
యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-11
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) టవర్ బ్రిడ్జి తీరం & ఇంగ్లాండు సాహితీమిత్రులు
టవర్ బ్రిడ్జి తీరం:
సాయంత్రం అయిదుగంటల ప్రాంతంలో “ఆఫ్టర్ నూన్ హై టీ క్రూజ్ “ ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి టవర్ బ్రిడ్జి తీరాన్ని చేరుకున్నాం.
టవర్ బ్రిడ్జి తీరంలో ఒక రోజంతా తిరిగి చూడాల్సినవి ఉంటాయి. అతిముఖ్యమైనవి టవర్ బ్రిడ్జి, టవర్ ఆఫ్ లండన్.
లండన్ బ్రిడ్జిలలో కెల్లా చెప్పుకోదగినది, అత్యంత సుందరమైనది టవర్ బ్రిడ్జి. ఈ టవర్ బ్రిడ్జి దూరం నించి అప్పుడప్పుడే ఆకాశంలోంచి దిగివచ్చి, నిలువెత్తు నలుచదరాకారపు కోట బురుజుల ఆకారాల్ని ధరించిన ఇద్దరు గంధర్వుల్ని కలిపి అడ్డు కర్రలతో కట్టి, అటూ ఇటూ తాళ్లతో లాగి బంధించినట్టు అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. దగ్గరకెళ్తే రాజసం ఉట్టిపడే ఠీవితో మిలమిలా మెరిసిపోతూ వారధిగా ప్రత్యక్షమవుతుంది.
1886-1894 మధ్య నిర్మించబడిన ఈ బ్రిడ్జి ఆ తరువాతి కాలంలో మహారాజైన ఏడవ ఎడ్వర్డ్ యువరాజు చేత ప్రారంభించబడింది. టవర్ల మధ్య నించి నౌకలకు దారివ్వడానికి వీలుగా మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జి మొత్తం రెండుగా చీలి కలిసే ఏర్పాటు ఉంటుంది. టవర్ల పైన అటు నించి ఇటుకి, ఇటు నించి అటుకి నడవడానికి అద్దాల దార్లు ఉండడం విశేషం. అందుకోసం ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత ఎత్తు బ్రిడ్జి మీంచి కనిపించే టవర్ ఆఫ్ లండన్, పూల్ ఆఫ్ లండన్ చూసి తీరాల్సినవి. అంతేకాకుండా విక్టోరియా కాలం నాటి స్టీమ్ ఇంజన్లని కూడా ఈ బ్రిడ్జికి దక్షిణ విభాగంలో చూడవచ్చు. బ్రిడ్జికి ఒక పక్కగా ఆవలి తీరంలో ఒకప్పుడు టవర్ హిల్ మీది నించి యుద్ధాలకు ఉపయోగించిన ఫిరంగులు ఉంటాయి.
సత్య ఒక్కడే బ్రిడ్జిని పాక్షికంగా చూసి రాగలిగాడు ఈ ప్రయాణంలో. ఇక మేం దిగిన తీరంలోనే ఉన్న “టవర్ ఆఫ్ లండన్” ని దాటి వెళ్తూ ఆ రోజుకి బయటి నించే చూసాం. సత్య అప్పటికే దాని చుట్టూ తిరిగొచ్చినందువల్ల అందులో ఉన్న విశేషాలు వివరించాడు.
మర్నాడు మేం సిటీ టూరు కోసం మాకే ప్రత్యేకించిన వ్యాను ఒకటి ట్రిప్ మాస్టర్స్ లోనే బుక్ చేసుకున్నాం. అయితే అందులో భాగంగా ఏమేం చూడొచ్చో తెలియదు కనుక ఈ “టవర్ ఆఫ్ లండన్” విషయాన్ని మర్నాటికి వాయిదా వేసాం. దీన్ని గురించి ఆ టూరులో వివరిస్తాను.
ఇక మేం టవర్ బ్రిడ్జి తీరంనించి విక్టోరియా స్టేషను దగ్గర్లో ఉన్న మా హోటలుకి వెళ్ళడానికి మళ్ళీ అండర్ గ్రౌండ్ రైలు ఎక్కడానికి నడక ప్రారంభించాం.
అదృష్టం కొద్దీ వాన ఆగి సన్నగా ఎండ కాయసాగింది. సాయంత్రపు వెలుతురు ఎంత దేదీప్యమానంగా ఉన్నా ఒంటికి పడితేనా? పైగా రివ్వున చలిగాలి ఒకటి.
ఎలాగో కష్టమ్మీద దాదాపు పావు మైలు నడిచి అండర్ గ్రౌండ్ రైలు ఎక్కి విక్టోరియాలో దిగి హోటలుకి నడిచేసరికి ఆరుగంటలు కావొచ్చింది. అప్పటికే చిత్తుగా అలిసిపోయాం.
ఇంగ్లాండు సాహితీమిత్రులు:
అక్కణ్ణించి సాహితీ మిత్రుల్ని కలవడానికి మరో గంటలో వెళ్లాల్సి ఉంది. అక్కడికి టాక్సీలో వెళ్లడానికి ట్రాఫిక్ లో గంట పడుతుంది. పబ్లిక్ ట్రాన్సుపోర్టు అయితే ఎక్కే చోట, దిగే చోట నడక, మధ్య మారాల్సిన రైళ్ల కోసం వేచి చూడాల్సిన సమయంతో కలిపి ఇంచుమించు రెండు గంటలు పడుతుంది. అంత సమయమూ, ఓపికా రెండూ లేవు. పైగా రాత్రి పూట పెరిగే చలిలో భారతీయ దుస్తులు వేసుకుని అడుగుతీసి అడుగు వెయ్యలేం.
పైగా రోజంతా బాగా అలిసిపోయామేమో ఇక ఆ రోజుకి పబ్లిక్ ట్రాన్సుపోర్టు ఎక్కింది చాలనిపించింది. డబ్బులు ఎక్కువైనా టాక్సీలో వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం. ఎంత అలిసిపోయినా హుషారుగా తయారైన నన్ను చూసి సత్య, సిరి ఏదోలా ఓపిక తెచ్చుకుని తయారయ్యేరు పాపం. అప్పటికే ఆలస్యం అయింది. ఊబర్ వెంటనే దొరకక మరో పదిహేను నిముషాలు ఆలస్యం అయింది. అలా ఆరున్నర గంటలకి బయలుదేరాల్సిన మేం ఏడున్నరకి బయలుదేరాం.
లండనులో మమ్మల్ని ఆహ్వానించిన సాహితీ మిత్రులు రాజేష్ గారికి ఉదయం నించి ఎప్పటికప్పుడు మా విశేషాలు తెలియజేస్తూ ఉండడం వల్ల మాకు కాస్త ఆలస్యమయ్యేటట్టు ఉందని చెప్పగానే “ఫర్వాలేదు, వర్కింగ్ డే నాడు ట్రాఫిక్ లో అందరూ చేరేసరికి కూడా ఆ సమయం అవుతుందని” అభయమిచ్చారు.
లక్కీగా ఆ సమయంలో ట్రాఫిక్ తగ్గేసరికి సరిగ్గా అరగంటలో హోన్సులో (Hounslow) ఊర్లోని ఇండియన్ హోటల్ “అమృత్ లాంజ్” కి చేరుకున్నాం. మా టాక్సీ అబ్బాయి హోటలు దాటి ముందుకు వెళ్ళిపోయి వెనక్కి రావడానికి సిగ్నల్ చుట్టూ తిరిగి రావడం మానేసి, ఇండియాలోలాగా రయ్యిన రెండు బిల్డింగులు వెనక్కి రోడ్డు వారనే రివర్సు డ్రైవ్ చేసేసేడు. ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టో, మరి యూకే లో అలా డ్రైన్ చేస్తారో గానీ, అమెరికాలోని కాలిఫోర్నియాలో అయితే ట్రాఫిక్ లేకపోయినా అలా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చెయ్యడానికి ఎవరూ సాహసించరు. పొరబాటున పోలీసుకి దొరికితే భారీగా ఫైన్ పడుతుంది మరి!
మొత్తానికి ఎనిమిది గంటల ప్రాంతంలో హోటలుకి చేరేం. హోటలు పక్కనే ఏదో ఇండియన్ స్టోర్ కూడా ఉంది. లోపలికి అడుగుపెట్టేసరికి అప్పటికే అందరూ మాకోసం ఎదురుచూస్తున్నారు.
నన్ను చూడగానే రాజేషు గారు, ఇతర మిత్రులు ఎదురొచ్చి పూలబొకేతో ఆత్మీయంగా ఆహ్వానించారు.
ఆ బొకేని వారి గుర్తుగా అపురూపంగా అక్కణ్ణించి ఫ్రాన్సుకి, ఇటలీకి కూడా వెంటతీసుకెళ్లేను.
ఇక మా ప్రయాణం ఖరారైన వెంటనే నాకోసం ఒక వాట్సాపు గ్రూపు ఏర్పాటు చేసినందువల్ల అక్కడున్న వారిని పరిచయం చేసుకోగానే వెంటనే పోల్చుకోగలిగాను. రాజేషు గారు, చరణ్ గారు, సూర్య గారు, శైలజ గారు, రామ కృష్ణ గారు, శ్రీరామ్ గారు, కృష్ణ గార్లని మొదటి సారి చూసినా అక్కడున్న రెండు గంటల్లో అత్యంత ఆత్మీయులైపోయారు.
పెద్ద టేబులుకి అటూ, ఇటూ కూర్చుని విందారగిస్తూ వ్యక్తిగత, సాహిత్య పరిచయాలు చేసుకున్నాం, భాషాసాహిత్యాల గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రశ్న పత్రాల్ని తయారుచేసిన అనుభవం ఉన్న రాజేషు గారు, ప్రవాస తెలుగు పిల్లలకి పాఠాలు బోధించాలన్న ఆసక్తి ఉన్న కృష్ణ గారు తెలుగు భాషా బోధనకి సంబంధించి ఎన్నో విషయాలు ముచ్చటించగా గత పదిహేనేళ్లుగా అమెరికాలో తానా వారి తెలుగు పాఠశాలలో పాఠ్య ప్రణాళికా డైరక్టర్ గా సేవలందజేస్తూ ఉన్న అనుభవంతో వారితో ఎన్నో విషయాలు పంచుకున్నాను.
అలాగే అప్పటికే చదివిన నా రచనలు చరణ్ గారు, రాజేషు గార్లు నా నవల పేరు దగ్గరినించి, చదివిన కథలు, కవితల గురించి, నెచ్చెలి పత్రిక గురించి వివరంగా ముచ్చటించడం, సూర్య గారు మొ.న వారంతా రచనల గురించి కుతూహలంగా ప్రశ్నలు వెయ్యడంతో ఎంతో ఉత్సాహం, సంతోషం చుట్టుముట్టింది నాకు.
వారంతా సాహిత్యాన్ని సృజిస్తున్న వారు, సాహిత్యాభిలాష మెండుగా కలిగినవారు, సినిమా రంగంలోనూ రాణిస్తున్నవారు. అయినా వారి రచనలకు నానించి సూచనలు తీసుకోవడం నన్ను ఆశ్చర్యానందాలకు గురిచేసింది. అంతేకాకుండా పుస్తక ప్రచురణకు సంబంధించిన వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రాజేషు గారు, వారి మిత్రులు కలిసి నిర్మించిన “గ్రే” సినిమా ఎన్నో అవార్డులు పొందింది.
మర్నాడు పొద్దున్నే టూరుకి వెళ్లాల్సి ఉందన్న ధ్యాసే లేకుండా హుషారుగా కబుర్లు చెప్తున్న నాకు కాలం గడిచిపోతున్నా ఒక పట్టాన వారినొదిలి వెళ్లాలనిపించలేదు. వారందరికీ కూడా నాలానే అనిపించినట్లు మాట్లాడుతూ ఉండిపోయారందరూ.
సత్యకి నాతో కలిసి ఇలా సాహితీ మిత్రుల్ని కలవడం కొత్తకాదు కాబట్టి మొదటంతా నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయినా చివర్లో తను కూడా మా కబుర్లలో శృతి కలిపాడు. ఇక సిరి పొద్దున్నంతా అలిసిపోవడంతో వెళ్తూనే టేబుల్ మీద తల పెట్టుకుని నిద్రపోయింది. అయితే భోజనం చివర్లో లేచి హుషారుగా మాకు ఫోటోలు తీసిన సిరిని శైలజ గారు ఎంతో ముద్దు చేసేరు. మా పిల్లలు ఈ విషయంలో బుద్ధిమంతులే. నాతో ఏ సభలకి, సమావేశాలకి వచ్చినా అస్సలు అల్లరి చెయ్యకుండా బుద్ధిగా కూర్చుంటారు.
ఇక్కడ మిత్రులతో అనర్గళంగా కబుర్లు చెప్తూ ఉన్నపుడు అస్సాంలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడెమీ సభలకి వెళ్లినప్పటి సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు సాహిత్యఅకాడెమీ ఆహ్వానం మీదట నేను ఢిల్లీ, బొంబాయి, భువనేశ్వర్, కలకత్తా, డార్జిలింగ్, గౌహతి మొ.న ఎన్నో చోట్ల సభలలో అతిథిగా పాల్గొన్నాను.
అస్సాంలోని సభకి సత్య, నేను మా పెద్దమ్మాయి వరుని తీసుకుని వెళ్ళేం. వెళ్లిన రోజున చలికాలపు రాత్రి వేళ భోజనాలయ్యేక ఆరుబయట శాలువాలు కప్పుకుని, వెచ్చని నెగడు చుట్టూ అందరం కూర్చుని పరిచయాలు చేసుకున్నాం, ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం, పాటలు పాడుకున్నాం, ఆనందంగా అస్సాం సంప్రదాయ నృత్యం చేశాం. వరు అప్పటికి నాలుగేళ్ళ పాప కావడంతో సత్య ఒళ్ళో నిద్రపోయింది. రాత్రి సమయం గడిచి పోతున్నా, పొద్దుటే సభకు హాజరు కావాల్సి ఉన్నా ఎవరికీ అక్కణ్ణించి కదలాలని అనిపించలేదు.
అచ్చం సరిగ్గా అలాంటి ఆత్మీయ భావన కలిగింది నాకు ఇంగ్లాండు సాహితీ మిత్రుల్ని కలిసిన ఆ సాయంత్రం. ఇంతటి సహృదయుల్ని నాకు పరిచయం చేసిన నార్వే వెంకట్ గారి పట్ల మనసంతా కృతజ్ఞతాభావం నిండిపోయింది.
ఎప్పుడో చిన్ననాట నేను సాహిత్యం పట్ల పెంచుకున్న అభిమానం, ఆసక్తి, అనుకోకుండా రాయడం మొదలుపెట్టిన కవిత్వం ప్రపంచ వ్యాప్తంగా నాకు ఇందరు సాహితీ మిత్రుల్ని పరిచయం చేస్తున్నదంటే, ఇందరి సత్సాంగత్యం లభిస్తున్నదంటే అది మా తల్లిదండ్రుల, గురువుల ఆశీస్సుల వల్లనే అని అనిపిస్తుంది నాకు.
చివరగా నా పుస్తకాల్ని వారందరికీ బహూకరించి పదిన్నర సమయంలో వారి నించి వీడ్కోలు తీసుకున్నాం.
కారు ఎక్కేక కానీ నాకు అలసట తెలియలేదు. అక్కణ్ణించి హోటలుకి ఎలా వచ్చామో కూడా తెలియనంత నిద్ర పట్టేసింది.
https://www.facebook.com/geetamadhavikala/posts/
*****
(సశేషం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
