ట్రావెల్ డైరీస్ -2

సముద్రం పిలిచింది

-నందకిషోర్

అదే యేడు చలికాలం : సముద్రం పిలిచింది.

మా పరిచయం చాలా స్వల్పకాలికమైనదే అయినా తెలియని స్నేహం ఏదో ఏర్పడింది.

వైజాగ్ నుండి భీమిలి అరగంట ప్రయాణం. బీచ్ పక్కనే ‘అతిథి’ హోటల్లో బస. గతంలో స్నేహితులతో వెళ్లిన ప్రతిసారి, కళ్ళతో మాత్రమే సముద్రం చూసేవాణ్ణి. సముద్రానికి అంతం ఉందని అనుకునేవాణ్ణి. క్షితిజంమీదికి చూపుసారించి, ఆకాశపు నీలం, సముద్రపు నీలం కలుసుకునే చోట ప్రేమికులు కూడా కలుసుకుంటారనుకునేవాణ్ణి. కళ్ళతో చూసిందే హృదయంలో వొంపుకునేవాణ్ణి. ఎప్పటికో, ఏ శిశిరాగ్ని క్షణాలకోగాని హృదయంతో దర్శించే అదృష్టం పట్టలేదు. ఆమె నన్ను ఇష్టపడిందాకా, నన్ను తనవాడిగా అనుకున్నదాకా, నాతో కలిసి గవ్వలు ఏరిందాకా సముద్రంలో ఉన్న అనంత జీవన సౌందర్యమేదీ స్పర్శకి రాలేదు.

వైజాగ్లో నాకు దొరికిన మనిషి భలే చిత్రమైన మనిషి. అంతగా ఎవరికీ పరిచయంలేని మనిషి. బెస్తవాళ్ళమో, చిన్నపిల్లలమో అయితే తప్ప ఆమె చూపుకు చూపు కలపలేం. ఆమెతో మాట కలపలేం. తీరమంతా ఆమె చీర అంచులాగా, ఆమె ఒక నీలి సముద్రంగా తోచేది. ఆరాధన హృదయంలో పెల్లుబికేది. మెరిసే కళ్ళతోనూ, జీవశక్తి తొణికిసలాడే దేహంతోనూ ఆమె సంచలిస్తుంటే సముద్రంమీంచి చూపు తప్పిపోయేది.

సముద్రంలో ఎంత దుఃఖానందం ఉందో ఆమెలోనూ అంత ఉండి ఉండొచ్చు. నాకు తెలీదు. ఆమె తెలీనివ్వదు. ఎవరన్నా పొరపాటుగా కదిలిస్తే చిటపట చిటపటగా మాట్లాడుతుండేది. ఏకాంతంలో గవ్వలేరుతుండేది. ఎదురుగా వొచ్చి నిల్చున్నా, అసలేమీ పరిచయం లేనట్టు నడుస్తూపోయేది. నన్ను కావాలనే ఏడిపించేది. 

ఊరికే గాలివాటుకి కొట్టుకొచ్చే కెరటాలంటే తనకిష్టం. అలాంటి మనుషులన్నా ఆసక్తి. హృదయం చిప్పిల్లిన అక్షరాలని ఆమె గవ్వలేరినంత శ్రద్దగానూ ఏరుకునేది. అపురూపంగా దాచుకునేది. దగ్గరివాళ్లకి పంచి ఇచ్చేది. అప్రయత్నంగా వొచ్చే ఆనందం ఆమెకి ‘ఎరుక’. లేదంటే తన అభిమానం సంపాదించడానికి నాకో యుగమన్నా పట్టేది. 

మాకు పేర్లున్న సంగతన్నా మాకు గుర్తుండేది కాదు. నేను అమ్మాయ్ అని పిలిస్తే తను అబ్బాయ్ అని పిలిచేది. “అమ్మాయీ, నువ్విలా చేయవొచ్చు కదా” అంటే “అబ్బాయీ, మనమిట్లా బాగానే ఉన్నాం కదా” అని సమాధానం వొచ్చేది. మాటలేవి లేకుండానే కళ్ళు నవ్వేవి. నడక ఆగేది. గొడవ అయినా ఎక్కువేసేపేమ్ ఉండేది కాదు.

చెప్పలేని దగ్గరితనం ఏదో తోచినప్పుడు నాతో “నువ్వొట్టి గాలివని” అనేది. నాకు అర్ధమయేది కాదు. అంటే ఏంటని అడిగేవాణ్ణి. ప్రశ్నమీద ప్రశ్నతో, పాటమీద పాటతో విసిగించేవాణ్ణి.  “గాలి ఒక పక్క, నీళ్లు ఒక పక్క” నన్ను పోరుతుంటే ఎలాగని తప్పించుకుపోయేది. 

ఊ. అంతా బాగుంటే అది కథ ఎందుకవుతుంది. ఒక చేయి మన చేతిలో ఉన్నాదని సంబరపడతామా! ఇంకో చేయి విధి చేతుల్లో ఉంటుంది. అది నిర్దయగా మనల్ని ఈడ్చుకుపోతుంది. ఆమె కొంచెం పెనుగులాడిందిగానీ, నేనే గాలి మనిషిని. అట్టే ఆగలేదు. ఆ ప్రేమ ఎంతో కాలం నిలవలేదు.

ముందుకు తోసుకొచ్చిన అలల్లాగే ఆమె వెనక్కిపోయింది. హోరుమనే అలల శబ్దం తగ్గిపోయింది. నాలుగేళ్లు అస్థిరమైన జీవితం. కాలం ఒక ఆట ఆడింది. ఆమెతో నేనెప్పుడూ మాట్లాడలేదు. కనీసం ఒక ఉత్తరమన్నా రాయలేదు. గవ్వలు దాచుకున్న పెట్టె ఒకటే అప్పుడప్పుడూ ఆమెని గుర్తుచేసేది.

*

కాలం చలి తిరిగింది:

..మళ్లీ నాలుగేళ్ళగ్గానీ తూర్పు సముద్రం పిలవలేదు. వైజాగ్‌లో ఓ కాన్ఫరెన్సుకోసం వొస్తిని కదా! చలిలో ఆ పాత మనిషెవరో గుర్తుకువొచ్చినారు. ఎన్నెన్ని గవ్వలు ఏరేవాళ్లమో! అభిమానం ఉంటే ఆగుతాదా, ఆమె కూడా ఆ రాత్రి చూసేందుకొచ్చింది. చాలా ప్రయాణం చేసి వొచ్చి, నేనెవరో తెలీనట్టు నిల్చుంది. బస్టాప్‌లోనో/ రోడ్డుదాటుతూనో అందమైన అమ్మాయి అగుపిస్తే చూస్తాడా లేదా వీడని చిన్న పరీక్షపెట్టింది. ఉత్తినే నేను ఓడిపోయాను. తదేకంగా చూసి తనే అని గుర్తుపట్టాను. నోవాటెల్ ముందు నల్లటి రోడ్డు. నడిచినంతదూరం నడిపించుకుపోయింది. ఆగాల్సిన చోట ఆగం. సముద్రపు ఒడ్డుకు మేం అప్పుడే మొదటిసారి కలుసుకున్నట్టు మాట్లాడుకున్నాం. ఆమె మారలేదు. వెనక్కి పోయిన అలలు కొద్దిగా ముందుకు తోసుకొస్తున్నాయ్. ఆ కొద్దిసేపు మాట్లాడుకుంటుంటేనే మేం భీమిలికి పోవడం నిశ్చయమైంది. రాత్రి ఆమెని బస్సెక్కించినా తోడుగా పోనందుకు నన్ను నేను తిట్టుకున్నాను.

మర్నాడు అప్పూ ఘర్ దగ్గర గంగరావి చెట్టు మేం కలుసుకోవాల్సిన చోటు. “అక్కడికి అటో ఇటో రాస ఉసిరి చెట్టున్న చోట నిల్చుని ఉంటాను, పదింటికల్లా వొచ్చి కలుసుకోమనింది” పిల్ల…ఎప్పుడూ ఇలాంటి గుర్తులే; మాదో రహస్య మార్మిక ప్రపంచమైనట్టు, ఈ సంక్షిప్త భాష మానవమాత్రులకి అర్ధం కావొద్దన్నట్టు ఏంటా చెప్పడమని వాదిస్తే, మనసున్న వాడికి మనిషి దొరక్కపోదా అని మారువాదించేది. మాటల్లో నేనెన్నడు గెలిచిన చరిత్ర లేదు. మెత్తగా మాట్లాడ్డం ఎంత చేతనవునో కఠినంగా మాట్లాడ్డం అంతే వొచ్చిన మనిషి. శుచి శుభ్రత ఎక్కువనీ, లోకమ్మీద ఆమెకి నాకంటే భిన్నమైన అభిప్రాయాలు, పట్టింపులు ఉన్నాయని ఇంతకుముందు  ఇంత స్పష్టంగా తెలీదు. ఆమె మళ్లీ కొత్తగా నాకు పరిచయమవుతోంది. ఆ కనువిప్పు కొంత ఇష్టంగానూ, కొంత ఇబ్బందిగానూ ఉండింది.

ఆకలిగా ఉన్నానంటే ‘టీ’ ఇప్పించింది. బస్సుకోసం కాసేపు చూసాం.  “ఆటో కట్టుకునిపోయే కర్మ మనకెందుకు? ఈ బెస్తవాళ్లందరూ నా అత్తలే కదూ” అని ఓ షేరింగ్ ఆటో ఎక్కించింది. వెనకాల ఎండుచేపల తట్టలూ, ఎవరో గిరిజన స్త్రీలు ఉన్నారు. ఆటో అంతా నిండిపోయి, మేం ఇరుక్కుపోయి కూర్చున్నాము. వెనకాల ఉన్న అవ్వకి అరవైపైనే ఉండొచ్చు. ఆమె ఆటో డ్రైవరుని విసుక్కుంటోంది. ఆపిన చోటల్లా  తిట్టకుండా తిడుతోంది. నవ్వొస్తోంది. నాకు అర్థమై అర్ధం కాకుండా ఉన్నాయా పదాలు. “మా భాష మహా సొంపుగా ఉన్నాదా అబ్బాయీ” అంటే “నీకంటేనా అమ్మాయీ” అనేవాణ్ణి. 

చేయి కొంచెం వణుకుతోంది. ఆమె మీద చెయ్యేసి కూర్చునేంత ధైర్యం నాకెప్పుడు వొచ్చిందీ తెలీదు. ఆ ఇరుకులో అంతకన్నా గత్యంతరం లేదు. ఆమె నన్ను ఏమనకపోవడం ఆశ్చర్యంగా ఉంది.  తొట్లకొండ దాటిపోతుంటే మా మౌనం పక్కకి తప్పుకుంది. “అబ్బాయ్. నువ్వు బౌద్ధుడినంటివి కదా. ఏమేం చూసొచ్చావో” చెప్పని అడిగింది. నాకింకా ఎండుచేపలవాసన దిగలేదు. లుంబిని,సారనాథ్, బుద్ద గయ, ఖుషీ నగర అన్నీ చూసి ఉన్నాను. ఏమి చెప్పేది శ్రమణీ అన్నాను?  “ఓహ్. ఇంతా చూసి నీకు తత్వం బోధపడనట్టుందే, ఒహటే ఏడుస్తావు” అంది. నా మానానికి నేన్నవుకున్నాను. కోరిక ఎంత దుఃఖమో అనుభవంలోకి వస్తోంది. ఎవరో ఇద్దరు దిగిపోతే కొంచెం గాలి ఆడుతోంది.

దారిలో ఒకరింటికి వెళ్లాం. అమ్మాయికి దాహం. నిజంగా నీళ్లకోసమేనా వొచ్చాము అంటే నవ్వి కాదంది. నువ్వెప్పుడన్నా వొస్తే ఉండేందుకు ఓ చోటు ఇదేనంది. ఈ మనిషీ నీలాగే రైళ్లో ఓ అనుకోని పరిచయమని చెప్పింది. వేరే భాషలో అతనితో ఏదో మాట్లాడింది. నాకంత చిత్రంగానూ, ఆసక్తిగానూ ఉండిందిగానీ, ప్రశ్నించే అవసరం ఏది ఉందనిపించలేదు. నామీద అంత ఇష్టం ఉన్నందుకు మంచిగా అనిపించింది.  అతనూ చాలా బుద్దిమంతుడల్లే ఉన్నాడు. భోజనం చేసి వెళ్లండని ఒప్పించబోయాడు. సమయం లేదని ఎలాగో బయటపడ్డాం. ఇంకో ఆటోకోసం, ఎండలో చాలాసేపు  నిల్చున్నాం.

*

ఇన్నేళ్ళు ఎక్కడెక్కడ పని చేసింది నిన్నంతా చెప్పాగానీ, అమ్మాయేమీ చెప్పలేదు. నేను గట్టిగా అడగనూ లేదు. సముద్రం ఉన్నదిక్కే ఆమెకూడా కూర్చున్నందుకు ధైర్యంగా ఆమెనే చూస్తున్నాను. విశాలమైన నుదురు, చీమలు తిన్న మొహం, కళ్ళలో మెరుపు తగ్గనే లేదు. పరధ్యానంగా ఉంది. ఎర్రమట్టి దిబ్బల దగ్గరకి ఆటో రాగానే చప్పున ఆపించింది. దిగమంది. అక్కడ రెండో మూడో గుడిసెలు. మేం ఒక మంచె ఎక్కాలి. అది నిలువెత్తు గడకర్రలమీద ఇల్లు ఉన్నట్టే ఉందిగానీ దానికి మెట్లు లేవు. ఒకే కర్ర వాలుగా వేసి ఉంది.

“నువ్వుగానీ నన్ను ఎక్కించావంటే మళ్ళీ దింపలేవు నీ ఇష్టం” అనింది అమ్మాయి. “ఏదైతే అదవుద్దిగానీ ఇంతదాక వొచ్చి నీ చేయి ఎట్లా వొదిలేది” అన్నా. అమ్మాయి ఎక్కింది. నవ్వింది. నాకోసమే చేసానని కొంత జున్ను తెచ్చింది. సరుగుడు చెట్ల గురించీ, జీడిమామిడి కాపు గురించీ కథలు చెప్పింది.  ఇట్లా నీలాపు చీరగట్టి సముద్రం పిలిస్తా ఉంటే కథలు ఎవరికి ఎక్కుతాయి?.. “అసలైతే ఎర్రమట్టి దిబ్బలు లోపలికి వెళ్ళి చూడాలిగానీ పోకిరీ వెధవలు అల్లరి పెట్టేస్తారు. కండాలేదు, గుండే లేదు. నీతో నాకెందుకు?” అనింది. దిగిపోదామని మహా తొందరల్లే ఉందని కొంచెం ధైర్యంచేసి చేయి పట్టుకున్నాను. చెమటపట్టి తను వొదిలించుకునేదాకా మాటల్లేకుండా కెరటాలు విరిగిపడేది చూస్తున్నాను. ఆమె నన్నూ, సముద్రాన్ని మార్చి మార్చి చూసింది. హోరుమనే అలల శబ్దం, గుండె చప్పుడు పైకిలేస్తూ వెనక్కి తగ్గుతున్నాయి. జీడి మామిడి పొద వెనుక ప్రేమ జంట ఒక పక్కా, సరుగుడు చెట్ల మీద పిట్టలు  ఒక పక్కా ఉన్నాయి. సముద్రం, మేమూ ఎదురెదురు ఉన్నాము.  

ఆ తాటిదూలం మంచె మీద ఉన్నప్పుడే ఎవడో పిచ్చోడు. పైకెక్కి మరీ డబ్బులడుగుతున్నాడు. పూటుగా తాగి ఉన్నాడు. అంతటి ఏకాంతంలో వాడొకడు తగిలాడు నా ప్రాణానికి; చేయి తడిపినా వొదల్డే…దిగుతూ ఎక్కుతూ తందానాలాడుతూ… “అయ్యగారిని మెప్పించావంటే నువ్ అడిగినంతా ఇస్తాడని” ఎగేస్తోంది అమ్మాయి. నేను వాడి భాష పట్టలేనని, వాని సతాయింపునోపలేక అవస్థపడుతుంటే ఇంకా ఇంకా నవ్వాలని తన తాపత్రయం. నాకు గందరగోళంగా ఉంది. తప్పతాగి వాడు పాడుతున్నట్టే నా మనసూ పాడుతోంది. ఎలాగో వాణ్ణీ, తననీ దింపి ఇందాకటి మాటల బరువునూ కొంత దింపుకున్నాను. సముద్రానికీ, దిబ్బకి మధ్య రోడ్డుపై బ్రిడ్జ్ ఉన్న దగ్గరే మేం భీమిలీకి ఆటో ఎక్కాము.

*

భీమిలి రాగానే క్రితం జన్మలో గవ్వలేరుకున్న జ్ఞాపకమేదో ఇద్దరం తడిమి చూసుకున్నాం. భీమిలి సముద్రంలో ఎన్ని గవ్వలూ, ఎన్ని శంఖాలు, ఎన్ని చందమామలు? వైజాగ్‌లో సముద్రం వయసెంతో తెలీదుగాని భీమిలి సముద్రం పడుచుది. పదహారేళ్ళది. రాళ్లమీదగాని దూకిందా, ఎగిరి దుమికిందా అంటే కన్నుపడ్డవాళ్ల చెంపలు పగిలేవి. మొహాలు తడిసేవి. కాళ్ళు జారేవి. అప్పట్లో అదో మోహకావ్యమే. ఇప్పుడూ?!

బీచ్ పక్కనే ఉన్న అతిధి హోటల్ కిటికీలోంచి రాత్రంతా సముద్రం చూస్తునే కూర్చునేవాన్ని. రాత్రి పూట దాని పిలుపుకి పరుగెత్తుకు వెళ్లాలనిపించేది. ఈశ్వరుడు గంగలో కలిసి ఇక్కడికే వొస్తాడనిపించేది. విరహంతో రాత్రంతా ఎదురుచూస్తే, పొద్దుటికి సూరిడొచ్చి దాన్ని ముద్దాడేవాడు. అదీ సిగ్గులేకుండా తుళ్ళితుళ్ళిపడేది. అప్పటి  భీమిలి సముద్రం నా స్వయంవ్యక్త యవ్వన సౌందర్యం.  ఇప్పుడూ?!

అసలైతే ఈ మనిషిని కలవొద్దని ఒట్టుపెట్టుకున్నాగానీ, ఒంటరితనంకొద్దీ ఓ సారి కలుద్దామనిపించింది. ఆమె పాత విషయాలన్నీ మర్చిపోయి దయగానే మాట్లాడింది. వాగ్దత్తం చేసుకున్నప్పుడు ఎట్లా అనుకున్నామో అలాగే ఆ కొస నుండి ఈ కొసకి ఒకసారి  నడిచాం. గవ్వలేం ఏరలేదు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న హృదయం ఎందుకో దిగులుగా అయిపోయింది. వెనుక జలాల్లా సముద్రపు నీళ్ళు ఆగిన చోట పసుప్పచ్చరంగువి రెండు పడవలున్నాయ్. ఎక్కి కూర్చుదామంటే తాను వినలేదు. కాళ్లు తడుపుకుందామన్నా వినలేదు. సమయం మించిపోతుందని వెనక్కి మళ్లాం. ఇప్పుడా భీమిలి సముద్రం ప్రౌఢలా కనిపిస్తోంది. విశాలమైన తీరమ్మీదకి తోసుకువొచ్చే అలలు, ఆమె లోకమ్మీద విసిగి చాచిన రెండు చేతులమల్లే ఉన్నాయి. అలలు విరిగే సౌందర్యమేదో విసుగ్గా ఆమె  కనుబొమ్మలు చిట్లడంలోను కనిపిస్తో ఉంది.

తిరుగుదారిలో ఆటో వేగంగా కదిలింది. తొట్లకొండ దగ్గరే ఓ కాఫీ తాగాం. రిషికొండలో కాసేపు ఆగాం. ఎక్కడో కోల్డ్ స్టోరేజ్ దాటుతుంటే ఎండిన చేపల మీద కొంగలు వందలుగా గుమిగూడిన దృశ్యం ఒకటి మనసులో ఉండిపోయింది. కాసేపటికి ఏవో పిచ్చి ఆలోచనల్లా అవి ఎగిరిపోయాయి. అయినా సముద్రం సముద్రమే. మనం దగ్గరికి పోవడమేగాని, తీరంమీద నడిచి సంబరపడటమేగాని, సముద్రం మనకాళ్ళ దగ్గర ఉంటుందా ఏమి? మన పిచ్చిగానీ!

*

ఎర్రమట్టీ దిబ్బ జున్నుగడ్డా దారి

సరుగు చెట్లా సందె నీడలివ్వి

తాటి దూలమ్మంచె తాబేటి వంతెన

దాటజూసే కడలి అడుగులివ్వి

నీ కనుల నీలిమల విరిగేటి కెరటాలు

పట్టుకొచ్చిన పాల నురగలివ్వి

నీ చేతి రేఖల్ల

ఊటపుట్టి

ప్రియసఖీ!

అంటిన చెమటలివ్వి

****

Please follow and like us:

3 thoughts on “ట్రావెల్ డైరీస్ -2 (సముద్రం పిలిచింది)”

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.