
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 25
– విజయ గొల్లపూడి
జరిగినకథ:విష్ణుసాయి, విశాల వివాహమైన నూతనజంట. సిడ్నీకి పెర్మనెంట్ రెసిడెంట్స్ గా వచ్చి, జీవన ప్రయాణం మొదలెడతారు. విష్ణు ఆర్థికంగా ఇపుడిపుడే స్థిరపడుతూ, ఒక్కో మెట్టు
ఎక్కుతున్నాడు. విశాల వర్క్ ఎక్స్పీరియన్స్ పూర్తి చేసి, కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అవుతుంది.
***
జీవితంలో లక్ష్యాన్ని సాధించి ముందుకు సాగాలంటే ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అవి శారీరకంగా, మానసికంగా, లేదా మనుష్యులవల్ల, పరిస్థితులవల్ల అయినా కావచ్చు. మొక్కవోని
పట్టుదలతో, ధైర్యంతో నిలదొక్కుకుని, చెదరక, బెదరక స్థిరంగా తన ప్రయత్నం తాను చేసుకుంటూ ఉన్ననాడు, తప్పక విజయం దరి చేరుతుంది.
విశాల తనకు వచ్చిన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్స్ కోర్స్ పూర్తికాగానే, మయోబ్ కోర్స్ లో చేరింది. గవర్నమెంట్ ఉచితంగా ఆ కోర్స్ చేయడానికిగాను న్యూసౌత్ వేల్స్ లో ఉంటున్న వారికి ఇస్తున్న సదవకాశం అది. (MYOB-Mind Your Own Business) మయోబ్ ఆస్ట్రేలియాలో వ్యాపార సంస్థలు వాడే అకౌటింగ్ సాఫ్ట్ వేర్. అది నేర్చుకున్న వారికి
ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు. ఇపుడిపుడే కంప్యూటర్ అభివృద్ధి చెందుతూ క్రొత్త టెక్నాలజీ మార్కెట్ లోకి వస్తున్న తరుణంలో, విశాల ఎప్పటికప్పుడు ఉద్యోగానికి కావలసిన సాధనాలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి అనుకుంది. విశాల క్లాస్ కి నామమాత్రంగా హాజరవ్వకుండా రన్నింగ్ నోట్స్, ముఖ్యమైన పాయింట్స్ రాసుకునేది. ఇంటికి వచ్చి మళ్ళీ ఒకసారి ఆ నోట్స్ తిరిగి చూసుకునేది. అందువల్ల ఆ రోజు వెళ్ళిన క్లాసులో ఏమి చెప్పారో అంతా ఒక రీలులా మళ్ళీ గుర్తుకువచ్చేది. ఆమెకున్న ఆ అలవాటు వల్ల, మెదడులో పొందికగా విషయాలు నమోదై, జ్ఞాపకశక్తి బాగుండేది. తరువాత క్లాస్ లో చెప్పే విషయాలకి బాగా అల్లుకుపోయేది. ఆస్ట్రేలియాకి క్రొత్తగా వచ్చిన మైగ్రేంట్స్ కి విశాల ఒక పెన్నిధి. చెంగ్ కొంత లాంగ్వేజ్ ఇబ్బంది వల్ల, తనకొచ్చే డౌట్స్ టీచర్ ని అడగలేక, విశాల ద్వారా సందేహ నివృత్తి చేసుకునేవాడు.
చెంగ్ మాట్లాడే యాస అర్థం చేసుకోవడానికి విశాలకి ఇబ్బంది అయినా, అతను ఏమంటున్నాడో రిపీట్ చేయమనేది. చెంగ్ తో పాటు యస్మిన్ కూడా విశాలను డౌట్స్ అడిగేది. అలా విశాల క్లాస్ లో ఒక బ్రైట్
స్టార్ గా తన ఉనికిని ఆస్ట్రేలియా గడ్డ మీద చాటుకుంది. కంప్యూటర్ మీద అకౌంటింగ్ సాఫ్ట్ వేరు ఆపరేట్ చేస్తున్నపుడు, నేవిగేట్ చేయడానికి విశాల దగ్గరకు వచ్చి చుట్టూ చేరేవారు. ఇది గమనించి, క్లాస్ టీచర్ డయానా, విశాలను బాలెన్స్ షీట్ గురించి వివరిస్తూ డిమాన్ స్ట్రేట్ చేయమని అడిగింది. విశాల కొద్దిగా బిడియపడినా, మళ్ళీ లేచి ధైర్యంగా స్మార్ట్ స్క్రీన్ మీద తనకున్న ఎం.బి.ఏ పరిజ్ఞానాన్ని జోడించుకుని, స్ప్రెడ్ షీట్ తో అన్నీ బాగా వివరించింది. డయానా విశాలను మెచ్చుకుంటూ,
“ఫెంటాస్టిక్ విశాల! దటీజ్ ఎ క్లియర్ ఎక్ష్ప్లనేషన్! వెల్ డన్.
యూ గాట్ ఎ యునీక్ క్వాలిటీ టు హెల్ప్ అదర్స్. యూ కెన్ ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ రెస్యూమె అండ్ అప్లై జాబ్స్. యూ కెన్ యూస్ మై నేమ్ ఏస్ ఆ రిఫరీ” అని పర్సనల్ గా వచ్చి విశాలతో అంది.
విశాల చిరునవ్వుతో “థాంక్స్ ఫర్ ద ఆపర్చ్యూనిటీ అండ్ ఫర్ యువర్ సపోర్ట్!” అంది.
క్లాస్ అవ్వగానే, బస్ స్టాప్ కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తోంది. నిజంగా ఈ రోజు విశాలకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంది. తనమీద తనకి ఆత్మవిశ్వాసం అపారంగా పెరిగి, మంచి బూస్టింగ్
వచ్చింది. దేశం కాని దేశంలో విదేశీ మహిళ తనను ప్రశంసించటం చాలా ఆనందంగా అనిపించింది. తను ఎక్కవలసిన బస్సు రావడంతో, ముందుకు నడిచి బస్సు ఎక్కింది. కిటికీ దగ్గర సీటులో
కూర్చుని, బయటికి చూస్తూ, ‘మేఘాలలో తేలుతున్నట్లుంది. ఫ్లైయింగ్ ఇన్ కలర్స్ అంటే ఇదేనేమో! మనసులో అంతర్వాణి స్వగతం పలుకుతోంది. ఈ ఆనందాన్ని ఎవ్వరితో పంచుకోలేను ఇపుడు. విష్ణు
వర్క్ లో బిజీ ఉంటారు. ఇంటికి వచ్చినా తెల్లవారుఝామున వస్తారు. లేచిన తరువాత, ఆయన మూడ్ లో ఉంటే సరదాగా మాట్లాడగలను. అయినా, నేను ఈ చిన్న విషయానికి ఇంత పొంగిపోవడమేమిటి?
నేను పర్మనెంట్ జాబ్ తెచ్చుకోవాలి, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలి.’ అని మనసులో ఆలోచనలతో, బస్ స్టాపు రాగానే దిగింది.
తాళాలు తీసుకుని, ఇంట్లోకి అడుగు పెడుతూ, మొబైల్ తీసుకుని మన్సూద్ కి ఫోన్ చేసింది. డ్రైవింగ్ లెసెన్స్ వారానికి రెండు క్లాసులు తీసుకోవడానికి టై మ్ ఖరారు చేసుకుంది. ఇంతలో వాయిస్ మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఆత్రంగా ఫోన్ తీసుకుని, మెసేజ్ వినసాగింది.
అత్తగారు రానున్న ఏప్రిల్ నెలలో ఉగాది విక్రమ నామ సంవత్సరం వస్తోంది. పంచాంగ శ్రవణం చేసుకుని, గుడికి వెళ్ళమని మెసేజ్ ఇచ్చారు. విశాలకి ఒక్కసారిగా మనసు గతంలోకి తొంగిచూసింది.
‘ఇంతవరకు అమ్మ దగ్గిర ఉండటంతో ఏమీ తెలియలేదు. ఉగాది పండుగ రోజు అమ్మ ప్రొద్దున్నే ఉగాది పచ్చడి తయారుచేసేది. నేను తలంటు పోసుకుని, క్రొత్త బట్టలు పట్టులంగా, ఓణీ వేసుకుని
దేముడికి దణ్ణం పెట్టుకుని స్తోత్రాలు చదువుకునేదాన్ని. ముందు ఉగాది పచ్చడి తిన్నాకనే, వేరే వంటకాలు తినాలి. ఉగాది పచ్చడిలో పులుపు, వగరు, చేదు, తీపి, కమ్మదనం, ఘాటు ఆ రుచి
తగలగానే భలేగా ఉండేది. ఒక్కోసారి పులుపు చివర్లో వస్తే, ఇంకోసారి చేదు, మరోసారి తీపి అలా నాలుకకి తగిలేవి. నేను ఎపుడూ వంక పెట్టకుండా తినేసేదాన్ని. ఇంటికి పురోహితులు వచ్చి, ఆశీర్వచనం చేసి, పంచాంగ శ్రవణం చేసేవారు. అమ్మ చేతి పులిహోర తింటే జిహ్వ మీద టేస్ట్ బడ్స్ లేచేవి. చింతపండు పులుపు, ఉప్పు, ఎండు మిరపకాయ అన్నీతుచ తప్పకుండా సమ పాళ్ళలో పడేవి. ప్రతి పులిహోర ముద్దలో శెనగలు పంటికి తగిలి రుచి అమోఘంగా ఉండేది. నాన్నగారికి కూడా అమ్మ చేతి పులిహోర అంటే చాలా ఇష్టం.
ఈ దేశంలో ఉగాదికి అసలు వేప పువ్వు దొరుకుతుందా? వేప పచ్చడి ఎలా చేయాలి?’ అలా ఆలోచిస్తూ విశాల తెలియకుండానే మంచం మీద వాలిపోయి డిన్నర్ చేయకుండానే నిద్రలోకి జారుకుంది.
త్వరగా నిద్రపోవడంతో విశాలకి తెల్లవారుఝామున నాలుగు గంటలకే మెలకువ వచ్చింది. ఇంకో గంటలో విష్ణు వచ్చేస్తాడు కదా అనుకుని, ఉత్సాహంగా స్నానాదికాలు ముగించుకుని, తయారైపోయింది విశాల.
‘తెల్లవారుఝామున ఇంకా ఐదు ఐనా ఇంకా రాలేదేంటి? రోజూ ఈ పాటికే వస్తారేమో కదా!’ అనుకుంది.
కాసేపు రెస్ట్ లెస్ గా అటు, ఇటు తిరిగింది. మనసు మళ్ళించుకోవడానికి, ఆదిత్యహృదయం, విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుకుంది. ఇంకా విష్ణు రాకపోయేసరికి, ఆమెలో గాబరా మొదలైంది. ఇపుడు ఏమి చేయాలి? భర్త మోబైల్ కి ఫోన్ రింగ్ చేసింది. ఫోన్ మెసేజ్ కి వెళ్ళింది తప్ప విష్ణు ఫోన్ తీయలేదు.
విశాలలో క్షణక్షణం ఆదుర్దా పెరిగిపోతోంది. ఏమి చేయాలో తెలియటం లేదు. తన దగ్గిర విష్ణు వర్క్ కొలీగ్స్ నెంబర్స్ ఏమీ లేవు. కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి. ‘రోజంతా కాలేజ్ లో ఆనందంగా గడిచింది అనుకున్నాను. అందరి దృష్టిలో నన్ను మించినవాళ్ళు వేరే ఎవరూ లేరు అన్న రీతిగా నేను ప్రవర్తించానా? ఆ దృష్టి దోషమే తగిలి నాకు ఇపుడు మనశ్శాంతి లేకుండా చేసిందా? ఎప్పుడూ ఇంత మనోవేదనకు గురి కాలేదు. కవి ఆరుద్ర నాలాంటి వాళ్ళ కోసమే ఈ పాట వ్రాసారనిపిస్తోంది. ‘చలిగాలి వీచింది, తెలవారబోతోంది. ఇకనైన ఇలు చేరవా ఓ ప్రియా! ఇకనైనా ఇలు చేరవా…అసలు కవులు ఆరుద్ర గాని, ముందు తెలిసెనా ప్రభూ, ఈ మందిరమిటులుంచేనా, మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గాని, ఆడవారి లోతైన భావాలను అంత క్షుణ్ణంగా వాళ్ళే వేదన అనుభవించినట్లు పాటలు ఎలా వ్రాయగలిగారు?’ పొంతన లేకుండా విశాల మనస్సు పరిపరి విధాలుగా కళ్ళెంలేని గుర్రంలాగ పరుగులు తీస్తోంది.
***
విష్ణు నైట్ షిఫ్ట్ పూర్తి చేసి, ఇంటికి బయలుదేరుదామనుకుంటుండగా, డే షిఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్ రాబర్ట్ నుంచి ఫోన్ వచ్చింది. తన కారు బ్యాటారీ ప్రాబ్లెం వల్ల, ఆగిపోయింది రోడ్డు మీద. ఇన్సూరెన్స్
వాళ్ళకి ఫోన్ చేసాను. కారు ఫిక్స్ అయ్యకగాని రాలేను. అంతవరకు విష్ణుని షిఫ్ట్ లో కొనసాగమని రిక్వెస్ట్ చేసాడు. వేరే గత్యంతరం లేక, విష్ణు టీ కలుపుకు వచ్చి, ఇంకో రౌండ్ ఫాక్టరీ మెషీన్స్ ని, ఆపరేటర్స్ ని
చెక్ చేసి, ప్రొడక్షన్ ప్లాంట్ బాగానే రన్ అవుతోంది అనుకుంటూ వచ్చాడు. అతనికి మనసులో విశాల మెదిలింది. పిచ్చిపిల్ల, అమాయకురాలు, చాలా కష్టపెడుతున్నాను. దేశం కాని దేశంలో ఇద్దరం చక్కగా
చెట్టాపట్టాలేసుకుని గడపాల్సిన రోజులు. అడవికాచిన వెన్నెలలా అయిపోయింది మా పరిస్థితి. ఫారిన్ లో జీవితమంటే అందరూ భూతల స్వర్గం అనుకుంటారు. కానీ గులాబీపూలకి ప్రక్కన ముళ్ళు ఉన్నట్లుగానే, ఇక్కడ ఎంత సుఖం ఉంటుందో, అంతే కష్టం కూడా ఉంటుంది. ఇలా విష్ణు కూడా పరిమితికి మించి వర్క్ చేస్తూ ఉండటంతో మనసు గతి తప్పి విపరీతమైన ఆలోచనలలోకి వెళ్ళాడు.
రెండు గంటల తరువాత రాబర్ట్ వచ్చి, విష్ణుని రిలీవ్ చేసాడు. రాబర్ట్ విష్ణుతో “ఐ యామ్ సో సారీ. యు కెన్ స్టార్ట్ యువర్ ఈవినింగ్ షిఫ్ట్ టూ అవర్స్ లేట్. ఐ విల్ కవర్ దట్ టైమ్. థాంక్యూ వెరీ మచ్” అని చెప్పి అతని భుజం తట్టాడు.
మొత్తానికి షిఫ్ట్ ముగించుకుని, విష్ణు ఇంటికి చేరుకునేసరికి ఉదయం ఏడు గంటలైంది. ఇంట్లోకి వెళ్ళగానే విశాల బల్లమీద వాలిపోయి పడుకుని ఉంది. విష్ణు కీస్ తీసుకుని లోపలికి వచ్చాడు. విశాల భుజం మీద చేయి వేసి,
“విశాలా! ఏమిటీ ఇక్కడ ఉన్నావ్? పెందరాళే లేచేసావా?” అన్నాడు.
విశాల అతని చేతిని విసురుగా తీసేసింది.
“ఇంట్లో నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అన్న విషయం మీకు గుర్తుందా?” అంది కోపంగా.
“విశాలా! ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నావ్?”
“కోపంగాక మరేమిటి? రావలసిన టైమ్ కి మీరు రాకపోతే, కంగారుగా ఉండదా? ఎంతసేపటినుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా? మీకేమైందో, ఎలా ఉన్నారో అని చాలా టెన్షన్ పడ్డాను.” అని కళ్ళమ్మట
నీరు పెట్టుకుంది.
విశాలను విష్ణు అంత కోపంగా చూడటం మొదటిసారి. అంత అలసటలోను, ఆమెను సముదాయించే ప్రయత్నం చేసాడు.
“నిన్ను నిద్ర మధ్యలో లేపటమెందుకులే అని ఫోన్ చేయలేదు. మార్నింగ్ షిఫ్ట్ రాబర్ట్ రావటం లేటవడంతో బయలుదేరుతున్నవాడిని, అతని ఫోన్ రావడంతో ఉండిపోయాను. ఎందుకు కంగారు
పడటం?.” అంటూ విశాల కళ్ళనీళ్ళు తుడిచాడు.
“కనీసం ఎమర్జెన్సీ కంటాక్ట్, లేదా మీ ఆఫీస్ లో ఆల్టర్నేట్ నెంబర్ ఐనా ఇచ్చారా?”
“విశాలా! ఇది అనుకోకుండా ఇలా జరిగింది. అదికూడా రాబర్ట్ కారు ఆగిపోవటం వల్ల జరిగింది. బాగా అలసటగా ఉంది. మాట్లాడే ఓపిక కూడాలేదు. నాకు రెస్ట్ కావాలి అంటూ డ్రెస్ మార్చుకుని విష్ణు
బెడ్ మీద పడుకుండిపోయాడు.”
విశాలకి వేరే మాట్లాడానికి కూడా ఆస్కారం లేకపోయింది. ‘ఇంతసేపు ఎంత వేదనకు లోనైంది. తన మనసులో భావాలను పూర్తిగా పంచుకోవడానికి కూడా లేదాయె. నిజంగా నైట్ షిఫ్ట్ చేసి వస్తే చేసిన
వాళ్లకే కాదు, ఇంట్లో వాళ్లకి కూడా సుఖం ఉండదు. నా పరిస్థితి అలాగే ఉంది. ఎవరితో చెప్పుకోవడానికి లేదు. ఇంట్లో అమ్మకి, నాన్నకి, అత్తగారికి, మావగారికి అసలు చెప్పకూడదు. కంగారు పడతారు.
కష్టమైనా, నష్టమైనా అది నేనే భరిస్తాను. సమయం చూసుకుని విష్ణు తో మాట్లాడాలి. వీలైతే నైట్ షిఫ్ట్ వర్క్ చేయవద్దని చెప్పేయాలి.’ అనుకుంది.
ఇంతలో ఫోన్ మ్రోగడంతో మొబైల్ తీసుకుని హలో! అంది.
* * * * *
(ఇంకా ఉంది)

నేను సిడ్నీ ఆస్ట్రేలియా లో ఉంటాను. మా తల్లిదండ్రులు శ్రీమతి శ్రీదేవి పెయ్యేటి మరియు శ్రీ రంగారావు పెయ్యేటి గార్లు ఇరువురు రచయితలు. ప్రవృత్తి పరంగా 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో తెలుగు రేడియో కార్యక్రమాలు, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తున్నాను. వృత్తి రీత్యా ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్థానికంగా తెలుగు వాణి రేడియో కన్వీనర్ గా సేవలు అందించాను. వందకు పైగా రేడియో కార్యక్రమాలు 15 రేడియో నాటికలు దర్శకత్వం చేపట్టి ప్రసారం చేశాను. ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చిన్నారులకు పాఠశాలలో religious education లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ద్వారా హిందూ మత బోధన తరగతులు తీసుకున్నాను. జాగృతి కథల పోటీలో నా కథలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు ఇరవై వరకు కథలు రాసాను, కథలు, కవితలు కొత్తవి రాస్తున్నాను. నా కథలు పలు పత్రికలలో, కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు, లలితగీతాలు, పాటలు పాడతాను. పలు వేదికలకు సమన్వయకర్తగా వ్యవహరించాను. సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలు గా నాలుగు సంవత్సరాలు సేవలు అందించాను. స్థానికంగా తెలుగువాణి మరియు జనరంజని రేడియో కార్యక్రమాలు, ఇంకా అంతర్జాలంలో తెలుగువన్ రేడియోలో వారం వారం కార్యక్రమాలు చేయటం నాకు అత్యంత ప్రీతికరం. “సకల కళాదర్శిని” వేదిక స్థాపించి, “స్త్రీ హృదయం” శ్రీ పెయ్యేటి రంగారావు గారి కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ తొలి కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించాను. మున్ముందు కళా, సాహిత్యం, సాహిత్య కార్యక్రమాలు “సకల కళాదర్శిని” ద్వారా అందచేయాలని భావిస్తున్నాను. వాహిని మాసపత్రిక “సాహితీ సదస్సు” అంతర్జాల మాధ్యమం జూమ్ ద్వారా విజయవంతంగా నాలుగు గంటలకు పైగా మూడు సదస్సులు నిర్వహించాను. దాదాపు ఐదు గంటలకు పైగా విజయవంతంగా విభిన్నమైన తెలుగు అంశాలతో కొనసాగింది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక వారోత్సవాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. భారతదేశంలో సాహిత్యంలో పలు అంశాలపై పత్ర సమర్పణ అందచేశాను.
