
వ్యక్తి-శక్తి
-డా||కె.గీత
వ్యక్తిగా మొదలవ్వడం అంటే
నీకు నువ్వే అంకురమవ్వడం
నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం
నిన్ను నువ్వే ప్రేమించుకోవడం
ద్వేషించుకోవడం
నీలోనువ్వే మాట్లాడుకోవడం
పోట్లాడుకోవడం
నీకు నువ్వుగా మిగలడం
వ్యక్తిగా ఉన్నంతసేపు
నీ పరిధి
నీ కనుచూపుమేర-
నీ దుఃఖోపశమనం
నీ అరచేతికందినంతమేర-
నీ బాధల్ని
నువ్వే తుడుచుకోవడం
నీ బంధాల్ని
నువ్వే పెంచుకోవడం
నువ్వే తుంచుకోవడం
***
సమిష్టిగా మొదలవ్వడం అంటే
నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం
సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే
నీ ప్రపంచానికి
దిశానిర్దేశం చెయ్యడం
సమిష్టిశక్తిగా ముందుకు వెళ్లడం అంటే
నీతో బాటూ
నమ్మిన కాళ్లకి తోడెళ్లడం
నమ్ముకున్న కళ్లని తుడవడం
నీతో బాటూ
సమిష్టిగా సంతోషాల్ని పంచుకోవడం
సమస్తాన్నీ ప్రేమించడం
ఒక్కోసారి
బంధాలు
మోసుకెళ్లలేనివైనా
గుండె కింద పదిల పరుచుకోగలిగినవి
ఒక్కోసారి
మాట విరుపుతో ఛెళ్ళున చరిచేవైనా
స్ఫూర్తి ప్రదాయకాలై
ముందుకు నడిపించేవి
సమిష్టిగా ముందుకు నడవడం అంటే
జీవితం తేజోమయం కావడం
జీవనం సఫలం కావడం
***
వీక్షణంగా ముందుకు నడవడం అంటే
సాహితీ లోకానికి
ఒక గవాక్షమై తెరుచుకోవడం
ఒకే గూటి పక్షులమై
అప్పటికప్పుడు రూపుదిద్దుకున్న
అక్షరాలమై
ఒక కవితాత్మక వాక్యమై
అఖండ ప్రచండమై
రెక్క విప్పుకోవడం
*****
(కాలిఫోర్నియాలో నెల నెలా జరుపుతూ, ఇప్పటివరకు 85 సమావేశాల నిర్వాహకురాలిగా “వీక్షణం” సప్తమ వార్షికోత్సవం సందర్భంగా రాసిన కవిత)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
