యాత్రాగీతం(మెక్సికో)-10

కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4

-డా||కె.గీత

భాగం-12

 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరంలో ఆ ఎత్తైన కట్టడం దగ్గిరే దాదాపు రెండు గంటల సమయం గడిచిపోయింది.

తిరిగి వస్తూ ఉన్నపుడు చుట్టూ అరణ్యంలా మొలిచిపోయిన చెట్ల నడుమ అక్కడక్కడా మాయా చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయిన శిథిల గృహాల అవశేషాలు, అప్పటి జన సమూహాల పాదముద్రల సాక్ష్యాలుగా నిలిచిపోయిన చిన్నా, పెద్దా కట్టడాలు మనసులో గొప్ప దిగుల్ని, బాధని కలిగించేయి. 

ఎంత గొప్ప సంస్కృతయినా, సమాజమైనా అంతరించిపోతే ఇంతే కదా అనిపించింది.  

దారిపొడవునా వన దేవతలు ఇప్పటికీ అక్కడే సంచరించిస్తున్న గగుర్పాటు కలిగింది.  

మేం తిరిగి గేటు వరకు రిక్షాలో వచ్చి, దిగేక కూడా కాసేపు మాయా సంతతికి చెందిన అతనితో కబుర్లు చెపుతూనే ఉన్నాను. తాతముత్తాతలు జీవించిన అదే ఊళ్ళో ఉపాధి వెతుక్కున్న అతని మీద గౌరవం కలిగింది. 

వచ్చే దారిలో మా మినీ బస్సు డ్రైవరు ఇప్పటికీ బయటి ప్రపంచపు ఊసు లేకుండా అడవిలోనే  జీవనం సాగించే వారి ఇళ్లను దూరం నుంచి చూపించేడు. త్రోవలో ఒక చోట ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బడికి వచ్చిన పిల్లలు కాలినడకన పోతుంటే ఆపి ఎక్కించుకుని రెండు, మూడు మైళ్ళ తర్వాత రోడ్డు మీద దించేడు.

ఆ చుట్టు పక్కల బస్సు సౌకర్యం లేనందున తమలాంటి ప్రైవేటు వాహనాల వాళ్ళందరూ ఇలా సాయం చేస్తుంటామని చెప్పేడు. అది చూసి మాబస్సు డ్రైవరు మీద ఎనలేని గౌరవం కలిగింది నాకు. 

ఆ తరువాత మధ్యాహ్న భోజన విడిది కోసం మాయా పల్లెటూరికి తీసుకు వెళ్ళేరు. 

మా మినీ బస్సు  విడిదికి రెండు వీథుల అవతల ఆపేడు మా డ్రైవరు. 

చుట్టూ మట్టిరోడ్లు, కంచెలు కట్టిన తడికెల ఇళ్లు… అచ్చం మనవైపు ఊరులా ఉంది. 

బస్సు ఆపిన చోటి నుండి ముందు నడుస్తూ దారిలో డ్రైవరు ఒక ఎర్ర పూలు, కాయల తుప్ప  చెట్టొకటి చూపించి, కాయల్లోని గింజలు మాకు ఒకటి ఇచ్చేడు. ఆ గింజని నలిపితే వచ్చే ఎర్రని సింధూరం వంటి రంగు వస్తూంది. 

ఆ రంగు  వంటకాల్లో, ముఖాలకు రాసుకుందుకు రంగుకోసం వాడతారని చెప్పేడు. 

ఇక చుట్టూ ఇళ్లున్న మాయా గ్రామంలో మధ్య కట్టిన పెద్ద ధాభా లా ఉంది ఆ టూరిజమ్ వాళ్ల భోజనశాల. 

అయితే వంట జరుగుతున్న చోటుకి అందర్నీ ప్రత్యక్షంగా తీసుకెళ్లి సాంప్రదాయిక వంటలు, పదార్థాలు ఎలా వండుతున్నారో  చూపించడం, అక్కడే వడ్డించడం విశేషం. 

మేం ఇంతకు ముందు రోజు చిచెన్  ఇట్జా టూరులో తిన్న పప్పు వడల వంటివి ఇక్కడ ప్రత్యక్షంగా వండడం చూపించేరు. చక్కగా ఎర్ర మట్టితో అలికిన పెద్దగాడి పొయ్యి మీద పెద్ద పెనంలో వేయిస్తున్న వడలు చూస్తే అచ్చం ఒకప్పటి మన వంటశాలలు గుర్తుకు వచ్చేయి. 

మెక్సికను ప్రాంతపు మిరప పళ్లు, టమాటా కలిపిన సాల్సా, మొక్కజొన్న చిప్సు, అవకాడో డిప్, బీన్స్ , కేరట్స్ తో ఉడికించిన లావుపాటి అన్నం, మాంసంతో, బీన్స్ పప్పుతో తయారుచేసిన గట్టి స్ప్రింగ్ రోల్స్, 

వడలు, మొక్కజొన్న చపాతీలు, వేయించిన చికెన్ వంటి రకరకాల  వంటకాలెన్నున్నా వడలు మాత్రమే అచ్చం మనం చేసుకున్నట్టు రుచిగా  ఉండడంతో మేం మళ్లీ మళ్లీ అవే వడ్డించుకున్నాం. చిట్టచివర్లో ఏదో నువ్వుల అచ్చులా కనబడితే తెచ్చుకుని తీరా అది చియా సీడ్స్ వంటి వాటితో తయారుచేసినదేదో అయ్యేసరికి నోట్లో పెట్టుకోలేక నవ్వుకున్నాం. 

భోజనం అయ్యేక ఆవరణలోనే ఉన్న వల ఉయ్యాళ్లలో కాస్సేపు సేద తీరేం. 

ఆ తరువాత దగ్గర్లో దిగువనెక్కడో ప్రవహిస్తున్న సన్నని సెలయేటి లోయకి  ఇటునుంచి అటుకి కట్టిన తాళ్ల వంతెన చూపించడానికి అందర్నీ పిలుస్తుండంతో అటు వెళ్ళేం.

నేను, సిరి చివర్లో నడవడం మొదలుపెట్టేం.  జీవితంలో మొదటిసారి అలా నడవడమేమో భలే భయం వేసింది.  వంతెన మధ్యలోకి వెళ్లేసరికి బాగా కదలడం మొదలెట్టేసరికి సిరి భయంతో   కూచుండి పోయింది. ఇక నేనైతే ఎటూ వెళ్లలేక అరవడం మొదలుపెట్టేను. అటువైపు నుంచి సత్య వెనక్కివచ్చి సిరినెత్తుకుని పరుగెత్తుతూ మరింత వేగంగా వంతెనని కదిపేడు. ఇక నా భయం చూడాలి! ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తూంది గానీ అక్కడ దాటుతున్నంతసేపు బిగ్గరగా ఏదేదో మాట్లాడుతూ, అరుస్తూనే ఉన్నాను. ఎలాగైతేనేం మొత్తానికి మెల్లిగా అడుగులో అడుగేస్తూ వచ్చి బస్సు కదిలే చివరి నిమిషంలో అందులో నుంచి బయటపడ్డాను. అలా అడుగు వేస్తే గాల్లో ఊగే వంతెన మీద నడవడం ఒళ్లు గగుర్పొడిచే గొప్ప అనుభవం!

ఆ తర్వాత ఆరోజు మా యాత్రలో చివరిదైన  సెనోట్ దగ్గిర ఆగేం. ఇక్కడ కూడా పార్కింగ్  నుంచి చాలా దూరం లోపలికి వెళ్లాల్సి రావడం, సిరి  నడవనని పేచీ పెట్టడంతో ఇక ఆవరణలో ఉన్న ఒకే ఒక్క రిక్షాని నేను, సిరి ఎక్కేం. 

అయితే  రిక్షా నడపడానికి  నలుగురు రావడం ఆశ్చర్యం కలిగించింది. దారిలో బ్రిడ్జిని దాటి, కొండెక్కి వెళ్లాల్సిన మట్టి బాట వెంట దారి  పొడవునా చక్రాలు కప్పడే ఇసుక ఉండడంతో అర్థమయ్యింది ఎందుకంత మంది వచ్చారో. ఆ బండికి ఇద్దరు ముందు, ఇద్దరు వెనక సాయం పట్టసాగేరు. 

ఎత్తు దారిలో నేను నడుస్తానని చెప్పి కాస్సేపు దిగుతానన్నా వాళ్ళు వినిపించుకోలేదు. 

వాళ్ళంతా వచ్చీ రాని ఇంగ్లీషు భాషలో మాట్లాడుతూ సరదాగా తీసుకెళ్ళేరు. 

ఈ సెనేట్ పూర్తిగా పై భాగం మూతబడి ఎక్కడో దిగువన గుహాంతర్భాగంలో ఉంది. 

సిరి ముందు రాననే సరికి బట్టలు మార్చుకునే వసతి బయటే గుండ్రంగా కట్టి ఉన్న ఆవరణలోఆగిపోయేను నేను. 

సిరిని నడిపిస్తూ మెట్లు దిగడం కష్టమని ఆలోచిస్తూ ఉండగా, మా రిక్షా అబ్బాయిల్లో ఒకతను కిందికి పాపను ఎత్తుకుని తీసుకువెళ్లడానికి సాయం చేస్తానని చెప్పడంతో, నేనూ మెట్లు దిగడం మొదలుపెట్టేను.

మెట్లన్నీ దిగగంగానే విశాలంగా ఉన్న గుహాంతర్భాగంలో లైట్ల నడుమ సహజ సిద్ధమైన పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా భలే అందంగా, అత్యద్భుతంగా  ఉంది ఈ సెనోట్. 

మాతో వచ్చిన అతి తక్కువ మంది మాత్రమే ఉండడంతో చల్లని నీళ్లలో ఈదులాడుతూ గంటసేపు గడపనిచ్చేరు. 

సిరితో అంత కిందికి దిగడం, ఎక్కడం కొంచెం కష్టమైనా అక్కడికి వెళ్లకపోయి ఉంటే మంచి అనుభూతిని మిస్సయ్యిపోయేదాన్ని అనిపించింది.  

తడితలలతో బయటకు వచ్చేక స్థానిక పెద్దమనిషి ఒకాయనతో వారి సంస్కతిలో పూజాశీర్వాదాల కార్యక్రమం నిర్వహించేరు. అందుకోసం అందర్నీ గుండ్రంగా నిలబెట్టేరు. 

గుగ్గిలం పొగ వేసిన మట్టిదిమ్మె ఒకచేత్తో పట్టుకుని, ఆకులూ, పూలు అర్థచంద్రాకారంలో చుట్టి అలంకరించిన మండపంలో మొక్కజొన్నలు, పళ్ళు, పూలు వేసి స్థానిక మాయా భాషలో మంత్రాలు చదివి అందర్నీ ఆశీర్వదించేడు ఆయన.  అలా ప్రత్యక్షంగా వారి భాషని వినగలిగేం. ఆ మొత్తం తతంగమంతా చాలా ఆసక్తికరంగా చూసేరు పిల్లలూ, పెద్దలూ. 

అక్కణ్ణించి తిరిగి బస్సు దగ్గిరికి వచ్చేసరికి పొద్దుపోతుండడంతో రిక్షా అబ్బాయిలు సరదాగా పాటందుకున్నారు. సిరి అందుకు సరిపడా గొంతు కలపడం మొదలెట్టింది. భలే సంతోషం వేసింది. 

దిగుతూనే రిక్షా బాడుగ కాకుండా అందరికీ తలా పది డాలర్లు  ఇచ్చేను. 

ఆ రోజుకి ఆ పార్కులో మేమే చివరి బాచ్ కావడంతో అందరూ తలా సైకిలు వేసుకుని మా బస్సు ముందే బయల్దేరేరు.  కానీ అందరికీ నాయకుడిలా ఉన్నతను మాత్రం మా బస్సు పక్కనే ఆగున్న కారు తీసి రయ్యిన వెళ్లిపోయేడు. 

ఇక అక్కడ ఫొటోలు, వీడియోలు వాళ్లే  తీసి అవన్నీ పెన్ డ్రైవ్ లో పెట్టి ఇవ్వడానికి యాభై డాలర్లకి ఇస్తుంటే మేమూ మావి తీసుకున్నాం. అయితే తీరా అమెరికా తిరిగి వచ్చేసరికి ఆ పెన్ డ్రైవ్ కనబడలేదు. అయితే వాళ్ల వెబ్సైటులో ముప్ఫై రోజుల వరకు భద్రపరుస్తామని వారు చెప్పడం గుర్తురావడంతో కాంటాక్ట్ చేసి ఫొటోలన్నీ డౌన్లోడ్ చేసుకోగలిగేం. 

తిరిగి మా రిసార్టుకి చేరుకునేసరికి ఆరేడు గంటల ప్రాంతమయ్యింది.  

అప్పటివరకు చూసిన అన్నిటికంటే  ఆ రోజు చూసిన తులం, కోబా శిథిలాలు, మాయ గ్రామం, ప్రజలు, వారి ఆచారవ్యవహారాలు  ప్రత్యక్షంగా చూసిన అనుభూతి ఎప్పటికీ పదిలంగా హృదయంలో ముద్రపడిపోయింది.

***

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

2 thoughts on “యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4)-10”

    1. నీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా!

Leave a Reply to డా||కె.గీత Cancel reply

Your email address will not be published.