నా జీవన యానంలో- రెండవభాగం- 10

-కె.వరలక్ష్మి 

స్కూలు ప్రారంభించిన రెండో సంవత్సరం నుంచి పిల్లల్ని విహారయాత్రలకి తీసుకెళ్తూండేదాన్ని. ఒకటో రెండో మినీబస్సుల్లో వెళ్తూండేవాళ్లం. అలా మొదటిసారి శంఖవరం దగ్గరున్న శాంతి ఆశ్రమానికి వెళ్లేం. తూర్పు కనుమల్లోని తోటపల్లి కొండల్లో వందల ఎకరాలమేర విస్తరించి ఉన్న అందమైన, ప్రశాంతమైన ఆశ్రమం అది. మా ఆడపడుచురాణిని ఆపక్క ఊరైన వెంకటనగరం అబ్బాయికి చెయ్యడం వల్ల వాళ్ల పెళ్లికి వెళ్లినప్పుడు ఆ ఆశ్రమాన్నీ, పక్కనే ఉన్న ధారకొండనీ చూసేను. ఆ ప్రాంతాన్ని పిల్లలకు చూపించాలని నా అభిలాష. అప్పటికి స్వామీజీ ఉన్నారు. మేం స్వామీజీని చూడడానికి ఒక సమయం కేటాయించేరు. పిల్లలకి ఒకటే ఆటవిడుపు. మామిడిచెట్ల కొమ్మల్లో ఊగుతూనూ, నాగమల్లి చెట్లకింద పూలు ఏరుకుంటూను ఎంజాయ్ చెయ్యడం ప్రారంభించేరు. మాకు తెలీక భోజనాలు పట్టుకెళ్లేంకాని, ముందుగా ఉత్తరం రాసి తెలియపరిస్తే ఎంతమందికైనా అక్కడ ఉచితంగా పెడతారట. ఒక తిన్నెమీద స్వామీజీ కూర్చుని  రమ్మని కబురు చేసేరు. ఆయనముందు దట్టమైన చెట్లనీడలో చాపలు పరిచి ఉన్నాయి. నేను, టీచర్లు, పిలలు వెళ్లి ఆ చాపల మీద కూర్చున్నాం. ముందే చెప్పడం వల్ల పిల్లలు సైలెంటుగా ఉన్నారు. స్వామీజీకి ఆ రోజు మౌనవ్రతమట. అందరి ముఖాల్ని పరిశీలించి చూసి, నన్ను రమ్మని చేతితో పిలిచేరు. అప్పటికే అందరం చేతులు జోడించి ఉన్నాం. నేను అలాగే ఆయన దగ్గరకి నడిచివెళ్లేను. ముకుళించిన చేతుల్ని అలాగే పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనకి అప్పటికే ఎనభై ఏళ్లైపైన వయసట. శిష్యుడొకాయన అందరిచేతా భగవన్నామస్మరణ చేయించారు చాలాసేపు. అంతసేపూ ఆయన నా చేతుల్ని అలా పట్టుకునే ఉన్నారు. ప్రార్థన ముగిసేక నా తలపైన చెయ్యి ఆన్చి ఆశీర్వదించి, నా వైపు దయ కురిపిస్తూ చూసి, నెమ్మదిగా నడుస్తూ తన ధ్యానమందిరం లోకి వెళ్లిపోయారు. ఆశ్రమం లోపలంతా చెట్లకి మంచి మంచి సూక్తులు రాసిన బోర్డులు వేళ్లాడదీసి ఉన్నాయి. వాటినన్నిటినీ నేను ఒక నోట్ బుక్లో రాసి తెచ్చుకుని రోజూ పిల్లలకి పాఠాలతో బాటు నేర్పించే ఏర్పాటు చేసేను.

ధారకొండకు వెళ్లినప్పుడు ఒక చిత్రాన్ని గమనించేను, అక్కడ ఎత్తైన శిఖరాల మీది చెట్లకు మన ఆటోసైజు తేనెపట్లు వేలాడుతూండడం గమనించేను. ఇక్కడి రైతులు ముందే చెప్పేరు. నిశ్శబ్దంగా ఉండాలని. అవి ఏమాత్రం డిస్టర్బ్ అయినా దండెత్తివచ్చి ప్రాణాలు తీసేస్తాయట. బస్సుల్ని దూరంగా వదిలేసి, నిశ్శబ్దంగా వెళ్లి చూసేసి వచ్చేం. అప్పటి విద్యార్థులు కూడా చక్కని బుద్ధిమంతులు. చెప్పింది తు.చ తప్పకుండా పాటించేవాళ్లు.

అలా ప్రతీ సంవత్సరం ఒక్కొక్క చోటు చొప్పున చాలా ప్రాంతాలు తిరిగి చూసి, తెలీని ఎన్నో విషయాలు విద్యార్థుల్తో బాటు నేనూ నేర్చుకున్నాను.

ఎప్పుడూ సెలవులొస్తే మోహన్ ఊళ్లు తిరగడమే కాని, నేనూ పిల్లలూ ఎక్కడికీ వెళ్లేవాళ్లం కాదు. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగులకి ఎల్.టి.సీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) ఇచ్చేది. ఏడుగురు సభ్యులు (భార్య, భర్త, ముగ్గురు పిల్లలు, తల్లి, తండ్రి) ఉన్న కుటుంబం తీర్థయాత్రలకి, హిస్టారికల్ ప్లేసెస్ చూడడానికి వెళ్తే సెలవుతో బాటు ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చేది. మా అబ్బాయికి పదేళ్లు వచ్చేయి. గీత, లలిత కూడా చూసి అర్థం చేసుకోగలరు అన్నప్పుడు నేను మోహన్ ని  అడిగేను పిల్లలకి వరంగల్, రామప్ప గుడి చూపిద్దామా అని. ముందు నువ్వు ఖర్చుపెట్టు, తర్వాత డబ్బులొచ్చేక ఇస్తాను అన్నాడు మోహన్. ఆ సంవత్సరం మే నెల సెలవుల్లో ముందు హైదరాబాద్ వెళ్లి ఎ.పి. గెస్ట్ హౌస్ లో బస చేసేం. అప్పుడు సిటీలో ఇప్పటంత రద్దీ ఉండేది కాదు. రోడ్లుక్రాస్ చెయ్యడం తేలికగా ఉండేది. రిక్షాలో తిరగేవాళ్ళం. రిక్షాలు తమాషాగా ఉండేవి. ఇంట్లో కూర్చున్నట్టు బాసింపట్టు వేసుకుని కూర్చోవాలి. ఇటువైపు రిక్షాల్లో పిల్లల్తో కలిసి కూర్చోవచ్చు. అక్కడి రిక్షాల్లో  ఇద్దరు కూర్చోవడమే ఇబ్బందిగా ఉండేది. రెండు రిక్షాల్లో తిరిగేవాళ్లం. దూరానికైతే సిటీబస్సులు. అక్కడ దొరికే పచ్చ అరటిపళ్లు చాలా నచ్చాయి. పిల్లలు అన్నం మానేసి అవే తినేవాళ్లు. నాంపల్లి స్టేషన్లో దిగినట్టు గుర్తు. పిల్లలకి జూపార్క్, సాలార్ జింగ్ మ్యూజియం, చార్మినార్, పాతబస్తీ, పబ్లిక్ గార్డెన్స్ వగైరాలు చూపించేం. హైకోర్టు, కొన్ని నిజాం కాలం నాటి పేలస్లు బైటినుంచి చూసేం.

ఓ రోజు ఉదయాన్నే హైదరాబాద్లో బయలుదేరి వరంగల్ కి వచ్చేం. అక్కడ మునిసిపల్ గెస్ట్ హౌస్ లాంటి ఏదో చిన్న విడిదిలో దిగి బేగ్స్ రూంలో పడేసి, బస్సులో వేయిస్తంభాల గుడి చూడడానికి వెళ్లేం. అక్కడ ఆడవాళ్లకి వేరే బస్సులున్నాయి. కొన్ని బస్సుల్లో ముందుభాగం ఆడవాళ్లకి, వెనుకభాగం మగవాళ్లకి ప్రత్యేకంగా ఉన్నాయి. వేయిస్తంభాల గుడి చూసేసి, మిట్ట మధ్యాహ్నం వేళకి వరంగల్లు కోట చూడడానికి వెళ్లేం. అక్కడ రాళ్లు, శిథిలాలు తప్ప మరేమీలేవు. కనుచూపు మేరలో ఎక్కడా పచ్చని చెట్టు లేదు. అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న ఇళ్లకి కోట శిథిలాల రాళ్లు ఉపయోగించుకున్నారు. నెత్తిమాడిపోతున్న ఎండలో పడి ఓరుగల్లు (ఏకశిల) మొదలుకి చేరుకున్నాం. అక్కడున్న బడ్డీకొట్టులో సోడాలు తాగి కాస్త సేదతీరేం. ఈ లోగా పిల్లలు రాతి పైనున్న గుడివరకూ ఎక్కిదిగడం, సోడాలు తాగడం, గొంతు, ఒళ్లు పొడారిపోతూ నిప్పులకొలిమిలో ఉన్నట్టున్న అలాంటి ఎండలు గోదావరి జిల్లాలో ఎప్పుడూ చూడలేదు. పిల్లల్తో సమానంగా గెంతుతూ ఉండే నేను గుట్ట ఎక్కడానికి ప్రయత్నించి, సగం ఎక్కేసరికి నాకు కళ్లు తిరుగుతున్నాయని అర్థమైంది. ఎలాగో కిందికొచ్చేక టప్ మని పడిపోయేను. నాముఖం మీద సోడానీళ్లు కొట్టీ, ఆ నీళ్లు తాగించీ లేవదీసేరు. పిల్లలు కూడా వేడి తట్టుకోలేక వేళ్లాడిపోతున్నారు. ఇక రామప్ప గుడినీ, వరంగల్లులో మిగతా ప్రదేశాల్నీ చూడాలనే కోరికకి బై చెప్పేసి తిరుగుప్రయాణానికి ట్రెయిను ఎక్కేసాం. 

మరోసారి మద్రాసు వెళ్లేం. స్టేషనుకి దగ్గర్లో ఏదో చిన్నహోటల్లో రూమ్ తీసుకున్నాం. పొదుపు పాటిస్తూ జాగ్రత్తగా ఖర్చుపెడుతూ తిరగాలి. మోహన్ డబ్బులేమీ తేలేదు. మూర్ మార్కెట్ లోనూ, చైనాబజార్ లోనూ వాళ్లకి నచ్చినవి చూసినా కొనమని అడిగేవాళ్లు కాదు మా పిల్లలు. మేరీనాబీచ్, మహాబలిపురం మద్రాస్లోని ముఖ్యమైన వీధులు కొన్ని కాలినడకన, కొన్ని టేక్సీల్లోనూ తిరిగేం. మోహన్ కి సినిమా వెర్రి తగ్గకుండా చూసుకునే పంతులు అనే ఒకాయన మమ్మల్ని సినిమా యాక్టర్ల ఇళ్లకి తిప్పిచూపించే పనిపెట్టుకున్నాడు. ఒక రోజంతా నేను అడిగిన కమల్ హాసన్ ఇల్లు అంటూ పైన బట్టలారేసిన పాతకాలంనాటి డాబా ఇల్లొకటి చూపించేడు. టేక్సీ స్పీడుగా వెళ్లిపోతున్నప్పుడు అది శోభన్ బాబు గారిల్లు, ఇది కృష్ణగారిల్లు అంటూ చెప్తూండేవాడు. మా చిన్నమ్మాయి శ్రీదేవిని చూసి తీరాల్సిందే అని పట్టుపట్టింది. ఇంట్లో చిన్నది కదా, గారాబం ఎక్కువ. శ్రీదేవి లంచ్ టైమ్ కి ఇంటికొచ్చే వేళకి పంతులు రికమండేషన్ తో మేం వాళ్లింట్లో ఉన్నాం. సింపుల్ వాయిలు చీరలో, చక్కని మేకప్ తో  బావుంది. మా చిన్నమ్మాయికి అప్పటికి ఆరేళ్లుంటాయి. శ్రీదేవి పలకరించగానే నా పేరు శ్రీలలిత అంటూ వెళ్లి ఆమె కాళ్లను వాటేసుకుంది. శ్రీదేవి ముద్దు ముద్దుగా పిల్లలు అడిగిన వాటికి సమాధానాలు చెప్పింది. ఈలోగా పంతులు మా టేక్సీలో వెళ్లి శ్రీదేవికి ఐస్క్రీమ్ తెచ్చాడట. బిల్లు తీసుకునేటప్పుడు అది కూడా కలిపి తీసుకున్నాడు టేక్సీవాలా. ఆ రోజు ఉదయం ముక్కామల గారు దివంగతులయ్యారట. లేకపోతే స్టూడియోలు కూడా చూపించేవాడు మోహన్. మోహన్ ఎప్పుడు మద్రాసులో దిగే రూంకి తీసుకెళ్లేడు. అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్న నటులు చాలా మందినే పరిచయం చేసాడు కాని, సత్యేంద్రకుమార్, బాలాజీ పేర్లు మాత్రమే గుర్తున్నాయి. బహుశా అది టి.నగరేమో. అంతకు ముందే కంచి, శ్రీకాళహస్తి లాంటివి చూసి ఉన్నాం కాబట్టి ఎక్కడా ఆగకుండా తిరిగి వెనక్కొచ్చేం. ఆ టిక్కెట్లు సబ్మిట్ చేసి ఎల్.టి.సి. డబ్బులు తీసుకుని తను ఖర్చుపెట్టేసుకున్నాడు మోహన్.

మా స్కూలుకి వార్షికోత్సవాలు చాలా బాగా చేసేవాళ్లం. హాస్యం నిండిన చిన్న చిన్న స్కిట్స్, నాటికలు, జాతీయగీతాలకు, భక్తి గీతాలకు నాట్య ప్రదర్శనలు చేయించేవాళ్లం. ఇప్పటిలాగా స్టేజీ దద్దరిల్లిపోయే కుప్పిగంతులు డేన్స్ లు అప్పుడు లేవు. ఎక్కడా సంస్కారం లోపించకుండా ఉండేవి కార్యక్రమాలు. పౌరాణిక నాటకాల్లోని శ్రీకృష్ణరాయబారం లాంటి సీన్స్ వేయించేవాళ్లం. నేనూ, మా చిన్నచెల్లెలు సూర్యకుమారి కలిసి పద్యాలు, పాటలు పాడేవాళ్లం. నల్లజిలకరి మొగ్గాలాంటి జానపదగీతాలు, చూడనెంతో శృంగారమూలాంటి పెళ్లిపాటలు, అప్పగింతలపాటలు, జనం నోళ్లలో నానే దంపుళ్ల పాటలు లాంటివి పాడుతుంటే జనం చప్పట్లతో మాకు మరింత హుషారొచ్చేది. చాలా పాటలు రేడియోనుంచి తీసుకున్నవే. స్కిట్స్, నాటికలు నేనే రాసేదాన్ని.  మాకు హార్మొనీతో అల్లాడి రామం గారు, తబలాతో తాళ్లూరు పంతులుగారు సహకరించేవారు. రాజమండ్రి వెళ్లి డ్రెస్సుల వాళ్లనీ, మేకప్ వాళ్లనీ నేనే బుక్ చేసుకొచ్చేదాన్ని. మోహన్ చిన్న సాయంకూడా చేసేవాడు కాదు. చూడడానికొచ్చిన తల్లిదండ్రులూ, బైటి జనాలూ కూడా కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ కదిలేవాళ్లు కాదు. అప్పుడప్పుడే టీ.వీలో దూరదర్శన్ కార్యక్రమాలు ప్రారంభమైన రోజులు. వార్తలు చదివేది హిందీలో అయినా, తెలుగులో అయినా మహిళాన్యూస్ రీడర్లను చూడడం జనానికి చాలా ఆసక్తిదాయకంగా ఉండేది. వాళ్లు కట్టుకున్న చీరలు, వాళ్ల హెయిర్ స్టైల్స్ గురించి మాట్లాడుకునే వాళ్లు. అందుకని ప్రతి ఏడాదీ మా కార్యక్రమాల్లో న్యూస్ చదివే కార్యక్రమం ఒకటుండేది. ఊరి మురిక్కాలవల గురించి, పందుల గురించి, ఊరి సమస్యల గురించి హాస్యం మేళవించి రాసిన న్యూస్ దట్టంగా మేకప్ చేసుకుని, వెరైటీ హెయిర్ స్టైల్తో కళ్లు ఆర్పుతూ చదివే న్యూస్ రీడర్కి బోలెడన్ని చప్పట్లు దక్కేవి. సాధారణంగా ఆ కేరెక్టర్ మా చిన్నమ్మాయి చేసేది. వరకట్నం లాంటి సీరియస్ సమస్యల్ని, కులమతాల విభేదాల సమస్యల్ని నాటికలుగా ప్రదర్శించేవాళ్లం. పిల్లలు ఇంటా బైటా ఎలా నడుచుకోవాలి, ఏ సమస్యల్ని ఎలా అధిగమించాలి అనేవి నేర్పించేవాళ్లం. వచ్చిన చీఫ్ గెస్టులకి లేపాక్షిలో కొని తెచ్చిన శిల్పాకృతుల్ని బహూకరించేదాన్ని. హైస్కూల్లో పర్మిషన్ అడిగి కొన్నాళ్లు హైస్కూల్ స్టేజిమీద, తర్వాత మాస్కూలు ముందు జరిపేవాళ్లం. పిల్లలకు మంచి మంచి బహుమతులిచ్చేవాళ్లం. నాకిప్పటికీ గుర్తు ఆనాటి నా విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఎంతగానో సహకరించేవారు, ఆ అభిమానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

 

*****

(ఇంకా ఉంది )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.