
అమ్మే అలిగిన వేళ
-డా||కె.గీత
అమ్మ అలిగి నెల్లాళ్ళు అవుతోంది
శూన్యం ప్రత్యక్షంగా వేళ్ళాడుతున్నట్లు
కాలం అక్కడే ఆగిపోయింది
ఎప్పటికి అలక తీరుతుందో
ఎన్నాళ్ళకి అలక తీరుతుందో
ఫోను చేసి నెల్లాళ్ళు
మాట్లాడి నెల్లాళ్ళు
మెసేజీలకి సమాధానం ఇచ్చి నెల్లాళ్ళు
నెల్లాళ్ళు బహుశా నీకు ముప్పయిరోజులే కావచ్చు
నాకు ముప్పయి సంవత్సరాలు గడిచినట్టు ఉంది
అమ్మా!
ప్రపంచంలో ఎవరు
మాట్లాడకపోయినా
బతుక్కి ఎదురీదే ధైర్యం
నువ్వు మాట్లాడకపోయేసరికి
మస్తక మాళిగలో ఎక్కడో కూరుకుపోయింది
వారానికోసారి నీతో చెప్పాల్సిన
కబుర్లు గుండె తడిలో
చెమ్మగిల్లుతున్నాయి
నీ నించి
వినబడని శబ్దం
ఖాళీ జీవితాన్ని బోర్లించినట్లు
స్తబ్దుగా ఉంది
నిన్ను చేరని
సమాచారం
పుప్పొడై రాలిపోయినట్లు
చెల్లాచెదురయ్యింది
మొదటి వారమంతా
ఫోను తియ్యకపోతే
మెసేజీలు చూడకపోతే
బిజీగా ఉన్నావనుకున్నాను
రెండో వారంలో
ఖంగారు పడినా
నీ ఫేసుబుక్ పోస్టుల్లో
క్షేమ సమాచారంతో సర్దుకున్నాను
మూడో వారంలోనూ
నాలుగో వారంలోనూ
నీ నించి మాట వినబడకపోతే
అర్థం అయ్యింది
కావాలని నువ్వు నన్ను
దూరం పెడుతున్నావని
నీ మౌనం నీకు ఎలా ఉందో గానీ
నాకు
భూమికివతల
సప్తసముద్రాల కివతల
చలిదేశంలో
ఉన్నా
కన్నీళ్ల వెచ్చదనమే
చుట్టూ అన్నీ ఉన్నా
నీ మాట వినబడని చెవుల్లో
నడి సముద్రపు హోరే
నీ మౌనం
తెల్లారగట్ల
హఠాత్తుగా మేల్కొలిపిన
పీడకల
పేగు బంధం
ఛెళ్ళున బాదిన కొరడా
అసలు
నువ్వు అలిగితే ఏమైంది?
నువ్వు మాట్లాడకపోతే
ఏమైంది?
పిల్లల తల్లినైన నాకు
ఇంకా తల్లి మీద
మమకారమెందుకు?
పుట్టగానే పెంటకుప్ప మీద
విసిరివేయబడ్డ పసిపాపలా
కిళ్ళుపెట్టి ఏడవడం ఎందుకు?
చంటిబిడ్డగా తప్పిపోయినట్లు
అమ్మ కోసం
వెక్కివెక్కిపడడం ఎందుకు?
వయసు మీద పడినా
అయినదానికీ
కానిదానికీ
‘అమ్మా’ అని
పలవరించడం ఎందుకు?
నీకు కష్టమొస్తే
ఇల్లూ వాకిలీ వదిలి
కనబడ్డ విమానమెక్కి
దుఃఖపడుతూ వచ్చినా
నువ్వు బాధపడితే
నేనే తల్లినై
ఎన్నో సార్లు ఓదార్చినా
నీ పనుల కోసమే
నా పనులు మానుకుని
ఎప్పుడెంత పాటు పడినా
నీతో కొన్నాళ్ళైనా
మా ఇంట గడపడం కోసం
ఎన్ని శ్రమలకోర్చినా
కలగని నిస్సత్తువ
ఇప్పుడు కలుగుతోంది
అమ్మా!
నాతో
మాట్లాడకుండా
ఉండడమే
నీకు సంతోషమైతే
నా నీడ కూడా
తగలకపోవడమే
నీకు ఆనందమైతే
నీ మౌనపు శిక్ష
నాకు జీవితశిక్షయినా
భరిస్తాను
నీకు ముగ్గురు పిల్లలున్నా
ఈ జన్మకి
ఒక్కతే అమ్మవైన
నువ్వు వేస్తున్న శిక్షకి
మౌనంగా తల వంచుతాను
జీవన విషాదాల్ని
ఎన్ని మోసినా
కఠిన పాషాణం
కాలేని హృదయంతో
ఆశిస్తున్నా-
ఎప్పటికైనా
నీ అలక తీరుతుందని
నీ పిలుపు వినబడుతుందని
చిన్నప్పుడెప్పుడో భయమేసినప్పుడల్లా
నీ చెంగు చాటున దాక్కున్నట్టు
నిశ్చింతగా
నీ మౌనం చాటున
నిరీక్షిస్తాను
—–
(పిల్లల మీద కోపగించే తల్లులకి ప్రేమగా -)
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
