మా కథ 

-ఎన్. వేణుగోపాల్ 

గని కార్మికుల నివాసం

సైగ్లో-20 ఒక గని శిబిరం. అక్కడున్న ఇళ్లన్నీ కంపెనీవే, చాలామంది గని పనివాళ్లు పొరుగున ఉన్న లలాగువాలోను, దగ్గర్లోని ఇతర కంపెనీయేతర గ్రామాల్లోనూ కూడా నివసిస్తారు.

ఈ శిబిరంలోని ఇళ్లన్నీ ఏ ప్రకారం చూసినా అద్దెవే కాని పనిచేసినంతకాలం కార్మికులకుంటారు. కంపెనీ మాకు వెంటనే ఇళ్లివ్వదు, ఇక్కడ ఇళ్ల కొరత బాగా ఉంది. ఐదేళ్లు, పదేళ్లు కూడా ఇల్లు దొరకకుండా పనిచేసిన గని పనివాళ్లెంతో మంది ఉన్నారు. కనుక వాళ్లు కంపెనీ బయటి గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. కార్మికుడు చనిపోతే 90 రోజుల్లోగా అతని భార్య ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి ఉంటుంది. రిటైర్ అయినా తొలగించబడినా కూడా 90 రోజుల్లోగా ఖాళీ చేయాల్సిందే.

కంపెనీ వాళ్ళిచ్చే ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. మా ఇంట్లోనైతే నాలుగు గజాల వెడల్పు,  ఐదో ఆరో గజాల పొడవూ ఉండే చిన్న గది ఒకటి ఉంటుంది. అదే మాకు మిత్రులొస్తే కూచునే గదీ, భోజనాలు చేసే గదీ, సామాను పెట్టుకునే గదీ, పడక గదీ… అన్నీ.  కొన్ని ఇళ్లలో రెండు చిన్న గదులుంటాయి. ఆ రెండింట్లో ఒకటి వంటగది అన్నమాట. ఆ ఇళ్లకు ఓ చిన్న వాకిలి కూడా ఉంటుంది. కంపెనీ ఇచ్చే ఇళ్లన్నీ ఇలాగే ఉంటాయి. కేవలం నాలుగు గోడలు – అంతే. నీళ్లుండవు, పరిశుభ్రత ఉండదు. మేమూ, మా పిల్లలు కిక్కిరిసి ఆ గదుల్లో ఇరకాలి. మా ఇంట్లోనైతే ఉన్న ఒక్క గదిలోనే మూడు పడకలు తయారు చేశాం. ఆ గదిలో చోటుంది వాటికే. నా ఏడుగురు పిల్లలు పడుకునేదక్కడే, చదువుకునేదక్కడే, మేమందరమూ తిండి తినేదక్కడే, పిల్లలు ఆడుకునేదీ అక్కడే, వెనుక ఉన్న చిన్న గదిలో నాకు ఒక బల్లా, ఒక పడకా ఉన్నాయి. ఆ గదిని నేనూ, నా భార్తా వాడుకుంటాం. మాకున్న కొద్ది వస్తువుల్ని ఓదానిమీదికోటి ఎక్కించేస్తాం, లేదా వాకిట్లో కప్పుకు వేలాడదీస్తాం. పిల్లలు కొందరు పైనా, కొందరు కిందా పడుకోవాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడే.

మాది ఎత్తు ప్రదేశం గనుక చలి చాలా ఎక్కువ. గడ్డితో వేసిన పయస’ అనే పరుపుల్ని మేం పక్కగా వేసుకుంటాం, ఒక మంచి పయస ఖరీదు ఎనిమిది వందల పేసోల నుంచి వెయ్యి పేసోల దాకా ఉంటుంది. అంత ఖరీదైనది కొనడం మాకు సాధ్యం కాదు గనుక గని పనివాళ్ల దగ్గర ఈ గడ్డి పయస’లే ఉంటాయి. మా ఇంట్లో కూడా మంచి చాపలేమీ లేవు. పయసలు జనపనారతో చేస్తారు గనుక ఎక్కువకాలం మన్నవు. అసౌకర్యంగా కూడా ఉంటాయి. కానీ ఏం చేస్తాం? ఈ పయసల్లోంచి గడ్డి ఎటునుంచి పడితే అటునుంచి బయటికొస్తూ ఉంటుంది. అవి చాలా కాలంమన్నేట్టు చేయడానికి మేం వాటికి అతుకులేస్తూ ఉంటాం.

పొద్దుటి పూట కొంచెంసేపూ. రాత్రిపూట మొత్తమూ కంపెనీ మాకు కరెంటు ఇస్తుంది.

ఇళ్లలో కాదు గాని మాకు మంచినీటి సౌకర్యం కూడా ఉన్నట్టే. అక్కడక్కడా పబ్లిక్ పంపులుంటాయి. అక్కడ నీళ్ల కోసం బారులు తీర్చి నిలబడవలసి ఉంటుంది.

మా బతుకు చాలా హాయిగా ఏమీ ఉండదని మీకు అర్థమై ఉంటుంది కదూ?! మా ఇళ్లలో స్నానాల గదులుండవు. పబ్లిక్ స్నానాల గదులుంటాయి. కానీ అక్కడ ప్రతి ఒక్కళ్లకీ ఓ పది పన్నెండు షవర్లు (నీటి తుప్పర్లు) మాత్రం దొరుకుతాయి. ఈ సౌకర్యం శిబిరంలోని అందరికీ దినం విడిచి దినం ఉంటుంది. మగవాళ్లకు ఓ రోజు, ఆడవాళ్లకు ఓ రోజు ఈ నీళ్లు దొరుకుతాయి. ఈ నీళ్లను చమురుతో వేడి చేస్తారు. గనుక చమురు లేనప్పుడు ఈ షవర్లు కూడా ఉండవు.

అంతేకాదు, పారిశుధ్య సౌకర్యాలూ, దొడ్లూ కూడా కంపెనీ సాంకేతిక సిబ్బంది ఇళ్లలో ఉంటాయి గాని, కార్మికుల ఇళ్లల్లో అసలుండవు. పబ్లిక్ మరుగుదొడ్లుంటాయి గాని – అవీ తక్కువే. ఓ వీధి మొత్తానికి  ఓ పది ఉంటాయి. వాట్లో అన్ని వేళలా నీళ్లు రావు. ఉదయం పూట వాటిని శుభ్రంచేసేందుకు కంపెనీ ఉద్యోగులున్నారు గాని మిగిలిన సమయమంతా అవి అసహ్యంగా ఉంటాయి. నీళ్లు రాకపోతే అవి రోజులు తరబడి అలా అసహ్యంగానే ఉంటాయి. మేం అట్లాగే వాడుకోవాలి అంతే.

కంపెనీయేతర గ్రామాల్లో నీటి కొరత చాలా ఎక్కువ. వాళ్ల నీటికోసం మాకంటే ఎక్కువ కష్టపడతారు. అక్కడైతే నీళ్లకోసం పొడవాటి వరసలు కనబడతాయి.  నీళ్లకోసం అక్కడి జనం ఎంతెంతో దూరం వెళ్లాల్సివస్తుంది. వాళ్లకు మాకున్నట్టు కరెంటు సౌకర్యం కూడా లేదు. నిజంగా వాళ్ల బతుకు దుర్భరం.

కంపెనీ ఇళ్లు ఎంత అసౌకర్యంగా ఉన్నా, తక్కువ ఉన్నాయి గనుక అవి దొరకడం గగనమైపోతుంది. ఇళ్ల కోసం పెద్దఎత్తున పోటీ ఉంది. పదేళ్లు పనిచేసిన వ్యక్తికి పది పాయింట్లొస్తాయి. అతనికి భార్యా ఏడుగురు పిల్లలూ ఉంటే మరి ఎనిమిది పాయింట్లొస్తాయి.  గని లోపల పనిచేస్తే మరిన్ని పాయింట్లొస్తాయి. ఒక కార్మికుడు ఇల్లు సంపాదించుకోవాలంటే ఈ పాయింట్లు ఎక్కువగా సంపాదించుకోవాలి. కంపెనీలో చాలా కాలం నుంచి పనిచేసి ఉండాలి. ఎక్కువ మంది పిల్లలుండాలి. గనిలోపల పనిచేయాలి. ఇల్లు దొరకకుండానే గనిలోపల పనిచేస్తే వచ్చే రోగాలతో చచ్చిపోయిన వాళ్లు కూడా ఉన్నారు.

ఇళ్ల గురించి కొన్ని ఫిర్యాదులున్నాయి. కాని కంపెనీ ఎప్పుడూ దివాళా తీస్తున్నామనీ మరిన్ని ఇళ్లు కట్టించలేననీ చెపుతుంది. ఐతే చాలా ఇళ్లు కంపెనీ జాతీయం కాకముందు ప్రైవేట్ గా ఉన్నప్పుడు కట్టించినవే. జాతీయకరణ తర్వాత కొన్ని కొత్త ఇళ్లు తప్ప అంతా యధావిధిగానే ఉంది. ఈ మధ్యనే కొన్ని ఇళ్లను పెద్దగా చేస్తున్నారు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసి, సమ్మెలు చేసి కంపెనీతో కూలిపోతున్న ఇళ్లు బాగా చేసేట్టు చేయగలిగాం. నిర్మాణ కంపెనీలు అక్కడక్కడా అతుకులు వేశాయి గాని అవేమీ పనికొచ్చేవి కావు. ఒక చిన్న వర్షం వచ్చిందంటే అవి కూలిపోతాయి.

ఈ ఇళ్ల కొరత సమస్య వల్ల ఇల్లు దొరకని వారు దొరికిన వాళ్లింట్లో ఉండడానికెళ్తారు. వాళ్లను అగ్రగాడోలంటాం. అంటే అదనపు కిరాయిదార్లన్న మాట. అలాగే నా ముగ్గురు చెల్లెళ్లూ నాతో  పాటు ఉండడానికి మా ఇంటికొచ్చారు. నేను వంటగదిలో ఒక పడక తయారుచేసి ఆ గది వాళ్లకిచ్చేశాను. బయట ఒక తగరపు రేకు పందిరి వేసి వంట దానికింద చేయడం మొదలెట్టాను.

అగ్రగాడోలు తప్పకుండా చుట్టాలే కావాలని లేదు. స్నేహితులైనా కావచ్చును. సైగ్లో 20కి వచ్చిన కొత్తలో నేనూ అగ్రగాడోగానే ఉన్నాను. అప్పుడు మేం ఎవరితో ఉండబోతున్నామో వాళ్ల గురించి నాకేమీ తెలియదు. నా భర్త ఆ కార్మికుణ్ని పని దగ్గర కలిశాడట, ఆయన కంపెనీలో చాలాకాలం నుంచి పనిచేస్తున్నాడు. నా భర్త కొత్తగా చేరాడు. ఆ కార్మికునితో మేమప్పటికి ఉంటున్న ఇంటావిడ ఎంత గయ్యాళిదో, మా ముఖాలమీదనే భళ్లున తలుపెలా వేసుకుంటుందో చెప్పాను.  అప్పుడాయన నా భర్తతో మా ఇంట్లో ఉండొచ్చు మీరు’ అని పిలిచాడు. మాకప్పుడే పెళ్లయిన కొత్త రోజులు. వాళ్లింట్లో ముగ్గురు చిన్న పిల్లలు, ఆయన చెల్లెలు ఉండేవాళ్లు. మేం బాగా కలిసిపోయాం. వంతుల ప్రకారం వంట చేసుకునే వాళ్లం. అందరికోసం పెద్ద గిన్నె పొయ్యిమీదకెక్కించేవాళ్లం. ఇట్లా కలిసిపోయి ఎన్నో ఏళ్ల తరబడి జీవించే వాళ్లు కూడా ఉన్నారు.

గని కార్మికులెట్లా పనిచేస్తారు?

గనుల్లో రెండు రకాలైన పని ఉంటుంది, ఒకటేమో సాంకేతికులు చేసేది, మరొకటి గని పనివాళ్లు చేసేది.

గని పని ఎప్పుడూ ఆగదు, పగలూ రాత్రీ నడుస్తూనే ఉంటుంది. గని పనివాళ్లకు మూడు షిఫ్టులుంటాయి. షిఫ్ట్ కొందరికి నెలకోసారి, కొందరికి రెండు వారాలకోసారి, మరి కొందరికి వారానికోసారి మారుతుంది. నా భర్తకు షిఫ్ట్ ప్రతి వారమూ మారుతుంది.

గని లోతులకు దిగడానికీ, పైకి రావడానికీ వచ్చే సమయం కూడా కలుపుకుంటే మొదటి షిఫ్ట్ ఉదయం ఆరింటి నుంచి మధ్యాహ్నం మూడింటిదాకా, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రి పదకొండింటిదాకా, మూడో షిఫ్ట్ రాత్రి పదింటి నుంచి ఉదయం ఏడింటిదాకా ఉంటాయి. 

మా మగవాళ్లు మొదటి షిఫ్ట్ లో పనిచేస్తున్నప్పుడు మేం నాలుగింటికే లేచి వాళ్లు తినడానికేదైనా చేయాల్సి వస్తుంది. వాళ్లు మధ్యాహ్నం మూడింటికి నకనకలాడుతూ గని నుంచి బయటికొస్తారు. గనిలోపలికి ఆహారం తీసుకుపోవడం అనుమతించరు. ఒకవేళ పట్టుకుపోయినా ఆ లోపలి వాతావరణానికీ, లోపల తినడానికీ ఆ ఆహారం చెడిపోతుంది. గనిలోపల ఎంతో దుమ్ము ఉంటుంది. ఎంతో వేడి ఉంటుంది. డైనమైట్లు పేలుతూ ఉంటాయి కనుక అక్కడేమైనా తినడం కూడా మంచిది కాదు. ప్రతి సమస్యకూ ఏదో ఓ పరిష్కారం ఉంటుంది గదా! లోపల తినడం అసాధ్యం అని కంపెనీ అంటుంది. కానీ కంపెనీ తలచుకుంటే గనిలోపల శుభ్రమైన, ఆరోగ్యకరమైన భోజనాల గదులు కట్టించగూడదూ?! కాని వాళ్లకందుకు శ్రద్ధ లేదు. సాంకేతిక సిబ్బందికి మాత్రం కంపెనీ ఇలాంటి ప్రాధాన్యత ఇస్తుంది. ఉదాహరణకు ఇంజనీర్లు చాలా తక్కువ కాలమే పనిచేస్తారు. ఉదయం పదిన్నరకు వాళ్లకు తిండివస్తుంది, ఆ ఆహారాన్ని వాళ్లు పదకొండున్నరకల్లా గనిలోపలే తినే ఏర్పాటు ఉంది. కంపెనీ ఈ సౌకర్యాన్ని కార్మికులకు కూడా కల్పించొచ్చు. కాని ఆ పని చేయదు. కార్మికులు పొద్దున్నే ఆదరాబాదరాగా కడుపులో పడేసుకున్న ఉపాహారంతోనే గనిలోకెళ్లి మధ్యాహ్నం మూడింటికి ఇళ్లకు మళ్లుతారు. గనికి దూరంగా, అన్ సియా లాంటి చోట ఉండే వాళ్లు ఉదయం మూడింటికే లేవాల్సి వస్తుంది. అప్పుడు బయల్దేరితే గాని వాళ్లు ఎంతో దూరంలోని సొకావన్, పాటినో, మిరాఫ్లోర్స్ లాంటి గని కేంద్రాల దగ్గరికి సమయానికి చేరుకోలేరు.

మరి వాళ్లు ఇన్ని గంటలపాటు ఆకలి ఎట్లా తట్టుకోగలుగుతారు? కారపు ముద్దతో కలిపిన కోకా ఆకులు (కారా కిళ్లీ లాంటిది-అను) నములుతూ ఉంటారు. 

 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.