
ఆమె (కవిత)
-గిరి ప్రసాద్ చెల మల్లు
ఆమె
ఒక ప్రశ్న
జవాబు దొరకదు
ఆమె ఒక పజిల్
అంచనాకు అందదు
ఆమె వర్షిణి
కురిపించే ప్రేమ
కొలిచే పరికరం లేదు
ఆమె
సృష్టి
బిడ్డ కోసం పంచే పాల నాణ్యత
లాక్టో మీటర్ కి చేరదు
ఆమె
దుఖం
కుటుంబ పాలన లో
అడుగడుగునా రెప్పల మాటున
గడ్డ గట్టి
ఏకాంతంలో విష్పోటనం
ఆమె
ఆరోగ్యం
జీవన శైలి ప్రతిబింబం
ఆమె
భద్రత
ఆమె చుట్టూ పురుష పంజరాలు
ఆంక్షల నడుమ
ఆకాంక్షల పణం
ఆమె
ఆలోచనలు
మెదడులో ప్రకంపనలు
ఆమె
ఒక విజ్ఞాన ఖని
తవ్వితే లావా
ఎగజిమ్ము
సంఘ ప్రక్షాళనలో
ఆమె పాదం
ఒక కదం
ఆమె పదం
ఒక గర్జన
ఆమె చూపుడు వేలు
మరో సంగ్రామ దిక్సూచి
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేసాను. చదువు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని కవితలు వ్రాస్తున్నాను. ప్రేమ కవితల్లో కూడా ప్రవేశం. కవితలు వివిధ దిన వార మాస వెబ్ పత్రికల్లో ప్రచురితం.
