అరచేత మాణిక్యము 

శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి-

-చంద్రలత

 నాజూకైన ‘గాజు పళ్ళెం’లో, ‘మట్టినీ బంగారాన్ని’ ఒకేసారి వడ్డించేసి, లయతప్పిన ‘జీవరాగాన్ని’ శృతి చేస్తూ , ఏమీ ఎరుగని ‘పాప’లా, వరలక్ష్మి గారు నిమ్మళంగా నిలబడి, ఫక్కున నవ్వేయగలరు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లేలా!  

గోదావరి మన్యం అంచుల్లో, పాడిపంటల నడుమ  విరిసిన పల్లె మందారం వరలక్ష్మి గారు.

చిన్నతనాన వెన్నమీగళ్ళ గోరు ముద్దలను అమ్మ బంగారమ్మగారు తినిపిస్తే, నాన్న వెంకట రమణగారు పుస్తకలోకాన్ని రుచి చూపించారు. ఆ పల్లెబడి అక్షరాలను దిద్దిస్తే, ఆ ఊరి గ్రంథాలయం సాహితీమూర్తిమత్వాన్ని తీర్చిదిద్దింది.

          స్వాతంత్ర్యం వచ్చిన కొత్త ల్లో, బాలికావిద్యను,మహిళాస్వాలంబనను ప్రోత్సహిస్తోన్న రోజులయినప్పటికీ, ఆనాటి కుటుంబ నేపథ్యంలో,పద్నాలుగేళ్ళ పసిప్రాయాన పదోతరగతి గడపలో నిలబడి, ఇల్లాలయ్యింది. ముగ్గురు బిడ్డల తల్లిగా, స్వాలంబన కొరకై ప్రయత్నించాల్సి వచ్చిన  కుటుంబపరిస్థితుల్లో తనకు తోడయిన అక్షరాలనే, పదుగురికి పంచిపెట్టి, తనతో పాటు మరికొందరికి సుధీర్ఘకాలం  ఉపాధి కల్పించగలగడం,సామాన్యమైన విషయం కాదు.తను ఆనందించిన అక్షర స్వేచ్ఛను,తను పుట్టి పెరిగిన పల్లెలోని వారెందరికో రుచి చూపించారు. 

         ఆనాటి పరిస్థితుల్లో పసితనం వీడకుండానే ,ఇల్లాలిబాధ్యతలు చేపట్టవలసి వచ్చినా, పట్టుబట్టి చదువులు కొనసాగించడం , సామాన్యమైన విషయం కాదు.

        అయిదారేళ్ళ వయస్సులో చిన్నారి వరలక్ష్మి, ఓ చిన్ని పుస్తకాన్ని తన చేతిలో అపురూపంగా పట్టుకొన్న తీరుచూస్తే, ఎంత ముచ్చట వేస్తుందో! చదువు నిగూఢ విత్తం! ఇది సత్యం!ఆ చిన్నారిముఖాన పరుచుకొని ఉన్న సన్నటి చిరునవ్వు ,కళ్ళల్లోని వెలుగుల నక్షత్రాలు, వరలక్ష్మి గారిలో ఈనాడూ దోబూచులాడుతూ ఉండడమే విశేషం!

         ఒక ఇల్లాలిగా, అమ్మగా, ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యుయులుగా , వారి వ్యక్తిత్వపు అస్తిత్వాన్ని మూర్తివంతం చేసుకొంటూ, వారి బహుముఖ జీవితం ప్రజ్ఞావంతంగా ,ప్రకాశవంతంగాను సాగింది. ఎన్నెన్ని ఆటుపోటులను ఎదుర్కొన్నా,ఆగక సాగుతూ.  అందుకే, అటు వ్యక్తిగాను ఇటు రచయిత గాను, సదా వందనీయులుగా నిలుస్తారు వరలక్ష్మిగారు.       

      ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా విస్తరించుకొంటూ, జీవించడమే కాదు, ఆ భావనలను స్పురిస్తూ రచించారు కూడా. వీరి రచనల్లో, కడు సామాన్య జీవితాల చుట్టు, కరుడు కట్టుకు పోయిన పొరపాటు అభిప్రాయాలెన్నో భళ్ళున బద్దలవుతాయి, మనకి తెలియకుండానే. కనాకష్టపు కనీసపు బతుకుల్లోని ఆశలు చిగురించడాన్ని,అణిచివేతలని ఎదుర్కోవడంలోని సానుకూల సృజనాత్మకతనీ , మనం విస్తుపోతూ చూడాల్సిందే!    

                గోదావరీనదీ తీరం అంటే ,దూరాన ఉన్నవారందరికీ ఒక అందమైన కల. ఆ కలను సుందర స్వప్నాలతో, నిరంతరం దృశ్య కావ్యాల్లా,  సాహిత్యం తీర్చిదిద్దుతూ వస్తోంటే, సప్తవర్ణ సమ్మోహక చిత్రికల్లా  పట్టంకడుతూ వస్తోంది, మన చలనచిత్రసీమ. ఇక, అక్కడి వారికి గోదావరిపై  ఉన్న అపరిమిత అభిమానం ,అక్కడి జీవితాన్ని అత్యద్భుత మెరుపుకలల్లా నిత్యం ఆవిష్కరిస్తూనే ఉంటుంది.  వరలక్ష్మి గారి కథలు చేసిందల్లా, ఆ పంచవన్నెల పగటికలల్లోంచి మనలను తట్టి లేపడమే!   ఆకలి ఎక్కడైనా, ఆకలే.చీకటి ఎక్కడున్నా, చీకటే! అదీ, వరలక్ష్మి గారి కలం ఒడిసిపట్టిన, దేశకాలసీమిత జీవిత సత్యం!      

          పల్లెలన్నా,  పిల్లలన్నా మా ఇద్దరికున్న ఆప్యాయతా,సజీవసంబంధం వలన కావచ్చు. పై నుంచి,మట్టితోనూ, జీవాలతోనూ సజీవసంబంధం ఉన్న పల్లెటూరివాళ్ళం కావడం వలన కాబోలు, వరలక్ష్మి గారితో నాకు ఇట్టే స్నేహం కుదిరింది. ఎంతైనా,’వేడి పాలమీది వెన్నలేమాయే’ అన్న సాధిపులసారం ఏమిటో, పచ్చిపాలలో దాగిన పెరుగు తియ్యదనమేమిటో, మీగడల మర్మమేమిటో, ఏ కొంతైనా ఎరిగినవాళ్ళం కదా! 

       1998 లో ‘అస్మిత’ వారు, మద్రాసులో ఒక అధ్యయన సమావేశం నిర్వహించారు.”గార్డెడ్ టంగ్” పేరిట మహిళారచయిత ల పై, వారి రచనలపై  , అనేక రూపాలలో ప్రభావితం చేస్తోన్న సెన్సార్ షిప్ గురించిన సమావేశం అది. ఓల్గా గారు,వసంతాకన్నాభిరాం గారి  నేతృత్వం లో సాగుతోన్న ఆ సమావేశాల్లో,ఆనాటి సుప్రసిధ్ధ మహిళా సాహితీవేత్త లంతా ఆహ్వానితులు.వాడిగా వేడిగా జరుగుతున్నాయి సంభాషణలు.ఎన్నెన్నో మూలభావనలు కదిలిపోతున్నాయి. ఎన్నెన్నో కొత్త కొత్త భావనలు చుట్టూ ఆవరిస్తూ ఉన్నాయి. 

       దానికి తోడు, మాలతీచందూర్ గారి వంటి సాహితీమూర్తులు, భానుమతి రామకృష్ణ గారి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలురు, జలంధర గారు, కల్యాణ సుందరి  గారి లాంటి నా అభిమాన రచయితలు,సరోజినీ ప్రేంచంద్ గారు,పొత్తూరి విజయలక్ష్మి గారి వంటి విజ్ఞులను ఎందరినో కలిసే అవకాశం కలిగింది. కొండవీటి సత్యవతి గారి వంటి ఉద్యమ కారిణులను,వసంతలక్ష్మి గారి వంటి పాత్రికేయులను ,మొదటిసారి  కలిసింది అప్పుడే. 

     అంతమంది లబ్దప్రతిష్టుల నడుమ, నేనేమో అప్పుడప్పుడే కళ్ళుతెరిచిన కొత్త కలాన్ని. ‘అన్నప్రాశన నాడే, అటు ఆవకాయ ఇటు పరమాన్నం దక్కాయి!’ అన్న ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్షణంలో, పరిచయం అయ్యారు వరలక్ష్మి గారు. ఆనాడు కుదిరిన స్నేహం ఈనాటికీ పచ్చబడి ఉందంటే, నా వయసుతోను , అనుభవరాహిత్యం తోనూ,తెలియనితనంతోనూ సంబంధం లేని , వరలక్ష్మి గారి అగణిత స్నేహం వలననే.అందుకు వారికి అనేక ధన్యవాదాలు.          

    ఆనాటి ఆహ్వానితుల్లో, సంచలనాత్మక కవయిత్రి,కె.గీత గారు, వరలక్ష్మి గారమ్మాయి అని ఆ తరువాత తెలిసింది. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ,ఎవరి స్వతంత్ర భావనలను వారు కలిగి వుండడం,ఎవరి అస్తిత్వాన్ని వారు నిలబెట్టుకో గలగడం, ఎవరికి నచ్చిన తీరులో వారు స్వంతంగా వ్యవహరించడం,నాకు అర్థమవుతూన్న కొద్దీ, వారిద్దరిపట్లా , ఎంతో గౌరవం కలిగింది.అభిమానంతో పాటుగా.  

             పల్లెబడిలో ఉపాధ్యాయులుగా వరలక్ష్మి గారి పట్ల నాకెంతో గౌరవం. గుప్పెడన్ని అక్షరాలని ఆ పల్లె బిడ్డల  చేతిలో పెట్టి, ప్రపంచానంతా వారి చిట్టి ఊహల్లో నింపడమే కాదు, భూనభోంతరాళలనూ తెచ్చి ఆ పల్లె గడపలోకి నిలిపినట్టే!   స్వేచ్ఛాలోచన, స్వాలంబన, స్వాభిమానం ముప్పేటలా మూర్తీభవించిన , ఒక నిలువెత్తు ఉదాహరణలా ,తరతరాల పిల్లల మధ్యన  నిలబడడం కన్నా విలువైనది ఏమున్నది? వారిలో అంతర్భాగమై, వారి మధ్యనే జీవించడం కన్నా, ఎవరమైనా ఆశించేది ఏముంటుంది? 

         ఆశావహజీవనాన్ని క్షణక్షణం నిర్వీర్యం చేయబూనే,న్యూనత, వ్యాకులత, స్తబ్దత లను వదిలించుకొంటూ , ఎక్కడిక్కడ ఎప్పటికప్పుడు , ముందుకు అడుగులు వేయడం మాములు విషయమా? అలా, ఎంతో దూరం ఒంటరిగా ప్రయాణం చేస్తూ,అభిమానపు కర్పూరకళికలా ప్రభవించారు కనుకనే, మనమీ రోజు వరలక్ష్మిగారి కలానికి విశిష్ట సాహితీ పురస్కారపు పండుగను జరుపుకొంటున్నాం. 

       ఈ సంబరంలో ,రంగు రంగుల కాగితం ముక్కలను జెండాలు గా కత్తిరించి ,వరుసలువరుసలుగా అతికించే చక్కని పనిని, స్వయాన వరలక్ష్మి గారే నాకు  అప్పజెప్పారు. బడిలో క్రమం తప్పక జరుపుకొనే జెండా పండుగ రోజులా.  ప్రతిఫలంగా ,వరలక్ష్మిగారిని దగ్గరగా తెలుసుకొనే అవకాశం ,వారి రచనలను మరోసారి చదివే సందర్భమూ దక్కాయి. అదాటున అందిన జున్నుముక్కల్లా!  

        అంతనంత పాఠకులకు వరలక్ష్మిగారు అందించిన అరచేతిమాణిక్యాలను, ఆణిముత్యాలను అన్నిటినీ,  దాచి ఉంచిన  వారి కథల ఉట్టి ని కొల్లగొట్టడమే, పాఠకులుగా మన ముందున్న పని!   

        మా చిరకాలపరిచయాన్ని,తొలినాటి కలం స్నేహాల్ని, ‘భూమిక’ సాహితీ ప్రయాణాల్లోని  ఆటవిడుపులనీ, చిన్న చిన్న సంతోష సమయాలనీ, నెమరువేసుకొంటూ,గోదావరి తళతళల తలపులను, పూతరేకుల తీపినీ …ఇష్టంగా  జ్ఞాపకం చేసుకొంటూ,  

వరలక్ష్మి గారికి,  ‘అజో విభో’ సత్యనారాయణ గారికి వినమ్ర నమస్కారాలు. 

 వ్యక్తిగా, ఉపాధ్యాయినిగా, రచయితగా,మానవిగా వరలక్ష్మిగారు సదా స్పూర్తినిస్తూనే ఉంటారు. 

         సాహితీమూర్తి వరలక్ష్మి గారికి గౌరవంతో నమస్సులు! 

         స్నేహమయి వరలక్ష్మి గారికి ఆప్యాయంగా జేజేలు !

శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి

 

వరలక్ష్మిగారితో చంద్రలత,

27 నవంబర్ 2007, నాయుడుపేట లో-

చంద్రలత: వరలక్ష్మి గారూ, నమస్కారం. దేశ స్వాతంత్య్రం వచ్చిన ఉత్సాహభరిత కాలంలో, మీరు గోదావరి ఒడ్డున కళ్ళు తెరిచారు. ఏడు దశాబ్దాల మీ జీవితం ఈ దేశ కాల పరిస్థితులతో నేరుగా ముడిపడి ఉన్నది. మీ వృత్తి జీవితమంతా బాల్యంతోనే ముడిపడి ఉంది. మీ బాల్యం గురించి… మీతో ముడిపడిన అనేక బాల్యాల గురించి… ఇన్నేళ్ళలో మార్పులు చేర్పులు.. మీరు గమనించినవి చెప్తారా?

వరలక్ష్మి: నేను పుట్టింది దిగువ మధ్యతరగతి కుటుంబంలో. ఎనిమిదవ తరగతి చదివిన మా నాన్న తప్ప నాకన్నా ముందు మా ఇంట్లో చదువుకున్న వాళ్ళెవరూ లేరు. సంధ్య వేళయితే వాకిలంతా మా వీథి జనంతో నిండిపోయేది. మా నాన్న పురాణ గ్రంథాలు, బ్రహ్మం గారి కాలజ్ఞానం వంటివి చదివి వినిపించేవారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో పెరిగాను. ఆడపిల్లల్ని బడికి పంపే రోజులు కావవి. మా వీథిలోంచి ఒకళ్ళో, ఇద్దరో వెళ్ళేవారు. కానీ వాళ్ళ చదువు రెండో తరగతితో ముగిసిపోయేది. ఇక మా యాదవులలో అయితే నాకన్నా ముందు ఆడపిల్లలు బడిలో చేరిన దాఖలాలే లేవు. అలాంటి పరిసరాల్లో నాకు చదువుకోవాలని ఎందుకంతగా ఆకాంక్ష ఏర్పడిందో తెలీదు. మా నాన్నమ్మ ఒడిలో కూర్చుని ”బాగా చదువుకుని పెద్ద పెద్ద పుస్తకాలు చదివేస్తాను” అనేదాన్నట. ఒకరోజు మా ఊరి పెద్ద పురోహితులు మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ”ఆరికి దణ్ణం పెట్టి బళ్ళో ఎయ్యమని అడుగు” అని నన్ను ముందుకు తోసింది మా నాన్నమ్మ. నేను పరుగు పరుగున వెళ్ళి ఆ మట్టిలో ఆయన పాదాల మీద సాష్టాంగపడ్డాను. ఆయన నన్ను లేవదీసి తీసుకొచ్చి మా అరుగు మీద కూర్చుని పంచాంగం చూసి ముహూర్తం పెట్టి బడిలో చేర్పించారు. ఏనాడూ బడి మానాలని అన్పించేది కాదు. నేను ప్రాథమిక పాఠశాలలో చేరిన 1953 నాటికి మా ఊరి హైస్కూల్‌లో అసలు ఆడపిల్లలే ఉండేవారు కాదట. నా అదృష్టం కొద్దీ ప్రభుత్వం అప్పుడే ఆడపిల్లల చదువుల్ని ప్రోత్సహించడానికి పూనుకుంది. హైస్కూల్లో ఆడపిల్లలకి ఫీజు మాఫీ చేశారు. ఐదవ తరగతితో చదువు ఆపెయ్యమనడంతో ఇంట్లో చెప్పకుండా వెళ్ళి ఎంట్రన్స్‌ పరీక్షలు రాశాను. అందరికన్నా ఎక్కువ మార్కులు నాకే రావడంతో టీచర్లు వచ్చి మా ఇంట్లో నచ్చచెప్పి నన్ను హైస్కూల్లో చేర్చుకున్నారు. అంత శ్రద్ధగా చదువుతున్నా పదవ తరగతిలోనే పెళ్ళి చేసేశారు. ఏడ్చి మొత్తుకుని మరో సంవత్సరం ఇక్కడే ఉండి మా స్కూల్లో ఉన్న యస్‌.యస్‌.యల్‌.సి (11వ తరగతి) పూర్తి చేశాను. ఆడపిల్ల జీవితానికి పెళ్ళే పరమావధి అనుకునే రోజులవి. తర్వాత నేను స్కూలు ప్రారంభించాక విద్యార్థులను ఉత్తమంగా, ధైర్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఆనాటి నా అనుభవాలు ఉపయోగపడ్డాయి.

చంద్రలత: బడిలో ఉన్నప్పుడే మీరు కథలు వ్రాశారు. ఆ తరువాత, దాదాపు ఇరవై మూడేళ్ళకు గానీ మీకు నచ్చినట్లు ”సీరియస్‌ కథలు” వ్రాయలేదు. ఈ ప్రారంభం-సుదీర్ఘ విరామం-పునఃప్రారంభం మీ వ్యక్తి చేతనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందని మీరు భావిస్తున్నారు?

ఆగిపోయిన మీ కలం ఆలస్యంగానైనా పచ్చబడింది, కొనసాగింది. అలా జరగడం అనేకమంది విషయంలో అసాధ్యం. ఒక ఉపాధ్యాయురాలిగా, ఒక రచయితగా మీరు ఇలాంటి రచనా స్తబ్దతలను, సృజన విరామాలను తరచూ గమనించే ఉంటారు. ఈ ‘అవస్థ’పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ విరుద్ధ పరిస్థితి తలెత్తిన ప్రభావ ప్రమేయాలను గురించి చెప్పగలరా?

వరలక్ష్మి: ఎనిమిదవ తరగతిలో నా మొదటి కథ ఆంధ్ర పత్రిక వీక్లీలో వచ్చింది. మా క్లాసులో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా ‘కాపీ కాదు’ అనే శీర్షికతో రాసిన కథ అది. కునేగా సెంటు పరిమళంతో వచ్చిన వినాయకచవితి ప్రత్యేక సంచికతో పాటు ఏడున్నర రూపాయల రెమ్యునరేషన్‌ తెచ్చిన రచన అది. పోస్ట్‌మేన్‌ మా క్లాస్‌రూంలోకి వచ్చి నా పేరును పెద్దగా పిలిచి ఇచ్చాడు. పక్క క్లాసులో ఉన్న మా సైన్స్‌ మాస్టారు జగన్నాధశర్మ గారు పుస్తకం తీసుకుని చూసి, అప్పటికప్పుడు హెడ్మాస్టర్‌ రూం ముందు ఒక మీటింగ్‌ పెట్టి అందరికీ ఆ విషయం చెప్పారు. నేను చాలా సిగ్గుపడిపోయాను. కానీ, ఆ సంఘటన నా రచనా వ్యాసంగానికి గొప్ప ప్రోత్సాహం ఇచ్చింది. యతి, ప్రాస లేని పద్యాలు, వచన కవితలు అప్పటికే రాస్తున్నాను. స్కూల్‌ ఫైనల్‌ అయ్యే లోపల కొన్ని పెద్ద కథలు రాశాను కానీ, ఏ పత్రికకూ పంపే సాహసం చేయలేదు. పెళ్ళి తర్వాత అత్తగారింట్లో… రాయకుండా ఉండలేక ఇంటి పనుల మధ్య ఎలాగో తీరిక చేసుకుని ఓ కథ రాస్తే మా అత్తగారి చెల్లెలు చింపి పడేసి, వాళ్ళింట్లో కథలూ, కాకరకాయలూ అంటే వాతలు తేల్తాయని వార్నింగిచ్చింది. మా వారి చదువు పూర్తై వచ్చేవరకూ పిల్లలతో పడరాని పాట్లు పడడం సరిపోయింది. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏనాడూ సాహిత్యం చదవడం నుంచి దూరం కాలేదు. స్కూలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక కొంత అవగాహనతో రాయడం ప్రారంభించాను. రిక్షా కథకన్నా ముందే నవలికలు రాశాను. పంపడం రిక్షా కథ ముందు పంపినా పిట్టగూళ్ళు సంపుటంలోని చాలా కథలు ఆ గ్యాప్‌లో రాసినవే. అందుకని రిక్షా కథ పునఃప్రారంభమని నేను అనుకోవడంలేదు.

చంద్రలత: మీరు వ్రాసిన ‘రిక్షా’ కథ, ఆ తదుపరి మీ అభిప్రాయాలలోని మూలభావనలను మీరే మార్చుకునేంత ప్రభావవంతంగా మలిచారు. ఇలా, రచయితగా పునరాలోచనలో పడిన అరుదైన వ్యక్తి మీరు. రచయిత అయినా ఇలా నేర్పుతూ, నేర్చుకుంటూ మీరు ఉపాధ్యాయురాలిగా వ్యవహరించారు కదా! మీ ఉపాధ్యాయ వృత్తి మీ సాహితీ జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించిందని మీరనుకుంటున్నారు?

వరలక్ష్మి: నిజానికి నా ఉపాధ్యాయ వృత్తి జీవిక కోసం ఎంచుకున్నది. నా ఆత్మకథ చదివితే తెలుస్తుంది. నా జీవిత సహచరుడు ఇల్లు పట్టించుకోని వ్యసనపరుడు. ముగ్గురు పిల్లల్తో ఇల్లు గడవడం కష్టమైపోయి స్కూలు ప్రారంభించాను. అప్పటికింకా ప్రైవేటు స్కూల్స్‌ పెద్దగా లేవు. ఈ ఊళ్ళో అయితే మొదటి స్కూలు నాదే. మా అబ్బాయికి నాలుగేళ్ళ వయసప్పుడు వాడితోపాటు మరో పదిమంది పిల్లల్ని చదివిస్తే ఓ వంద రూపాయిలయినా వస్తాయి కదా అని, ఆ రోజుల్లో పొదుపుగా సంసారం నడుపుకోవడానికి వంద ఎక్కువే. మొదటి రోజు ఏడుగురు పిల్లల్తో స్కూలు ప్రారంభమైంది. నన్ను తెలిసిన ఊరు వాళ్ళంతా ‘మా పిల్లలు కూడా నీలాగే చదువుకునేలా చూడమ్మా’ అంటూ పిల్లల్ని పంపడం ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన, సమర్ధులైన ఆడపిల్లలకి నేనే టీచింగ్‌ నేర్పించి ఉద్యోగాలిచ్చాను. అలా కొందరికి జీవిక కల్పించగలిగాను, నేను జీవించగలిగాను. విద్యార్థికి పది రూపాయిల ఫీజు మాత్రమే తీసుకుని పాతికేళ్ళపాటు స్కూలు నడిపాను. ఓ వందమంది నిరుపేద విద్యార్థులకి యూనిఫామ్‌, బుక్స్‌ ఇచ్చి ఉచితంగా చదువు చెప్పాను. నా విద్యార్థులు ఇప్పటికీ ఎక్కడ కన్పించినా ఆత్మీయంగా పలకరిస్తారు. ఈ జన్మకీ తృప్తి చాలు అనిపిస్తుంది. నా దగ్గరకొచ్చే ఎందరో తల్లులు అరమరికలు లేకుండా వాళ్ళ జీవితాన్ని నా ముందు పరిచేవారు. నా కథా వస్తువులు చాలా వరకు అవే. ఇక, రిక్షా కథకి వస్తే రిక్షా వ్యక్తి చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్‌ వెనుక ఉన్న పేదరికం అర్థమయ్యాక అవి రాయడం సరికాదని అన్పించింది.

చంద్రలత: మీరు పల్లెలకు చేరువగా బడి నిర్వహించారు. మీరు పుట్టి పెరిగిన ఊరు జగ్గంపేట మీ వృత్తి కాలంలో పల్లె నుంచి పట్నంలా మారింది. ఈ మార్పులు మీ బడి పిల్లలపై ఎలా ప్రతిఫలించాయి? మీ బడి పిల్లల చదువు సంధ్యలపై మీ పరిశీలనలు చెప్పండి. విద్యారంగంపై మీ దృక్పథం చెప్పండి. ఈనాటి విద్యా వ్యాపార ధోరణిలో పొసగక మీ బడిని నిలిపివేశారు. ఆ పరిస్థితులను వివరంగా చెప్పగలరా?

వరలక్ష్మి: చేరువగా కాదు, పల్లెల్లోనే నిర్వహించాను. అది ఇప్పటి కార్పొరేట్‌ స్కూల్‌ లాంటిది కాదు. ఆటపాటల్లోనే పిల్లలకు నీతి పద్యాలు, శతక పద్యాలు, ఎక్కాలు, లెక్కలు వల్లె వేయించేవాళ్ళం. స్వచ్ఛమైన ఉచ్ఛారణ కోసం సంస్కృత శ్లోకాలు, హిందీ దోహాలు పలికించేవాళ్ళం. చిన్న క్లాసుల నుండే ఇంగ్లీషు, హిందీతో బాటు పెద్దలతో, పిన్నలతో ఎలా నడుచుకోవాలో నేర్పించేవాళ్ళం. మొయ్యలేనన్ని పుస్తకాలు, బరువైన హోమ్‌ వర్క్‌లు లేకుండా చూసేవాళ్ళం. అదంతా నాకు మా ఉపాధ్యాయులు నేర్పిన విద్యా విధానమే. మంచి ప్రాథమిక విద్యనందించి ఎనిమిదవ తరగతిలో హైస్కూలుకి పంపేవాళ్ళం. గీత హైస్కూల్లో చదువుకుంటూనే నాకు టీచింగ్‌లోనూ, ఆఫీస్‌ వర్కులోనూ సాయం చేసేది. ఆరు, ఏడు తరగతుల పిల్లలకి చిన్న కథలు విన్పించడం, కవితలు రాయించడం చేసేది. డల్‌గా ఉన్న విద్యార్థుల్ని సెలవు రోజుల్లో కూడా ఇంటికి పిలిచి చదివించేవాళ్ళం. మా స్టూడెంట్స్‌ జెమ్స్‌లా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఊరు పట్నంగా మారే క్రమంలో ఒకాయన ఎక్కడినుంచో వచ్చి ఎకరాల స్థలంలో స్కూలు భవనం, బస్సులు లాంటి ఆకర్షణలతో నెలకి రెండు వందల యాభై రూపాయల ఫీజుతో ప్రారంభించాడు. ఎక్కడి పది రూపాయలు, ఎక్కడి 250? అయినా నా జీవిత సహచరుడు పక్షవాతంతో మంచం ఎక్కి, నేను స్కూలు ఆపేసేవరకూ నిరాఘాటంగా నడిచింది. ఇవాళ వీథికొక కార్పొరేట్‌ స్కూలు ఉందిక్కడ. ఉన్నవాళ్ళు సరే, లేనివాళ్ళూ తినీ తినక, అప్పు చేసి మరీ పిల్లల్ని వేల రూపాయల ఫీజు కట్టి మరీ బడిలో వేస్తున్నారు. రెండు మూడేళ్ళ తరువాత మాన్పించి ఏదో ఒక పనిలో పెట్టేస్తున్నారు. విద్య, వైద్యం వ్యాపారాలు కాకూడదని నేను కోరుకుంటాను.

చంద్రలత: రవీంద్రుని పేరుతో మీ విద్యాసంస్థను స్థాపించారు. మీ బిడ్డల పేర్లతో సహా, రవీంద్రుని ప్రభావం కనబడుతోంది. ఒక వ్యక్తిగా, ఉపాధ్యాయురాలిగా, రచయితగా, మీ తాత్విక ప్రాతిపదికపై, వృత్తి ప్రవృత్తులపై రవీంద్రుని ప్రభావం ఉన్నట్టా? ఉంటే, రవీంద్ర భావనలు మీకు ఎలా సానుకూలమయ్యాయి? లేదా ఎలా ప్రతిబంధకాలయ్యాయి?

వరలక్ష్మి: అక్షరాలు చదవడం వచ్చినప్పటి నుంచీ ఎక్కడ ఏ పుస్తకం, ఏ కాగితం కన్పించినా చదివేసే అలవాలు. ప్రాథమిక పాఠశాల గ్రంథాలయంలో ఉన్న బొమ్మల రామాయణం, గలివర్‌ కథలు లాంటి మొత్తం పుస్తకాలన్నీ చదివేసిన ఏకైక విద్యార్థిని నేనే. హైస్కూలుకి వెళ్ళాక అక్కడా రెండు బీరువాల నిండా ఉన్న పుస్తకాల్ని చూసి వారం రోజులు ఆ గది చుట్టూ తిరిగితే ఏరి ఏరి ఓ చిన్న పుస్తకం తీసి ఇచ్చారు మాస్టారు. అది రవీంద్రుడి గీతాంజలికి బెల్లంకొండ రామదాసుగారి తెలుగు అనువాదం. ఆ చిన్న వయసులో ఎంత అర్థమైందో చెప్పలేను కానీ, చాలా నచ్చింది. చదువు మధ్యలో ఏ కాస్త టైం దొరికినా పారాయణంలాగా పదే పదే చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ భావాల ఆర్ద్రతకి కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. నా సుకృతం కొద్దీ నాకు చదువొచ్చే వేళకి మా ఊరికి గ్రంథాలయం వచ్చింది. దాంట్లో బోలెడన్ని పుస్తకాలు ఉండేవి. మా అమ్మ చదువుకోలేదు. కథలు, నవలలు చదివి విన్పించమనేది. అలా చందమామ నుంచి శరత్‌ రచనల వరకూ ప్రాథమిక పాఠశాలలోనే చదవడం అలవాటైంది. ఎప్పుడైనా రవీంద్రుడి పుస్తకాలు తెస్తే తనకి నచ్చనట్లు ముఖం పెట్టేది. రవీంద్రుడి కాబూలీవాలా కథ మాత్రం తనకి నచ్చింది. నాకూ ఎంత నచ్చిందో చెప్పలేను. ఆ రోజుల్లో రవీంద్రుడి నవలల జోలికి పోలేదు కానీ కథలు చదివాను. రవీంద్రుడి భావుకత నన్ను వదలలేదు. అందుకే మామూలు జనాన్ని అర్థం చేసుకోవడంలో చాలా కాలం వెనుకబడి ఉండిపోయాననుకుంటాను. బాల్యంలో అర్థంకాని రవీంద్రుడిి తాత్వికత ముప్ఫై ఏళ్ళ వయసు దాటాక మళ్ళీ చదివినప్పుడు కొంత అర్థమైంది. గోరా నాకు ఇష్టమైన నవల. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళు అద్దెకు తీసుకుని పెరట్లో చెట్ల కింద క్లాసులు నడిపి శాంతినికేతన్‌లో ఉన్నట్లు తృప్తి పడేదాన్ని.

చంద్రలత: మీ సాహితీ సంపర్కం మీ బడి నిర్వహణకు ఎలా తోడ్పడింది, అడ్డుపడింది?

వరలక్ష్మి: అడ్డు పడలేదు. చాలా తోడ్పడింది. నేను స్కూలు నడుపుతున్నానని, కథలు రాస్తున్నానని ఏనాడూ పై మెట్టు మీద కూర్చోలేదు. దాంతో పిల్లల తల్లులు నాతో కలివిడిగా ఉండేవాళ్ళు. కొందరైతే ‘అక్కా నా గురించి కథ రాయవా’ అని అడిగేవాళ్ళు, గాజుపళ్ళెంలో గంగ, ఖాళీ సంచుల్లో దుర్గ లాంటి వాళ్ళు. అలా ఆ ఇంటి వాతావరణాన్ని బట్టి ఆ పిల్లల్ని ఎలా చదివించాలో అర్థమయ్యేది.

చంద్రలత: ”చెంబెడు నీళ్ళు తాగి పూలు, పళ్ళతో విరాజిల్లే మొక్కలాగా, గుప్పెడు గింజలు తిని రెక్కలల్లార్పుతూ ఎగిరే పక్షుల్లాగా సౌందర్యవంతంగా మానవ జీవితం ఉండాలి” అన్న మీ ఆకాంక్ష నేపథ్యంలో ప్రస్తుత వస్తు ప్రధాన తరంపై, డిజిటల్‌ యుగ సమాజంపై మీ వ్యాఖ్యానం ఏమిటి? సామాజిక మాధ్యమాల్లోనే సాహిత్యం ఉన్నదన్న భ్రమాత్మక తరానికి మీ సూచనలు ఏమిటి?

వరలక్ష్మి: ఈనాటి యువతకు వస్తువుల ఆరాధన ప్రధానమైంది. వాళ్ళవాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం మొక్కల్లో, పక్షుల్లో చూసే సౌందర్యం వాళ్ళకి వస్తువుల్లో కన్పిస్తుంది. రచయితులుగా మనం విలువల్ని విప్పి చెప్తూ రచనలు చెయ్యడం తప్ప మరో మార్గం లేదు. యువతని డిజిటాలిటీ పూర్తిగా ఆక్రమించుకున్న కాలం ఇది. మీరే అన్నారుగా భ్రమాత్మకమని, చాలా మంది భ్రమల్లో ఉండడానికే ఇష్టపడతారు. కానీ మరో పార్శ్వం చూస్తే తొందరగా జనంలోకి వెళ్తోందన్న మాట నిజం. కాలంతో పాటు మార్పు సహజం, అవసరం కూడానేమో!

చంద్రలత: “ప్రాంతీయ నేపథ్యం నుంచి మొదలయి దేశీయతవైపు, మానవీయత వైపు సాగిన సాహిత్య రూపాలు”గా మీ రచనలను వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారు అభివర్ణించారు. మీ కథలను మీరెలా భావిస్తారు? మీ రచనలను ఎలా పరిచయం చేయాలనుకుంటారు?

వరలక్ష్మి: వీరలక్ష్మి గారు చెప్పేవరకూ నేను గమనించలేదండి. నా కళ్ళముందు జరిగిన సంఘటనకు అక్షర రూపం ఇస్తానంతే. కావాలని ముగింపులు కూడా ఇవ్వను. రచన చదివిన పాఠకులు ఒక ఆర్తికి, ఆర్ద్రతకు లోనై తమను తాము సరిదిద్దుకుంటే చాలని అనుకుంటాను. నా కథలు చదివాక స్త్రీల పట్ల తమ దృక్పథం మారిందని చాలా మంది అన్నారు. వీరలక్ష్మి గారికి కృతజ్ఞతలు.

చంద్రలత: ఖాళీసంచుల్లోని ఎండు చేప దుర్గ అయినా, రైల్వే ప్టాట్‌ఫాం మీద నిప్పు రాజేసుకోవాలనే బాలిగాడైనా, మేకల కాపరిగా పుట్టి, పెంకుల వ్యాపారి అయి, డాబా ఇల్లు కట్టి, నిలువునా కూలిన అయోధ్య రాముడైనా, తరతరాల మంత్రసాని లోవ ”హైవే పరిష్కారం” వైపు చూపు సారించినా… మీరు ఇంతవరకు స్పృశించని కడు సామాన్య జీవితాన్ని జీవిస్తోన్న సజీవ మూర్తులను సాహితీలోకానికి పరిచయం చేశారు. మీరు సృజియించిన ఈ కాల్పనిక పాత్రలను మీరు మరొక మారు పలకరిస్తే…?

వరలక్ష్మి: అవును, వాళ్ళంతా నా చుట్టూ ఉన్న సజీవ మూర్తులే. నేను మరొకమారు పలకరించినా, ఇంకొకమారు పలకరించినా వాళ్ళ జీవితాలేమీ మారిపోలేదండి. ఇళ్ళల్లోకి గ్యాస్‌ స్టవ్‌లు, చేతుల్లోకి సెల్‌ఫోన్‌లు వచ్చినంత మాత్రాన జీవితం మారిపోయినట్లు కాదు. కథల్లోని పాత్రలు ఆత్మహత్య చేసుకోవడం, చచ్చిపోవడం పరిష్కారాలుగా చూపించడం నాకు ఇష్టం ఉండదు. ఏ పరిస్థితినైనా తట్టుకుని ధైర్యంగా జీవించాలని కోరుకుంటాను.

చంద్రలత: వరలక్ష్మి గారూ, యాదృచ్ఛికమే కావచ్చు గాక, మీ ”పాప” కథకు, పాలగుమ్మి గారి ”గాలివాన” కథకూ రైల్వేస్టేషన్‌ వేదిక అయ్యింది. పాలగుమ్మి గారి సాహిత్యంపై మీ ఇష్టం మీ పైనా, మీ రచనా వ్యాసంగాలపైనా ప్రతిఫలించాయేమో గమనించారా? మరే ఇతర సాహితీకారుల ప్రభావమైనా, మీ రచనలపై ఉందంటారా?

వరలక్ష్మి: పాలగుమ్మి గారి కథా వస్తువులు, కథనరీతి నాకు నచ్చుతాయి.పడవ ప్రయాణం కథ నాకు ఇష్టమైన కథ. బడుగు జీవితాల్లోని సంఘటనల్ని దూరంగా నిలబడి మూడో వ్యక్తిగా రాసిన కథ అది. కథను అలా రాయడం నాకు నచ్చుతుంది. అంతవరకే. వారిని అనుకరించి ఏ కథలూ రాయలేదు. తమాషా ఏమిటంటే ‘పాప’ కథ రాసేసరికి నేను ‘గాలివాన’ చదవలేదు. అదే రోజుల్లో కాళీపట్నం వారి కథా వస్తువులు, శైలి నన్నాకట్టుకున్నాయి. మాస్టార్ని అప్పుడప్పుడూ పత్రికల్లో చదవడం తప్ప ఇంటి ఖర్చులు మానేసి పుస్తకాలు కొనుక్కునేంత వెసులుబాటు లేదు నాకప్పుడు. ప్రైవేటుగా ఎం.ఏ. చదువుతూ చేమకూర వేంకట కవి సాహిత్యం కోసం రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయానికి వెళ్తే అక్కడ సన్నిధానం శర్మగారు నాకు ”యజ్ఞంతో పదహారు” పుస్తకాన్నిచ్చారు… ఇలాంటి గొప్ప రచయితల కథ వల్ల ఎలాంటి కథా వస్తువు తీసుకోవాలి, ఎలా రాస్తే బావుంటుంది అన్నది నాకు అర్థమైంది.

చంద్రలత: గోదావరి వాళ్ళకు ఆ నది చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు జగత్ప్రసిద్ధం. మీ ముంపు వాసుల కథ ‘ఆనకట్ట’ విశేషాల గురించి చెప్పండి.

వరలక్ష్మి: అవును, గోదావరిని మేమెంతో ప్రేమిస్తాం. మా జీవనాధారంగా భావిస్తాం. ఆ ఆనకట్ట రావాలని మా ప్రాంతపు రైతులు చాలా ఎదురుచూస్తూ ఉండేవారు. ఎందుకంటే మాది మెట్ట ప్రాంతం. భూములన్నీ వర్షాధార భూములు. మా ఊరు అటు మన్యాన్ని, ఇటు హైవేను అనుకొని ఉండడం వలన ఊరి చుట్టూ పెంకుల మిల్లులు, సగ్గు బియ్యం మిల్లులు, సిరామిక్‌ ఫ్యాక్టరీలు, సుద్ద… గ్రానైట్‌ క్వారీలు ఉండడం వల్ల అటు తూర్పు నుంచి ఇటు మన్యం నుంచి జనం వలస వస్తూ ఉంటారు. అప్పట్లో మన్యం నుంచి వచ్చినవాళ్ళు కొంతమంది ఆ ఆనకట్ట వల్ల తమ మగపిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయాయని చెప్పుకునే వాళ్ళు. మరోవైపు మగపిల్లలు పదవ తరగతి చదువుకుంటే చాలు ఏవో ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మకంతో ఉండేవాళ్ళు. సరిగ్గా అప్పుడే రాజమండ్రి నుంచి కొందరు దురాశాపరులు పౌల్ట్రీ ఫామ్స్‌ పెట్టబోతున్నామని, పదివేలు కట్టినవాళ్ళకు ఉద్యోగాలిస్తామని, గుడ్లు దుబాయ్‌కి ఎగుమతి చేసి లాభాల్లో వాటా కూడా ఇస్తామని పెద్దగా ప్రచారం చేశారు. చాలామంది అది నమ్మి పుస్తె, పూస అమ్మి కట్టేసి ఎదురుచూడడం, అది ఫేక్‌ వ్యాపారమని తెలిశాక ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మా స్కూలు పిల్లల్ని రెండు మూడుసార్లు మారేడుమిల్లి అడవిలోకి, సంతలోకి తీసుకెళ్ళాం. అలా ఆ కథ రూపుదిద్దుకుంది. ఆ కథ ‘ఆటా’ సావనీర్‌లోనూ, అరుణతారలోనూ ప్రచురింపబడింది. ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ ఇంగ్లీషులో వేసిన ”బియాండ్‌ ద బ్యాక్‌ యార్డ్‌”లో స్థానం పొందింది.

చంద్రలత: గోదావరి జిల్లా అయితేనేమి, ఆకలి ఎక్కడైనా ఒక్కటే, అమ్మ ఎవరికైనా అమ్మే! మీ ప్రాంతీయతను, స్థానికతను మీరు ప్రతిఫలించడంపై మీరు సంతృప్తిగా ఉన్నారా? స్థానికతను చిత్రిస్తూనే, సార్వజనీయతను సాధించిన రచయిత మీరు. నానాటికీ కుచించుకుపోతోన్న, ఈనాటి కలలపై మీ అభిప్రాయం ఏమిటి?

వరలక్ష్మి: అవును, ఆకలి ఎక్కడైనా ఒక్కటే. కొనీ కొందరు విమర్శకులు ‘గోదావరి జిల్లాల రచయితలకు ఆకలి గురించి తెలీదు’ అనడం విని నవ్వుకొని ఊరుకొన్నాను. ఇంకా కొందరు మీరు ‘గాజుపళ్ళెం’ లాంటి కథను మళ్ళీ రాయలేదేంటి అంటుంటారు. వాళ్ళు చదవరు, కొన్ని పరిధులు పెట్టుకొని కొందర్నే చదువుతుంటారు. నా చుట్టూ ఉన్న పల్లె జీవితాన్ని ప్రతిబింబించడం నాకు చాలా తృప్తినిస్తుంది. ఆ పని పల్లెల్లో జీవించేవాళ్ళే చెయ్యగలరు. ఇప్పటికీ పల్లె గురించి రాయడం అంటే గోధూళి వేళను, ఉషోదయాలను, పూల పరిమళాలను వర్ణిస్తూ రాయడం అనుకొంటారు కొందరు. జీవితాల్ని దూరం నుంచి చూసి రాయడం వేరు, వాళ్ళతోనే ఉండి రాయడం వేరు. ఇప్పటి కథలు కూడా నేను చాలా చదువుతూ ఉంటాను. కొన్నిమంచి కథలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళకు దొరికిన కథా వస్తువులు అవే మరి. కథను వీలైనంత తొందరగా రాసేసి సామాజిక మాథ్యమాల్లో చూసేసుకోవాలనుకోవడం కూడా ఒక కారణం కావచ్చు.

చంద్రలత: మీరొక చోట ”సీరియస్‌ కథ” అన్న మాట వాడారు. కథ ఏదైనా కథే! కథలో సీరియస్‌ కథలు అంటే ఏవని మీరనుకొంటున్నారు?

వరలక్ష్మి: అది నాకు మాత్రమే అన్వయించే మాట. చిన్నప్పటి నుంచీ నోట్‌బుక్స్‌లో మిగిలిన ఖాళీ పేజీల్లో ఆషామాషీ కథల్ని, నాన్నమ్మ మెచ్చుకుందనో, అమ్మ కోప్పడిందనో రాసేస్తూ ఉండేదాన్ని. కొంత అవగాహన తర్వాత రాసిన కథల్ని సీరియస్‌ కథలు అనుకొన్నాను.

చంద్రలత: నవల, కథ, కవిత… ఈ మూడు ప్రక్రియల్లో అందె వేసిన చేయి మీది. మీ నవలా రచనలను గురించి చెప్పండి?

వరలక్ష్మి: నా నవలలు, నిజానికవి నవలికలు. వాటి విషయంలో నేనేమంత సంతృప్తిగా ఫీలవను. స్కూలు ప్రారంభించిన కొత్త రోజులు. ఒక పక్క ప్రైవేటుగా పరీక్షలకు కూర్చునే చదువు, చంటి పిల్లల్ని చూసుకోవడం, వంటతో సహా ఇంటి పనులు. అటు స్కూల్లో ప్రిన్సిపాల్‌, టీచర్‌ కమ్‌ స్వీపర్‌ అన్నీ నేనే. ఈ గందరగోళంలో నవలలు రాసేయాలనే తపన, పూర్తిగా వంద పేజీలైనా రాయకుండా ముగించి పంపిన నవలకి 600 రూపాయల రెమ్యునరేషన్‌ వచ్చింది. నెలంతా కష్టపడినా నా స్కూలు మీద అందులో సగం డబ్బులు కూడా వచ్చేవి కావు. ఇంటి అవసరాలకి డబ్బులు కావాల్సి వచ్చేది. ఆ వరసలో నాలుగు నవలికలు రాసేశాను. ఒకదానికి జ్యోతి మంత్లీ వాళ్ళు డబ్బులు పంపలేదు. ఎంత బాధ కలిగిందో చెప్పలేను. ఆర్థిక అవసరాలు రాయించిన నవలలు అవి.

చంద్రలత: మీ ”పరిసర పరిశీలన చూస్తుంటే ప్రాచీన కవులలో శ్రీకృష్ణదేవరాయలు, ఆధునికుల్లో విశ్వనాథ సత్యనారాయణ గుర్తొస్తారు” అంటూ చేరా మాస్టారి అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొన్నారు. మీ కవితా రచనానుభవాలు చెప్పండి.

వరలక్ష్మి: చాలామంది లాగానే నేను కూడా కవిత్వంతోనే రాయడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు బాల కవితలు, కొంచెం ఎదిగాక ప్రేమ కవితలు… అంతలో మా గీత మంచి కవిత్వం రాయడం మొదలుపెట్టింది. బాధో, ఆనందమో అప్పటికప్పుడు ఫీల్‌ ఆపుకోలేక రాసెయ్యాలనుకున్నప్పుడు కవిత్వం రాశాను. ‘అస్మిత’తో పరిచయమయ్యాక నా కవిత్వ ధోరణిలో మార్పు వచ్చింది. నాదొక కవితా సంపుటి ‘ఆమె’ వచ్చిందని చాలా మందికి తెలీదు.

చంద్రలత: ఒక్కోసారి రచయిత రాసిన కథలలో కొన్ని కథలే గుర్తింపుకు నోచుకుంటాయి. వాటి వెలుగులో మిగిలిన కథలన్నీ నలిగిపోతాయి, మరుగునపడిపోతాయి. మాట్లాడే ఆ కొన్నిటి గురించే, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం. ఏ కథనైనా రచయిత అదే నిబద్ధతతో రాస్తారు కదా. ఈ తరహా మూస ప్రచారం సబబేనా? మీ రచనలలో మీకు ముఖ్యమైనదిగా అనిపించి, అజ్ఞాతంలో ఉండిపోయినవేమైనా ఉన్నాయా? అలాంటి రచనల గురించి చెప్పగలరా? ఈ ధోరణి ప్రక్రియలపైనా ప్రసరిస్తుంది. ఉదాహరణకు మీ కథల వెలుగులో మీ కవిత్వం, నవలలకు రావలసినంత గుర్తింపు రానట్టేగా! మీరేమంటారు?

వరలక్ష్మి: అవును! అది నిజం. ఎంత గొప్ప రచయితకైనా అది తప్పదు. ఎవరికైనా కొన్ని కథలే అలా ప్రాచుర్యంలోకి వస్తాయి. నావి కూడా అలాగే కొన్ని మంచి కథలని నేననుకున్న వాటి గురించి ఎవరూ మాట్లాడలేదు. నేను కథ మీద ఎక్కువ ఏకాగ్రత చూపించడం వల్ల నవలల మీదా, కవిత్వం మీదా అంత శ్రద్ధ చూపించలేకపోయాను.

చంద్రలత: “జీవితాన్ని ఒకే పరిధిలోంచి చూడడం… రచయిత తనని తాను పరిధులు విధించుకోవడమేనని నేననుకొంటాను. కథను బట్టి పాత్రలకి సహజంగా నడుచుకునే స్వేచ్ఛనివ్వాలి” అన్నారు మీరు. మీ సుదీర్ఘ సాహితీ జీవితంలో మీ అభిప్రాయంలోని సాధ్యాసాధ్యాల గురించి చెప్పండి?

వరలక్ష్మి: కథవరకూ ఎందుకు? ఏ వ్యక్తీ జీవితంలో ఒకేలా నడుచుకోడు. కొన్ని సందర్భాల్లో మంచివాడనుకున్న వ్యక్తి మరికొన్ని సందర్భాల్లో మరోలా కనిపిస్తాడు. అందుకే ఏదో ఒక పరిధిలోంచి పాత్రల్ని చూడడం మంచిది కాదని నాకన్పిస్తుంది. అందుకే నా కథల్లోని పాత్రలు సహజంగా నడుచుకుంటాయి.

చంద్రలత: మూస పాత్రల పట్ల, మూస ధోరణుల పట్ల, మీ పొసగనితనాన్ని మీ ప్రతి కథలోనూ వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మీ రచనలు ఎప్పుడైనా అలాంటి ప్రమాదాలకు గురయ్యాయని మీకు అనిపించిందా ఎన్నడైనా?

వరలక్ష్మి: లేదు, నేను అలా రాశానని అనుకోవడం లేదు.

చంద్రలత: సిద్ధాంతాలను ముక్కునబట్టి వల్లించకుండా, వాదోపవాదాలకు మూసప్రతీకలుగా పెట్టుడు పాత్రలను నిలబెట్టి, వాటి చేతిలో మైకులు పెట్టి వదిలేయకుండా, తప్పొప్పుల కలనేతగా, సజీవ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ కథన నిర్మాణ ప్రక్రియలను మీరు ప్రయత్నపూర్వకంగా చేశారా? మీ సహజ కథనశైలా? ధోరణుల వరదల్లో పడి కొట్టుకుపోకుండా, ఒడ్డున నిలబడగలిగానని మీరు భావిస్తారా?

వరలక్ష్మి: చిన్నప్పటి నుంచీ విస్తృతంగా… అవి దేశీయ కథలు కానీ, విదేశీయ అనువాదాలు కానీ చదివే అలవాటు వల్ల మంచి కథ ఏదైనా చదివినప్పుడల్లా రాయాలని అన్పించేది తప్ప నేను రచయితనవుతానని అనుకోలేదు. అందుకు తోచినట్లు రాయడం తప్ప ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఒక సంఘటన నన్ను బాగా కదలించినప్పుడు రాయాలని అనుకుంటాను, ఆ కథ దానికదే రూపు దిద్దుకుంటుంది. కానీ, ఒక్కసారి రాసేసి నిర్లక్ష్యంగా ఫెయిర్‌ చేసెయ్యను. మళ్ళీ మళ్ళీ చదువుతూ అనవసరమైన ఒక్క వాక్యం కూడా లేకుండా జాగ్రత్తపడతాను. ధోరణులేవీ నన్నంటలేదని అనుకోను కానీ, ఒడ్డున నిలబడగలిగాననే అనుకుంటున్నాను.

చంద్రలత: కథ అన్నాక ముగుస్తుంది. సుఖాంతమో, దుఃఖాంతమో, మీరు ఏ ముగింపూ లేని కొనసాగింపు గల ఓపెన్‌ ఎండ్‌ కథ ”పాప” రాశారు. తెలుగు కథకు అరుదైన ఇలాంటి ‘అసంపూర్ణ ముగింపు’ లాంటి కథన ప్రయోగాలు మీ రచనలలో యథాలాపంగా జరిగాయా? మీ కృషితో సాధించారా?

వరలక్ష్మి: కథ రాయడానికి కూర్చున్నప్పుడు నేనేదీ అనుకోను. ఆ కథ దానికదే శైలిని ఏర్పరచుకుంటుంది, నడుస్తూ వెళ్తుంది. ”పాప” కథ రాసేటప్పుడు దానికంత స్పందన వస్తుందని నేననుకోలేదు. పైగా ఆ కథ మద్రాసు నుంచి కొంగర జగ్గయ్య గారు, ఉప్పల నరసింహం గారు కలిసి తెచ్చిన కథావేదికలో వచ్చింది. ‘మంచి కథా సాహిత్యం మంచి సమాజాన్ని నిర్మిస్తుంది’ అన్న కథావేదిక స్లోగన్‌ నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేసింది. పబ్లిక్‌ మ్యాగజైన్‌లో రాకపోయినా ఆ కథ పాఠకులలోకి చొచ్చుకు వెళ్ళింది. దాన్ని నా కథల్లో మాగ్నమ్‌ ఓపస్‌ అన్నారు.

చంద్రలత: “పాప” కథ ముగింపు గురించి మీరన్నారు.. “పాపని తల్లితో కలపకపోవడం నాకిష్టం లేని ముగింపు” అని. ఇలా, రచయిత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కథ ముగియడం ఒక రచనాద్భుతం! ఆ ముగింపే ఆ కథకు ఆయువుపట్టు… మీరేమంటారు?

వరలక్ష్మి: కావచ్చు కానీ, ఆ అద్భుతం కోసం అంత చిన్న పాపను అలా వదిలెయ్యడం ఒక క్రూరత్వం కూడా అన్పించింది.

చంద్రలత: ‘మీ కథలలో తిరుగుబాటు ఉండదెందుకు’ అన్న ప్రశ్నకు జవాబుగా, మీరు ‘అణచివేత, తిరుగుబాటు’… వీటి గురించి లోగడ వివరంగా చెప్పారు. మరి ఏ కథకైనా ఈ రెండేనా మూలకాలు?

వరలక్ష్మి: అణచివేత ఉన్నచోట తిరుగుబాటు ఉంటే బావుంటుందని రచయితగా కోరుకుంటాం. కానీ, మనుషుల్లో లేదా కొన్ని ప్రాంతాల్లో ఆ ధోరణి అరుదుగా కన్పిస్తుంది. జీవితాల్లో ఈ రెండే కాకుండా ఎన్నెన్నో కోణాలుంటాయి. వాటిని కూడా అర్థం చేసుకుంటూ రాయాలని నేననుకుంటాను.

చంద్రలత: ‘రాజకీయాలతో ముడిపడితేనే సాధ్యం’ అన్న భావనకు మీరు కట్టుబడి ఉన్నారా? అలా కట్టుబడి ఉండాలా? మీ అభిప్రాయం ఏమిటి?

వరలక్ష్మి: రాజకీయాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి మార్పు అవసరమైన విషయాల్ని ఎత్తి చూపడం అవసరం. అది రచయితకు ముఖ్యమైన బాధ్యత, రచయితల్లో రాజకీయాలు లేకుండా ఉంటే మాత్రం బావుంటుంది.

చంద్రలత: “ఈ కథ నేను వ్రాయాల్సిన కథ” అని ఎప్పుడైనా అనిపించిందా?

వరలక్ష్మి: అనిపించింది. శ్రీరమణగారి ‘బంగారు మురుగు’ కథ చదవగానే నాకెంతో నచ్చి అలా అన్పించింది.

చంద్రలత: ఏ వాదాన్నైనా ”మనసుకు నొప్పించక” చెప్పాలన్న మీ కథన ప్రయత్నాల్లో మీరు నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా?

వరలక్ష్మి: అన్నీ అందరికీ నచ్చవు. కొందరు ‘ఈ విషయాన్ని రాడికల్‌గా చెప్పి ఉంటే బావుండేది’ అంటారు. మరి కొందరు ‘ఈ కథలో ఈ వాదం లేదు’ అంటారు. అవి వాళ్ళ అభిప్రాయాలు. నేనెందుకు నొచ్చుకోవాలి?

చంద్రలత: మీరు సాహితీ విమర్శకులను, వారి ప్రజ్ఞాపాటవాలను చూశారు. సమకాలీన సాహితీ విమర్శ ఆరోగ్యకరంగా ఉందంటారా? ఈ తరం సాహితీ విమర్శకులకు మీ సూచనలేమిటి?

వరలక్ష్మి: అసలిప్పుడు మంచి విమర్శ ఉందంటారా? నాలుగు లైన్లు రాసేసి దాన్ని రివ్యూ అంటారు. ఇప్పటికీ కవిత్వం అంటే శ్రీ శ్రీ గురించి, కథ అంటే గురజాడ గురించీ మాత్రమే రాసేవాళ్ళున్నారు. ఇంకొందరు పురుషులు రాసేదే సాహిత్యం అంటూ స్త్రీల జోలికి పోరు. ఇంకొందరు వాళ్ళకి బాగా పరిచయం లేదా స్నేహం ఉన్నవాళ్ళ గురించి మాత్రమే రాస్తున్నారు. రాగద్వేషాలు, ప్రాంతీయ తత్వాలు విడిచిపెట్టి విమర్శ రాస్తే బావుంటుంది. నేను కేవలం రచయితనే కాబట్టి విమర్శకులకు సూచనలేమివ్వగలను?

చంద్రలత: మీ సాహితీ ప్రయాణంలో మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంఘటనలు, అపరిమిత ఆనందాన్ని కలిగించిన సందర్భాలు ఉండే ఉంటాయి. అలాగే మీ ‘రెక్కలు కత్తిరించబడిన’ అనుభవాలు కూడా! మిమ్మల్ని భయపెట్టిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? మాతో పంచుకోండి. అలాంటి అవాంఛనీయ సందర్భాలను మీరెలా అధిగమించగలిగారు? ఆనందపు, అపురూప క్షణాలను చెప్పండి.

వరలక్ష్మి: మనం స్త్రీలం కాబట్టి, సెంటిమెంట్స్‌కి అతీతులం కాదు కాబట్టి ఆ అనుభూతులన్నీ సహజం. అప్పటికి ఎవ్వరితో పరిచయాలు లేవు. నా వరకూ నేను చదువుకోవడం, రాసుకోవడంలో ఉండగా హఠాత్తుగా ఒకరోజు ‘గాజుపళ్ళెం’ కథకు రంజని అవార్డు వచ్చినట్లు పేపర్లో వచ్చింది. పగలంతా పేపరు చదివే తీరిక లేక రాత్రి చదివేదాన్ని. ఆశ్చర్యంతో నేను అరిచిన అరుపు విని మా పిల్లలు నిద్రలేచి వచ్చారు. ‘మధుర’ కథకు అజో-విభొ’ అవార్డు, ‘మట్టి-బంగారం’ కథకు ఆటా అవార్డు రావడం మొదటి ఆనంద సమయాలు. సుశీలా నారాయణరెడ్డి అవార్డు, ఇప్పుడిలా అజొ-విభొ-కందాళం వారి ‘విశిష్ట సాహితీమూర్తి’ అవార్డు అందుకోవడం… ఇవన్నీ ఆనందంలో ముంచెత్తే అపురూప సందర్భాలే కదా! భయపెట్టిన క్షణాలైతే ఏమీ లేవు. ఎందుకంటే అందరూ నా పట్ల స్నేహవాత్సల్యాలను ప్రదర్శిస్తూ నడుచుకుంటారు కనుక. కొందరు అసూయ, ద్వేషాలను ప్రదర్శించినా నేను పట్టించుకోను, జాలిపడతాను.

చంద్రలత: ఎలాంటి పరిధుల్లోనూ, చట్రాల్లోనూ ఇమడడానికి ఇష్టపడని వారు మీరు. మీ స్వేచ్ఛాభిలాష, స్వతంత్ర భావనలు, మానవ దృక్పథం, సార్వజనీయతను ప్రతిఫలిస్తుంటాయి. ఏ రచనలోనైనా ఎప్పటికప్పుడు ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో కులానికి, జెండర్‌కు, ప్రాంతానికి పరిమితం చేసే కుదింపులు జరుగుతుంటాయి. ”వెనుకబడిన కులంలో జన్మించినా సాహిత్యంలో వెనుకబడని వ్యక్తి కె.వరలక్ష్మి”… ఇలాంటి వ్యాఖ్యానాలపై మీ స్పందన ఏమిటి?

వరలక్ష్మి: ఒకప్పుడు వెనుకబడిన కులాలు గిల్టీ ఫీలయ్యే సందర్భాలుండేవి. ఇప్పుడు ఎవరి కులాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్న రోజులు నడుస్తున్నాయి. నా ఉపాధ్యాయులు, నాతో చదువుకున్న స్నేహితురాళ్ళు అందరూ ఆధిపత్య కులాల వాళ్ళే. వాళ్ళంతా నన్నెంతో ఆత్మీయంగా చూసేవాళ్ళు. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నదెంతో ఉంది. నావరకూ నాకు ఈ కులాలు, మతాలు లేకుండా అందరూ ఒక్కటిగా ఉంటే బాగుండును అన్పిస్తుంది. వెనుకబడిన కులంలో పుట్టడం వల్లనే వెనుకబడిన స్త్రీల గురించి అందరికీ నచ్చేలా రాయగలిగాను. ఎందుకంటే అవన్నీ నా అనుభవాలు కూడా. ఒక్కటి మాత్రం నిజం, మమ్మల్ని గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

చంద్రలత: మీ కుటుంబం, వృత్తి, ప్రవృత్తుల నడుమ సమతూకం సాధించగలిగాననుకొంటున్నారా?

వరలక్ష్మి: అవును, నిర్ద్వంద్వంగా సాధించాను.

చంద్రలత: మీరు, మీ అమ్మాయి కె.గీత, మీ మనవరాలు చిన్నారి వరూధిని… మూడు తరాలుగా సజీవ సాహితీ స్రవంతి మీ కుటుంబం. అటు కుటుంబపరంగా, ఇటు సాహితీపరంగా ఈ తరాల అంతరాలను మీరు ఎలా స్వీకరిస్తున్నారు? మీ అమ్మ, అమ్మమ్మల తరంతో పోలిస్తే, మీరు అమ్మ, అమ్మమ్మ అవ్వడం ఎలా ఉంది?

వరలక్ష్మి: ఏది వచ్చినా సాహిత్యం అనేది నేర్పిస్తే రాదు. దానికొక ప్రతిభ కావాలి. ఆ ప్రతిభకి కృషి కావాలి. గీత కృషి అలాంటిది. మా అమ్మ అమ్మమ్మల్లాగే పిల్లల ఎదుగుదల చూసి ఆనందపు అపురూప క్షణాలను ఫీలవుతూ ఉంటాను.

చంద్రలత: చివరిగా… వరలక్ష్మిగారూ! మీరు పరిచయమై రెండు దశాబ్దాల పైమాటే. మీరు స్వతహాగా సౌమ్యులు, స్నేహమయి, సంస్కారవంతులు. అప్పటికీ, మీకంటే ఎంతో చిన్నదాన్నయినా నాతో ఇట్టే స్నేహం కలిపారు. ఇన్నాళ్ళు నిలిపారు. అందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను! మీతో సన్నిహితంగా ఈ సుదీర్ఘ సంభాషణ జరిపేందుకు, మీరు నన్ను ఎంపిక చేసుకోవడం నాకు దక్కిన గౌరవం. ఈ క్రమంలో మీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ధన్యవాదాలు.

వరలక్ష్మి: మీకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు చంద్రలతా!

 (అప్పాజోశ్యుల, విష్ణుభొట్ల అవార్డు అందుకున్న సందర్భంగా కె. వరలక్ష్మిగారితో చంద్రలత జరిపిన ఇంటర్వ్యూ – “సాహితీ వైజయంతి” సౌజన్యంతో)

*****

Please follow and like us:

One thought on “అరచేత మాణిక్యము & శ్రీమతి కె.వరలక్ష్మి గారితో ముఖాముఖి”

  1. జీవితానికి ఎదురీదుతూ కూడా, ఓడిపోని విశ్వాసంతో ముదడుగులు వేస్తూనే, సాహిత్య సీమలను కూడా ముప్పేటల అల్లుకుని, విజయం సాధించి, ముచ్చటైన మూడోతరం సాహితీ సౌరభాలను ఆఘ్రాణిస్తూ జీవన సార్థక్య సూత్రాలను ఎంతో గంభీరంగా వెలువరించిన సువిఖ్యాత రచయిత్రి వరలక్ష్మి గారికీ, ఎంతో సమర్థవంతంగా ముఖాముఖి నెరపిన చంద్రలత గారికీ, అందంగా అందించిన నెచ్చెలి కీ హృదయపూర్వక కృతజ్ఞతలు. పుట్టపర్తి నాగపద్మిని

Leave a Reply

Your email address will not be published.