
ఈ తరం నడక – 21
వసంత మనో పతాకం
-రూపరుక్మిణి

కాలంతో అన్వేషణ చేస్తూ నడచి వచ్చిన దారిని పురాస్మృతులుగా చేసుకుంటూ అలుముకున్న చీకట్ల మధ్య పున్నమి, వేకువల అస్తిత్వపు వెలుగుల్ని విరజిమ్ముతూ… ముఖంపై ఏర్పడ్డ ముడతల్లో గాయాల చెమ్మని తోడుకుంటూ చేసే కవిత్వ ప్రయాణమే ఈ చివరాఖరిజవాబు.
వసంత గారు జీవిత ప్రయాణంలో ఓ ఆడపిల్లగా ఎదిగిన దగ్గర నుండి కవిత్వం తన ఇంటిలో కలాన్ని ఆయుధంగా చేసుకున్న((వి.వి)(వసంత గారి మామయ్య))విప్లవ గీతమై ప్రవహిస్తుంటే తాను ఓ అక్షర ఆయుధంగా కవిత్వ సంతకాలని చేశారు.
జీవిత భాగస్వామి ఆర్కేతో కలిసి చేసే ప్రయాణంలో కొంతకాలం కలానికి విరామం ఇచ్చినా, కరోనా తరువాత ఆమె కలం బలంగా వినిపించడం మొదలు పెట్టింది. ప్రశ్నించడమే సమాజ చైతన్యమని ప్రశ్నలేని కాలం ఉండకూడదని చైతన్యాన్ని నింపే వాక్యంతో తన కవిత్వం రాసారు.
తన జీవిత ప్రయాణ బడలికల్లో ఎన్నో సంఘటనలు, సందర్భాలను కవిత్వమయం చేస్తూ సమాజంలో ఉండవలసిన తీరుని, చూడవలసిన కోణాన్ని తనలోని భావోద్వేగాలని కవిత్వం ద్వారా వినిపించారు.
ఎవరో నీ చుట్టూ గీసిన నిషేధాలనియమాల గిరిలో / నీకు నీవే పరిమితుల కట్టడాలు కట్టుకోకు / నువ్వే ఏర్పరచుకున్న ప్రపంచంలో ఉష్ణపక్షివైపోతే / మన స్వప్నాల మరో ప్రపంచం సంగతేమిటి?/ నీలోని చైతన్యాన్ని ఇంజెక్ట్ చేసుకో స్వప్నం వాస్తవం చైతన్యమయం కావాలి / అంటూ ప్రతి సందర్భానికి ఓ ధైర్యం వాక్యమై నడుస్తుంది తన కవితా ప్రక్రియ.
ఒక సందర్భంలో తన గురించి తాను మాట్లాడుతూ
/ అవును నేను వసంతాన్ని/ చిగురించడం విరబూయడమే తెలిసిన దాన్ని/ అంటూ ఓటమి ఎరుగని గెలుపు జెండా తన మనో పతాకాన్ని ఎగురవేస్తారు.
కొందరు మౌనంగా ఉంటారు. మార్గాన్ని అన్వేషిస్తూ, మార్గాలని నిర్మించే వారిని అనుసరిస్తూ, తమ జీవిత ప్రయాణానికి సార్ధక్యాన్ని దక్కించుకుంటారు. ఈ సమాజంలో దారి చూపే అనేక మంది నాయకులుంటారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల పైన ఆ నాయకుల గొప్పతనాన్ని వారి త్యాగదనాలనో పొగడడం చూస్తూ, చేస్తూ ఉంటాం. కానీ అలా వారు ప్రయాణించే ప్రయాణంలో వారి వెన్నంటి నడిచే జీవితాల అవశేషాల్ని పట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం. నమ్మిన ఆశయం కోసం ప్రయాణించేవారు వారి ఆశయ సాధనలో వారితో నడిచే భాగస్వాములను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసి ఉంటారు. ఆ భాగస్వాముల కథలు ఏమిటి కన్నీటి గాధలు ఏమిటి ? ఎప్పుడైనా ఆలోచిస్తామా అలా ఆలోచించినప్పుడు ఆ నాయకుడు వెంట నడిచే ఇంటి దీపం సాధారణ చమురు దీపం లాగే కనబడుతూ ఉంటుంది. కానీ ఎన్ని భావోద్వేగాలను పుణికి పుచ్చుకొని వారు నడిచే బాటల్ని సుగమం చేస్తూ ఉంటారు.
అటువంటి ఒకానొక సందర్భంలో తన కళ్ళముందే కనిపిస్తున్న అక్క హేమలతను చూస్తూ / లైఫ్ ఇన్ పోయెట్రీ ఆవిష్కర్తను తలచుకుంటూ /విప్లవ కవి విప్లవోద్యమ ఫెలో ట్రావెలర్ సహచరి/ అంటూ కవిత్వం అయిపోతారు.
విప్లవాన్ని కనుమరుగు చేయాలని చూస్తున్న సందర్భంలో విప్లవాన్ని సముద్రంతో పోలుస్తూ రాసిన కవిత కట్టిపడేస్తుంది.
/ సముద్రమంతా మానవత్వాన్ని బాధపెట్టి ఏం బాగుకుందామని / సముద్రం భాష అర్థమైతే సముద్రం హోరు విను/ విశాలత్వమే సముద్రం / సామాజికము సమూహమే ఉనికి/ పోరాటమే ఊపిరిగా పుట్టి పెరిగిన సముద్రం దగాపడ్డ ప్రపంచం బాధ ఈ కవిత్వం/ ఇది ఒక నిశ్శబ్ద దుఃఖం అంటూ / వివి గారిని జైల్లో కలిసి వచ్చిన సందర్భాన్ని కవిత్వం చేసారు.
నిజమే కదా సముద్రాన్ని ఎవరైనా బంధించగలరా ఎంత గొప్ప ప్రతీక.
సమాజానికి సేవ చేస్తు, ప్రజల కోసం ప్రజల మధ్య అజ్ఞాతవాసాలు చేసిన అనేక జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి. సమాజపు దుఃఖాన్ని తమదుఃఖంగా చేసుకొని శ్రమజీవుల విముక్తి మార్గం కోసం తుపాకీతోనే విముక్తి ఇవ్వవచ్చని రాజబాటగా అడవి బాట పట్టిన ఎన్నో కుటుంబాలలో స్త్రీలు ధైర్యంగా వారి జీవనాన్ని సాగించడం, ఒంటరి ఏకాంతవాసాల్ని అనుభవిస్తూ సంవత్సరాల కొద్దీ ఆ వ్యక్తులపై ప్రేమని పెంచుకుంటూ ప్రేమను పంచుకుంటూ వారి కోసమే ఎదురుచూపుల్లో జీవితాన్ని గడిపిన ఎందరో విప్లవ నాయకుల జీవిత భాగస్వాముల కన్నీటిచెర, ఉప్పొంగిన అడవిలో ప్రేమ వెన్నెల కురిపించే మహిళల హృదయం ఎన్ని వెలుగులతో నిండి ఉంటుందో ఈ చివరాఖరిజవాబు కవితలను చూసినప్పుడు కలిగే అనుభూతి చెప్తుంది.
సాధారణంగా విప్లవ జీవితాన్ని పంచుకునే స్త్రీలు చాలా ధైర్యవంతులు, 70ల కాలం నాటిని ఒక్కసారి కళ్ళముందు తలుచుకుంటే ఎందరో స్త్రీమూర్తులు తమ జీవితాల్ని ప్రజలకోసం ఆశయాల ఆకాంక్షల మధ్య వదులుకున్న వారు కనిపిస్తారు. పోరాడి గెలిచి ఓడినవారు కొందరైతే, ఆ పోరాటానికి విరమణ అందుకున్న వారు చెప్పే ఆత్మకథలు కవిత్వమై ప్రవహిస్తుంటాయి అనేకసార్లు.
ఇక్కడ వసంత గారు కూడా తన జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకుల మధ్య సమాజాన్ని తాను చూసిన తీరు మనకు కవిత్వమై కనిపిస్తుంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే భరోసా వాక్యమై మనకు వినిపిస్తుంది.
నినాదంగా నిలబడాలని చెప్తూ
/నువ్వు ప్రసరించే వెలుగులలో/ వెల్లువలో ప్రవాహంలో/ నీలోని ఎరుపులో /నీ అడుగులోన అడుగై/ నీ ఆశయాల దోసిళ్ళతో /నినాదం సాగమంటుంది
-ఆశ
/తెగపడిన కలలను అతికించుకుంటూ /చీకటిని ఛేదించే ఉదయాలను/ పూలతో పరుద్దాం రండి/ అన్న పిలుపులు వినిపిస్తాయి
-బేల
కవితలో / మాటలు నిశ్శబ్దాలైన వేళ /గుప్పిట్లో ఏముందో తెలుసుకోలేక /జీవితకాలం బేల అయిన ప్రశ్నార్థకం /
అంటూ జ్ఞాపకాల చెలిమల్ని తవ్వుకుంటారు.
– దుఃఖపు దోసిళ్ళు
వీచే గాలిని పారే సెలయేరుని అడిగా / మీరంతా ప్రజల మనసులో చెప్తాయి.
ప్రజల కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని ఊచకోత కోసిన ఆ చేతులు నాశనం అయిపోవా / కుట్ర పంన్నిన వాళ్ళ మెదళ్ళు గడ్డకట్టిపోవా.
కలల కాంతి కిరణాల్లారా / రాలిపోయిన పువ్వుల్లారా / మీ ప్రేమ లేఖలన్నీ సుతిమెత్తని పొత్తిళ్లలోకి / మీ ప్రతిరూపాల వెలుగు వీచికలై ప్రసరిస్తాయి.
అక్కడక్కడ వసంత మాటల్లో నిర్లిప్తత తుళ్లిపడుతుంది. ఏం రాయగలను నా సుధీర్ఘ ప్రయాణ విశేషాలను/ ఏమని రాయను అసలు నేనింకా గమ్యాన్ని చేరందే/ ఈ ప్రయాణం అసలే అస్తవ్యస్తంగా/ అవస్థలతో ఉంది /మజిలీలు మజిలీలుగా /
అంటూ జీవితమే ఓ -చిల్లుపడవ అంటూ బాధను వ్యక్తం చేస్తారు.
ఇలా ఇంకా అనేక రూపాల్లో వసంత గారు కవిత్వ పతాకాన్ని ఎగురవేశారు కవిత్వమే తన చివరాఖరిమజిలీ అంటూ.
అభినందనలు వసంత గారు..
పుస్తకం పేరు- చివరాఖరిమజిలీ
రచయిత: వసంత నెల్లుట్ల
ఎన్నెలపిట్ట ప్రచురణలు
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
