“అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు” సమీక్ష

-పి. యస్. ప్రకాశరావు

          సామాజిక ప్రయోజనాన్ని ఆశించి వెలువడిన ప్రముఖుల రచనలు ఆ సమాజం మారేవరకు సజీవంగానే నిలుస్తాయి. అలాంటి వాటిలో ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు’ చెప్పుకోదగ్గవి. మహారాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వీటిని Writings and speeches of Dr Babasaheb Ambedkar పేరుతో 21సంపుటాలుగా ఇంగ్లీష్ లో ప్రచురించింది. వీటిని తెలుగులో తేవడానికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది.  “అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు” పేరుతో  వివిధ విశ్వవిద్యాలయాల సహకారంతో 1992 నుంచి అంచెలంచెలుగా తెలుగులో ప్రచురించింది. ఇవి బృహద్గ్రంథాలు. పరిశోధకులూ  సిద్ధాంత వ్యాసాలూ రాసేవారూ తప్ప సామాన్య పాఠకులు  వీటిని చదవడం కష్టం. ఆ సమస్యను గుర్తించిన డా.  చిలుకోటి  కూర్మయ్య గారు అంబేద్కర్ మీద ఉన్న అపారమైన గౌరవంతో సామాన్య పాఠకులకోసం వాటిని సరళమైన తెలుగులో అందివ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారు. గత ఏడాది మొదటి  సంపుటిని సంక్షిప్తంగా ప్రచురించారు. అది పాఠకుల ప్రశంసలందుకుంది. 2 వ  సంపుటికి యథాతథానువాదం 1995 లో వెలువడింది. అనువాద బాధ్యత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యా లయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంయుక్తంగా తీసుకున్నాయి. అది సుమారు 900 పేజీలకు పైగా ఉంది. ఇప్పుడు కూర్మయ్యగారు దాన్నికూడా సంక్షిప్తం చేసి అదే పేరుతో (“అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు సంపుటి-2) ప్రచురించారు. ఆయన ‘వ్యాఖ్యానం లేకుండా’ అనే స్వీయ నిబంధన విధించుకోకుండా రాస్తే ఇది 500 పేజీల బృహద్గ్రంథం అవుతుంది.

          ఎప్పుడో నూరేళ్ల క్రితం బొంబాయి శాసన సభలో చేసిన ప్రసంగాలూ, వివిధ సమస్యలకు ఆయన సూచించిన పరిష్కారాలూ ఇప్పుడు తెలుసుకోవడం అవసరమా? అనుకోనవసరం లేదు. అంబేద్కర్ లేవనెత్తిన సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాబట్టి వీటి అవసరం ఇప్పుడు కూడా ఉంది. ఆయన మాటల్లోనే ఒక సంఘటన ఉదాహరిస్తాను. 

          “మహారాష్ట్రలోని వాడ్ గాన్ లంగ్డా (Vadgaon langda) అనే గ్రామంలో హిందువులు దళితుల ఇళ్లపై  దాడి చేసి ఆడ మగ అనే వివక్ష లేకుండా అందర్నీ కొట్టారు. ( ఇక్కడ కూర్మయ్యగారు సంక్షిప్తం చేశారు గానీ  ఇంగ్లిష్ లో the villagers in a body of 200, armed with sticks, lathis and other instruments.. అని ఉంది. ) వాళ్ళు ఆసుపత్రిలో కోలుకోడానికి పది రోజులు పట్టింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సవర్ణ హిందువులు రాజీకి వచ్చి 300 రూపాయలు ఇస్తామని నాకు కబురు పంపారు. నేను కోర్టు తీర్పు ప్రకారం వెళదామని  చెప్పాను. కోర్టు వారందరినీ నిర్దోషులుగా విడిచి వేసింది” (పే. 83)

        నాడే కాదు మనదేశంలో ఈనాటికీ ఈ పరిస్థితి ఉంది. గుజరాత్ లో కిరాతకంగా మానవ హననానికి పాల్పడిన వారిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేస్తే హిందూ మతోన్మాదులు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ప్రజాప్రతినిధి బెయిల్ మీద విడుదల యితే పాలకవర్గ మూకలు అతన్ని మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.

          నాటి దళితులు ఎదుర్కొనే సమస్యలతో బాటు సమాజాన్ని పట్టి  పీడించే ప్రతి సమస్యనూ అంబేద్కర్ లేవనెత్తారు. ‘విద్యను వ్యాపారంగా చూడకూడదు వీలైనంత తక్కువ ఖర్చుతో విద్యార్థులకు విద్యనందించాలి’  (పే. 20)’ఉన్నత విద్యను వాస్తవాలతోను సిద్ధాంతాలతోనూ విద్యార్థి బుర్రలు నింపడం కాకుండా మానసిక శక్తుల్ని వెలికి తీసేదిగా పెంపొందించాలి’ (పే 27) ‘ విద్యా సర్వీసులో అధికారులు, పాలకవర్గాలు ఉపాధ్యాయులు ఉన్నారు. పదోన్నతి వారి పాండిత్యాన్ని బట్టి కాకుండా పనిచేసిన కాలం మీద ఆధారపడి ఉంటోంది’(పే.30). ‘మద్యపానాన్ని మాన్పించాలి కానీ అంతకంటే ముఖ్యమైన విద్యా ఆరోగ్యం పై ముందు దృష్టి సారించాలి’ (పే. 56)’ బోధనా భాషగా ప్రాంతీయ భాషను వాడాలనేది నాకున్న ఖచ్చితమైన అభిప్రాయం’ ( పే 34)’ఎప్పుడైనా దేశభక్తికి అస్పృశ్యులకు మధ్య ఘర్షణ వస్తే నా వరకు నేను చెప్తున్నా దేశ ప్రయోజనాల కంటే అస్పృశ్యుల ప్రయోజనాలే నాకు అగ్రగామిగా ఉంటాయి’ (పే 85)‘ మంత్రుల పట్ల ప్రజలకు వారు మూడో తరగతిలో ప్రయాణం, ఎడ్లబండి మీద తిరగడం వల్ల రాదు. ఈ వేషాలు చూసి ఎవరూ మోస పోరు’ (పే.60)

          బ్రిటిష్ వారి విధానాలను వ్యతిరేకిస్తూనే వాళ్ళ ఉద్యోగుల పట్ల అంబేద్కర్ ఆలోచనా విధానం చూడండి.

          “భారతీయులకు యూరోపియన్లకు ఒకే పనికి ఒకే జీతం నేను అంగీకరించను. అలా చేయడం ప్రభుత్వానికి వృధా ఖర్చు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. యూరోపియన్లు దేశం విడిచి, తమ వారికి దూరంగా, అభద్రతతో ఉంటారు. వారు రెండు దేశాలలో తమ కుటుంబాల్ని పోషించాలి. ఈ సమస్యలు ఏవీ లేని భారతీయు లకు వేతనం తగ్గిస్తే ప్రభుత్వం పొదుపు చేయవచ్చు”( పే.134) తాగునీరు, విద్యార్థుల ఉపకార వేతనాలు, చిన్న రైతుల సమస్యలు, మంత్రుల జీతభత్యాలు, కార్మికుల సమ్మెహక్కు, ఇలా అన్ని సమస్యల మీద ఆయన అభిప్రాయాలు ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి.

          రచయిత ప్రూఫ్ రీడింగ్ పై తగిన  శ్రద్ధ చూప లేదు. మలి ముద్రణలో వాటిని సవరించుకుంటారని ఆశిస్తాను. ఒత్తులూ దీర్ఘాలూ ఎగిరిపోవడం ఒకోసారి ఎలాగూ తప్పదు.  ‘మధ్యపానం’ వంటి లోపాలూ రావచ్చు. కానీ ఒకే పేరాలో ‘జంబుసార్ మున్సిపాలిటీ’ అని ఓసారి, ‘జంబసార్ మున్సిపాలిటీ’ మరో సారి (పే.93)వస్తే పాఠకుడు గందరగోళంలో పడతాడు.  ‘లబూటా’ అనే పదం ఒకే పేజీలో నాలుగుసార్లు వచ్చింది( పే.37) కానీ ఇది ‘బలూటా’ అనే మరాఠీ పదం. ఇంగ్లిష్ ప్రతిలో baluta అనే ఉంది. ప్రభుత్వం ప్రచురించిన తెలుగు ప్రతిలో కూడా ‘బలూటా’ అనే ఉంది. వెన్నెలను ఆస్వాదించేవాడు చంద్రుడిలోని మచ్చలను పట్టించుకోనట్టు ఈ అచ్చు తప్పులను వదిలేస్తే ఇంగ్లిష్ లో 823 పేజీల్లోనూ తెలుగులో సుమారు 900 పేజీల్లోనూ ఉన్న బృహద్గ్రంథాన్ని 136 పేజీల్లో సామాన్య పాఠకుల కోసం సంక్షిప్తంగా, సరళమైన భాషలో రాసినందుకు డా. కూర్మయ్యగారినీ, ప్రచురించిన ప్రచురణకర్తలనూ అభినందిస్తున్నాను. అంబేద్కర్ రచనలపై ఆసక్తి ఉన్నవాళ్ళంతా దీన్ని తప్పకుండా చదవాలి.

రచన: డా. చిలుకోటి కూర్మయ్య

ప్రచురణ: ఆర్ పి పబ్లికేషన్స్, కాకినాడ।

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.