యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-8
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) లండన్ విహారం ప్రారంభం
అండర్ గ్రౌండ్ రైలు:
లండన్ లో మా అంతట మేం పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో సొంతంగా, సులభంగా తిరగొచ్చని మిత్రులు చెప్పిన మీదట అదేదో చూద్దామని బయలుదేరేం. విక్టోరియా బస్సు, రైలు స్టేషను మా హోటల్ నించి ఒక వీథి అవతలగా ఉంది. విక్టోరియా స్టేషను నించి లండనులోని ప్రధాన ప్రదేశాలన్నిటికీ బస్సు, రైలు సౌకర్యముంది. కొన్ని చోట్లకి మరొకటి, రెండు మారాల్సి ఉంటుంది. ఇంకేం! సౌకర్యవంతంగా ఉంది కదా అని అక్కణ్ణించి మేం ఒంటిగంటకి వెళ్లాల్సిన “లండన్ ఐ” ప్రాంతానికి పదకొండింటికే బయలుదేరాం. గూగుల్ మేప్స్ లో రూట్ మేప్ పెట్టుకుని ఏ సమయానికి ఏమేం ఎక్కాలో సులభంగా తెలుసుకున్నాం. అక్కణ్ణించి ప్రతి అయిదు నిమిషాలకొక అండర్ గ్రౌండ్ రైలు ఉంది. ఎక్కితే అయిదే అయిదు నిమిషాల్లో వెస్ట్ మినిష్టర్ స్టాపులో దిగుతాం. ఈ అండర్ గ్రౌండ్ రైలు వేగవంతంగా వెళ్లే న్యూయార్కులోని సబ్ వే వంటిదన్నమాట. ఇక్కడ దీన్ని “ట్యూబ్” అని అంటారు.
అయితే అండర్ గ్రౌండ్ రైలు ఎక్కడానికి ఎంట్రెన్సు ఎక్కడో కనిపెట్టడం మొదటి సారి కొంచెం కష్టమే.
మేప్ లో అక్కడక్కడే చూపిస్తుంది. మొత్తానికి పదినిమిషాలు అటూ ఇటూ తిరిగి కనిపెట్టాం. రైలు స్టేషన్ని ఆనుకుని, లోకల్ బస్సు స్టేషను ఉంటుంది. అది దాటి రోడ్డుకావల ఈ అండర్ గ్రౌండ్ రైలు స్టేషను ఉందన్నమాట!
అయితే పేరుకి తగట్టుగానే ఎక్కడో దిగువన అండర్ గ్రౌండ్ లో ఉండడం వల్ల ఓ రెండు పేద్ద ఎస్కలేటర్లు దిగెళ్లాలి. ఎస్కలేటర్లు ఎక్కడానికి ముందు స్టేషనులోకి అడుగు పెడుతూనే కిందికి వెళ్లాలంటే టిక్కెట్టు స్కాన్ చెయ్యాలి. పేపరు టిక్కెట్టు అక్కడే ఉన్న టిక్కెట్టు మిషన్ల ద్వారా కొనుక్కోవచ్చు. (లేదా) రోజు వారీ పాసులు కొనుక్కోవచ్చు. ఈ టిక్కెట్ల ఖరీదు ఏ జోన్లకి వెళతామో వాటి మీద ఆధారపడి ఉంటుంది.
ఇక ఎక్కడికక్కడ ఏ స్టేషను నించి ఏ స్టేషనుకైనా సులభంగా క్రెడిట్ కార్డు స్కాన్ చేసుకుని వెళ్లిపోవచ్చు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు ఏదైనా పనిచేస్తుంది. అయితే ఇద్దరు ముగ్గురు వెళ్ళినపుడు ఒక్కో మనిషికి ఒక్కో క్రెడిట్ కార్డు వాడాలి.
ఈ క్రెడిట్ కార్డు ఒక్కసారి స్కాన్ చేస్తే అదే టిక్కెట్టుగా గేటు తెరుచుకుంటుంది. ఇక స్టేషను బయటికి వచ్చేటపుడు ఏ కార్డు స్కాన్ చేస్తే టిక్కెట్టు పడిందో అదే కార్డు మళ్ళీ స్కాన్ చేస్తే టిక్కెట్టు రుసుము కార్డులో నించి కట్ అవుతుంది, గేటు తెరుచుకుంటుంది.
తీరా మేం ముగ్గురం కార్డులు స్కాన్ చేసి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న పెద్ద ఎస్కలేటరు దిగనని మా సిరి మారాం చేసింది. మా సిరికి అంతలేసి పెద్ద ఎస్కలేట ర్లంటే భయం. అక్కడ లిఫ్ట్ కూడా లేదు. చుట్టూ బోల్డు మంది జనం హడావుడిగా వెళ్తు న్నారు. ఇక పక్కకి తీసుకెళ్లి కొంతసేపు బతిమలాడి, మరి కొంతసేపు భయం పోగొట్టడానికి ఏవేవో కబుర్లు చెప్పి, మొత్తానికి ఇద్దరంచెరో రెక్కా పట్టుకుని ధైర్యం చెప్పి తీసుకెళ్ళేం. ఇక అక్కణ్ణించి వరసపెట్టి లండన్లో ఎక్కి దిగిన అండర్ గ్రౌండ్ రైళ్ల పుణ్యమా అని మా సిరికి మొత్తానికి ఎస్కలేటర్లంటే ఉన్న భయం పోయింది.
ఇక్కడ రైళ్లు బాగా రద్దీగా ఉన్నాయి. ప్రతి పెట్టెలోనూ కిక్కిరిసి జనం ప్రయాణిస్తూ ఉన్నారు. అమెరికాలో మేమున్న చోట బస్సులు, రైళ్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు. ఇలా రైలు ప్రయాణం అంటే సిరి భయపడుతుందేమో అనుకున్నాం. కానీ బానే సర్దాపడుతూ ఎక్కింది. అంతేకాదు ప్రతిసారీ చక్కగా ఓ సీటు సంపాదించుకునేది. రైలు చాకచక్యంగా ఎక్కడం, దిగడం ఒక్కసారికే నేర్చేసుకుంది.
వెస్ట్ మినిస్టర్:
వెస్ట్ మినిస్టర్ స్టేషనులో రైలు దిగగానే బయటికి వచ్చేసరికి థేమ్స్ నది ఒడ్డున ఉన్న నడిచే దారికి చేరేం. అక్కణ్ణించి నగరంలో ఇతర చోట్లకి పడవలు కూడా తిరుగుతాయి. అచ్చు ఆస్ట్రేలియా సిడ్నీలో లాగా. కాదు కాదు ఇక్కడి పద్ధతే ఆస్ట్రేలియాలో ఉందన్న మాట.
రైలు ఆగిన తీరంలోనే వెస్ట్ మినిస్టర్ ఆబీ అనబడే రాయల్ చర్చి, బిగ్ బెన్ గడియారం, పార్లమెంటు భవనం వగైరా ఉన్నాయి. మేమెళ్ళాల్సిన “లండన్ ఐ” తీరానికి అటు వైపు మురిపిస్తూ గుండ్రంగా ఆకాశంలోకి సాగి గంభీరంగా నిలిచి ఉంది. అక్కణ్ణించి అవతలితీరానికి బ్రిడ్జి దాటి నడుచుకుంటూ వెళ్లాలి.
రైలు స్టేషను బయట, తీరం వెంబడి పలకల గచ్చు ఉన్నా, శుభ్రత ఉన్నట్టు లేదు. ఎక్కణ్ణించో ఎగిరొచ్చినట్లు బాట మూలల్లో ఎండిన పూలు, రాలిన పుప్పొడి వంటిది తప్ప పెద్దగా తుక్కు లేకపోయినా గాల్లోంచి ఏదో చెమ్మ, రొచ్చు వాసన. గోడలన్నీ నాచు పట్టి నట్టు నలుపు దేరి ఉన్నాయి. మెట్లెక్కి పైకి వెళ్ళగానే కాస్త నయం.
ఎదురుగా “రెడ్ ఫోన్ బూత్” కనబడగానే జనం అందులోకి వెళ్లి ఫోను చేస్తున్నట్లు నటిస్తూ ఫోటోలు తీసుకోసాగేరు. లండనులో ఇలా పాతకాలపు ఎర్రని ఫోను బూత్ లు ఎక్కడికక్కడ దర్శనమిస్తాయి.
లండను అంటే గుర్తు చేసేవి ఇక్కడి డబుల్ డెక్కర్ ఎరుపు రంగు బస్సులు, ఈ ఫోను బూత్ లే.
బిగ్ బెన్ గడియారం:
అక్కణ్ణించి బిగ్ బెన్ గడియారపు స్తంభం కాంతులీనుతూ దర్శనమిచ్చింది. ఈ మధ్య కొన్ని సంవత్సరాల పాటు ఈ బిగ్ బెన్ ని మరమ్మత్తులు, పునరలంకరణల నిమిత్తమై మూసి ఉంచారు. మా అదృష్టం కొద్దీ అదే వారంలో పని పూర్తవ్వడంతో మేం బిగ్ బెన్ ని చూడగలిగాం. తలెత్తి చూస్తే అందమైన నీలాకాశంలో తెల్లని మబ్బుల మధ్య బంగారు పూతతో దగధగా మెరుస్తూ ఠీవిగా నిల్చున్న గడియారపు స్తంభాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలలేదు. దాన్ని ఆనుకుని అదే రంగులో తీరం వెంబడి పార్లమెంటు భవనం. ఫోటోల్లో బంధించలేని సౌందర్యం! కొన్నిటిని కళ్ళతోనే చూడాలని ఆ తీరంలో ఉన్న గొప్ప కట్టడాల్ని చూస్తే అనిపించింది.
వెస్ట్ మినిస్టర్ ప్రధాన ప్రదేశాలు:
దాన్ని అనుకుని వెనకగా వెస్ట్ మినిస్టర్ ఆబీ (Westminster Abbey) రాయల్ చర్చి ఉంటుంది. ఇక్కడే బ్రిటన్ రాజ వంశీకుల గొప్ప కార్యాలెన్నో జరుగుతాయి. చివరికి వారిని సమాధి చేసేది కూడా ఇక్కడే. చర్చిల్లో సమాధి చేసే సంప్రదాయం యూరపులోనే చూసేం.
లండన్ మహా నగరం 32 బరోలుగా విడగొట్టబడింది. “బరో” అంటే మన భాషలో “పేట”(బస్తీ) అని చెప్పుకోవచ్చు. అందులో వెస్ట్ మినిష్టర్, గ్రేటర్ లండన్ లోని ప్రధాన కేంద్ర ప్రదేశం. ఇక్కడే కాస్త అటూ ఇటూగా బ్రిటిషు మహారాజు, మహా రాణీల బకింగ్ హాం ప్యాలెస్ (Buckingham Palace), ప్రసిద్ధ వైట్ హాల్ (Whitehall) రోడ్డు, యునైటెడ్ కింగ్ డమ్ మొత్తమ్మీద పెద్దదీ, ప్రధానమైనదీ అయిన వెస్ట్ మినిష్టర్ కాథెడ్రల్ (Westminster Cathedral) కాథలిక్కు చర్చి, బ్రిటన్ ప్రధాన మంత్రి నివాసం (10 Downing Street), ప్రసిద్ధ ట్రఫాల్గర్ స్క్వేర్ (Trafalgar Square) మొ.వి ఉంటాయి.
బౌదికా విగ్రహం:
వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జి ఎక్కే ముందే ఉన్న ఎత్తైన పెద్ద విగ్రహం ఆ చుట్టుపక్కల ఉన్న అన్నిటికంటే విభిన్నమైంది, గొప్ప ప్రాధాన్యత కలిగినది. జోడు గుర్రాల బండి మీద చేతిలో బల్లెంతో , వెనక తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి విప్లవిస్తున్న స్త్రీ మూర్తి కాంస్య విగ్రహం అది. అది రోమను సామ్రాజ్య దురాగతానికి ఎదురీదిన స్థానిక “ఇకెనీ” ఆటవిక రాణీ “బౌదికా” విగ్రహం.
రోమను సామ్రాజ్యానికి సామంత రాజైన తన భర్త ప్రాసగాస్టాస్ మరణానంతరం క్రీ.శ. 43 ప్రాంతంలో “బౌదికా” రాణీ అయ్యింది. అయితే స్త్రీలు పరిపాలనాధికారులు కావడాన్ని వ్యతిరేకించే రోమను సామ్రాజ్యం ఆమెని నిర్దాక్షిణ్యంగా కొరడా దెబ్బలతో శిక్షించడమే కాకుండా, అతిక్రూరంగా ఆమె కూతుళ్ళిద్దరినీ బలాత్కారానికి గురి చేసింది.
దాంతో ఆమె ఇతర స్థానిక ఆటవిక జాతులతో కలిసి రోమను సామ్రాజ్యం మీదికి దండెత్తి, పోరాడి, ఘోర యుద్ధంలో వీరనారిగా మరణించింది. అప్పటి యుద్ధంలో దాదాపు ఎనభై వేల మంది మరణించారట. లండను నగరమంతా ధ్వంసమైందట.
18 వ శతాబ్దిలో విక్టోరియా మహారాణి కాలంలో ఈ గాథకి ప్రాముఖ్యత లభించింది. ప్రసిద్ధ కవి టెన్నీసన్ ‘Up my Britons, on my chariot, on my chargers, trample them under us’ అంటూ “బౌదికా” పేరుతో 1859లో రాసిన కవిత అత్యంత పేరుగాంచింది.
అదంతా గుర్తుకొచ్చి అక్కడ “జోహార్ బౌదికా” అనకుండా ఉండలేకపోయాను.
అయితే ఆ చుట్టూ తిరుగుతున్న వారిలో అక్కడున్న విగ్రహాన్ని పెద్దగా పట్టించు కునేవారే లేరు. ఏదో నామమాత్రపు ఫోటో ఒకటి లాక్కుని వెళ్లిపోయేవారే. అది క్వీన్ విక్టోరియా విగ్రహం అనుకునేవారూ ఉన్నారు.
*****
(సశేషం)