
చిలుక జోస్యం
-కందేపి రాణి ప్రసాద్
“మన మిత్రురాలిని అక్రమంగా నిర్బందించారు. వేట గాళ్ళను వదిలి పెట్టకూడదు మనుషుల వద్ద మన రామచిలుక ఎలా బాధపడుతున్నదో ఏమో! మనుషులంత దుర్మార్గులు ఎవరూ లేరు!” అంటూ ఆవేశంగా యువ రామచిలుకలు మాట్లాడాయి.
“ఏమైంది నాకే విషయమూ తెలియలేదు ఎందుకు అంత కోపంగా ఉన్నారు” అని అప్పుడే వచ్చిన పిచ్చుక అందర్నీ చూస్తూ అడిగింది. అక్కడ కాకులు, నెమళ్ళు, చిలుక లు, పావురాలు పిచ్చుకలు వంటి పక్షులన్నీ సమావేశమై ఉన్నాయి. అందరూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారు.
“మన రామచిలుకను ఒక వేటగాడు బంధించి తీసుకుపోయాడు. ఎలా విడిపించుకు రావాలి అని అందరూ ఆలోచిస్తున్నారు. యువ పక్షులేమో కోపంగా ఉన్నాయి!” అని ఒక పావురం సమాధానం చెప్పింది.
అయ్యో! అలా ఎలా జరిగింది. మన రామచిలుక వేటగాడిని చూడలేదా! వడిసెల రాయితో కొట్టాడా! పడిపోయిందా పాపం! అని పిచ్చుక బాధ పడుతూ అడిగింది. అదేం కాదు మిత్రమా! అదుగో! ఆ కనపడే చెట్టు కింద ఒక పండిన జామ పండును పెట్టాడట. దానిని చూసి ఆశగా దగ్గరకు వెళ్ళిన చిలుకను పట్టేసుకున్నాడట. అయినా జామపండు చెట్టున ఉంటుంది గానీ కింద ఎందుకు ఉంటుంది అని అనుమానం రావాలి కదా! ఒక కాకి అనుమానంగా అన్నది.
“ఇన్ని ఆలోచనలు వస్తాయా ఏదో పండు చూసి ఆశ పడింది. చెట్టు మీది కాయ పడితే రాలి కింద పడదా ఏమిటి? అది కాదు ఆలోచించాల్సింది. మన రామచిలుకను తిరిగి ఎలా తీసుకు రావాలి అని ఆలోచించాలి” అని పావురం అన్నది.
పక్షుల్లో పెద్దదైన ఒక గుడ్డి గద్ద అందరి మాటలూ విని ఇలా అన్నది. “ముందుగా మన చిలుక ఏ గ్రామంలో ఉన్నదో చూసి రండి. దానిని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం.
‘ఆ వేటగాడు ఎవరికైనా అమ్మేశాడో లేదా వండుకుని తినేశాడో’ భయం భయంగా పిచ్చుక అన్నది. “అనవసర భయాలు మానేసి గ్రామాల్లోకి పోయి కనుక్కుని రండి” గుడ్డి గద్ద గట్టిగా హెచ్చరించింది.
అంతలోనే ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి వాలింది “నేను మన రామ చిలుకను చూశాను” అని ఆయాసపడుతూ చెప్పింది. “ఎక్కడ చూశావు? ఎలా ఉంది? ఏమైనా దెబ్బలు తగిలాయా? ఆరోగ్యంగానే ఉన్నదా” అంటూ అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించారు. పక్షులన్నీ కాకి చుట్టూ గుమిగూడాయి. అందరి మొహాల్లో ఆతృత కనిపిస్తు న్నది. కాకి ఏమి సమాధానం చెప్తుందా అని ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాయి.
“మన అడవి పక్కనున్న గ్రామంలోనే చూశాను. వేటగాడు తన ఇంటి ముందన్న పంజరంలో బంధించాడు. పాపం దిగాలుగా కనిపించింది. నేను చూసి పలకరిద్దాం అనుకునేంతలో వేటగాడు బయటకు వస్తూ కనిపించాడు నాకు భయమేసి పారిపోయి వచ్చాను.” కాకి వగర్చుకుంటూ చెప్పింది.
“సరే ఇప్పుడేం చేద్దాం. ఎలా విడిపించుకొద్దాం వేటగాడిని చూస్తే అందరికీ భయమే” అంటూ పక్షులన్నీ తమలో తాము చర్చించుకోసాగాయి. పక్షి రాజు లేచి నిలబడి “కాసేపు ఎవరూ మాట్లాడకండి. చిలుక పంజరంలో ఉందని వెలుతున్నారు కదా! పంజరంతో సహా ఎవరైనా మోసుకురాగలరా? ఎవరి వద్ద అంత బలం, సాహసం ఉన్నాయి” అని అడిగింది.
“రాత్రిపూట కళ్ళు కనిపించే గుడ్ల గూబ వెళితే బాగుంటుందేమో” అని ఒక పిచ్చుక అన్నది. “కళ్ళు కనిపించటం ఒక్కటే కాదు కదా! పంజరాన్ని మోసుకు రావాలి కదా! అని మరొక కాకి అన్నది. వీళ్లిలా మాట్లాడుతూ ఉండగానే గుడ్లగూబ ముందుకొచ్చి “నేను వెళతాను పక్షి రాజా! ఈ రోజు రాత్రికే వెళ్ళి తీసుకోస్తాను. గ్రామం బయటే మీరందరూ నిలబడండి. నేను గ్రామం పొలిమేర దాకా తీసుకు రాగలను” అన్నది.
“శభాష్ గుడ్లగూబా! మంచి నిర్ణయం తీసుకున్నావు ఈ రోజు రాత్రికే వెళ్ళు. మేమంతా నీకోసం ఎదురు చూస్తుంటాము. వేటగాడి కంట పడకుండా జాగ్రత్తగా తేవాలి సుమా! లేదంటే నీ ప్రాణాయి కూడా ప్రమాదంలో పడతాయి.” అని పక్షిరాజు జాగ్రత్తలు చెప్పింది.
ఆ రోజు రాత్రికి గుడ్లగూబ బయలు దేరింది. గ్రామం బయట పిచ్చుకలు, కాకులు, పావురాలు, పక్షిరాజు అందరూ నిలబడి ఉన్నారు. అందరి మొహాల్లో భయం ఆదుర్దా కలగలసి ఉన్నాయి.
కాసేపటికి దూరంగా గుడ్ల గూబ వస్తూ కనిపించింది. చేతిలో పంజరం ఉన్నదా లేదా చీకట్లో కనిపించడం లేదు. కాసేపు తర్వాత గుడ్ల గూబ ఖాలీ చేతుల్తో వచ్చింది. అందరూ ఏమైందని అడిగారు.
గుడ్లగూబ ఏడుపు మొహం పెట్టుకుని సమాధానం చెప్పింది. “వేటగాడి ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ మన రామ చిలుక కనిపించలేదు. ఇంట్లో కూడా వెతికాను. వాడు గాడ నిద్రలో ఉన్నాడు. ఎక్కడా పంజరమూ కనిపించలేదు. రామచిలుకా కనిపించ లేదు”.
పక్షులన్నీ కాకి వైపు చూశాయి. “నువ్వే కదా చూశాను అన్నావు. ఇంతలో ఏమై పోయింది. ఒకవేళ వేటగాడు తినేశాడా? అని రకరకాలుగా ప్రశ్నించాయి.” ఉదయం నేను చూసినప్పుడు ఉన్నది. మరిప్పుడు ఏమైందో ఏమో! ఎవరికైనా అమ్మేశాడేమో. చాలా మంది చిలుకలను పెంచుకుంటారు కదా! అని కాకి చెప్పింది.
అందరూ నిరాశగా ఇంటికి వెళ్లారు. ఎవరి మనసంతా సంతోషంగా లేదు. ఆ రాత్రి గడిచిపోయింది.
తెల్లవారాక కాకులు, పావురాలు అడవి పక్కనున్న గ్రామాల వైపు వెళ్ళాయి. రామ చిలుక కోసం చాలా గాలించాయి. ఎక్కడా దాని జాడ కనిపించలేదు. సాయంత్రం వరకూ తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరాయి. కానీ రామ చిలుక విషయం తెలియలేదు. మరునాడు, ఆ మరునాడు కూడా పక్షులు వెతికాయి కానీ ఫలితం శూన్యం. రోజూ రామ చిలుక విషయం మాట్లాడుకుని అలసిపోయారు.
ఒక నెల రోజుల తర్వాత పాపురం ఒక మంచి విషయం చెప్పింది. రామ చిలుకను ఉత్తరం వైపున్న గ్రామంలో చూశానని చెప్పింది. ఒక చిలక జోస్యం చెప్పే వ్యక్తి దగ్గర క్షేమంగానే ఉన్నదని చెప్పింది. రామ చిలుక క్షేమంగానే ఉన్నదన్న వార్తతో అందరూ సంతోషించారు. కానీ ఎలా విడిపించాలి అని మరల ఆలోచన మొదలు పెట్టాయి.
“నువ్వెళ్ళి రామ చిలుకతో మాట్లాడు. చిలక జోస్యం వ్యక్తి ఏయే వేళల్లో ఏయే పనులు చేస్తుంటాడో తెలుసుకో. దానినిబట్టి చిలుకను విడిపించే ప్రయత్నం చేద్దాం. నువ్వైతే రామ చిలుకను కలసి ధైర్యం చెప్పి మాట్లాడి విషయాలు తెలుసుకుని రావాలి అని పాపురానికి సలహ చెప్పింది గుడ్డి గద్ద.
“అలాగే రేపే వెళ్ళి విచారిస్తాను. రామచిలుకతో అన్ని విషయాలూ మాట్లాడి చెప్తాను. అని పావురం సంతోషంగా చెప్పేసరికి పక్షులన్నీ కూడా ఆనందంతో గంతులు వేశాయి. వేటగాడి వద్ద లేనందుకు సంతోషించాయి. మాంసంగా వండుకుని తిన నందుకు ఆనందాన్ని వ్యక్త పరిచాయి.
ఆ మరునాడు పావురం ఉత్తరం వైపు గ్రామానికి వెళ్ళింది. చిలక జోస్యం వ్యక్తి అన్నం తినేటపుడు చిలుకతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నది. మధ్యాహ్న సమయంలో అతడు అన్నం తినే సమయంలో చిలుక దగ్గరకు చేరింది. చిలుక పొవురాన్ని చూసి కళ్ళవెంట నీళ్ళు కార్చింది. “భయపడకు మిత్రమా! నిన్ను విడిపిద్దా మనే మేమంతా ప్రణాళిక వేసుకుంటున్నాము” అంటూ వేటగాడి దగ్గరకు గుడ్లగూబ వెళ్లి తిరిగి రావటంతో సహా అన్ని విషయాలూ చెప్పింది.
పావురం మాటలు విన్న చిలుక ఎంతో సంతోషించింది. “నా కోసం మీరందరూ ఇంత కష్టపడ్డారా? నా మీద చాలా ప్రేమ ఉన్నది. ఈ రోజు నేనేమి తినక పోయినా నా కడుపు నిండి పోతుంది” అంటూ కళ్ళ వెంట నీళ్ళు కారుస్తూనే ఉన్నది.
పావురం చిలుకను హత్తు కుందామని పంజరంలో నుంచి కాలును పెట్టింది. చిలుక పావురం కాలును తాకి సంతోషపడింది. పావురం చిలకను అడిగింది. “చిలక జొస్యపు వ్యక్తి గురించి వివరాలు చెప్పు. మేమంతా విడిపిస్తాం.”
రామచిలుక నవ్వి ఇలా చెప్పింది. “మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. కానీ, నేనిక్కడే ఉండాలనుకుంటున్నాను. వేటగాడిలా కాకుండా నన్ను నెల రోజుల నుండీ జాగ్రత్తగా చూసుకున్నాడు. అన్నం పెట్టాడు, దాహం తీర్చాడు. నాకూ పనేమిలేదు. సమయానికి తిండి పెడుతున్నాడు. నాతో పాటు అతనూ ఆకలి తీర్చు కుంటున్నాడు. ఏ వేటగాడి భయమూ ఉండదు. పరవాలేదు నేను అలవాటు పడిపోయాను. స్పేఛగా ఎగరకపోయినా బాధలూ భయాలూ ఏమీ లేవు. మీరంతా దిగులు పడకండి. నా గూర్చి బాధపడకండి నేను క్షేమంగానే ఉన్నానని అందరికీ చెప్పు” అని పావురానికి వీడ్కోలు చెప్పింది. పావురం కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.