త్వంజీవ శరదాం శతమ్

(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-గౌతమ్ లింగా

          నా రిటైర్మెంట్ జీవితానికి రెండు సంవత్సరాలు.. మనసుగా మనిషిగా కూడా చాలా నిదానంగా ఉంటున్నాను. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు ఆలోచనల్లో పనుల్లో పనులు చేయించడంలో చాలా చురుకుగా ఉండేదాన్ని ఇప్పుడా చురుకుదనం లేదు కావాలనే తగ్గించుకున్నాను. వయసు కూడా 60 సంవత్సరాలు దాటింది నా ఉద్యోగ జీవితమంతా ఉరుకులు పరుగులే. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అధికారిణిగా దాదాపు నలభై సంవత్స రాలు పనిచేసాను. ముప్పై నలభై గ్రామాలు చూసుకోవాల్సిన ఉద్యోగం రోజుకి ఒకటో రెండో ఊర్లు తిరిగి అక్కడి పిల్లల్ని మహిళల్ని కాపాడుకోవడం నా ప్రాధమిక బాధ్యత.సమస్యల్ని అసమానతల్ని ఒంటికీ ఇంటికీ చుట్టుకొని బ్రతుకుతున్న గ్రామీణ మహిళలకి కొంచెం చైతన్యం ఇంకొంచెం సాధికారత పరిచయం చేసే నా ఉద్యోగమంటే నాకు ప్రేమ. ఇదేదో పనిలాగా కాకుండా బాధ్యతలాగానే భావించాను మూడుముళ్లు వేసుకున్న ఆడపిల్లలు నెలకో రెణ్ణెల్లకో ఆత్మ’హత్య’లు చేసుకుంటే మొదటగా మెడ ముళ్ళు విప్పేది మేమే, కడుపులో బిడ్డకళ్లు తెరవకుండా కళ్లుమూస్తే భాదతో కన్నీరయ్యేది మేమే, పాలబుగ్గల ఆడబిడ్డల్ని పెళ్లిళ్లసంతలో అమ్ముకుంటుంటే అడ్డుచెప్పేది కూడా మేమే. ఇలాంటివి ఎ న్నో చేశాం. ప్రతీ వారం ఇలాంటిదేదో జరుగుతూనే ఉండేది ఎవరికైనా ఈరోజుల్లో ఇంకా ఇవన్నీ ఉన్నాయా అనిపిస్తే చెప్పండి మీ అమాయకత్వాన్ని బలిదీసుకునే బాధ్యత నేను తీసుకుంటా.

          విటమిన్ల లోపంవల్ల చనిపోయే పసిపిల్లలు కొందరైతే సమాజపు మానసిక వైకల్యం వలన పురిటిగూడు దాటని బిడ్డలు ఇంకొందరు. అప్పటికే నలుగురు ఆడపిల్లల్ని కన్న తల్లి భయంభయంగా ఇంకోబిడ్డని మోస్తుంటే నాకు చాలాసార్లు కడుపులో కుదిపేసేంత బాదేసేది, నేనుకూడా అమ్మనే కదా? ‘కడుపునొప్పి తట్టుకోలేక నిండు బాలింత బలవన్మ రణం’ అని ఏ రోజు రిపోర్టులో రాసుకోవల్సొస్తుందోనని నా భయం.

          నాలుగు మాటలు చైతన్యాన్ని మోసుకురావని నాకూ తెలుసు కానీ ఇది ఒక్కరోజులో ఎప్పటికీ మారదు.

          అదృష్టం కొద్దీ ఆడబిడ్డపుట్టి పెద్దదైనా దురదృష్టంకొద్దీ పన్నెండేళ్ళు రాగానే పెళ్లిళ్లు చేసే పెద్దరికాలే ఎక్కువ, ఇది చాలా ప్రమాదం దీనికంటే పురిట్లోనే చంపడమే తక్కువ పాపం. పన్నెండేళ్ళకి మానసికంగా శారీరకంగా ఎదగని ఆ గులాబీ మొగ్గలమీద పెళ్లి అనే గాలివాన పెద్ద తాటిమొద్దుని నిలువునా నిర్ధాక్షిణ్యంగా పడేయడం భరించలేని పాపం సహించలేని నొప్పి. అప్పటికే పొద్దునంతా తాళి బొట్టునీ రాత్రయితే మగాళ్ల దేహాన్నీ మోస్తున్న పసిదేహాలు ఇంకో బిడ్డని మోయలేవు, నిన్నో మొన్నో బొడ్డుతాడ్లు కోసుకున్న లేత కడుపులు ఇప్పుడే ఇంకో బొడ్డుతాడు కోసివ్వలేదు, ఆ వయసు ఆడబిడ్డలకు ఈ సమాజమంత తెలివితేటలు ఉండవు ఇంకా అమాయకంగానే ఉంటారు ఇది నిజమైన అమాయకత్వం, ఇది సమాజాన్ని నాలుగు అడుగులు వెనక్కి నెడుతుంది బంగారు బ్రతుకుల్ని రెండడుగులు నేలలోకి తొక్కిపెడుతుంది, నాన్న చెబితే తలొంచు కుని కూర్చుంటుంది అమ్మ ఏడిస్తే బడి బట్టలు విప్పి పసుపు బట్టలు కట్టుకుంటుంది, ఇంత చెడు చేసే అమాయకత్వం నిజంగా అవసరం లేదేమో వీళ్ళకి కొంచెం తెలివి నేర్పాలి.

          “నాకు ఇప్పుడే పెళ్లివద్దు” ఈ మూడు పదాలు ఒక్కో పీట ముడినీ ‘పీడ’ ముడినీ ఆపగలగాలి వీటిని పాఠ్యపుస్తకాల్లో మొదటిపేజీలో ముద్రించాలి, ఆడబిడ్డలతో అక్షరా భ్యాసం రోజే దిద్దించాలి. ఇప్పుడు ఇది అవసరం స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరేసేంత, ప్రతీ ఏడూ రాజ్యాంగం మార్చినంత అవసరం.

          ఉద్యోగకాలంలో ఆపిన బాల్యవివాహాలు పెట్టిన కేసులు ఇప్పటికీ నన్ను వెంటాడు తాయి, అప్పటి కోర్టు కేసులకి ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ తరపున మేమే స్వయంగా హాజరవ్వాలి. రిటైర్ అయినా ఉద్యోగం చేసే భాగ్యం మాకు నెలకోసారైనా వస్తుంది కానీ అది నాకు చాలా ఆనందం బోనులో నిలబడి మాట్లాడిన ప్రతీమాటా ఏదో మంచిపని చేశానని గుర్తుచేస్తుంది, ఇదేనేమో ఉద్యోగయోగమంటే నేను ఏ ఒక్కరోజూ కోర్టు కేసులకు ఇబ్బంది పడలేదు. కొంచెం ఆరోగ్యం సరిగా లేనప్పుడో ఊర్లో లేనప్పుడో ఈ కేసుల కోసం రావాలంటే అసహనంగా ఉంటుంది కానీ దానివెనక ఉన్న కారణం ఆడపిల్లల బంగారు జీవితం అన్నీ గుర్తొచ్చి ఉత్సాహం వస్తుంది. వాళ్ళకోసం ఎంత దూరమైనా  వెళ్లాలని పిస్తుంది ఏమైనా చేయాలనిపిస్తుంది.

          నా నడుమునొప్పి కన్నా ప్రయాణంకన్నా ఓపికలేనితనం కన్నా కోర్టుకి హాజరై బాల్యవివాహం చేసిన చేయబోయిన తల్లిదండ్రులకి చిన్న శిక్ష వేయించినా అంతకన్నా ఆనందం ఉండదు అదొక ఉదాహరణ అవుతుంది. అందుకే ఆరోజు కూడా ఒక బాల్య వివాహపు కేసు హాజరవడానికి కోర్టుకి వెళ్ళాను అప్పటి కేసులో సంబంధం ఉన్న నాలుగైదు డిపార్టుమెంట్లవాళ్ళం ఒక్కచోట కూర్చున్నాం దాదాపు అందరం ఒకే వయసు వాళ్ళం ఒక్క మహిళా పోలీసు మాత్రం అప్పటికే చనిపోయారు ఒక చైర్ కాళీగా ఉంది.

          ఈ కేసులో అమ్మాయికి పద్నాలుగేళ్లు. మూడింతలు పెద్ద వయసున్న వాళ్ళ దూరపు చూట్టానికి ఇచ్చి పెళ్ళిచేయాలని ఆ అమ్మానాన్నా మాట్లాడుకొని ఏదో గుళ్లో పూలుపండ్లు పెట్టుకొని ఇంటిదగ్గర పెళ్లి చేయాలని నిచ్ఛయించారు. రేపొద్దున్న పదింటికి పెళ్లి ఈ రోజు సాయంత్రం ఏడింటికి మా ఆఫీస్ హెల్ప్లైన్ కి ఎవరో ఫోన్ చేసారు ఆ వార్త నాకు చేరేటప్పటికి ఎనిమిది అయ్యింది, అన్ని డిపార్ట్మెంట్లవాళ్ళు ఒక్కటిగా కలిసి వెళ్లేసరికి రాత్రితొమ్మిది దాటింది మేము అయిదుగురం వెళ్ళేసరికే పెళ్లిఏర్పాట్లలో ఆ ఇల్లంతా కళకళలాడుతుంది. ఒక్క పెళ్లికూతురు మొహంతప్ప. ఆ అమ్మాయి బడి స్నేహితులనుకుంటా పక్కనే చేరి ఆశ్యర్యంతోనో బాధతోనో మాకు కూడా ఇలాగే జరుగు తుందేమోనన్న భయంతోనో ఆందోళనగా ఉన్నారు.

          పెళ్లికూతురు తల్లి ఇంకొంతమంది ఆడవాళ్లు రేపు పెళ్ళికి కావాల్సిన సరుకులు ఒక్కచోట సర్దుతున్నారు. అప్పుడే చుట్టాలు ఒక్కొకరుగా వస్తుంటే తండ్రివాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు వచ్చినవాళ్ళకి మంచినీళ్ళూ ఆ వెంటనే భోజనాలు వడ్డించే పనులు ఆ పక్కనే జరుగుతున్నాయి, తోరణాలు కట్టేవాళ్ళు ఒకప్రక్క వచ్చిన కూరగాయల్ని జాగ్రత్త చేసేవాళ్ళు ఇంకోపక్కా ఇల్లంతా సందడిగా కోలాహలంగా ఉంది.

          మేము ఈ సందడిని ఆపడానికి వచ్చాం అని చెప్పాలంటేనే ఎలాగో అనిపించింది అందరి ఆనందం కంటే ఒక్క ఆడపిల్ల భవిష్యత్తు ఖచ్చితంగా ఎక్కువే. ఇక్కడ వాళ్ళ ఆనందం సంబరం కంటే సమాజాన్ని బాగుపరచే ధర్మమే మాకు ముఖ్యం. మాలో ఉన్న ఒక అధికారి ముందుగా వాళ్ళ నాన్నని పిలిచి మేము వచ్చిన కారణం దాని పరిణామం అంతా చెప్పాడు. ఇల్లంతా ఖంగుతిని మా చుట్టూ మూగింది మధ్యలో మేము ఉన్నాం మా చుట్టూ చుట్టాలు మాకు పెళ్లిచేస్తారేమోనని కొంచెం భయంకూడా అయింది అయితే ఇలాంటివి మేము దాదాపు ప్రతీ వారం ఎక్కడో ఒక దగ్గర చూస్తుంటాం ఎలా మాట్లాడాలో ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలో మాకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళ నమ్మకాలు ఇష్టాలు మేము గౌరవిస్తాం ఒక్కపెళ్లిని తప్ప మేము దేన్నీ ఆపము.

          దాదాపు 30 నిమిషాల తరువాత ఆ అమ్మ నాన్న కౌన్సిలింగ్ కి ఒప్పుకున్నారు ఇద్దరినీ పెళ్లికూతురితో సహా ఒక్క గదిలో కూర్చోబెట్టి పరిణామాలు పరిస్థితులు పర్యవసానాలు ఇలా ‘ప’ పదజాలమంతా వాడి సవివరంగా చెప్పాము. అప్పటికే రాత్రి పదకొండయింది ఇంకా ఏమీ తినలేదేమో నాకు కొంచెం నీరసంగా కూడా అనిపించింది ఆ అమ్మాయి ఏడుస్తుంటే బాధగా అనిపించింది. వాళ్ళ అమ్మానాన్నా మొదట్లో కుదరదంటే కుదరదని వాదించారు. ఇప్పటికే ఇంత ఖర్చు పెట్టాం చుట్టాలు వచ్చి ఇంట్లో ఉన్నారు డబ్బులు పోయినా పరువు కూడా పోతుందని గగ్గోలు పెట్టారు. అయితే పోలీసు కేసులు కోర్టులు అంటే కొంత జంకారు అందులోనూ చెప్పేవారిలో ఒక మహిళా పోలీసు కూడా ఉన్న కారణాన జంకాల్సొచ్చింది.

          రెండుగంటల తరువాత వాళ్ళని ఒప్పించి పెళ్లిజరగదు అని మాట తీసుకొని అదే బాండ్ పేపర్ మీద రాసి వారి సంతకాలు తీసుకొని పని అయిందన్న ఆనందంతో ఆ గదిలోంచి బయటకివచ్చాము.

          అడుగు బయటపెట్టామో లేదో వందమందితో వచ్చిన ఆ ఊరి నాయకుడు మా మీదికి దండయాత్రకి వచ్చాడు ఒక అధికారి చొక్కాపట్టుకొని బెదిరించి ఆదిపత్యాహంకార దౌర్జన్యాన్ని రెట్టింపుచేసి చూపించాడు నీరసంతో కళ్ళు మూతపడుతున్న నాకు ఒక్కసారిగా ఏమవుతుందో అర్దమవ్వడానికే కొంత సమయం పట్టింది వందలమంది కర్రలతో చుట్టుముట్టిన ఆ దృశ్యం ఏం జరుగుతుందో అర్దమవ్వనీయలేదు అప్పటికే తాగివున్న జనం ఆధిపత్యం కోసమే గొడవ పడడానికి వచ్చిన నాయకుడు కోపంగా గాలిలో తిరుగుతున్న మూర్ఖపు కర్రఒకటి బలంగా తగిలినా కూడా చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కునే వాళ్ళం మేము. మామూలు స్థాయి ప్రభుత్వ ఉద్యోగులం ఏం జరిగినా దెబ్బలకి కట్లు మేమే కట్టించుకోవాలి అదే కట్టుతో వెళ్లి రేపొద్దున సంజాయిషీలు చెప్పు కోవాలి. స్వంత నిర్ణయాలు తీసుకోవడం మా ఉద్యోగంలో నేరం. ఇది ఎవ్వరూ చేయని తీర్మానం. మెదడులేని ఆ గుంపుకి మేము అడ్డంగా దొరికిపోయాం అసలిక్కడ పెళ్లే జరగట్లేదని వాళ్ళ వాదన. ‘ఎవరు చెప్పారు పెళ్లి జరుగుతుందని? ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది’ అని గట్టిగట్టిగా అబద్దాలు అరుస్తూ కొట్టడానికి ముందుముందుకి వస్తున్నా రు అర్ధరాత్రి పన్నెండింటికి దొంగలని పట్టుకున్నట్టు మమ్ముల్ని పట్టుకొని చుట్టూ వందలమంది మూగితే వారి చేతిలో కర్రలకి నోళ్ళొస్తే వాటిని ఎవరు మూయించాలి ఏ చట్టం మమ్ముల్ని కాపాడాలి? అయిదుగురిలో నలుగురం ఆడవాళ్ళం ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు రేపొద్దున నా కూతురు హాస్టల్ కి వెళుతుంది దానికేదైనా తినేవి చేసిపెట్టాలి, నా కొడుక్కి ఒళ్ళు వెచ్చగా ఉందని వచ్చేటప్పుడు పడుకొని ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో? నా ఆలోచనలు నన్ను అమ్మని చేస్తున్నాయి మేము ఇక్కడ చనిపోడానికి సిద్ధంగా లేము ఓడిపోడానికీ సిద్ధంగా లేము ఎందుకంటే ఇప్పటికీ ఆ ఇంట్లో ఉన్న ఆడబిడ్డమెడలో కత్తుల్ని కట్టకుండా ఆపడమే మా ప్రధమ కర్తవ్యం ఏకైక ఉమ్మడి బాధ్యత. అక్కడి బూతులు నేర్చిన కర్రలు గాలిని వాతావరణాన్ని కలుషితం చేస్తూనే ఉన్నాయి ఏ పోలీసుస్టేషన్ కి కాల్ చేసినా ఈ సమయంలో సరైన స్పందన లేదు. ఆ ఉరి జనం వినేట్టు లేరు వినాలని అనుకోవట్లేదు కూడా అసలు అమ్మాయికి 23 సంవత్సరాలు అని పొద్దున్నకెల్లా సర్టిఫికెట్ తీసుకొస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారు తేగలరు కూడా అనిపించింది ఏ ఉద్యోగికో అయిదువందలిస్తే లామినేషన్ చేసి మరీ ఇస్తాడు నాకు తెలుసు. అలా తెస్తే మొదటికే మోసమొచ్చేది.

          మాకు మా ఉద్యోగాలకి. జీవితాంతం సంజాయిషీలు చెప్పుకోవాలి చేయని తప్పులు ఒప్పుకోవాలి.

          దాదాపు గంట తరువాత ఉప్పెన కొంత శాంతించింది అయితే పూర్తిగా తగ్గలేదు ఈ బలగంతో అమ్మాయి తల్లిదండ్రులకి బలం వచ్చింది పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అని తీర్మానించుకున్నారు. మేము రాయించుకున్న పత్రాన్ని నిర్ధాక్షిణ్యంగా లాక్కొని చింపివేసారు ఆ నాయకుడు అతని తమ్ముడు ఇంకో ఇద్దరుముగ్గురు పెద్దలు దూరంగా కూర్చొని మందు తాగుతున్నారు అలజడి తగ్గినప్పుడెల్లా వచ్చి గట్టిగా సంబంధం లేకుండా అరిచి వెళ్తున్నారు. ఈ గొడవ ఆగడం వాళ్ళకి ఇష్టం లేదని నాకు అర్థమైంది. పెళ్లి ఆపకుండా మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం. అది మా సమిష్టి నిర్ణయం ప్రభుత్వాధికారి నిర్ణయించుకుంటే ఇంత గొప్పగా ఉంటుంది పెళ్లిచేయడం కాదు ఆపడం కూడా కష్టమే. మమ్ముల్ని ఏమైనా చేస్తారేమో అని భయం ఉన్నా చేసేది చాలా మంచిపని అని నమ్మకం మాది అందులోనూ ఆ అమ్మాయి అందమైన కళ్ళలో కన్నీరు కాలు కదలనివ్వలేదు. అప్పటికే తెల్లవారబోతోంది మా వాదన వందలసార్లు వినిపించాం. వాళ్ళ ఓపిక చచ్చి తాగింది కొంత దిగి చివరకి ‘పెళ్లిజరగదు’ అని ఒప్పుకున్నారు ఈ సారి దాదాపు ఒక ఊరంతా ఒప్పుకుంది మళ్ళీ ఆ అమ్మానాన్నలతో సంతకాలు తీసుకున్నాం ఇంటికి బయలుదేరే సమయానికి మా జీపు డ్రైవర్ ఏదో చెట్టుకింద నిద్రపోతున్నాడు ప్రభుత్వోద్యోగి కదా? నిర్దాక్షిణ్యంగా అతన్ని నిద్రలేపి వెలుగు నుంచి చీకటికి దారితీశాము నిజానికి చీకటి నుంచి వస్తున్నట్టు అనిపించింది.

          పొద్దున్నే నా పై అధికారికి ఇదంతా వివరించి ఎనిమిదింటి కెల్లా మళ్ళీ ఆ ఊరు చేరుకున్నాం ఈసారి రెండు నిండు జీపుల నిండా పోలీసులతో వెళ్ళాం వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దం ఒక్క మనిషీ లేడు అంతా పరిపూర్ణమైన ప్రశాంతత నిన్న రాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఓ రెండు కుక్కలు తప్ప నిన్న మొరిగిన ఒక్క మనిషీ అక్కడ లేడు ప్రక్కన కనుక్కుంటే మాకు తెలిసిన సమాధానమే చెప్పారు తెలియదని. చేసేదేమీ లేక వెనక్కి వచ్చేసాం ప్రతీ ఊర్లో ఒక శిశు సంక్షేమ శాఖ కార్యకర్త ఉంటుంది ఆమెద్వారా తరువాత రోజు వాకబుచేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్లిగుడిలో రహస్యంగా పెళ్లిచేశారని తెలిసింది. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం మనం ఎవరిమీద కోపంతో వాళ్ళు ఇంత హడావుడి పెళ్లిచేశారు మా మీదా? మా మాటల మీదా? మేము ఎవరికోసం ఇంత ప్రయత్నం చేశామని వాళ్ళ భావన? మేము ఎవరికి శత్రువులం? ఇది సమాజపు మూర్ఖత్వం ఇలా ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదు సడుగులిరిగి  కూలబడు తుంది. ఆడబిడ్డల శవాలను పూడ్చడానికి ఇక్కడ నేల సరిపోని రోజొస్తుంది ఇలాగే ఉంటే ఇరవైఏళ్ళు వచ్చేదాకా రజస్వల కాకుండా ఏదైనా మందు పెట్టాలేమో? పెళ్లీడు వచ్చేదాకా దేహం పెరిగకుండా కొత్త చట్టం తీసుకురావాలేమో?

          బక్క పలచనిదేహంతో కాళ్ళకి సగం పారాణితో నుదిటిన పెద్దకుంకుమ బొట్టుతో చెంపలమీది కన్నీటితో డొక్కల్లోకి వెళ్లిదాక్కున్న పొట్టతో ఎముకల్నీనుతున్న నడుముతో ఈరోజే మొదటిగా కట్టుకున్న చీరతో చాలా అందంగా ఉన్న ఆ పసిడిపిల్లకాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని ఉంది. నిన్ను నేను ఈ పెళ్లి నుంచి తప్పించలేకపోయామమ్మా అని గట్టిగా హత్తుకోవాలనుంది. హార్దిక సంస్కరణ ఆర్ధిక స్వాతంత్య్రం లేని స్త్రీపురుష సమానత్వం మంచి జోక్ గా మిగిలిపోతుంది అలా చేసిన పెళ్ళిళ్ళలో కురిసిన  తలంబ్రాల కంటే కారిన కన్నీరే ఎక్కువ అప్పగింతలప్పుడు కాదు అమ్మానాన్నా ఏడవాల్సింది పెళ్లి చేయాలని ఆలోచనవచ్చినప్పుడు.

          ఇప్పుడు ఆ కేసు పనిమీదే కోర్టుకి వచ్చా అది జరిగి చాలా ఏళ్ళయింది అయినా ఇంకా ఏదో వెలితి నన్ను వెంటాడుతుంది ఏదో చేయలేక పోయానని బాధ ఎప్పటికీ దహిస్తూనే ఉంది. పాతబడిన బట్టలతో ఆ తల్లిదండ్రులు మా ముందు మెట్లమీద కూర్చొని ఉన్నారు ఎందుకో అప్పుడు ఉన్నంత ఉత్సాహం లేదు వాళ్లలో వయసు కూడా అయిపోయింది నాకు వాళ్ళతో మాట్లాడడం అటు చూడడం కూడా ఇష్టం లేదు దగ్గరగా వచ్చి ‘బాగున్నరామ్మా’ అన్నాడు చాలా ముభావంగా ‘ఆ బాగున్నా’ అన్నా ఆ ఆడమనిషి మాట్లాడకుండా నా వైపే చూస్తుంది నేను తలతిప్పి అసహజంగా నవ్వా ఆమె ఇంకా అలాగే చూస్తుంది ఎలాంటి భావం లేకుండా. నాకు వాళ్ళమీద కోపం ఉంది చాలా కోపం. ఎంతంటే నేనే న్యాయమూర్తినైతే ఇప్పుడే వాళ్ళిద్దరికీ ఉరిశిక్ష వేయిస్తానేమో ఇద్దరూ నావైపే చూస్తున్నారు కళ్ళు లోపలికి పోయి ఉన్నాయి కడుపు లోతుల్లోంచి వస్తున్నట్టు న్నాయి ఆ తండ్రికి మాటలు అయినా స్పష్టంగా వినిపించాయి..

          “మీరు చెప్పినప్పుడు పెళ్లిచేయకుండా ఉంటే నా బిడ్డ ఉరేసుకొని చచ్చిపోయేది కాదమ్మా” అన్నాడు. నా కోపం ఎందుకో మాయమైంది ఒక్కసారిగా కళ్ళలోంచి  నీళ్ళొచ్చా యి ఆ అమ్మాయి ముఖం నాకింకా గుర్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.