సన్మిత్రులందరికి శుభాభినందనలు. క్రిందటి నెల మనమందరం ఘనంగా ధనలక్ష్మీ దేవిని ఆహ్వానించి, పూజించి, రంగు రంగుల దివ్వెల కాంతులలో దీపావళి పర్వదినం చేసుకున్నాము. అలాగే పరమ పవిత్రమైన కార్తీక మాస పూజలకు శ్రీకారం చుట్టాము కదా? లక్ష్మీ అమ్మవారిని రంజింపజేసే మరియొక రాగం, శ్రీరంజని రాగ విశేషాలు ఈ నెల మీకోసం.
ఈ రాగం మరీ పురాతనమైనది కాదు. 72 మేళకర్తలని ఏర్పరచి, ఒక్కొక్క రాగంలో జన్యరాగాలను శోధించినపుడు పుట్టిన రాగమని చెప్తారు. త్యాగరాజ స్వామి, దీక్షితుల ముందు కాలంలో ఈ రాగం కానరాదు. పాత సాంప్రదాయ సంగీతంలో కానీ, పాటలలో కానీ ఈ రాగం లేదు. శ్రీ అంటే లక్ష్మీ దేవిని రంజింపజేసే రాగం అని ఒక భావన. శ్రీ అంటే శోభ కాబట్టి ఈ రాగాన్ని శోధించి పాడుకున్నప్పుడు తోచిన శోభ కారణంగా శ్రీరంజని అనే నామం ఏర్పరచి ఉండవచ్చునని మరొక భావన. ఏది ఏమైనా ఇది ఒక శుభప్రదమైన రాగము.
ఈ రాగం 22 వ మేళకర్త ఖరహరప్రియ రాగ జన్యము. ఈ రాగం ఆరోహణ అవరోహణలు కింది విధంగా ఉన్నాయి.
“స రి గ మ ద ని స”
“స ని ద మ గ రి స”
6 స్వరములు మాత్రమే ఉండటం వలన షాడవ రాగం. ఉపాంగ రాగము. పంచమము వర్జము కనుక వర్జ రాగము. ఇందులోని స్వరములు షడ్జము, చతుశృతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశృతి దైవతము, కైశికి నిషాదములు. గమకవరీక రక్తి రాగము. మంద్ర మధ్యమం నుండి తార స్థాయి మధ్యమం వరకు పాడతగినది. మనోధర్మ సంగీతానికి అనువైనది. శుభకరమైన రాగము కనుక కచేరి మొదలు కానీ ప్రధమార్ధంలో కానీ పాడతగినది. వినేవారికి ఉత్సాహాన్ని కలిగించగలదు.
ఈ రాగం భక్తి, కరుణ, శృంగార భావనలను అద్భుతంగా పోషించగలదు. లక్ష్మీ దేవిని రంజింప చేయకలదు కనుక సకల శుభాలను, సంపత్తును కలుగజేయగలదని నమ్మిక. ఈ రాగాన్ని త్యాగరాజ కీర్తనలే జీవింపజేశాయని చెప్పవచ్చు. హిందూస్తానిలో ఈ రాగం భాగేశ్రీ గా అత్యంత ప్రాచుర్యంలో ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన రాగము.
త్యాగరాజ స్వామి తన “సొగసుగా మృదంగ తాళము” కీర్తనలో ఉత్తమ వాగ్గేయ కారుని లక్షణమును, మంచి కీర్తన యొక్క లక్షణాన్ని అందంగా పొందుపరిచారు. Link లో విని ఆనందించగలరు.
“నీ సాటి దైవమెందు ” అనే దారు కీర్తనని దీక్షితులవారు తన శిష్య పరమాణువు కమలం ఆరంగేట్రం కోసం దానికి అనుగుణంగా రచించారు. లింక్ లో విని ఆనందిం చండి.
ఇన్ని చక్కని లక్షణాలున్న ఈ రాగం లలిత, సినిమా సంగీతాలలో ఎక్కువ కనిపించదు.
ఇపుడు కొన్ని ప్రముఖ రచనలు చూద్దాము.
శాస్త్రీయ సంగీతం |
1 | కీర్తన | సొగసుగా | రూపక | శ్రీ త్యాగయ్య |
2 | కీర్తన | మారుబల్క | ఆది | శ్రీ త్యాగయ్య |
3 | కీర్తన | భువిని దాసుడ | ఆది | శ్రీ త్యాగయ్య |
4 | కీర్తన | బ్రోచేవారెవరే | ఆది | శ్రీ త్యాగయ్య |
5 | కీర్తన | సరి ఎవ్వరే | ఆది | శ్రీ త్యాగయ్య |
6 | కీర్తన | శ్రీ దుం దుర్గాయై | ఖండ | శ్రీ దీక్షితులు |
7 | కీర్తన | పర్వత రాజ | ఆది | శ్రీ త్యాగయ్య |
8 | కీర్తన | నీ సాటి దైవము | రూపక | శ్రీ త్యాగయ్య |
| |
లలిత సంగీతం |
విడువరాదు | గాయని కుమారి కృష్ణ కుమారి |
సినిమా సంగీతం |
ప్రణయ రాగ | మాయ మశ్చీంద్ర | శ్రీ బాలు, శ్రీమతి సుశీల |
|
ఇవండీ శుభకరమైన, లక్ష్మీ రంజకమైన శ్రీరంజని రాగ విశేషాలు. వచ్చేనెల మరొక అందమైన రాగం తో మీ ముందుంటాను. అంతవరకు శెలవు, నమస్తే.