె. వారి గజళ్ళ లోని అంశాలేవో వారే వివరించారు.
 
          వారి గజళ్ళలో మనిషి , మానవత, ప్రగతిశీల సందేశం, సామాజిక అంశాలతో గజళ్లు అల్లారు. కొన్ని గజళ్ళలోని షేర్లను పరిశీలిద్దాము …
 
“పరులకోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని?
మూగనేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని?
 
తాతలు తాగిన నేతులు సంగతి నీతులు పలికే మన సంస్కృతి
జల్లులు నిలవని ఎండకు ఆరని చిల్లుల గొడుగు దేనికని?”
 
          ఈ గజల్ లో ..,మానవత్వం మంచితనం విశాలహృదయం లేని ,అవసరానికి ఆపన్నహస్తం అందివ్వని కుహనా ఆదర్శాల మాటలు దేనికని ? అంటూ …,వాగు పరుగు, చిల్లుల గొడుగు, కదలని అడుగు , అందని వెలుగు, పైపై తొడుగు అనే ‘ఖాఫియాల’తో ‘దేనికని ‘అనే ‘రదీఫ్ ‘తో ప్రభోదించే గజల్ .
 
          సి. నా. రె.గారి మరో సందేశాత్మక గజల్ “ఆత్మలను పలికించేదే అసలయిన భాష” లో కొన్ని షేర్లలోని గజలియత్ /భావ సౌందర్యాన్ని చూద్దాము.
 
ఆత్మలను పలికించేదే అసలయిన భాష
ఆ విలువ కరువై పోతే అది కంఠ శోష
 
వేదం ఖురాన్ బైబిల్ వీధిలోన పడతాయా
మత మేదైనా ఒకటేలే ప్రతిమనిషి శ్వాస
 
అవినీతికి పట్టం కట్టీ అభ్యుదయం పూడ్చిన జాతీ
ఇకనైన కళ్ళు నులుముకో ఇది రక్త ఘోష.
 
నానాటికి ఏమీ! పతనం నాలో ఒక తీరని మధనం
ప్రభుత్వాలు ఏమైతేమి పైసా పై ధ్యాస.
 
తల మెరిసిపోతే దిగులు తనువూరిపోతే దిగులు
అది దిగువ కాదు ‘సి నా రె ‘తుది జీవితాశ.
 
          పై గజల్ లోని షేర్లు ..,పతనమవుతున్న మానవ విలువలను, చెలరేగిన మత మౌఢ్యాలను, సంఘంలోని అవినీతిని సరళ పదాలతో అందమైన భావుకతతో పలికించారు సి.నా.రె.
 
          గజళ్ళు స్వరపరిచి ఆ గజల్ లోని రసానుభూతితో పాడినపుడు ఆ గజల్ సౌందర్యం మనోహరం. సి.నా.రె. వారి కొన్ని గజళ్ళను వారే స్వరపరిచి పాడారు. వారి గజళ్ళను క్రింద లింక్ లో వినండి .
 
          ఆకాశవాణి లో సి. నా. రె గానం చేసిన వారి గజల్ “ ఏవో ఏవో బాధలు భరించె మూగ జీవితం “ పైన లింక్ లో వినండి. రాజేశ్వర రావు సంగీతం లో సి.నా.రె. పాడుతూంటే శ్రోతగా మనం ఆ మధుర భావ గాన స్రవంతిలో మునిగిపోతారు.
 
          ప్రముఖ గజల్ కవి ,కాళోజి పురస్కారం గ్రహీత పెన్నా శివరామ కృష్ణ గారు ఉర్దూ గజళ్ళ అవగాహనతో గజల్ ప్రక్రియ అధ్యయనంతో పెన్నా శివరామ కృష్ణ గారు రచించిన “ గజల్ సౌందర్య దర్శనం “ అనే గ్రంథం గజల్ చరిత్ర , గజల్ వస్తు నిర్మాణ శైలిపై ప్రామాణిక గ్రంథంగా పేర్కొనవచ్చు. వారు రచించి ప్రచురించిన గజళ్ళ సంపుటాల నుండి వారి గజళ్ళ సౌందర్యాన్ని ఆస్వాదిద్దాము.
 
          పెన్నా శివరామ కృష్ణ గారి గజళ్ళలో ప్రియుని ప్రేమ ప్రణయానికి స్పందించని ప్రేయసి నిరాదరణకు గురయిన ప్రియుని మనోవేదన వస్తువుగా మలిచిన గజళ్ళు ఎక్కువ. వారి రెండు గజళ్ళ సంపుటాల నుండి రెండు గజళ్ళలోని షేర్లను పరిశీలిద్దాము.
 
          “శిశిర వల్లరి“ (2012)సల్లాపం”(2003) వారి 2 గజల్ సంపుటాలు . “సల్లాపం “లోని ఈ గజల్ షేర్లను చూడండి.
 
మనసులోనే పిలిచి పిలిచి అలిసిపోతాను!
నీవు వచ్చే లోపు మట్టిగా మారిపోతాను!
 
కారు చీకటి కమ్ము కున్నా చింత నాకేల
హృదయాగ్నికీలల అగ్నిలోనే నడిచిపోతాను!
 
నిన్ను రోజు చూడవలెనన్న కాంక్ష తీరుటకు
నీ దారిలో ఒక మైలురాయిగ నిలిచిపోతాను!
 
నిన్ను నాలో చూడవలెనన్న ఆశ ముగిసింది
పెనుశిలకు తాకిన అద్దమై కడతేరిపోతాను!
 
మారు రూపము దాల్చు విద్యను నేను నేర్చుకుని
చిరుగాలి తరగగ మారి చెంపను తాకి పోతాను!
 
వీధిలో నను చూడగనే తలుపు మూసితివి
నీ ద్వారమునకే చిరుముద్దును ఇచ్చిపోతాను!
 
          ఈ గజల్ లో ప్రేయసి ప్రేమ తిరస్కారంతో పరాకాష్టకు చేరిన ప్రియుని మనో వేదనను హృద్యమయిన గజలియత్ తో చిత్రించారు శివరామకృష్ణ గారు.
 
          వారి మరో గజల్ సంపుటి” శిశిర వల్లరి“ (2012)లోని గజల్ షేర్లలోని వస్తు నిర్మాణ శైలి గమనించండి.
 
పూవుపూయించి మొగ్గగా తిరిగి మారమంటే ఎలా?
వేణువుగా మలిచి వెదురుగ మారమంటే ఎలా?
 
దూరాభారాలు దాటి గమ్యం చేరిన నది ఒకటి
జలధికోపించి నదిని దూరముగా వెళ్ళమంటే ఎలా?
 
ఇసుకపొరకాదు నీటితెరకాదు హృదయమంటే చెలీ
ఎదను నీ వర్ణచిత్రముగ తీర్చి చెరపమంటే ఎలా?
 
          ప్రేమ ప్రణయమార్గాన నడిచి దగ్గరయిని ప్రియుని తుదకు తిరస్కరించిన ప్రేయసిని సంభోదిస్తూ .. ఆమె నిర్ధాక్షిణ్య తత్వాన్ని ఈ గజల్లో సుందరమైన ప్రతీకల పదబంధాలతో వ్యక్తీకరించారు శివరామకృష్ణ గారు.
 
          ప్రముఖ గజల్ కవి , చిత్రకారుడు సురారం శంకర్ గారు మనోహరమైన గజళ్ళు రసహృదయ పాఠకులను అలరిస్తాయి. “ సౌగంధిక” , “సౌపర్ణిక” వారి గజళ్ళ 2 సంపుటాలు.
 
          అందుకోలేని ప్రేయసి అందచందాలు అందని ద్రాక్షా పండ్లులా  కవ్వి స్తూంటే..,ఎలా నిన్ను చూసేది,పాడేది,కొలిచేది,చేరేది, కలిసేది,గెలిచేది అనే అంత్యప్రాసలతో ‘ఖాఫియాల’తో ,సరళ సుందర పదబంధాలతో సురారం శంకర్ గారి
హృదయ భాషను..భావ వ్యక్తీకరణను వారి ఈ గజల్ లోని గజలియత్ సౌందర్యాన్ని గమనించండి.
 
ఒకే చూపు వేయి పున్నములు ఎలానిన్ను చూసేది?
ఒకే పాట వేయి భావనలు ఎలా నిన్ను పాడేది?
 
జీవితాశ నిండా నీవే జీవయాత్ర నిండా నీవే
ఒక తలపు వేయివేల స్పందనలు ఎలా నిన్ను కొలిచేది
 
సందెపొద్దు సంకెల నీవై సదా శ్రీలు కురిసేవే
ఒక ఆశ వేల విఘ్నములు ఎలా నిన్ను చేరేది?
 
పడిలేచే కెరటమై ఒడిచేరిన సరాగమా..
ఒక చినుకు వేయి ఆమనులు ఎలానిన్ను తడిసేది?
 
కొండల్లో కోనల్లో కోవెలవై వెలిశావే
ఒక తపన వేయి సంధ్యలు ఎలా నిన్ను కలిసేది?
 
ఏమైనా ‘శంకర్ ‘ఎదలో తానే నీ సర్వం గర్వం
ఒక పుటకే వేయి గమ్యములు ఎలా నిన్ను గెలిచేది?
 
వారి “సౌగంధిక “ గజల్ సంపుటిలోని గజల్ ఇది.
 
మరో గజల్…,
 
ఆకసానికి చూపు సాచితి ఉనికి తెలియదు నేటికీ
గుండెలో స్నేహాలు నాటితి మొక్క మొలవదు నేటికీ
 
కొలను సాంతం పూల మడిగా తీర్చితిని నీ రాకకై
హృదయ దళమును త్రుంచుకుంటివి మాట తెలుపవు నేటికీ
 
హద్దులను చెరిపేసి ఆమని సిద్ధపరచితి మౌనినై
కలల తీరం చేరుకుంటివి తలుపు తీయవు నేటికీ
 
నీకు నా కథ చూడ ముచ్చట, నాకు మాత్రం వ్యథేలే
మనసు పత్రం చదువుకుంటివి లేఖ రాయవు నేటికీ
 
కాలగతిలో నాకు నేనే కానుకైతిని కావ్యమై
బ్రతుకు తంత్రిని మీటి పిలిచితి తొలకరించవు నేటికీ
 
వృథా “శంకర్”! రాతి మనసుల నీతి తెలియని స్నేహము
మనిషిగా నా మనసు పంచితి స్వీకరించవు నేటికీ.*
 
          హృదయదళములు తుంచుకుని కలల తీరం చేరుకుని పలకని ప్రేయసి కోసం ప్రియుని తపనను ..ఎంత మధురంగా పలికించారో ఈ గజల్ లో గజలియత్ ను గమనించండి..
 
          గాయకులు ఆనంద్ తలారి పాడిన “ సౌపర్ణిక” గజల్ సంపుటిలోని సురారం శంకర్ గారి గజల్ ని క్రింద లింక్ లో వినండి.
 
          ప్రముఖ గజల్ కవి ప్రొ.ముకుంద సుభ్రమణ్యం శర్మ గారి గజళ్ళు జీవన సుఖ దుఃఖ భావోద్వేగాల సౌందర్యాన్ని ,ఆశావహ దృక్పథాన్ని చక్కని ఖాఫియా రదీఫ్ లతో లయబద్దంగా నడుస్తాయి. వీరు తన గజళ్ళలో ‘తఖలుస్ ‘కు ప్రాధాన్యత నివ్వరు.
 
          వారి గజళ్ళ లోని ఈ కింది షేర్లను చదవండి.
 
మధురమైన జ్ఞాపకాలు భారమౌను కొన్నాళ్ళకి !
మురిపించిన ప్రేమ లతలు మాయమౌను కొన్నాళ్ళకి!
 
తెలియ నట్టు ఉంటావేం ఎద కోయిల కూస్తున్నా!
ఎప్పుడూ తెరవని తలుపే భాగ్య మౌనుకొన్నాళ్ళకి!
 
నవ్వుకునే సిరి మల్లికి ఏ తలపుల పులకింతో
ఈ మౌనం నీ ఎదలో గాయ మౌను కొన్నాళ్ళకి!
 
ఎదురుచూసి ముగిసి పోవు ఎండుటాకు జీవితాలు
రాలి పడిన పూలు కూడ ధన్య మౌను కొన్నాళ్ళకి!
 
తలపు లెన్ని ఉన్నాయో నీ తలగడ నడిగి చూడు
పొరపాటుకి రుణమెంతో అర్ధ మౌను కొన్నాళ్ళకి!
 
పనికి రాని దేమున్నది నీ కనులకి మనసుంటే
చీకటిలో మిణుగురుయే దీప మౌను కొన్నాళ్ళకి!
 
నీకోసం తపిస్తున్న మనసు నెలా చంపేయను
పిచ్చి వాడి ప్రేమ కూడ కావ్య మౌను కొన్నాళ్ళకి!
 
రెండో గజల్…;
 
తీరానికి అలల పోటు భరించడం తెలియాలి!
సమరానికి వ్యూహాలను రచించడం తెలియాలి!
 
పోరాటం లేనిచోట విజయానికి తావులేదు
ఓటమిలో పాఠాలని స్మరించడం తెలియాలి!
 
బలహీనత లేనివాడు లేడన్నది పచ్చినిజం
మచ్చలనే అందంగా ధరించడం తెలియాలి!
 
కొండనైన డీ కొట్టే సాహసమే కావాలోయ్
సాధనతో స్వప్నాలను జయించడం తెలియాలి!
 
నీలక్ష్యం నీ ఊపిరి ఒకటేనని మరువబోకు
ఎద లోపలి చీకట్లని జ్వలించడం తెలియాలి!
 
వివాదాలు విరోధాలు కొత్త కాదు ఆగి పొకు
కష్ఠాలకి చిరునవ్వుని వరించడం తెలియాలి!
 
రాలి పోని పువ్వు లేదు తెలవారని పొద్దు లేదు
ఈ రంగుల లోకంలో నటించడం తెలియాలి!
 
          సుప్రసిద్ధ కవి, గజల్ కవి కళారత్న బిక్కి కృష్ణ గారు అన్నదాతలు శ్రమజీవులు రైతన్నలపై గజల్ రచించిన తొలి గజల్ కవి. రైతుల పై ఆరాధన భావంతో ఆకట్టుకొనే హృద్యమైన గజల్ ను రాసిన ప్రధమ కవి.
 
“రైతుల పై పూలు చల్లి దైవాలను పూజించు”
అనే వారి ఈ గజల్ ను ఆశ్వాదించండి.
 
రైతులపై పూలు జల్లి దైవాలను పూజించు
నాగళ్ళకు నమస్కరించి శ్లోకాలను పఠియించు!
 
నవధ్యానం పండితేనె గ్రహాలకు నైవేద్యం!
శ్రమ వేదం పచ్చని దేశం క్షేత్రాలను స్మరియించు!
 
చేలగట్లపైన రాళ్ళే శివలింగాలని తెలుసుకో
ఎద్దులగళాల గంటల నాదాలను ధ్యానించు!
 
కూలీల చెమటబొట్టె నీఅన్నపు మెతుకాయె!
అధికారం ఎండమావి చట్టాలను సవరించు!
 
నేతలు మేధావులంత అన్నదాత లౌదురా!
కృషీవలుడె నిజమైన రుషి త్యాగాలను ప్రేమించు!
 
          బిక్కి కృష్ణ గారు “ వల్లరి” , “ స్వాంతన “ అన్న రెండు గజల్ సంపుటాలను వెలువరించి నారు.
 
అన్నదాతలైన రైతు కూలీల శ్రమజీవన సౌందర్యాన్ని అందమైన గజల్ గా మలచిన
అద్భుత ప్రయోగం ఈ గజల్. బిక్కి కృష్ణ గారి ఈ గజల్ లో చేసిన డబుల్ ఖాఫియా
( 2 ఖాఫియాల) ప్రయోగాన్ని పరిశీలించండి..,
 
నిను మార్చలేను నేమారలేను గాయమై
పోయానులే!
కను మూయలేను నినుచేరలేను గేయమై పోయానులే!
 
నీ పెదవికన్న మధుపాత్ర మేలని విఫల ప్రేమ తెలుపిందిలే
ఎద కోయలేను నిను చూడలేను రోగమై పోయానులే!
 
వలపుపక్షినై ఎగిరిపోవచ్చు చిత్రం చెరిగిపోదే నీవలపు చిత్రం!
మరణించలేను నినుమరువలేను మౌనమై
పోయానులే!
 
కంటి చెట్టుపై పూలకన్నీరై ఎదనేలపై రాలివాడిరేయాను
శిశిరమై పోలేను నీ ఉసురు కాలేను రాగమై పోయానులే!
 
మనసు మాయామృగం సొగసు ఛాయాగ్రహం
కృష్ణా!
శిలనై పోలేను నిను కలువలేను శూన్యమై
పోయానులే!
 
          కళారత్న బిక్కికృష్ణ కు తనచుట్టు ఒక తెలుగు కవిత్వ సమూహాన్ని ఏర్పాటు చేయాలన్నది అతని ప్రగాఢ లక్ష్యం. ఆ లక్ష్యంతో కవిత్వం పై “కవిత్వం  డిక్షన్  “అన్న పుస్తకం రాసి ఉచితంగా పంచిపెట్టడం అతనిలోని కవిత్వ సాహిత్య సేవకు ఓ ఉదాహరణ.
 
          గజల్ ప్రక్రియల్లో ప్రయోగాలు , తెలుగు గజళ్ళకు అధ్భుతమైన సమీక్షలు విశ్లేషణలు అవలీలగా చేస్తూ , రాస్తూ గజల్ కవులను ప్రోత్సహించడం అతని నైజం. కళారత్న బిక్కి కృష్ణ ఎన్నో సినిమాలకు పాటలు రాసి ప్రముఖ గాయకుల, మ్యూజిక్ డైరక్టర్ ల ప్రశంసలందుకున్నారు .
 
          బిక్కి కృష్ణ దాదాపు 29 తెలుగు గజల్ కవుల గజళ్ళ సౌందర్య సమీక్షలను ఆంధ్రప్రభ దిన పత్రికలో ధారావాహికగా ప్రచురించారు. వారి “గజల్ సౌందర్యం-సమీక్షణం”“ వ్యాసాలు పలువురి ప్రశంసలందుకున్నాయి.
 
          గజల్ కవులకు గజల్ వస్తు నిర్మాణ అభివ్యక్తి శైలి, గజలియత్ అంశాలపై అవగాహన కలిగించే ఆ గజల్ సమీక్షణ వ్యాసాలను మా “విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్ “( VGF) Publications పుస్తకంగా ప్రింట్ చేయించి విజయవాడలో నిర్వహించిన మొదటి VGF వార్షికోత్సవం (2022 )మీటింగ్ లో కవులకు ఫ్రీగా పంచాము.
 
          మధుర గాయకుడు తలారి ఆనంద్ గానం చేసిన బిక్క కృష్ణ గారి గజల్ ను వినండి.
 
          రాబోయే ‘నెచ్చెలి ‘సంచికలో మరికొంత మంది ప్రముఖ తెలుగు గజల్ కవుల గజళ్ళ సౌందర్యాన్ని పరిశీలించి గజల్ గానం విని ఆస్వాదిద్దాము .
*****
(సశేషం)
 
 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.