
యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
లగేజీ ప్యాకింగు:
ప్రయాణపు తేదీకి ముందు నాలుగైదు రోజుల పాటు లగేజీ ప్యాకింగుతో సరిపోయింది. మా ముగ్గురికీ ఒక్కొక్కళ్ళకి 23 కేజీల చొప్పున చెకిన్ లగేజీ, ఏడేసి కేజీలు హాండ్ లగేజీ ఉచితంగా ఉన్నప్పటికీ రెండు పెద్ద సూట్ కేసులు, ఒక చిన్న సూట్ కేసులతో ఇట్నించి పది కేజీల బరువు తక్కువే పట్టుకెళ్లాం. అట్నించి ఏదైనా కొనుక్కొవడానికి బరువు, స్థలం మిగిలి ఉండాలిగా మరి!
అదీగాక ఇంతకు ముందు ఆస్ట్రేలియా ప్రయాణంలో లోకల్ ఫ్లైట్లలో హాండ్ లగేజీకి కూడా చాలా స్ట్రిక్టుగా బరువు తూచి హడావుడి చేసే సరికి ఇక ఈ ప్రయాణంలో రిస్కు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. బరువెక్కువ ఉంటే అనవసరంగా డబ్బులు కట్టాల్సిందే కదా! అయితే ఐరోపాలో ఎక్కడా హాండ్ లగేజీ బరువు వివరాలు అడగలేదు. అదొక్కటి నయం అనిపించింది.
అయినా భుజాన మరీ బరువు లేకుండా హేండ్ లగేజీ బ్యాక్ ప్యాక్ లలో నాలుగయిదు కేజీలు మాత్రమే పెట్టుకున్నాం. అందులో తొంభై శాతం మా ఇద్దరి లాప్ టాపులు, సిరి ఐ-పాడుతో సరిపోయాయి.
అన్నిటికంటే ముఖ్యంగా ఏ బట్టలు పట్టుకెళ్ళాలి అనే విషయకంగా ఎంతో రీసెర్చి చేసి, ఎందరినో అడిగి తెలుసుకున్నాం. మేం వెళ్తున్న ఏప్రిల్ నెల రెండో వారంలో “ఇటలీలో కాస్త వెచ్చగా, బానే ఉన్నా, ఇంగ్లాండు, ఫ్రాన్సులలో కాస్త చలిగానే ఉంటుంది” అని తెలుసుకుని దాదాపుగా అన్నీ చలికాలపు బట్టలే పెట్టుకున్నాం. వెచ్చని కోట్ల వంటి జాకెట్లతో బాటూ, చెవులకి వెచ్చని కాప్ లు, గ్లోవ్స్, సాక్సులు తప్పనిసరిగా పెట్టుకున్నాం. ఇక ఇంగ్లాండులో ఎప్పుడూ వర్షాలే కాబట్టి గొడుగు, రెయిన్ జాకెట్ తప్పనిసరిగా సర్దుకున్నాం.
అయితే మేం ఊహించినదానికన్నా ఎక్కువ చలిగా ఉందక్కడ. అమెరికాలో మేమున్న శాన్ఫ్రాన్సిస్కో ఏరియాలో మాంఛి చలికాలంలో ఉన్నప్పటి చలి ఉంది. దాంతో బాటూ చలిగాలి వల్ల చెవులకి వెచ్చని కాప్ లు లేకపోతే బయట నిలబడలేక పోయాం. ఇక వర్షాలు సరేసరి. ఇంగ్లాండు, ఫ్రాన్సులలో ఆరుబయట తిరిగిన ప్రతీసారీ దాదాపుగా వానలో తడుస్తూనే ఉన్నాం. వింటర్ జాకెట్లతో బాటూ, అతి తక్కువ బరువు ఉన్న ఏవో పలుచని ప్లాస్టిక్ సంచుల వంటి రెయిన్ జాకెట్లు కూడా పట్టుకెళ్ళేం. కానీ అవి ఒక్కసారి మాత్రమే వేసుకున్నాం. మిగతా సందర్భాల్లో హోటల్లో మర్చిపోవ డమో, అవి వేసుకునేలోగా తడిసిపోవడమో అయ్యేది. వచ్చేటపుడు ఇటలీలో నా రెయిన్ జాకెట్టుని ఏదో సంచీ అనుకుని అక్కడే వదిలేసాను కూడా. ఇక మేం పట్టు కెళ్లిన ఫోల్డబుల్ గొడుగు మాత్రం మా సిరిని బాగా కాపాడింది. తను సాధారణంగా ఎంత చలికాలమైనా చలిపులి లేకుండా జాకెట్టు వేసుకోకుండా ఆరుబయట చక్కగా తిరిగేస్తుంది. కానీ వానని తట్టుకోలేదు. కొంచెం తడిసిందంటే ఏడుపు ప్రారంభిస్తుంది. మేమిద్దరం సగం తడిసినా, వేసుకున్న వింటర్ జాకెట్ల కున్న కాప్లని తలల మీదికి లాక్కుని ఏదో రకంగా మానేజ్ చేసాం. మొత్తానికి ఇలా స్ప్రింగ్ సీజన్ లో వెళ్తే చలికి, వానకి తట్టుకుని తిరగాల్సిందే. ముఖ్యంగా చిన్న పిల్లలతో వెళ్లడం కొంచెం కష్టమే.
ఇటలీలో పగటిపూట ఎండకాస్తూ వాతావరణం ఆహ్లాదంగానే ఉన్నా రాత్రిపూట జాకెట్లు వేసుకోవాల్సిందే.
ప్రయాణం:
ఎట్టకేలకు ఏప్రిల్ పన్నెండవ తారీఖు రానే వచ్చింది. మధ్యాహ్నం పన్నెండున్నరకి శాన్ఫ్రాన్సిస్కోలో మా ఫ్లైట్. ఇంటి నించి దాదాపు గంటన్నర ప్రయాణం కావడం, ఆ సమయంలో బాగా ట్రాఫిక్‌కు ఉండడం వల్ల ఉదయం ఎనిమిదిన్నరకే ఊబర్ టాక్సీ మాట్లాడుకుని బయలుదేరి ఎయిర్‌పోర్టుకి పది గంటల కల్లా చేరుకున్నాం.
లగేజీతో ఎటువంటి ఇబ్బందీ లేకుండా సజావుగా చెకిన్ పూర్తి చేసుకుని అనుకున్న సమయానికి గంటన్నర ముందే గేటుకి చేరుకున్నాం. ఇంకా బోల్డు సమయం ఉండడంతో ఆన్లైన్ లో లాంజ్ గురించిన సమాచారాన్ని వెతికాం.
మాకు ఎయిర్‌పోర్టుల్లో ప్రయారిటీ లాంజ్ మెంబరు షిప్పు ఉంది. ఆ మెంబరు షిప్పు కార్డుతో ఎయిర్ పోర్టు లాంజ్ లలో విమానం బోర్డింగ్ సమయం అయ్యేవరకు రెస్టు తీసుకోవచ్చు, అలాగే లాంజ్ లలో భోజనాలు వగైరాలు ఉచితంగా చెయ్యవచ్చు.
అయితే ఈ మధ్య మేమెక్కడికి వెళ్లినా ఈ లాంజ్ లు మేమున్న టెర్మినల్‌లో కాకుండా వేరే టెర్మినల్‌లో ఉంటున్నాయి. ఈ సారి కూడా అదే అయ్యింది. అయితే మా గేటుకి కూతవేటు దూరంలో ఉన్న “మస్టర్డ్ గ్రిల్” అనే రెస్టారెంటులో ప్రయారిటీ లాంజ్ మెంబరు షిప్పు వాళ్ళు రావొచ్చనే బోర్డు చూసి వెళ్లి వాకబు చేశాను. అక్కడ ఒకొక్కళ్లకి $28 డాలర్ల ఖరీదు చేసే ఏదైనా ఫుడ్ మెంబరు షిప్పులో భాగంగా ఉచితం. మరింకేం! ఎలాగూ లంచ్ టైం అవుతుండడంతో చక్కగా పెందరాళే భోజనం కానిచ్చాం.
సరిగ్గా సమయానికి శాన్ఫ్రాన్సిస్కో నించి లండన్ వెళ్ళే ఫ్లైటు బయలుదేరింది. శాన్ఫ్రాన్సిస్కో నించి లండన్ కి పదిన్నర గంటల ప్రయాణం. అయితే సమయంలో ఉన్న తేడా వల్ల పదమూడో తారీఖు ఉదయానికి చేరుతాం. ఫైటు అమెరికా సంయుక్త రాష్త్రాలు దాటి, కెనడా, ఐస్ లాండ్ల మీదుగా వెళ్లసాగింది.
ముందంతా వీసా చికాకులు పట్టి పీడించినా సజావుగా ఫ్లైటు ఎక్కాక ఎన్నినాళ్ళ కలో నెరవేరబోతున్న పట్టరాని ఉత్సాహంతో మనసంతా ఏదో వింతైన ఆనందం కలగ సాగింది!
*****
(సశేషం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
