
చిత్రలిపి
నవ్వుకుంటున్నావా…. నీవు ???
-మన్నెం శారద
గోళాలు దాటి అనంత దిగంతాలకేగిన నీకు
మాలిన్యపు డబ్బాలు తెచ్చి పూస్తున్న
కాలుష్యపు రంగులు చూసి ….!
ఇదేమిటయ్యా ఈ జనం …..
వారి వారి మనసులోని విషపు రక్తం
నీ కీర్తి బావుటా పై నిలువునా వెదజల్లుతున్నారు !
ఎవరు నువ్వు ???
ఆడుతూ ఆడుతూ ….
పాడుతూ పాడుతూ …
చిలిపిగా గెంతుతూ …
చిందులు తొక్కుతూ …
కష్యదాటి కర్మఫలం తో …
మా మధ్యమసలిన మహామనిషివి కావా …
నీకు కులమేమిటి …మతమేమిటి !
నువ్వొక చీకటి ఆకాశంలో జివ్వున వెలిగిన మెరుపువి
గాఢపు మబ్బుల అంచున మెరిసే జలతారు అంచువి !
నీపాటకి మైమరచి కరుగుతున్న రసజ్ఞ మేఘాల కొసలు పట్టుకుని
చిలిపిగ క్రిందకి దూకే
అపురూప దివ్యజలానివి !
అప్పుడే లేలేతకిరణాలు సోకి
వికసిస్తున్న పవిత్ర పారిజాతానివి
.అసలు నీగురించి చెప్పడానికి ఏ పదకోశం లో మాటలు లేవు !
నువ్వు నువ్వే ….
అవును ముమ్మాటికీ నువ్వు నువ్వే !
నువ్వొక పాటవి !
నువ్వొక మాటవి !నువ్వొక నవ్వువి
నువ్విక మాకెన్నడూ దొరకని అపురూప దివ్య బాలాగాంధర్వుడివి ..
…నవ్వుకోకు మరి మా అజ్ఞాన తిమిరాన్ని చూసి !!!
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
