
అనుబంధాలు-ఆవేశాలు – 3
– ప్రమీల సూర్యదేవర
“ఇక్కడి భద్రత విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తామో మీకు ఈపాటికి అర్దమైపోయి ఉండాలి. జలజ లాంటి భద్రతా సిబ్బంది మొత్తం పన్నెండు మంది ఉంటారు. కాని ప్రతిరోజు విధుల్లో నలుగురు మాత్రమే ఉంటారు. ఈ పన్నెండు మంది రోజుకి ఎనిమిది గంటల చొప్పున పని చేస్తారు. వారంతా అతి జాగరూకతతో ప్రతిక్షణం అప్రమత్తతో ఉండ వలసిందే. ఏ మాత్రం ఏమరుపాటు ఉండ కూడదు. ప్రతి భద్రతావుద్యోగి క్రింద ఆరుగురు ఆరితేరిన సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్దరిని మీ రక్షణ కోసం నియమించాను. మీరు ఇక్కడ ఉన్నంత కాలం వీరిద్దరు మీ వెంట ఉంటారు. ఇక్కడ ఉండే వారంతా యువతులే కావటంవల్ల మా సిబ్బంది కూడ యువతుల్నే నియమిస్తాము. వీరు బలంలోకాని, ధైర్యసాహసాల్లోకాని ఏమాత్రం పురుషులకు తీసిపోరు.” ఈ చివరి మాటలు చెప్పేటప్పుడు ఆమె నీలికళ్ళల్లో గర్వం తొంగి చూసింది.
“సుశీల, నియతిగారిని జైలు అధికారిణి వద్దకు తీసుకు వెళ్ళు ,” అని. అప్పుడే గదిలోకి వచ్చిన యువతితో అన్నది. ఆ యువతికి వయసు షుమారు 35-40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. నల్లగ నిగనిగలాడే శరీరంతో బాగా కండలు తిరిగి ఉన్నది. ఆమె కనుగుడ్లు ముందుకు వచ్చి బయటకు వచ్చేసేలా ఉన్నవి. ముంజేతులకు పచ్చబొట్లు పొడిపించుకున్నది. పల్చగా ఉన్న జుట్టు నున్నగా దువ్వి నడినెత్తి మీదకు ముడి వేసి పిన్నులు గుచ్చింది. జుట్టుకు రాసిన నూనె ముఖంమీదకు కారి, ముఖమంతా జిడ్డుగా ఉన్నది. ఈమె దాదాపు 5 అడుగుల 8 అంగుళాలకు తక్కువ ఉండదు. మనిషిని చూడగానే మోటుగ, కదిల్తే కొడుతుందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. జలజ ధరించినట్టుగానె నల్లంచు గోధుమరంగు చీర కట్టుకుని అదేరంగు జాకెట్ వేసుకుంది. వంటి మీద ఆభరణాలేవీలేవు కాని ఎడమ చేతికి రాగి కడియం ఉన్నది. ఈమె కూడ జలజలాగ భద్రతా దళానికి చెంది ఉండవచ్చుకాని శారీరకంగ ఇద్దరికి పోలికే లేదు. సుశీల వైపునుండి చూపులు మరల్చి వార్డెన్ వైపు తిరిగి, “మీపేరు తెలుసుకో వచ్చా?” అని అడిగాను.
అదే చిరునవ్వుతో, “తప్పకుండ, నా పేరు నిర్మల. ఇక్కడ ఇదే పనిని 25 సంవత్సరాలుగ చేస్తున్నాను. ఎందరో ఉద్యోగులు రావటం పోవటం చూశాను కాని నేను మాత్రం ఇక్కడే ఉండి పోయాను,”అన్నది.
ఎందుచేతో ఈమె మీద గౌరవం ఏర్పడింది. త్వరలోనే కలుస్తానని ఆమెకు నమస్కరించి సుశీల వెంట బయటకు నడిచాను.
సుశీల నడకను అందుకోవటానికి పరుగులాంటి నడకతో ఆమెను వెంబడించాను. పూలతోటకు వెనుకనున్న భవనం వైపు దారి తీసింది. ఈ భవనంలొ గదులు వరుసగా కాకుండ ముందు వరండా, ఆ తరువాత పెద్దహాలు, హాలుకి రెండు వైపులా నాలుగు గదులున్నాయి. జైలు అధికారిణి గది చాలా విశాలంగా ఉన్నది. కూర్చోవటానికి రెండు సోఫాలు గోడ వారగా వేసి ఉన్నాయి. గది మధ్యలో పెద్ద టేకు బల్ల, దానిపై ఇద్దరు వ్యక్తులు రెండు పరుపులు వేసుకుని పడుకోవచ్చనిపించింది. బల్ల వెనుక నల్లటి లెదర్ కుర్చీ, ఇవతల వైపున నాలుగు చెక్క కుర్చీలున్నాయి. గదిలొ ఒకమూల ఎత్తైన పూలకుండీలో తోటలో కోసుకు వచ్చిన పూలు, క్రోటన్ ఆకులతొ అమర్చారు. పూలు అమర్చిన విధానం చూస్తే ఎవరో బాగా నైపుణ్యం ఉన్నవారు అమర్చినట్లు అందంగా ఉన్నాయి. గదిలో నాలుగు వైపుల పెద్దపెద్ద కిటికీలు, వాటికి లేత ఆకుపచ్చరంగు కర్టెన్లు వ్రేళాడుతున్నాయి. ఆ గదిలో కూడా జైలు అధికారిణికి ఎడమ వైపున ఉన్న గోడపై టెలివిజన్ తెరలున్నవి. షుమారు 50-55 సంవత్సరాల మధ్య ఉన్న యువతి, ఏదో వ్రాసుకుంటున్నదల్లా మమ్మల్ని ప్రశ్నార్దకంగ చూసింది. మంత్రిగారిచ్చిన ఉత్తరం ఆమెచేతికిచ్చి నేను వచ్చిన పని చెప్పాను.
“అవును, రెండు రోజుల క్రితం మంత్రిగారు ఫోన్ చేసి చెప్పారు. పనుల ఒత్తిడివల్ల మరిచిపోయాను, అంటూ నాకెదురు వచ్చింది.
“సుశీలా, నువ్వూ, మంగమ్మా వెళ్ళి, మూడవ వాలోర్డ్లో ఉన్న ఆ ఇద్దరిని దోషులను ప్రశ్నించే గదిలోకి తీసుకు వెళ్ళండి,”అని చెప్పింది. నావైపు తిరిగి, “మీరు ఈ కిటికీలో నుండి ఆ గదిలో ఉన్నవారిని చూడవచ్చు కాని వారికి మనం కనుపించం. మీరు చూసిన తరువాత వారు ఇక్కడకొచ్చిన కారణం, వారికి విధించిన శిక్షల గురించి మాట్లాడకుందాం. అవి విన్న తరువాత కూడ మీరు మీ పని కొనసాగించాలనుకుంటే, వారి పూర్తి కేస్ వివరాలున్న ఫైల్ మీ చేతికిస్తాను. “ అన్నది.
నువ్వొచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపో–అంతే కాని పిచ్చాపాటికి సమయం లేదన్నట్లు ఖచ్చితంగ చెప్పి కిటికీ వైపు చూపించింది. అటు చూడగానె ఉద్వేగంతో నాగుండె దడదడ కొట్టుకుంది. ఆ ఇరువురి కాళ్ళకే కాక చేతులు కూడ వెనక్కు విరిచి కట్టి గొలుసుల్తో బంధింప బడి ఉన్నాయి. పై నుండి క్రింద వరకు బూడిద రంగు పొట్టిచేతుల గౌన్లు వేసుకుని, అంట కత్తిరించిన జుట్టుతొ జీవశ్చవాల్లా ఉన్నారు. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. కాని చూడటంలేదు.
ముఖంలో భావాలు తెలుపటానికి కళ్ళు అద్దాల వంటివని అంటారు. కాని గాజుకళ్ళలా ఉన్న ఆ కళ్ళల్లో భావాలు ఎక్కడ దాగి ఉన్నాయో!! మూడు అంకెలు వేసిన అట్ట ముక్కలు నల్లదారానికి కట్టి, మెడలొ వ్రేళ్ళాడుతున్నాయి. వారినక్కడ అలా చూస్తుంటే నాకేదో తప్పుచేస్తున్నాననే భావన కలిగింది. క్షణికోద్రేకాలకులోనైన వారిచర్యల ఫలితమే వారిని ఇక్కడకు చేర్చింది. ఒకానొకప్పుడు వారివారి కుటుంబాలతో కష్టసుఖాలు పంచుకుంటూ, వారివారి వృత్తులు నిర్వహించుకుంటూ కిటికీకి ఈవలవైపున ఉన్న మనందరిలాగానే సమాజంలొ కష్టసుఖాలని ఎదుర్కొంటూ, వారివారి స్నేహితుల, బంధువుల ప్రేమాభిమానాలను పంచుతూ, పొందుతూ వుండేవారే కదా! నా ఆజ్ఞలేకుండానే నాలో దుఃఖం పెల్లుబికింది. కళ్ళ వెంట కారే నీటిని అదుపులొ పెట్టుకోలేక పోయాను.
“ఇలా రండి, కొంచెంసేపు ఇలా కూర్చుందాం.” కారాగార అధికారిణి పిలిచింది.
కకలావికలమైన మనస్సుని అదుపులొ పెట్టుకోవటానికి కొన్నిక్షణాలు పట్టింది.
“నియతిగారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా?” నావైపు సూటిగా చూస్తూ అడిగింది.
కళ్ళు తుడుచుకుని అంగీకారసూచకంగ అడగమన్నట్టు తల ఊపాను.
“మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ జీవితంలొ జరిగిన ఏదైన సంఘటనా? లేక మీకై మీరు తీసుకున్న నిర్ణయమా?
“నేను మనస్తత్వశాస్తృం చదువుకున్నాను. మా నాన్నగారు న్యాయవాది. వార్తాపత్రికల్లో చదివిన ఫిర్యాదులు చాలా వరకు నాతో చర్చించే వారు. దోషి, నిర్దోషి, కారాగార శిక్ష, మరణదండన—-ఇవన్నీ వింటూ ఉంటే, కారణాలు ఏమై ఉంటాయి అనే ఆలోచన కలిగేది. ఆ వ్యక్తి యొక్క గడిచి పోయిన జీవితం ఎన్నో విధాలుగా ఊహించుకునే దానిని. నేను మనస్తత్వశాస్రం చదవటానికి కారణం కూడ ఆ న్యాయస్థానమే.
చెడ్డవ్యక్తి — అనిపించకోవటానికి మానవుల్లో ఎక్కువ శాతం ఇష్డ పడరు. అలాంటిది కావాలని తప్పు చేయాలని మాత్రం ఎవరికి ఉంటుంది? ఒక వ్యక్తి తప్పు చేయటానికి ఆ వ్యక్తి పెరిగిన వాతావరణం, పరిస్తితుల ప్రభావం, ఆకలి, పేదరికం –లాంటి కారణాలు ఎన్నో ఉండవచ్చు. దొరికిన సాక్ష్యాల ద్వారా న్యాయస్థానం నిరూపించలేక పోవచ్చు. తీర్పుకు గురైన వ్యక్తి శిక్షను అనుభవించేటప్పుడు పొందే మానసిక వ్యధ నా ప్రయత్నంవల్ల కొంత వరకైనా తగ్గించగలనేమోననే ఆలోచనే నేనిలా రావటానికి కారణం.”
“వీరికి మీపై నమ్మకం కలగాలంటే ఒక్క వారం కాదు. ఒక నెల కూడా సరిపోక పోవచ్చు. ఈ కారాగారానికి కొన్ని కఠినమైన నిబంధనలున్నాయి. తరచు బయటి నుండి ఎవరైన వస్తూపోతూ ఉండటం కారాగారవాసులకే కాదు మీకు కూడ క్షేమంకాదు. కారాగారవాసుల రక్షణతో పాటు వారి నుండి మా అందర్ని కాపాడుకోవటం మా ముఖ్యమైన ధ్యేయం. వీరిలో కొందరు చాలా ప్రమాదకరమైన వ్యక్తులున్నారు. ఏక్షణంలొ ఎలా మారిపోతారో ఎవరం ఊహించలేము. ఇక్కడి సిబ్బందిలొ మూడువంతులవారు ఒకప్పుడు ఇదే ప్రదేశంలొ శిక్షను అనుభవించినవారే. వారిలో ఉన్నంత అప్రమత్తత బయటి నుండి వచ్చిన వారిలో ఉండదు. (దొంగను మరొకదొంగే తేలికగా పట్టుకోగలడన్న నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి).
*****
(ఇంకా ఉంది)

1974, సెప్టంబర్ నుండి ఒహాయో రాష్ట్రంలో సిన్సనాటిలో నివసించి, 2004, జనవరి నెలలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోకి చేరుకున్నాము. నా మొట్ట మొదటి కథ ‘భయం’ 2007 డిసెంబర్ మరియు 2008 జనవరి ‘తెలుగునాడి’ మాసపత్రికలో ప్రచురించబడింది. రెండవ కథ ‘కదిలే బొమ్మలు’ 2010 ఏప్రియల్ నెలలో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురించబడింది. 2003 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొదటి నవల ‘అనుబంధాలు-ఆవేశాలు’ చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల ‘ అనురాగ సంగమం ‘ 2024 ఫిబ్రవరిలో ప్రచురించటం జరిగింది. హస్తినాపురం (ఆస్టిన్) సాహిత్య సభలో పాల్గొని నా స్వీయ రచనలు కొన్ని చదువుతుంటాను.
