యాత్రాగీతం(మెక్సికో)-12

కాన్ కూన్ ( చివరి భాగం)

-డా||కె.గీత

మర్నాడే  మా తిరుగు ప్రయాణం.  ఆ రోజుతో కాన్ కూన్ లో చూడవలసిన ప్రదేశాలు చూడడం, చెయ్యవలసిన  ఎడ్వెంచర్  టూర్లు  చెయ్యడం, అన్నీ అనుకున్నట్టుగా అయ్యేయి. 

అంత వరకు బయట అన్నీ చూసేం గానీ మా రిసార్టు లో విశేషాలు ఏవీ చూడలేదు. 

కాబట్టి ఆరోజు అందుకోసం కేటాయించేం. అంతే కాదు సముద్ర తీరంలోనే ఉన్నా ఇసుకలో అడుగులు మోపి నాలుగడుగులు కూడా వెయ్యలేదు. 

ఇంకేం పొద్దున్నే సత్య, నేను తెలతెలవారకుండానే  సముద్ర తీర వ్యాహ్యాళికి బయలుదేరేం.

రిసార్టు  నుంచి ఎడమకు, తిరిగొచ్చి మళ్లీ కుడికి నడక సాగించేం. 

ఉదయం గోరు వెచ్చగా అత్యంత ఆహ్లాదంగా ఉంది. ఇంటి దగ్గిర ప్రతిరోజూ ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్తుంటాం. 

అయినా ఆ ఉదయం గొప్ప ప్రత్యేకతను సంచరించుకుంది. తూర్పున కిరణాలు విచ్చుకోకముందు మబ్బు పట్టిన ఆకాశంలా మసకమసక వెలుతురు నాకెంతో ఇష్టం. పైగా స్వచ్ఛమైన ఉదయరాగాలు ఆలకించడానికన్నట్లు ఆకాశానికి ఎగిసి పడ్తున్న సముద్రకెరటాలు, తీరాన పాదాల వెంటబడుతున్న పాలనురుగు. తెల్లని ఇసుకలో ఇద్దరి పాదాల్ని పక్కపక్కన ముద్రలేసుకుని మురిసిపోతూ, దార్లో ఆగి ఎవరో కట్టిన ఇసుక గూడుకి  మా వంతుగా చిన్న ఇసుక గోపురాన్ని అతికిస్తూ , ఎప్పటెప్పడివో కబుర్లన్నీ కలబోసుకుంటూ వెలుగురేఖలు విచ్చుకుని భానుకిరణాలు తళతళా మెరిసే వరకూ నడుస్తూనే ఉన్నాం. 

రిసార్టు  నుంచి ఎడమకు ఉన్న మరో రిసార్టు దగ్గిర బీచి మొత్తం ఊర్లో ఉన్న ట్రాక్టర్ వంటి ట్రాక్టర్ తో చదును చేయసాగేరు. అమెరికాలో ఇటువంటిదెప్పుడూ చూడక అతనితో మాట్లాడి రెండు మూడు ఫోటోలు తీసుకున్నాను. ఇలా రిసార్టు బీచి ఒడ్డున ప్రతీ రోజూ చదును చేస్తూ, పెళ్లిళ్లు మొదలైన పార్టీలకు,  ముందుగా బుక్ చేసుకున్న బీచి పార్టీలకు ఏర్పాట్లు చేస్తారని చెప్పేడతను. 

తిరిగి రూముకి వచ్చి పిల్లలని లేపి తయారుచేసి బ్రేక్ ఫాస్టు కాగానే ముందురోజే బుక్ చేసుకున్న ఫోటో షూట్ కోసం రిసార్టులోనే ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్ళేం. 

ఇక్కడ రిసార్టు పాయింట్ల గురించి కొంచెం చెప్పాలి. రిసార్టులో బస చేసినందుకు గాను కొన్ని ఉచిత పాయింట్లు ఇస్తారు. వాటిని రిసార్టు లో ఉన్న గిఫ్ట్ స్టోర్స్, ఫోటో స్టూడియో, మసాజ్ సెంటర్ల వంటి చోట్ల రేట్లలో తగ్గింపు కోసం వాడుకోవచ్చు. అయితే ప్రతీచోటా కొన్ని నియమిత పాయింట్లు మాత్రమే  వాడుకోవడానికి  ఉంటాయి. ఎక్కడ ఎన్ని పాయింట్లు  ఉంటాయో వివరంగా  ముద్రించిన కార్డు ఒకటి ఇస్తారు. 

అప్పటికే నేను దాదాపు కొన్ని  చోట్ల పాయింట్లు డిస్కౌంట్ ఉపయోగించేను. 

ఇక ఆ రోజు ఆ లిస్టులో ఉన్నవి గిఫ్ట్ స్టోర్స్, ఫోటో స్టూడియో. 

అమెరికాలో బయటికెళ్లి ఫామిలీ ఫోటోలు ప్రత్యేకంగా తీయుంచుకోవడం ఒక లగ్జరీ.

మాకున్న పాయింట్లతో ఉచితంగా  ఫోటోలు తీస్తారు కానీ ప్రతీ ఒక్క ఫోటోని కొనుక్కోవాలి. 

సరే అప్పటికే ప్రత్యేకమైన దుస్తులేసుకుని సరదాగా తయారయ్యిన మాకు మిగతా వివరాలకంటే ఫోటోలు తీయుంచుకునే ఉత్సాహం ఎక్కువైపోయింది.

దాదాపు గంటన్నర పాటు రిసార్టులో అందమైన స్పాట్లలో, సముద్రతీరంలో మాకునచ్చినట్లు ఆడుకుంటూ ఉండమని రకరకాల ఫోటోలు తీసేడతను. అవెంత బావున్నాయంటే ఒక్క ఫోటోకూడావదలాలని అనిపించలేదు. మొత్తం నూటపది ఫోటోలు, డిజిటల్ కాపీలుగా మాత్రమే తీసుకున్నా వెయ్యి డాలర్లు బిల్లు కట్టాల్సి వచ్చింది. అయితేనేం డబ్బులతో వెలకట్టలేనివి జీవితంలో అందమైన జ్ఞాపకాలు. 

ఇక గిఫ్ట్ స్టోర్ లో కొన్ని ఉచిత పాయింట్లకి ఒక వెండి బ్రేస్లెట్ తీసుకుని, మిగిలిన డిస్కౌంట్ పాయింట్లతో బాటూ మరొక రెండువందల డాలర్లు పెట్టి మెక్సికో జెమ్ స్టోన్ ఫాషన్ జ్యుయలరీ సెట్టు కొనుక్కున్నాను. నిజానికి ఈ పాయింట్లన్నీ మనుషుల్ని ఆయా చోట్లకి రప్పించడానికేనని తెలిసినా కొత్త చోట్లకి వెళ్ళినపుడు అన్ని విశేషాలూ  చూసి రావాలని, వివరాలు తెలుసుకోవాలని ఉత్సుకతతో వెళ్లొచ్చేను. పిల్లలకు కూడా వాళ్లకి నచ్చిన టోపీలు, టీ షర్టుల వంటివి కొనిపెట్టేసరికి వాళ్ల ఆనందానికి  అంతు లేకుండా పోయింది. గదిలో పరుగులెడుతూ గంతులేయడం మొదలుపెట్టేరు.  చిన్న పిల్లల్లా ప్రపంచంలో అందరూ అల్పసంతోషులుగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా అనిపించింది. 

మధ్యాహ్నమంతా పదిహేనంతస్తుల ఆ రిసార్టులో అన్ని ఫ్లోర్లు తిరిగి, విశేషాలన్నీ చూసి వచ్చి, సాయంత్రం ఆవరణలోనే ఉన్న ఇన్ఫినిట్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి ఈతలు కొడుతూ సరదాగా గడిపేం. 

చీకటి పడ్డాక బాల్కనీలో కొచ్చి కూచున్నాం. ఎదురుగా సాగరతీరాన దేదీప్యమానంగా వెలుగుతున్న కార్తీక పౌర్ణమి చంద్రుడు కెరటాల మీద నుంచి వెన్నెల రాశులు పోసుకుంటూ ఆకాశంలోకి ఎగిసినట్లు అత్యద్భుతమైన దృశ్యం. పగటి అలసటని పోగొట్టడానికన్నట్లు సుతారంగా మేను తాకే నునువెచ్చని సముద్రపు గాలి. పగలల్లా  అలిసిపోయిన  పిల్లలు  ఒళ్లోనే నిద్రపోయేరు. ఆకాశాన్ని, సాగరాన్ని  తనివితీరా కళ్ల నింపుకుంటూ మేమిద్దరం ఎంతో సేపు కబుర్లు  చెప్పుకుంటూనే ఉన్నాం. 

ఇటీవల వెళ్లిన అన్ని టూర్లలో అత్యంత హాయి గొల్పిన అందమైన ప్రయాణం ఇది. అక్కడినుండి మర్నాడే బయలుదేరి వచ్చేసినా మనసుని తన దగ్గరే కట్టివేసి,  భద్రపరుచుకుని మా కోసం ఎప్పటికీ ఎదురుచూస్తున్నట్లు అనిపించిన అందమైన విడిది కాన్ కూన్.  

*****

 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.