
ఆకుపచ్చని ఆలోచన
(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
– బద్రి నర్సన్
ఎంతో అన్యోన్యంగా గడిపిన దంపతులకైనా జీవిత చరమాంకంలో ఎవరో ఒకరికి ఒంటరి ప్రయాణం తప్పదు. ఆ ఒకరికి తోడుగా మిగిలేవి ఇద్దరు కలిసి బతికిన రోజుల జ్ఞాపకాలే. రాజారాం చనిపోయి అయిదేళ్లవుతోంది. భర్త ఎడబాటు నుండి కోలుకునేందుకు సుశీల వెదుకుతున్న దారుల్లో తమ చెట్లు, చేమలు ఆమెకు సాంత్వననిచ్చాయి. తమ వ్యవసాయ క్షేత్రమే ఆమెకు ఛత్రఛాయగా నిలుస్తోంది. వారు కలిసి వేసిన అడుగుజాడలన్నీ ఆ మొక్కల మధ్యనే కదలాడుతున్నాయి. భర్తతో కలిసి నాటిన మొక్కలు, ఎంతో ప్రేమగా పెంచిన చెట్ల సహవాసంలో ఆమెకు ఒంటరితనం తెలియకుండానే కాలం గడిచిపోతోంది. ఏ చెట్టు కింద కూచున్నా అవి భర్త ఊసులే చెబుతున్నట్లు ఉంటుంది.
రాజారాం, సుశీలది ఓ చక్కని ప్రేమ కథ. రాజారాం పట్టణ జీవి. సుశీల పల్లె పడుచు. డిగ్రీ చదివేప్పుడు ప్రేమలో పడ్డారు. ‘మాకున్నది ఒకే అమ్మాయి. ఊరు విడిచి రాదు. నీవు కూడా మాతోపాటు ఊర్లో ఉంటానంటే మా పిల్లనిస్తాం!’ అని ఆమె నాన్న కండిషన్ పెట్టాడు. సుశీలతో జీవితం పంచుకోడానికి ఒప్పుకోక తప్పలేదు. పంచె కట్టు నేర్చి రైతుగా అవతారమెత్తాడు రాజారాం. అలా అనివార్యంగా, అందంగా ఆయన జీవితమంతా పల్లెటూరిలోనే గడిపాడు.
ఇంటి పనులు తీర్చుకొని దగ్గర్లోనే ఉన్న తమ ఐదెకరాల భూమి వద్దకి వెళ్లడంతోనే రాజారాం, సుశీల దినచర్య మొదలయ్యేది. ఇష్టమైన వంటకాలు ఇంట్లో సిద్ధం చేసినా భోజనాలు మాత్రం చెట్ల కిందే సాగేవి. రాత్రుళ్ళు తప్ప వారిదెప్పుడూ వనభోజనమే. వంటలకు తోడుగా చెట్టు మీది కాయలు, పండ్లు విస్తళ్లలోకి చేరుకునేవి. తినే సమయంలో అటుగా వచ్చినవారు పంక్తిలో కలిసిపోయేవారు. పంటలు తమవైనా ఆకలికి అందరివి అయ్యేవి.
తమ ఇద్దరు కొడుకుల చదువు ఊర్లో అయిపోగానే సుశీలనే వారి వెంట పట్టణానికి వెళ్లి పిల్లలను చూసుకొనేది. పిల్లలు రెసిడెన్షియల్ కాలేజీల్లో చేరగానే సుశీల తిరిగి ఊరికి వచ్చేసింది. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అన్ని ఒక క్రమంగా జరిగిపోవడంతో ఆ కుటుంబానికి అంతా కలిసివచ్చింది అనుకుంటున్న వేళ రాజారాంకు గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ చేరేలోగా ప్రాణాలు విడిచాడు.
నాగన్న, పార్వతి వీరి ఆత్మబంధువులు. అందరికన్నా ముందుగానే వచ్చే నాగన్న చేలకు నీళ్ళు పెడుతూ, సాగు పనుల్లో నిమగ్నమయ్యేవాడు. పేరుకే నాగన్న వీరి పాలేరు. ఆయన భార్య పార్వతి పనమ్మ. నిజానికి మాత్రం సుశీల, రాజారాం వీరికి నీడనిచ్చే చెట్లు. పార్వతి, నాగన్నలేమో ఆ చెట్లపై బతికే పక్షులు. అది ఈ నలుగురి మధ్యన విడదీయరాని బంధం. రాజారాం మరణంతో వారు నలుగురు నుంచి ముగ్గురైనా నాగన్న, పార్వతి ఇరువురు కలిసి సుశీలకు ఆ ఆలోచన రాకుండా చూసుకుంటున్నారు. అమ్మగారు ఒంటరిగా ఉండవద్దని సుశీల ఇంటి అరుగు మీదికి వారి నివాసాన్ని మార్చేశారు.
‘మీరు కూర్చోండమ్మా!’ అని సుశీలను కదలనీయకుండా ఆమెకు నచ్చినట్లు ఇంటి పనులు, వంటలు చేయడం పార్వతి అలవాటు చేసుకుంది.
‘మీరు పొలం పనులు చూసుకుంటే చాలు. మీకిచ్చే కూలి దానికే కదా!’ అని సుశీల వారించినా పార్వతి వినదు.
‘ఇన్నేళ్ళుగా మీ ఉప్పు, పప్పు తింటున్నవాళ్ళం. మాకీ పనులు కష్టమా?’ అని నాగన్న భార్యవైపు మాట్లాడుతాడు.
ఉప్పు పప్పు మాటేమోగాని ఈ రోజుల్లో నమ్మకమైన మనుషులు దొరకడం ఎంతో కష్టం. అయన పోయిన నుండి ఒంటరి బతుకును మరిపించేలా సొంతమనుషుల్లా తోడుంటున్నారు. వీరి ఋణం తీర్చుకోవడం తనవల్ల జరిగే పనేనా అని మనసులోనే వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది సుశీల.
ఎదిగిన కొడుకులిద్దరూ ఇప్పుడు పట్టణంలో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. భార్య పిల్లలతో వారి జీవితాలు సుఖంగా గడుస్తున్నాయి. పంటలు చేతికి రాగానే వీలైతే తాను, లేకపోతే నాగన్నతో బియ్యం, పప్పులు అన్ని రకాలు శుభ్రం చేసి పిల్లలకు పంపిస్తూ ఉంటుంది. సుశీల కన్నా నాగన్నకే ఆ తొందరెక్కువ. చిన్న, పెద్ద ఎవరికేం కావాలో, వారి ఇష్టాలేమిటో ఆయనకు బాగా తెలుసు.
ఈ మధ్య వయోభారంతో సుశీల ముందరి మాదిరి హుషారుగా ఉండలేకపోతోంది. ఇంట్లో ఉన్నా, పంటల వైపు వెళ్లినా కూచునేప్పుడు, లేచేప్పుడు ‘అమ్మా, బాబూ!’ అని దీర్ఘం తీస్తోంది. ఆమె బాధ చూసిన నాగన్న ‘అమ్మా! అరవై ఏండ్లు దాటిన మీరు ఇంకా పొలం పనులంటూ కష్టపడడమెందుకు? ఇంట్లో సేద తీరండి! మేమున్నాం కదా ఇవన్నీ చూసుకునేందుకు?’ అన్నాడు.
‘కాళ్లు చేతులు ఆడినంత కాలం నేను ఈ చెట్ల మధ్యకు రాకుండా ఉండలేను నాగన్నా! ఎందుకోగానీ ఈ మధ్య చిన్న పనికే ఆయాసమోస్తోంది. ఓసారి మనోహర్ దగ్గరికెళ్లి డాక్టర్ కు చూయించుకోవాలి’ అంది. మనోహర్ ఆమె పెద్ద కొడుకు. సాయంత్రం ఫోను చేయగానే ఆయన పొద్దున్నే వచ్చి తల్లిని వెంటతీసుకొని వెళ్ళాడు.
డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకోని, ఆఫీసు నుండి తొందరగానే వచ్చిన మనోహర్ సాయంత్రం అమ్మను డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళాడు.
‘ఏజ్ రిలేటెడ్ ఇస్సూస్ తప్ప పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. బిపికి ఎప్పట్లా గోళీలు వాడాలి. ఐరన్, వైటమిన్స్ కి సప్లిమెంట్స్ రాస్తున్నాను. నెల రోజులు చూద్దాం. ఆ తరవాత వచ్చేప్పుడు కొన్ని టెస్ట్స్ చేయించండి!’ అంటూ డాక్టర్ చీటీ మనోహర్ చేతిలో పెట్టాడు.
ఇంటికి చేరుకోగానే చిన్న కొడుకు ప్రకాష్ కూడా అక్కడికి వచ్చాడు. డాక్టర్ ఏమన్నాడో తమ్ముడికి చెప్పాడు మనోహర్. తల్లి వయసు, ఒంటరితనం, ఆరోగ్యం అన్నిటి గురించి వారు చర్చించారు.
‘అయితే.. అమ్మ తిరిగి ఊరికి వెళ్ళే అవసరం లేదు. మన దగ్గరే ఉంటుంది. మన ఇళ్లు కూడా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఆమె ఇష్టం వచ్చినంతకాలం ఉండొచ్చు’ అన్నాడు ప్రకాష్.
ఆ మాట విన్న సుశీల అప్పుడే కొడుకుల పంచన బతకాలా అని ఆలోచనలో పడ్డది. ఈమాత్రం దానికే తన జీవితంలో ఇంత మార్పు అవసరమా.. ఊర్లో తనకేం తక్కువని ఇక్కడికి రావాలి. నెల తర్వాత డాక్టర్ మళ్ళీ ఓసారి కలవమన్నాడు, అంతదాకా కాలం గడవనీ.. అని తన మనసులో అనుకుంది.
మూడు రోజులకే పరిస్థితి మారిపోయింది.
‘అమ్మ ఎలాగూ మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఊర్లో ప్రాపర్టీస్ ఎందుకు? భూములు, పాత ఇల్లు అమ్మేసి ఇక్కడే ఏమైనా కొనేద్దాం!’ అన్నాడు ప్రకాష్.
ఆ మాట వినగానే సుశీలకు గుండెల్లో రాయి పడ్డట్టైంది. పిల్లలు తన బాధ చూడలేక తమ వద్ద ఉండమంటున్నారని లోలోపల సంతోషపడింది కానీ చెట్టునే మొదటికి నరికేసే ఇలాంటి ఆలోచన చేస్తారని అనుకోలేదు. భూములు, పాత ఇల్లు అని ఎంత తేలిగ్గా అనేశాడు. కన్నవారితో కలిసి పెరిగిన జ్ఞాపకాలు, బంధాలు వాటితో ముడిపడి ఉన్నాయన్న ధ్యాస, స్పృహ కొంతైన లేదు. బతుకంతా తీపి గురుతులుగా మిగిలిపోయే విషయాలను ఇంతలోనే ఎలా చెరిపేసుకోగలిగారు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తనకైతే భూమి, ఇల్లు కేవలం మట్టి ముద్దలు కావు. రాజారాం ప్రేమతో నిండిన మందిరాలు. ఏ వైపు చూసినా ఏదో జ్ఞాపకంగా కదలాడుతూ కనిపిస్తుంది.
ఇలా ఆలోచనల మధ్యలోకి ఒక్కసారిగా ఆమె కళ్ల ముందుకు నాగన్న కుటుంబం తెరపైకి బొమ్మలా వచ్చింది. అయిదేళ్లుగా వారి సేవకు కొలమానము లేదు. కడుపున పుట్టినవారి వల్ల కూడా అది సాధ్యపడదని ఆమె ధీమాగా చెప్పగలదు. నాగన్న తమకు పుట్టని మూడో కొడుకు. చదువులు,ఉద్యోగాలపై పిల్లలు ఊరొదిలాక నాగన్ననే ఇంటి బాధ్యతని తన భుజంపై వేసుకున్నాడు. వయసు పెరిగాక భర్తకు కూడా నాగన్న వస్తేగాని కాళ్లు, చేతులు ఆడేవి కావు. పనుల్లో కదలిక వచ్చేది కాదు. ‘వీరి ఋణం కూలి డబ్బులతో తీరేది కాదు సుశీలా!’ అని ఆయన ఎన్నిసార్లు గుర్తు చేసుకొనేవారో లెక్కే లేదు. తానైన వారి కోసం ఎంతైనా, ఏమైనా చేయాలి, ఆయనెక్కడున్నా సంతోషిస్తారు అని తపిస్తోంది.
సుశీల కోరుకునేదేమిటంటే నాగన్న, పార్వతిల పిల్లలు కూడా తమ పిల్లల్లా బతకాలి. వారి కొడుకుని బాగా చదివించాలి, అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. ఇప్పటికే వారి స్కూల్ ఖర్చులన్నీ తానే భరిస్తోంది. తన ఆలోచనకు తగ్గట్లుగా కావలసిన డబ్బులు వ్యవసాయం ద్వారానే కూడుతున్నాయి. వీలైనంత సొమ్ము బ్యాంకులో వేస్తోంది. ఇదేదీ కొడుకులకు తెలియదు.
భూమి, ఇల్లు అమ్మేద్దామని ప్రకాష్ అన్న మాటలే ఆమెను వెంటాడుతున్నాయి. ఆ రాత్రి ఆమెకు నిద్ర కూడా కరువైంది. అదే జరిగితే తన లక్ష్యం నెరవేరేదెలా? నాగన్న కుటుంబం పరిస్థితి ఏమిటి? భూమిని కన్నతల్లిగా సాకుతున్న రైతుకు కాదని, ఉద్యోగం చేసుకొని హాయిగా బతుకుతున్న కొడుకులకు ఆ భూమిపై హక్కేమిటి? తాను బతికుండగా చక్కని పంట పొలాలు వేరే వారి సొంతమవడం తట్టుకోగలదా! ఆకుపచ్చ వనంలాంటి నేల పరుల పాలైతే తన భర్త ఆత్మ కూడా క్షోభిస్తుంది. అక్కడి ఏ చెట్టునడిగినా, ఆకునడిగినా నాగన్న, పార్వతిల పేర్లే జపిస్తాయి. వారు దూరమైతే అవి ఏడ్చి ఎండిపోతాయేమో! తన మనసు న్యాయస్థానంలో త్రాసు మొత్తం నాగన్న వైపే మొగ్గుతోంది. తన మనసులోని మాట కొడుకులకు చెబితే వినకపోగా తననే ఒప్పించే ప్రయత్నం చేస్తారనిపించింది. ఇంటికి వెళితే తప్ప తన మనసుకు శాంతి లభించేలా లేదు అనుకుంది.
మర్నాడు పొద్దున్నే ‘ఊరికి వెల్తానురా!’ అని ఆఫీసుకు వెళ్ళుతున్న మనోహర్ తో మెల్లగా అంది.
‘మళ్ళీ డాక్టర్ ను కలవాలి కదా?’ అన్నాడాయన.
‘ఇంకా పదిహేను రోజులు ఉంది కదా! అప్పటికి మళ్ళీ వస్తాను. నీవు రానవసరం లేదు. నేనొక్కదాన్ని రాగలను’ అంది.
మాట పెంచకుండా ఆయన ‘సరే.. చిన్నోడికి కూడా చెప్పాలి కదా! ఆఫీసు నుండి రాగానే బస్టాండులో దింపేస్తాను. సరేనా?’ అన్నాడు.
‘వాడికి నువ్వు చెప్పేయ్.. నేను భోంచేసి ఆటో మాట్లాడుకొని వెళతానులే.. ఇందులో కొత్తేముంది?’ అంది.
‘ సరే నీ ఇష్టం.. వెళ్లేప్పుడు ఏమేం కావాలో నీ కోడలిని అడుగు’ అంటూ మనోహర్ బయటపడ్డాడు.
సుశీల మధ్యాహ్నం భోజనం అయ్యాక ఆటోలో బస్టాండ్ చేరుకొని సిద్ధంగా ఉన్న బస్సెక్కి ఊరికి చేరుకుంది. పడమర వైపు చేరుకున్న సూర్యుడు మెరుపులు తగ్గించుకొని పల్లెటూరి చల్లగాలిలో సేద తీరుతున్నాడు. దూరం నుంచే సుశీల రాకను గమనించిన పార్వతి మొగుడి వైపు చూస్తూ ‘ అమ్మగారు ఈ సారి తొందరగానే వచ్చేస్తున్నారు’ అంది. ఎదురెళ్ళిన నాగన్న ఆమె చేతిలోని సంచిని తీసుకోని వాకిట్లో మంచం వాల్చాడు. బావి దగ్గరికెళ్లి నీళ్లు తోడి ‘ కాళ్ళు కడుక్కోండి అమ్మా!’ అని పిలిచాడు. ముఖంపై నీళ్లు చల్లుకొని కూర్చున్న సుశీలకు పార్వతి చెంబులో నీళ్లు తెచ్చి ఇచ్చింది. పొయ్యిపై మరుగుతున్న పాలను గ్లాసులో పోసి మంచం పట్టెపై పెట్టాడు నాగన్న. కూచున్న చోటికే అన్ని వస్తుంటే ఆమె ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. ఇదంతా వాళ్ళు ఎప్పుడూ చూపే మర్యాదే అయినా సుశీలకు ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. ఏమిచ్చినా వీరి ఋణం తీర్చుకోలేనని మళ్ళీ మళ్ళీ అనిపించింది.
రెండు రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఆస్తుల పంపకం గందరగోళంలోంచి బయటపడిన సుశీల మనసుకు ఓపిగ్గా ఆలోచించే స్థితి వచ్చేసింది. వయసు పెరిగిపోతోంది. ప్రకాష్ తెచ్చిన ప్రతిపాదన లోకంలో ఉన్నదే కదా అనిపించింది. తమకున్న ఇల్లు, ఐదెకరాలు సుశీలకు కన్నవారు ఇచ్చిన ఆస్తి. భూమి ఆమె పేరిటే ఉంది. పిల్లలకు తగిన ఆదాయం, సంపాదన ఉన్నాయి. ఊర్లోని ఆస్తి నాగన్నకు వదిలేయండి అంటే ఒప్పుకొనే దయాగుణం వారికి లేకపోవచ్చు. కానీ ఒక భాగం నాగన్నకు ఇస్తామంటే ఒప్పుకోవచ్చు. అంతైనా చాలు. ఈ ఆలోచన ఆమెకు కొంత సంతృప్తినిచ్చింది.
ఉండబట్టలేక ఫోను తీసుకోని అదే విషయాన్ని మనోహర్ చెవిలో వేసింది.
‘ అమ్మా! ఆ రోజు నీవు హడావుడిగా ఇంటికి బయలుదేరినప్పుడే నాకంతా అర్థమైంది. తమ్ముడి మాట నిన్ను బెదరగొట్టిందని తెలుసు. అయితే నీవు ఆస్తిని మూడు భాగాలు చేద్దామని అంటున్నావు. ఆ అవసరం కూడా లేదు. మన ఊర్లో చదివేప్పుడు దున్నేవారికే భూమి అనే టాపిక్ మీద వ్యాసరచన పోటీ జరిగింది. రాసేప్పుడు నాకు మన నాగన్ననే చేయి పట్టి రాయించినట్లనిపించింది. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్కూల్ మ్యాగజైన్ లోనూ వేశారు. ఇప్పటికి నాదగ్గర ఉంది. మనకా ఆస్తి వద్దురా అని తమ్ముడికి చెప్పి పెట్టాను. ఒప్పుకున్నాడు. అమ్మకు నీవు చెబితేనే బాగుంటుందని అన్నాడు. నాకు చెప్పిందే చెబుతూ వాడికోసారి ఫోన్ చెయ్. సంతోషిస్తాడు. మా ఇద్దరిలో ఎవరికీ ఆ ఆస్తిపై ఆశ లేదు. మన జీవితాలు ఎప్పటిలానే సాగనీ. నీ ఆరోగ్యం, అవసరాలకు మేమెప్పుడూ ముందుంటాం. మళ్ళీ చెబుతున్నాను. మన భూమి దున్నేవాడిదే. సరేనా!’ అని నవ్వుతు ఫోన్ పెట్టేశాడు మనోహర్.
*****

జగిత్యాల స్వస్థలమైన బద్రి నర్సన్ గారు గ్రామీణ బ్యాంకులో సేవలందించి 2015లో ఉద్యోగ విరమణ చేశారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి కలిగిన వీరు 2013లో రచనారంగంలోకి ప్రవేశించారు. పత్రికల్లో పుస్తక సమీక్షలతో మొదలైన వీరి సాహిత్యప్రస్థానం క్రమంగా విస్తరించి సాహిత్య, సామాజిక అంశాలపై వందలాది వ్యాసాలకు దారి తీసింది. వీరు వ్రాసిన యాభై కథలలో ఇరవై కథలను సమాహారంగా ‘దారి తెలిసిన మేఘం’ అనే కథాసంపుటిగా 2024లో ప్రచురించారు. సామాన్యుని మేలు కోరే సమాజ నిర్మాణం కోసం తన అక్షరాలు తోడ్పడాలన్నదే బద్రి నర్సన్ గారి రచనల ముఖ్యోద్దేశ్యం.
