
“నెచ్చెలి”మాట
చదువు ఉపయోగం
-డా|| కె.గీత
చదువు ఉపయోగం ఏవిటంటే-
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు…
టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు…
దేశం…..
అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు
మామూలు మనుషుల గురించి అంటారా?
చదువుకుంటే
సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు…
మూఢనమ్మకాలు పారద్రోలవచ్చు…
నైతిక ప్రవర్తన నేర్చుకోవచ్చు…
ఇన్నొద్దుగానీ
ఇంకో మాటేదైనా చెప్పమంటారా?
చదువుకుంటే
తెలివి పెరుగుతుంది
తిక్క కుదురుతుంది
లాంటివి కాకుండా
అసలు సిసలైనవేవిటంటే
పొట్టకూటికి తప్పనివైనా
తక్కువ తిప్పలు పడొచ్చు
వలస బతుకులైనా
నగరాల్ని పట్టుకు వెళ్ళాడొచ్చు
ఇంకా
కరెక్టుగా చెప్పాలంటే
అవసరమైన దానికంటే
కాస్తో కూస్తో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు
అక్కర్లేని ఖర్చులు
పెట్టుకుంటూ జల్సాలు చేసుకోవచ్చు
అయినా
చిన్నప్పుడెప్పుడో
విద్య వలన
వినయం, ధనం,
అన్ని అర్హతలు, సుఖాలు కలుగుతాయని చదువుకుని
అక్కడే మర్చిపోయేం కదా!
ఉన్నట్టుండి ఇప్పుడు మళ్లీ చదువు ఉపయోగం ఎందుకు గుర్తుకొచ్చిందంటారా?
ఎందుకంటే-
కొందరు తల్లిదండ్రులు
చదువుకుని కూడా
పుట్టగానే చెత్తబుట్టలో విసిరెయ్యడం
అల్లారుముద్దుగా పెంచి మరీ విషమిచ్చి చంపెయ్యడం
అక్కడితో ఆగేనా…
కులం, మతాలు
పరువు, మర్యాదలు
అంటూ
పిల్లల్ని
కట్టుకున్నవాళ్ళని
వాళ్లు కన్నవాళ్ళని
తెగనరికెయ్యడం
అంతేనా…
మూఢ నమ్మకాలు
తంత్రవిద్యలు
అంటూ
ఘోరాతిఘోరంగా….
క్రూరమృగాల కంటే
హీనంగా
పిల్లల్ని స్వయంగా పొట్టనబెట్టుకుంటుంటే
అర్థం ఏవిటి?
చదువు నిరర్థకమనా!?
చదువు వల్ల ఉపయోగాల్లో
“కనీస ఇంగితజ్ఞానం”
అన్నది లిస్టులో లేదనా?!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
