ఎర్రకాలువ

-తోట సుభాషిణి

నా గదంతా రక్తంతో నిండిపోతుంది  

ఆ నాలుగు రాత్రుల యుద్ద సమయంలో 

అమావస్యనాడు వెన్నెల చూసావా

 నేను చూసాను చాలాసార్లు

 లోదుస్తులపై ఎర్రటి మరకలు మెరుస్తుంటే

మా ఇంటిముందు మోరీ  

యుద్ధంలో సైనికుల మరణానికి 

ఆనవాలు చరిత్ర

నల్లరక్తం ….

ఎరుపు విరిగి సన్నని తీగరాగం అందుకుంటుంది అదే విప్లవగీతం 

స్నానాల గదిలో  ఆ గేయం వర్ణనాతీతం

నేను కమ్యూనిస్టుగా ముద్రవేయించుకుంటుంటా

అడవికి ప్రేమికురాలునై 

ఋతు చక్రాన్ని మొలిపించుకునేందుకు

అవునూ నాకు కొన్ని గుడ్డ ముక్కలు

మరికొన్ని నాఫ్కిన్స్ కావాలిగా 

ఎరుపు సింధూరమే కాదు 

ఇక్కడ సిగ్గుబిళ్ళ కూడ…

కుక్కగా పుడతానా

లం….. గా మారిపోతానా …

ఒరేయ్ లంగా ….

నువ్ రక్తం పారిస్తేనే యోధుడువైతే

అదే రక్తం నేనుగా ప్రవహిస్తున్న

అందుకే అమ్మగా బ్రతుకుతున్నా

వంటిల్లే కాదురా 

ఏ గదిలోనైన ప్రవేశం నా ఎర్రకాలువ పారుతున్న దేహాంగంతోనే

విప్పేందుకో 

విప్పానని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసేందుకో 

స్త్రీ దేహం 

మొలతాడుకు కట్టుకున్న పిన్నీసు కాదు

జన్మాంతం కొనియాడే 

భక్తి స్వరూపం…

*****

Please follow and like us:

2 thoughts on “ఎర్రకాలువ(కవిత)”

Leave a Reply to Giri Prasad Chelamallu Cancel reply

Your email address will not be published.