దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          భోజనం అయ్యిన తరువాత నిశి వ్రజేశ్వర్‌ని దేవీ రాణి శయ్యాగారంలోకి ప్రవేశ పెట్టింది. అక్కడ ఒక రాజ దర్బారులాగా అంతా అమర్చి వుంది. ఎదురుగా ఒక స్వర్ణ సింహాసనం వుంది. ముత్యాల సరాలు వెనుకగా వ్రేలాడుతున్నాయి. కానీ వ్రజేశ్వరుడీ ధ్యానమంతా ఆ ఐశ్వర్యానికి స్వామిని ఎవరా అనే విషయం మీదనే వున్నది. అప్పుడు ఒక మూల సాధారణమైన కొయ్య కుర్చీ మీద ఘూంఘట్ తల వెనుకకు దించి కూర్చున్న ఒక స్త్రీ కనబడింది. సాగర్లో కనబడిన చురుకుదనం, నిశిలో ఉన్న కరకుదనం ఈవిడలో కనబడటం లేదు. పైగా వాళ్లు చమక్కులతో కూడిన ఖరీదైన బట్టలు, నగలు ధరించి వున్నారు. ఈవిడ ఒక సాధారణ నూలు చీర కట్టుకుని స్థిరంగా, ధీరతతో ఉన్నది. కానీ తల కొంచెం దించుకున్నది.

          ఇంతకు క్రితం నిశి సలహా ప్రకారం దేవి రాణి వీణ మీటుతున్నప్పుడు ఐశ్వర్య వంతురాలులాగా వేషభూషణాలతో నావపై వీణ మీటుతో వ్రజేశ్వర్ కోసం ఎదురు చూసింది. కానీ, ఇప్పుడు దేవీ రాణి ఆ ఆర్భాటం సరైనది కాదు అని తలచి, సాధారణ కట్టూబొట్టుతో ఆ కొయ్య కూర్చీ పై కూర్చుని ఉన్నది.

          నిశి అక్కడి నుండి నిష్క్రమించింది. దేవి లేచి వ్రజేశ్వర్‌కి ప్రణామం చేసింది. వ్రజేశ్వర్ చకితుడయ్యాడు. అక్కడ వేరెవ్వరూ తనకి ఇప్పటిదాకా ప్రణామం చెయ్యలేదు. అప్పుడు ఇంకొంచెం పరిశీలనగా దేవి రాణి ముఖం గమనించాడు. ఎక్కడో చూసినట్టు వున్నది. ఏదో గుర్తుకు వచ్చింది. “ఆమె” కాదు కదా!? ఆమె ఎప్పుడో మరణించింది కదా! ఒకరిని పోలిన మనుష్యులు ఇంకొకరు వుండవచ్చు. ఇంకొంచెం పరిశీలనగా దేవి రాణి ముఖాన్ని కళ్లార్పకుండా చూడసాగాడు.  

          ఆమెను పోలిన దేవి రాణిని చూస్తున్న వ్రజేశ్వర్‌కి హృదయం భారమయ్యింది, కళ్లు నిండాయి, కానీ కన్నీరు జార్చకుండా సముదాయించుకున్నాడు. క్రొద్దిగా తల దించు కున్న దేవి వ్రజేశ్వర్ కనులను గమనించలేదు. గమనించినట్లయితే ఈ కథ ఇంకొక మలుపు తిరిగేదేమో! దేవి హృదయాంతరాలు కూడా వేదనతో నిండి ఉన్నాయి. ఆ దృశ్యం రెండు మేఘాలు వర్షించాటానికి ముందు ఉరుములు మెరుపులతో సంఘర్షిత మవుతున్నాయా అన్నట్లు ఉన్నది.

          దేవి చివరకు వ్రజేశ్వర్‌తో “మీకు చాలా కష్టం కలిగించాను. కారణం మీకు అర్థమయ్యే వుంటుంది. ఈ అపరాధాన్ని మన్నించండి” అన్నది.

          “మీరు నాకు ఉపకారమే చేశారు” అన్నాడు వ్రజేశ్వర్. ఇంకేమీ అనలేకపోయాడు.

          “మీరు ఇక్కడ అన్నపానాదులు చేసి మా ప్రతిష్ట పెంచారు. మీరు కులీన బ్రాహ్మణు లు, పైగా మాకు సంబంధీకులు కూడాను. మీకు మర్యాద చెయ్యటం మా ధర్మం. మేము ఇచ్చే దక్షిణని స్వీకరించండి.”

          “స్త్రీని మించిన ధనమేముంటుంది. రాణిగారు, మీరు నాకు ఆ స్త్రీ ధనాన్నిఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ ఏమి ఉంటుంది?”

          ‘ఓ వ్రజేశ్వర్! ఏమన్నావు? స్త్రీని మించిన ధనమేముంటుందా? ఆ రోజున మరి తండ్రీకొడుకులు ఇద్దరూ కలసి నన్ను ఇంటినుంచీ తరిమేసినప్పుడు ఏమయ్యింది ఈ మాట?’ దేవి తమాయించుకుంది. ప్రక్కన వున్న ఒక వెండి కలశం తీసుకుని “మీరు ఈ దక్షిణ స్వీకరించండి.”

          “మీ నావ మీద వెండి బంగారాలు చాలా పడి వున్నాయి. ఇది తీసుకోకపోతే సాగర్‌కి కోపం వస్తుంది. కానీ, విషయమేమిటంటే …”

          వ్రజేశ్వర్ మాట పూర్తి కాకుండానే దేవి అన్నది “నేను ప్రమాణం చేసి చెపుతు న్నాను. ఈ సొమ్ము దొంగిలించో, దోపిడీలు చేసో సాధించింది కాదు. ఇది నా స్వంత సొమ్ము. మీరు వేరే ఆలోచన పెట్టుకోకుండా స్వీకరించండి.”

          వ్రజేశ్వర్ సమ్మతించాడు. పైగా బ్రాహ్మడు దక్షిణ తీసుకోవటంలో తప్పేమీ లేదు అనుకున్నాడు. దేవి వెండి కలశాన్ని అందించితే, చేతులు ముందుకు చాచి తీసు కున్నాడు. “బరువుగా వుంది, ఇందులో ఏమన్నావున్నాదా?” ఆశ్చర్యంగా అడిగాడు.

          “ఖాళీ కలశం కాదు” అన్నది దేవి.

          వ్రజేశ్వర్ కలశంలో చెయ్యి పెట్టి తీస్తే బంగారపు మొహిరీలు.

          “వీటిని ఎక్కడ పెట్టాలి?”

          “తీసి ఎక్కడో పెట్టటం ఎందుకు? అవన్నీ మీకే” అన్నది దేవి.

          “అవునా, అన్నీనా!”

          “అవును, అన్నీను.”

          “ఇందులో ఎన్ని మొహిరీలు వున్నాయి?”

          “మూడు వేల మూడు వందలు.”

          “మూడు వేల మూడు వందల మొహిరీలా! ఏభై వేల రూపాయల కంటే ఎక్కువే. సాగర్ నా డబ్బు అవసరం గురించి మీతో ఏమన్నా చెప్పిందా?”

          “మీకు ఏభై వేల రూపాయలు అవసరమని చెప్పింది.”

          “అందుకనే ఇస్తున్నారా?”

          “ఈ ధనము దైవానుగ్రహం. స్వామికార్యము నిమిత్తము వాడవలసినది. సద్విని యోగం చేసే అధికారం మాత్రామే నాకున్నది. ఆ ధనములో కొంత మీకు ఋణంగా ఇస్తున్నాను.”

          “నాకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా వుంది. ఈ డబ్బు కోసం దొంగతనమో దోపిడీనో చెయ్యాల్సివస్తుందేమో అనుకున్నా. మా నాన్నగారు చాలా ఇబ్బందిలో వున్నారు. మరి, ఈ ఋణం ఎప్పుడు ఎలా చెల్లించాలి?”

          “నా మరణ వార్త విన్నప్పుడు, ఈ ధనానికి ఇంకొక మొహిరీ చేర్చి, దైవకార్యానికి వినియోగించండి.”

          “అలా దుశ్శకునం పలికితే నేను ఈ ధనాన్ని స్వీకరించలేను.”

          “అలా అయితే మీకు తోచినప్పుడు తిరిగి చెల్లించండి.”

          “డబ్బు ప్రోగుచేసుకుని ఎలాగైనా మీకు పంపిస్తాను.”

          “మీ మనుష్యులెవ్వరూ నా దగ్గరకు రావటానికి కుదరదు.”

          “అలా అయితే స్వయంగా నేనే తీసుకు వస్తాను.”

          “ఎక్కడకని వస్తారు? నేను ఒక చోట స్థిరంగా వుండను, ఎప్పుడు ఎక్కడ వుంటానో తెలువదు.”

          “మీరు ఎక్కడకి రమ్మంటే అక్కడికి వస్తాను.”

          “మీరు ఏ రోజున వస్తారో ముందు నిర్ణయించుకోండి. అప్పుడు ఎక్కడ కలవాలో చెపుతాను.”

          “మాఘఫాల్గుణ మాసాలలో డబ్బు కూడబెట్టుకుంటాను. వైశాఖంలో ఋణం చెల్లించగలను.”

          “వైశాఖ మాసం శుక్లపక్ష సప్తమి నాటి రాత్రికి ఇక్కడకు ఋణం చెల్లించటానికి రండి. ఆలస్యమైతే మరి నేనిక్కడ వుండను.”

          వ్రజేశ్వర్ అంగీకరించాడు. దేవి ఆ కలశాన్ని అతని పడవ పైన ఉంచి రమ్మని ఒక దాసీని ఆదేశించింది. వ్రజేశ్వర్ దేవికి ఆశీర్వాదములు పలికి పడవ దగ్గరకి వెళ్లటానికి సిద్దమయ్యాడు. దేవి వ్రజేశ్వర్‌ని ఆగమని “మరి దక్షిణ తీసుకోకుండానే వెళ్తారా” అన్నది.

          “ఇప్పుడు ఇచ్చినది దక్షిణ కాదా?” అన్నాడు వ్రజేశ్వర్.

          “ఇప్పుడు ఇచ్చినది ఋణము. దక్షతగల దక్షిణ ఇది” అంటూ తన వ్రేలికి వున్న ఉంగరం తీసింది. వ్రజేశ్వర్ స్వీకరించటానికి చేతులు ముందుకు చాపి దోసిలి పట్టాడు. దేవి ఆ దోసిటలో ఉంగరం వెయ్యలేదు. వ్రజేశ్వర్ చెయ్యి అందుకుని మృదువుగా అతని వ్రేలికి తొడిగింది.

          వ్రజేశ్వర్ గుండె దిటువగల మనిషే. కానీ ఈ హాఠాత్పరిణామానికి చంచలమ య్యింది. హృదయములో నుండి ఒక అమృతధార పొంగినట్లయ్యింది. చెయ్యి వెనుకకు తీసుకోవడం మర్చిపోయాడు. అప్పుడే రెండు అశృ బిందువులు తన చేతుల మీద పడినాయి. వ్రజేశ్వర్ తల ఎత్తి చూస్తే, దేవి కళ్లు కన్నీటితో నిండి వున్నాయి. ‘ఆ రోజు రాత్రి’ కూడా ఆమె కళ్లు అశ్రువులతో నిండి వుండటం వెంటనే గుర్తుకు వచ్చింది. ఆ కన్నీటిని తను తుడవటమూ గుర్తుకు వచ్చింది. వ్రజేశ్వర్ అప్రయత్నంగానే దేవి చుబుకము పట్టుకుని నెమ్మదిగా తల పైకి లేపి, ఆమె పెదవులని మృదువుగా చుంబిం చాడు. 

          ఉన్నట్టువుండి వ్రజేశ్వర్‌కి కొంత తెలివి వచ్చింది. ‘ఎంత పని చేసాను’ అని అనుకున్నాడు. డాకూల రాణిని తను ముద్దుపెట్టుకున్నాడు. ఆకాశం తన నెత్తిన విరిగిపడినట్లనిపించింది. భయంతో వెంటనే వెను తిరిగి పరుగు పరుగున పోయి నావ మీద నుండి పడవ పైకి దూకాడు..

          సాగర్ వ్రజేశ్వర్ పరుగుతో పడవ ఎక్కటం చూసింది. “అయ్యో, అయ్యో, ఆసామి పారిపోతున్నాడు” అంటూ తనూ పరుగున వెళ్లి పడవ ఎక్కింది.

          వ్రజేశ్వర్ తన రెండు ధనములు, ఒకటి బంగారు మొహిరీలతో కూడిన కలశం, సాగర్ అనే స్త్రీ ధనం, రెండిటితో సహా పడవలో వెళ్లి తన నావను చేరుకున్నాడు.

          వ్రజేశ్వర్ వెళ్లటం గమనించిన నిశి అప్పుడు దేవి శయ్యాగారానికి వెళ్లి చూస్తే, దేవి క్రింద పడి రోదిస్తున్నది. దేవిని నెమ్మదిగా లేపి కూర్చోబెట్టి, అనునయిస్తూ, “ఇదేనా నీ నిష్కామ కర్మ? ఇదేనా నీ సన్యాసం? ఇదేనా నువ్వు భగవద్గీత నుండి గ్రహించిన భగవద్ ‌వాక్యం?” అంటూ ప్రశ్నించింది.

          దేవి మౌనంగా వుండిపోయింది. నిశి “స్త్రీలు నిలబెట్టుకోలేనప్పుడు ప్రమాణాలు చెయ్యటమెందుకో! ప్రమాణాలు చేస్తే నాలాంటి వాళ్లు చెయ్యాలి. ఎందుకంటే, నాకు వేరే వ్రజేశ్వర్ లేడు. నా వ్రజేశ్వరుడు వైకుంఠపురంలోనే వున్నాడు.”

          దేవి కళ్లు తుడుచుకుంటూ “నువ్వు యముడి కంటే కూడా కఠినరాలువి, ఇక్కడి నుంచి ఫో” అన్నది.

          “నేను పోతాను, నేను యముడికి కూడా భయపడను. నువ్వు మాత్రాం నీ ప్రతిజ్ఞా ప్రమాణాలను చాలించి మీ పతిదేవుడి దగ్గరకు ఫో” అన్నది.

          “అయ్యో, అసలు నాకు ఆ గతే వుంటే, నేను ఈ దారి పట్టేదాన్నా? సరే, మనం ఇక్కడ నుండి బయలుదేరే సమయం ఆసన్నమయ్యింది. నావకు ఉన్న నాలుగు తెరచాపలనూ ఎత్తించండి” అంటూ అజ్ఞాపించింది దేవి.

          తెరచాపలను ఎత్తారు, లంగరు తాళ్లను వదులు చేసారు. నావ నీటి మీద నుండి ఎగురుతూ వెళ్తున్న నీటిపక్షి వలే వేగంగా సాగింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.