
చిత్రలిపి
కర దీపిక
-మన్నెం శారద
యవ్వనం ఉరకలేస్తున్నప్పుడు
మనసు ముందుకే ఉరకలు వేస్తుంది
సై అంటే సై అని కాలు దువ్వుతూనే ఉంటుంది
పర్వతాలని అధిరోహించాలని
పైపైకి ఎగబాకాలని
సవాళ్ళని ఎదుర్కోవాలని
అందరికన్నా ముందు నిలవాలని
కొండమీద జెండా పాతాలని
ఎన్నో కలలు !
మరెన్నో ఆశలు !
అలుపెరుగని పయనం
ఇప్పుడిక ప్రొద్దుగుంకుతున్నది ,
పగలంతా ప్రచండం గా వెలిగిన వెలుగులిప్పుడు
ఎర్రబడి ఆనక నల్లబారుతున్నాయి
అధిరోహణవెంట అవరోహణ అంటుకునే ఉంటుంది
ఎత్తులక్రింద లోయల నీడలు పరచుకుంటూనే ఉంటాయి
నిరాశ ఏమీలేదు ….
ఓటమి కూడా కానేకాదు .
..నీ దగ్గర ఇంకా చాలా ధనముంది
ముందుతరాలకు పంచగల జ్ఞానముంది
వెలుగు పిదప మలిగిపోక తప్పదు కదా
నవ్వుతూ నిజాన్ని అంగీకరించి
ఒక దీపం వెలిగించి
వెనుక బడినవారికి దారి చూపించు …
మార్గదర్శకమై ముందుకి నడిపించు
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
