
కన్నీటి ఉట్టి
(నెచ్చెలి-2025 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)
– వేముగంటి మురళి
ముడుతలు పడ్డ ముఖం
చెప్పకనే చెపుతుంది
ఇంటిని అందంగా తీర్చిదిద్దినందుకు
అమ్మకు మిగిలిన నజరానా అదే అని
పిల్లల్ని పెంచుతూ పందిరెత్తు ఎదిగి
వంటింట్లో పొయ్యిముందు వాలిన తీగలా నేలకు జారడమే అమ్మతనం
పని కాలాన్నే కాదు
అమ్మ విలువైన ఆనందాన్ని తుంచేసి
గడియారం ముళ్లకు బంధించేస్తుంది
అందరూ కళ్ళముందు తిరుగుతున్నా
లోలోపటి కన్నీటి నదిలోని
కైచిప్పెడు దుఃఖాన్ని దోసిట్లోకి తీసుకోరెవరు
బాపైనా కనురెప్పలమీది కన్నీళ్లను తుడుస్తాడే తప్ప మనసులోతుల్లో ఊరుతున్న
తడిని కనీసం తడమడు
అన్నీ తనవే అనుకుంటుంది
ప్రతీదాంట్లో తన పాత్ర ఉండాలనుకుంటుంది
మొత్తం జీవితాన్ని ఇచ్చేసింది కుటుంబానికి
జీతం అడగకుండానే
మొదటి తారీఖ్ న ఇంటి ఖర్చులకు
మసంటిన చేయి చాచక తప్పలేదు
ఆనందానంద వేదనల మధ్య
అమ్మ కలల్ని ఎక్కడ దాచుకుంటుంది
నిద్రపోని రాత్రుల్లో
గోడకు బొట్టుబిళ్ళ అతికించినట్టు కలల్ని అతికించి
తెలియని దుఃఖాన్ని కప్పుకొని పడుకుంటుంది
పొద్దున్నే సూర్యోదయమంత వెచ్చదనంతో
వంటింట్లోకి చేరుకుంటుంది
*****

నేను సిద్దిపేటలో 1972లో జన్మించాను.
మా బాపు పద్యకవి కావడం వల్ల కొంత సాహిత్య జ్ఞానం అబ్బింది. నందిని సిధారెడ్డి, దేశపతి మిత్రుల వల్ల ప్రాపంచిక దృక్పథం తెలిసింది.
