“నెచ్చెలి”మాట 

“అంతా మన మంచికే”

-డా|| కె.గీత 

 

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ  ఎప్పుడూ “ఏం జరిగినా మన మంచికేనల్లా”  అంటూ ఉండేది. 

 

“అంతా మన మంచికే” అనుకోవడానికి చాలా బాగానే ఉంటుంది కానీ నిజంగా మనకు నచ్చనివి జరుగుతున్నంత సేపు సంయమనంతో నిలదొక్కుకోవడం చాలా కష్టం. 

 

ఇంటా, బయటా మనకు నచ్చనివెన్నో జరుగుతూఉంటాయి. కొన్నిటిని మన ప్రయత్నంతో మార్చగలం. కొన్నిటికి ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరో మార్గం ఉండదు. వాటిని తల రాతలు అనుకుని దుఃఖ పడడమూ కద్దు. 

 

కానీ, జీవితంలో అన్నిటికన్నా అత్యవసరమైనది ఒకే ఒక్కటి – “ఓర్పు”.  విచిత్రం ఏవిటంటే ఓర్చుకోవడమే అత్యంత కష్టమైనదీను.  

 

నిజానికి అనుకోనిదేదైనా జరిగినప్పుడు మాములుగా జరగాల్సినదేదో తప్పిపోయి మరో కొత్త ప్రపంచం తెరుచుకుంటుంది. (ఇదే అద్భుతమంటే!)

 

ఇలా అడుగుపెట్టిన కొత్త ప్రపంచం వల్ల మొత్తం జీవన గమనమే మారిపోతుంది. ఎప్పుడైనా గమనించేరా?

 

ఇక  సంపాదకీయమని “ఓర్పు” పాఠమేవిటని అనుకుంటున్నారా! 

 

వస్తున్నా, అక్కడికే వస్తున్నా కాస్త ఓర్చుకుందురూ!!

 

తెలుగులో అంతర్జాల స్త్రీల పత్రికల సంఖ్య కేవలం వేళ్ళ మీద లెక్కించొచ్చు. 

 

ఇక ఎక్కడో ఒకటీ, అరా తప్పిస్తే అవన్నీ  కేవలం తెలుగు సాహిత్యానికి మాత్రం పరిమితం అయి ఉన్నవే. 

 

‘అసలు తెలుగు పాఠకులకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్త్రీల సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని  పరిచయం చేస్తేనో’ అన్న ఆలోచన వచ్చింది. 

 

ఎవరితో మాట్లాడినా “మంచి ఆలోచన” అన్న సమాధానమే రావడంతో “నెచ్చెలి” రూపుదిద్దుకుంది. 

 

ఇదంతా నెల రోజుల్లో జరిగిందంటే ఆశ్చర్యం కాదు! 

 

తెలుగులో స్త్రీల కృషి తక్కువదేమీ కాదు. కేవలం సాహిత్య రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థాయికి చేరిన మహిళల స్ఫూర్తి మనకుంది. 

 

స్త్రీల కథలు, కవిత్వం, నవలలు, జీవితచరిత్రలు మొ.న సాహిత్య ప్రక్రియలు, పరిశోధనలు, కళలు, సినిమాలు…ఇలా అన్నీ ఒక  చోటికి తీసుకొచ్చి అందించే వేదికే “నెచ్చెలి”.   

 

అనువాదాల విషయానికొస్తే ఇతర భాషల నుంచి మనకు లభ్యమవుతున్న అనువాదాలతో పోలిస్తే, మన భాష లోంచి ఇతర భాషల్లోకి అనువాదాలు తక్కువగా వున్నప్పటికీ  ప్రయత్నమైతే ఎప్పుడూ జరుగుతూ ఉంది. ఇక పూర్తిగా ఆంగ్ల భాషలోనూ రాస్తున్న ఇప్పటి యువతరమూ ఉన్నారు. 

 

ఇందుకోసం “నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) శీర్షిక ఏర్పాటయ్యింది. 

 

ఇలా ఒకటొకటీ చేరుతూ, అన్ని చేతులూ ఒక్క చోట కలిసే అరుదైన వేదికగా వెలువడుతున్న  “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక మొదటి సంచిక ఈ నెల పదో తేదీన మీ ముందుకు వస్తూంది. 

తీరిక చేసుకుని, ఓపిగ్గా చదువుతారు కదూ!

 

ఇంతకీ కొసమెరుపు ఏవిటంటే, 

 

మరో పత్రికకు “అపాత్రదానం” అనే అపాయం తృటిలో తప్పడం వల్ల  రూపొందిన అద్భుతమే ఈ “నెచ్చెలి”.

 

అమ్మమ్మ చెప్పింది నిజమే  “ఏం జరిగినా మన మంచికేనల్లా……… ”

 

*****

Please follow and like us:

6 thoughts on “సంపాదకీయం-జూలై ,2019”

  1. తొలి సంచిక పరిచయ సంపాదకీయం ‘సహనమే సంస్కృతి’అనే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటను గుర్తు చేసేవిధంగా ఓర్పుతో మొదలవటం బాగుంది.నేను మూడవ తరగతి లోనే నాలుగవ తరగతిలోనో చదువుకున్న అదీ ఒకందుకు మంచిదే కథ జ్ఞప్తికి వచ్చేలా మీ అమ్మమ్మ గారి అదీ ఒకందుకు మంచిదేనల్లా అనేది పాజిటివ్ యాటిట్యూడ్కి పునాది వాక్యం.ఓర్పు ,పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగితే జీవితంలో ప్రతిదీ ఒక అద్భుతం లాగానే ఉంటుంది.లోతుగా ఆలోచిస్తే ప్రపంచమూలసూత్రం స్త్రీ .అలాంటి “న్ననారీ హృదయ స్థితిమ్”ను విశ్వైకదృష్టితో చూడటానికి నెలకొల్పిన “నెచ్చెలి”మంచిఫలితాలనిస్తుందని భావిస్తూ,ఇవ్వాలని అభిలషిస్తూ అభినందనలతో

    1. రామ్మోహన్ రావు గారూ! నెచ్చెలి మొదటి సంపాదకీయం మీకు నచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు అనేక నెనర్లు.

  2. గీతగారు అభినందనలు.మీ,మన అంతర్జాల మహిళా మాస పత్రిక మీ సంపాదకత్వములో, అందరి మనసులు చూరగొనేవిధంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ , ఆశపడుతూ.
    వసుధారాణి .ఆర్

    1. వసుధా రాణి గారూ! శుభాకాంక్షలు అందజేసినందుకు కృతఙతలండీ. మీరన్నట్లు అందరి మనసులూ చూరగొనేటట్లు “నెచ్చెలి” ఉంటుందని హామీ ఇస్తున్నాను.

  3. సంపాదకీయం బావుంది. నెచ్చెలి పత్రిక ఇంకా బావుంది. నీకూ, నెచ్చెలికీ మనః పూర్వక శుభాకాంక్షలు గీతా!

Leave a Reply

Your email address will not be published.